#HerChoice: మహిళలు తమకు నచ్చినట్లు ఉంటే ఏం జరుగుతుంది?

  • దివ్య ఆర్య
  • బీబీసీ ప్రతినిధి
మహిళ కార్టూన్

'భార్యలను వేశ్యల నుంచి, ప్రియురాళ్లను భార్యల నుంచి వేరు చేసి చూసే నువ్వు, ఒక మహిళ నిర్భయంగా తిరుగుతూ వేశ్యలు, భార్యలు, ప్రియురాళ్లలో తన ఉనికిని వెదుక్కోవడానికి ప్రయత్నిస్తే మాత్రం ఎందుకంత ఆందోళన?'

సుమారు 40 ఏళ్ల క్రితం ప్రముఖ హిందీ కవి అలోక్ ధన్వా తన కవిత 'భాగీ హుయీ లడ్‌కియా' (పారిపోయిన బాలికలు)లో రాసిన మాటలివి. ఇవి నిన్ను, నన్ను ఉద్దేశించి రాసినవి.

ఇది నిజం కాబట్టే, మహిళలు నిర్భయంగా సంచరిస్తుంటే గాభరా పడతాం.

కానీ నీ గాభరా వాళ్లు అలా సంచరించడాన్ని ఆపలేకపోయిందని నీకు తెలుసా?

కేవలం నువ్వు కళ్లు మూసుకున్నంత మాత్రాన, ఆ వైపు చూడనంత మాత్రాన మహిళలు తమ జీవితంలో తిరుగుబాటు చేయడం ఆపలేదు.

అలాంటి కనిపించని తిరుగుబాట్లను ఎందుకు వెలుగులోకి తీసుకురాకూడదు అని మేం భావించాం.

సామాజిక సరిహద్దులను చెరిపేస్తూ, తమ కలలను, కోరికలకు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ, తమ ఉనికిని వెదుక్కుంటున్న ఈ భారతీయ మహిళలను పరిచయం చేసుకోండి.

వీళ్లు నీ, నా మధ్యలోనే జీవిస్తున్నారు. వీళ్లు తమకు నచ్చినట్లుగా ఉత్తర, ఈశాన్య, దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని గ్రామాల్లో, నగరాల్లో జీవిస్తున్నారు.

రాబోయే నెలన్నర కాలంలో మేం దేశంలోని విభిన్న ప్రాంతాలు, వర్గాలకు చెందిన 12 మంది కథలను మీ ముందుకు తీసుకొస్తాం.

ఈ కథలు తప్పకుండా మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తాయి. అవి భారతదేశంలోని మహిళల గురించి మీ అభిప్రాయాలను, అంచనాలను ఖచ్చితంగా సవాలు చేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images

వీటిలో మేం, పెళ్లి కాగానే తన భర్త నపుంసకుడు అని తెలిసిన ఒక మహిళ కథను మీతో పంచుకుంటాం.

అతను శారీరకంగా ఆమెను సంతృప్తిపరచలేడు, మానసికంగా ఆమె భావాలను పంచుకోవడంపై అతనికి ఆసక్తీ లేదు. సామాజిక ఒత్తిడితో అతను పెళ్లికి అంగీకరించాడు. కానీ అలాంటి అసంపూర్ణమైన బంధంతో ఆ మహిళ ఏం చేయగలదు?

ఒక పాప పుట్టగానే - తండ్రి తనకు నచ్చిన మహిళతో, తల్లి తనకు నచ్చిన పురుషుడితో వెళ్లిపోతే, ఆ పాప ఒంటరిగా మిగిలిపోయిన కథ మరొకటి.

తల్లిదండ్రులు జీవించే ఉన్నా, ఆ బాలిక అనాథే. ఆమె ఏం కోరుకుంటోంది?

హోమోసెక్సువల్ సంబంధాల గురించి ఎంతో చెప్పారు, రాశారు. కానీ ఎలాంటి శారీరక ఆకర్షణ లేదా సెక్స్ లేకుండా దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్న ఇద్దరు మహిళలను మీరెప్పుడైనా కలిసారా? అలాంటి స్వేచ్ఛాభావాలు కలిగిన మహిళలను కలవాలనుకుంటున్నారా?

విడాకులు తీసుకున్న మహిళలు అసహాయులు అని భావించే వాళ్లకు, తన భర్త ప్రేమను కోల్పోయిన తర్వాత, ప్రేమించడం నేర్చుకుని, తనను తాను గౌరవించుకోవడం నేర్చుకున్న మహిళ కథ చదవడం చాలా బావుంటుంది.

