#HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!

బీబీసీ స్పెషల్ సిరీస్ #హర్‌చాయిస్

అది నా మొదటిరాత్రి. మొట్ట మొదటిసారి నేను ఒక పురుషుడితో ఒంటరిగా ఉన్నాను. నాకు నా ఆప్తులైన స్నేహితులతో చేసిన సంభాషణలు, నేను చూసిన పోర్న్ వీడియోలు గుర్తుకొస్తున్నాయి.

తల వంచుకుని, చేతిలో పాలగ్లాసు పట్టుకుని నేను గదిలోకి ప్రవేశించాను. నేను ఊహించినట్లుగానే అంతా సాంప్రదాయబద్ధంగా ఉంది.

కానీ ఒక పెద్ద షాక్, ఇంకా చెప్పాలంటే ఒక ఆశాభంగం నా కోసం సిద్ధంగా ఉందని నాకు తెలీదు.

గదిలోకి ప్రవేశించగానే, నా భర్త నన్ను గట్టిగా హత్తుకుంటాడని, ముద్దులు పెట్టుకుంటాడని, రాత్రంతా మేం శృంగారంలో పాల్గొంటామని నేను కలలు కన్నాను.

అయితే జరిగిందేమిటంటే, నేను గదిలోకి వెళ్లేసరికే అతను నిద్రపోయి ఉన్నాడు.

నాకు 35 ఏళ్లు. నేను కన్యను. నన్నెవరో తిరస్కరించినట్లు నాకు తీవ్రమైన వేదన కలిగింది.

నేను కాలేజీలో చదివే రోజుల్లో, పని చేసే చోట అనేక మంది యువతీయువకులు ఒకరి భుజంపై మరొకరు తల పెట్టుకుని, చేతిలో చేయి వేసుకుని వెళుతుంటే చూసి ఈర్ష్య పడేదాన్ని.

ఫొటో సోర్స్, Getty Images

నా జీవితంలో నాకూ అలాంటి తోడు వద్దా?

మా కుటుంబం పెద్దది. నాకు నలుగురు అన్నాతమ్ముళ్లు, ఒక సోదరి, తల్లిదండ్రులు ఉన్నా, నేనెప్పుడూ ఒంటరిగానే ఫీలయ్యేదాన్ని.

నా తోబుట్టువులందరికీ పెళ్లిళ్లు అయిపోయి, వాళ్లకంటూ కుటుంబాలు ఏర్పడ్డాయి.

నా వయసు పెరుగుతోందని, నేనింకా ఒంటరిగానే ఉన్నానని వాళ్లకసలు గుర్తుందా అని ఒక్కోసారి అనిపించేది.

నా హృదయం ప్రేమతో, కోరికతో జ్వలించేది. కానీ నా చుట్టూ ఒంటరితనం అలుముకుని ఉండేది.

కొన్నిసార్లు నేను లావుగా ఉండడమే దీనంతటికీ కారణమని అనిపించేది.

#హర్‌చాయిస్ - 12 మంది భారతీయ మహిళల వాస్తవగాథలు. ఈ కథనాలు 'ఆధునిక భారతీయ మహిళ' ష్టాయిష్టాలు, కోరికలు, ఆకాంక్షలు, ప్రాధాన్యతల గురించి వివరిస్తూ మన భావనను విస్తృతం చేస్తాయి.

లావుగా ఉండటం నేను చేసిన నేరమా?

లావుగా ఉన్న ఆడవాళ్లంటే పురుషులకు ఇష్టం ఉండదా? నేను లావుగా ఉండడమే మా వాళ్లు నాకు సంబంధం చూడలేకపోవడానికి కారణమా?

నేను ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతానా? నేను లైంగికానుభూతి పొందలేనా? ఈ ప్రశ్నలు నిరంతరం నా మెదడును తొలిచేసేవి.

నాకు 35 ఏళ్లు వచ్చాయి. ఎట్టకేలకు ఒక 40 ఏళ్ల మగాడు నన్ను పెళ్లిచేసుకోవడానికి ముందుకొచ్చాడు.

