హ్యూమన్‌రైట్స్ వాచ్: ముస్లింలపై దాడులను అడ్డుకోవడంలో భారత్ విఫలం

  • 19 జనవరి 2018
హిందూ కార్యకర్త Image copyright Getty Images

గత ఏడాది మతం పేరుతో జరిగిన దాడులను అరికట్టడంలో భారతదేశం విఫలమైందని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది.

మైనారిటీ మతస్తులపై దాడులకు పాల్పడిన వారిని పారదర్శకంగా విచారించ లేకపోయిందని వరల్డ్ రిపోర్ట్-2018 నివేదికలో ఆ సంస్థ తెలిపింది.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన అనేక మంది సీనియర్ నేతలు.. పౌరుల హక్కులను పణంగా పెట్టి బహిరంగంగానే హిందుత్వాన్ని, అతి జాతీయతావాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది.

దాదాపు 90 దేశాలలో మానవహక్కుల తీరును పరిశీలించి ఈ నివేదికను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.

ఇంకా ఆ నివేదిక ఏం చెప్పిందంటే..

Image copyright SANJAY KANOJIA/getty images

బీజేపీ అనుబంధ సంస్థలుగా చెప్పుకొనే హిందూ అతివాద సమూహాలు.. ముస్లింలు, ఇతర మైనారిటీలపై అనేక సార్లు దాడులు చేశాయి.

మైనారిటీలు ఆవులను చంపుతున్నారని, వాటి మాంసాన్ని అమ్ముతున్నారనే పుకార్లను పట్టుకుని వీళ్లు ఇదంతా చేశారు.

పోలీసులు దాడులు చేసిన వారిపై సరైన చర్యలు తీసుకోకపోగా గోరక్షణ చట్టాల కింద బాధితులపై కేసులు పెట్టారు.

2017లో మైనారిటీలపై కనీసం 38 దాడులు జరిగాయి. వీటిలో 10 మంది చనిపోయారు.

Image copyright Getty Images
  • ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే విద్యావేత్తలు, పాత్రికేయులపై ప్రభుత్వం రాజద్రోహం, నేరం, పరువు నష్టం వంటి కేసులు పెట్టింది.
  • మానవహక్కుల కార్యకర్తలు, సంస్థలకు విదేశాల నుంచి నిధులు అందకుండా చేసి ప్రభుత్వం వేధించింది.
  • ప్రసార మాధ్యమాలు, పాత్రికేయులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు అవినీతి పేరిట విచారణ ప్రారంభించి ఒత్తిడి తీసుకొచ్చారు.
  • దేశంలో 2017 నవంబరు నాటికి 60 సార్లు ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించారు. ఇందులో ఒక్క జమ్మూ కశ్మీర్‌లోనే 22 సార్లు నిలిపి వేశారు.
  • లైంగిక దాడులకు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చి దాదాపు అయిదేళ్లు అవుతున్నా ఇంకా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితులు పోలీసు స్టేషన్లలో అవమానాల పాలవుతున్నారు.

"మైనారిటీలు, బలహీన సమూహాలను అధికారులు పట్టించుకోవడం లేదు. తరచూ జరుగుతున్న దాడుల నుంచి వారికి రక్షణ కల్పించేందుకు తాము సుముఖంగా లేమనే వాస్తవాన్ని వారు నిరూపించుకున్నారు. భవిష్యత్తులో దాడులు జరగకుండా అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని హ్యూమన్ రైట్స్ వాచ్ దక్షిణ ఆసియా డైరెక్టర్ మీనాక్షి గంగూలీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)