మా ఎంగేజ్‌మెంట్ సందర్భంగానే నేను అతనితో నా ఆలోచనలన్నీ పంచుకున్నాను.

కానీ అతను ఎలాంటి ఆసక్తీ చూపలేదు, ప్రతిస్పందించలేదు. కానీ అతను నెర్వస్‌గా ఉన్నట్లు నాకనిపించింది. మౌనంగా కూర్చుని, నేలకేసి చూస్తూ కేవలం తలను మాత్రం ఊపాడు.

ఈ రోజుల్లో మగాళ్లు ఆడాళ్లకన్నా ఎక్కువ సిగ్గుపడుతున్నారని, నాక్కాబోయే భర్త కూడా అదే కోవకు చెందిన వాడని నేను భావించాను.

ఫస్ట్‌నైట్ రోజే చేదు అనుభవం

కానీ నా మొదటి రాత్రి నాకు ఎదురైన అనుభవంతో నేను గందరగోళానికి గురయ్యాను. అతను ఎందుకలా ప్రవర్తించాడో నాకు అర్థం కాలేదు.

మరుసటి రోజు ఉదయం దాని గురించి ప్రశ్నించేసరికి, తనకు ఆరోగ్యం బాగా లేదన్నాడు.

మా రెండోరాత్రి, మూడోరాత్రి.. అనేక రాత్రులు ఇలాగే గడిచిపోయాయి.

నేను ఈ విషయాన్ని మా అత్తగారితో చెప్పాను. కానీ ఆమె తన కుమారుణ్ని వెనకేసుకొచ్చారు.

''మా వాడికి సిగ్గు ఎక్కువ. చిన్నప్పటి నుంచి వాడు ఆడపిల్లలతో మాట్లాడాలంటే బిడియపడేవాడు. వాడు బాయ్స్ స్కూల్లో చదువుకున్నాడు. వాడికి అక్కాచెల్లెళ్లు కానీ, గర్ల్‌ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు'' అన్నారు.

ఇది నాకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా, నేను దాని గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను.

నన్ను ముట్టుకునే వాడే కాదు

క్రమంగా నా కోరికలు, కలలన్నీ ఒక్కొక్కటిగా కరిగిపోవడం ప్రారంభించాయి.

నా అసంతృప్తికి కారణం కేవలం లైంగిక వాంఛ మాత్రమే కాదు. అతను నన్నెప్పుడు చేతుల్లోకి తీసుకునేవాడు కాదు, కనీసం ముట్టుకునేవాడు కూడా కాదు.

ఒక మహిళ కేవలం పైటను సర్దుకుంటేనే చాలా మంది మగాళ్లు కళ్లప్పగించి చూస్తారు.

కానీ రాత్రిళ్లు నేను దుస్తులన్నీ విప్పేసినా అతను నా వైపు కళ్లు కూడా తిప్పేవాడు కాదు.

నేను లావుగా ఉండడమే అతనలా ప్రవర్తించడానికి కారణమా? ఎవరి ఒత్తిడి వల్లో అతను నన్ను పెళ్లి చేసుకున్నాడా?

దీన్నంతా ఎవరితో పంచుకోవాలో నాకు అర్థం కాలేదు. దీని గురించి నేను నా కుటుంబసభ్యులకు కూడా చెప్పలేకపోయాను.

వాళ్లు నా వైవాహిక జీవితం ఆనందంగా ఉందనే ఆలోచనల్లో ఉన్నారు.

కానీ రాన్రానూ నాలో సహనం నశించసాగింది. నాకు ఏదో పరిష్కారం కావాలి.

సాధారణంగా అతను సెలవు రోజుల్లో కూడా ఇంట్లో ఉండడు. అయితే ఆ రోజు మాత్రం ఎందుకో ఇంట్లోనే ఉన్నాడు.

నేను గదిలోకి ప్రవేశించి, గడియ పెట్టాను. అతను మంచం మీద నుంచి ఎగిరి పడినంత పని చేశాడు.

అతని దగ్గరకు వెళ్లి చాలా మర్యాదగా, ''నేనంటే మీకిష్టం లేదా? మనం ఇంతవరకు ఒక్కసారి కూడా దగ్గర కాలేదు. మీ అభిప్రాయాలను ఒక్కసారి కూడా నాతో పంచుకోలేదు. మీ సమస్య ఏంటి?'' అని ప్రశ్నించాను.

ఈ ప్రశ్నకు అతను ''నాకెలాంటి సమస్యా లేదు'' అని వెంటనే సమాధానం ఇచ్చాడు.

నేను అతని దృష్టిని నావైపు మరల్చుకుని, అతణ్ని నా వైపు ఆకర్షించుకోవాలనుకున్నా.

నేను ధైర్యం చేసి, చివరకు అతని పురుషాంగాన్ని ముట్టుకునేంత వరకు వెళ్లాను.

నేను రెచ్చగొడితే దాని పరిమాణం పెరుగుతుందని భావించిన నాకు, అది చాలా చిన్నగా ఉండడం చూసి నిరాశ కలిగింది.

పురుషాంగం పరిమాణం నిజంగా అంతే ఉంటుందా అని నాకు గందరగోళంగా అనిపించింది. నేను పోర్న్ వీడియోలలో చూసినవన్నీ గ్రాఫిక్సా?

ఈ ప్రశ్నలకు ఎవరిని అడిగి సమాధానాలు తెలుసుకోవాలన్నా నాకు సిగ్గనిపించింది.

వాళ్లకు ఆ విషయం ముందే తెలుసు

పురుషుడు ఎలాగైతే ఒక స్త్రీ అందాన్ని అంచనా వేస్తాడో, అలాగే నేను ఎందుకు నా భర్తను అంచనా వేయకూడదు? అతని గురించి నాకు కొన్ని ఆశలు ఉండడం తప్పా?

ఆ తర్వాత నాకు అతను నపుంసకుడు అని, మా పెళ్లికి ముందే డాక్టర్లు ఈ విషయం చెప్పారని తెలిసింది.

అతనికి, అతని తల్లిదండ్రులకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. కానీ నాకది చెప్పకుండా మోసం చేశారు.

ఇప్పుడు నాకు నిజం తెలీడంతో అతనికి అవమానమైంది. అయినా అతను మాత్రం దీనిపై ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు.

మహిళలు ఏ చిన్న పొరపాటు చేసినా సమాజం దాన్ని భూతద్దంలో చూస్తుంది. కానీ అదే పురుషుడి తప్పుంటే మాత్రం అప్పుడు కూడా అన్ని వేళ్లూ మహిళల వైపే చూపిస్తాయి.

''జీవితంలో కేవలం సెక్స్ మాత్రమే ముఖ్యం కాదు. నువ్వు ఎందుకు పిల్లలను దత్తత తీసుకోవు?'' అని నా బంధువులు నాకు సలహా ఇచ్చారు.

మా భర్త తల్లిదండ్రులు, '' ఈ విషయం బైటికి తెలిస్తే మా కుటుంబం పరువు పోతుంది'' అంటూ నన్ను వేడుకున్నారు.

నా కుటుంబసభ్యులు, ''ఇది నీ ఖర్మ'' అన్నారు.

కానీ అందరికన్నా నా భర్త మాటలే నన్ను ఎక్కువ బాధించాయి.

భర్త నోటి వెంట వినకూడని మాటలు విన్నా

అతను, ''నువ్వు నీకిష్టం వచ్చింది చేసుకోవచ్చు. నీకిష్టం వచ్చిన వాళ్లతో పడుకోవచ్చు. నేను నిన్నేమీ ఇబ్బంది పెట్టను, ఎవరికీ చెప్పను. నీకు వేరే వ్యక్తి ద్వారా పిల్లలు కలిగితే వాళ్లకు నా ఇంటి పేరు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు'' అన్నాడు.

ఏ మహిళ కూడా తన భర్త నుంచి వినకూడని దారుణమైన మాటలవి.

అతనో మోసగాడు. తన పరువు, కుటుంబం పరువు కాపాడుకోవడానికి నన్ను ఈ పని చేయమని అడుగుతున్నాడు.

నా కాళ్ల మీద పడి ఏడ్చాడు. ''ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. నాకు విడాకులు ఇవ్వొద్దు'' అని వేడుకున్నాడు.

అతణ్ని వదిలేసి నా దారి నేను చూసుకోవడమా లేక, ఒక జీవిత భాగస్వామి కోసం కోరికలన్నీ అణచుకొని జీవించడమా?

చివరకు నేను నా భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాను.

కానీ నా తల్లిదండ్రులు నన్ను అంగీకరించలేదు.

నేను నా స్నేహితుల సాయంతో ఓ లేడీస్ హాస్టల్‌లో చేరి, ఉద్యోగం వెతుక్కున్నాను.

మెల్లగా నా జీవితం గాడిలో పడ్డాక, విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాను.

నా భర్త కుటుంబం సిగ్గులేకుండా వ్యవహరించింది. వాళ్ల కుమారుడి లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్లు నాకు వివాహేతర సంబంధం అంటగట్టారు.

నేను కోర్టులో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోరాడాను. ఎట్టకేలకు మూడేళ్ల అనంతరం నాకు విడాకులు మంజూరయ్యాయి.

నాకు పునర్జన్మ లభించినట్లు అనిపించింది.

జీవితాంతం కలిసుండే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా

నేనిప్పుడు నా నలభైలలో ఉన్నాను. ఇప్పటికీ నేను కన్యనే.

గత కొన్నేళ్లలో చాలా మంది నాకు దగ్గర కావడానికి ప్రయత్నించారు. వాళ్లంతా నా భర్త నుంచి శారీరక సుఖం లేకపోవడం వల్లనే నేను నా భర్తను వదిలిపెట్టానని భావించి, నన్ను పొందడానికి ప్రయత్నించారు. వాళ్లు నన్ను అపార్థం చేసుకున్నారు.

నన్ను పెళ్లి చేసుకోవడానికి కానీ, ఒక దీర్ఘకాలిక బంధం ఏర్పరచుకునేందుకు కానీ వాళ్లలో ఎవరూ సిద్ధంగా లేరు.

అలాంటి మగాళ్లందరి నుంచి నేను దూరంగా ఉన్నాను.

నాలో ఇంకా కోరికలు, కలలు, వాంఛలు ఉన్నాయి. కానీ నన్ను ప్రేమించి, నా భావాలను అర్థం చేసుకుని, నాతో జీవితాంతం కలిసి ఉండే వ్యక్తి వద్దే వాటిని వ్యక్తం చేస్తాను.

అలాంటి పురుషుడి కోసం నేను వేచి చూస్తున్నాను.

అప్పటివరకు నా స్నేహితులతో వాళ్ల లైంగిక జీవితం గురించి సంభాషిస్తూ సంతృప్తిపడతాను.

సెక్స్ విషయంలో వెబ్ సైట్లే నా బెస్ట్ ఫ్రెండ్స్.

నా విషయంలో తీర్పులు ఇచ్చేవాళ్లకు కొదవ లేదు. ఆడవాళ్లు ప్రాణం లేని వస్తువులు కాదని, వాళ్లకు కూడా అనేక కోరికలుంటాయని వాళ్లు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.

(దక్షిణాదికి చెందిన ఒక మహిళ తన గాథను బీబీసీ ప్రతినిధి ఐశ్వర్యారవిశంకర్‌తో పంచుకోగా, సీనియర్ ప్రతినిధి దివ్య ఆర్య దీనిని అక్షరబద్ధం చేశారు. ఆ మహిళ విజ్ఞప్తి మేరకు ఆమె పేరును రహస్యంగా ఉంచుతున్నాం.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)