ఒంటరిగానే జీవించాలని నిర్ణయించుకున్న మహిళల కథనాలు చదవడం కూడా ఆసక్తికరమే.

పెళ్లి చేసుకోకూడదు అనే నిర్ణయం వల్ల కుటుంబంతో, సమాజంతో యుద్ధం చేసినంత పని అవుతుంది.

అలాంటి వాళ్లందరూ సంతోషంగా ఉన్నారు.

ఒకరు తనకు ఇష్టం వచ్చిన రీతిలో జీవించడాన్నిఆస్వాదిస్తున్నారు.

మరొకరు ఒక శిశువును దత్తత తీసుకుని, ఆ శిశువును సొంతంగా పెంచి పెద్ద చేయడంలో బిజీగా ఉన్నారు.

మరొకరు - తన సహజీవనం వల్ల వచ్చిన గర్భాన్ని ఉంచుకుని, ఆ బిడ్డను పెంచుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ సంబంధం విచ్ఛిన్నమైతే, అయినా బిడ్డకు జన్మనిచ్చి, పెంచి పెద్దచేసుకోవాలని నిర్ణయించుకున్న ధైర్యవంతురాలు.

కుటుంబ ఒత్తిడితో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత హింసించే భర్త పాలైన కథ మరొకరిది.

ఈ సమస్య నుంచి ఆమె ఎలా బయటపడ్డారు? ఆ బంధాన్ని అలాగే కొనసాగించారా? లేక దాని నుంచి బయటపడే ధైర్యాన్ని కూడగట్టుకున్నారా?

భర్త హింసించకున్నా, ఆమె పట్ల ప్రేమ లేకపోతే? నిర్జీవంగా ఉన్న వైవాహిక బంధాన్ని కాసింత రంగులమయం చేసుకోగల దారి ఉందా?

ఆమె ఆ ఖాళీని మరో వ్యక్తితో పూరించుకునే ప్రయత్నం చేస్తే పర్యవసానం ఏంటి?

ఎందుకు మహిళలు తమ భర్త నుంచి దూరంగా పారిపోవాలనుకుంటారు? ఒక కథనం దీనికి కారణాలను కనుగొనే ప్రయత్నం చేస్తుంది. ఆ వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా దానికి ఎలా పరిష్కారాన్ని కనుగొన్నారో ఆ కథనంలో చదవండి.

ఒక మహిళ వికలాంగురాలైతే, ఆమె తన భర్త, అతని కుటుంబం దృష్టిలో 'సంపూర్ణ' మహిళ' ఎలా కాగలదు?

సహజీవనం ఇచ్చిన ధైర్యంతో ఒక మహిళకు తన సామర్థ్యంపై విశ్వాసం, నమ్మకం ఎలా పెరిగాయో మరో కథనం వివరిస్తుంది.

తక్కువ చదువుకున్నా, తన కాళ్ల మీద తాను నిలబడుతూ, ఒక బాధ్యత లేని వ్యక్తితో కలిసి జీవిస్తున్న మరో మహిళ కథనం కూడా ఉంది. అతను ఏమీ సంపాదించకపోవడమే కాకుండా, తనకు ఇష్టం వచ్చినపుడు వచ్చి తనతో సెక్స్‌లో పాల్గొనమని ఆమెను బలవంతం చేస్తుంటాడు.

అతను కండోమ్‌లు ఉపయోగించడు. దాంతో ఆమె బలహీనురాలైపోతోంది. కానీ ఆ సంబంధాన్ని తెగ్గొట్టుకొనేందుకు ఆమె సిద్ధంగా లేదు.

ఇలాంటి పరిస్థితిలో ఆ మహిళ ఏం చేయాలి?

ఈ వారాంతం నుంచి బీబీసీ స్పెషల్ సిరీస్ #HerChoice ఇలాంటి 12 కథనాలను మీ ముందుకు తెస్తుంది.

ఇదంతా మన మధ్యనే జరుగుతోందని మీరు గుర్తుంచుకోవాలి.

కొంతమంది మహిళలు ఆలోచిస్తున్నారు, మరికొందరు అనుకున్న పనిని చేస్తున్నారు. అలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి మనకు ఇది ఒక అవకాశం.

'భాగీ హుయీ లడ్‌కీ' కవితలో అలోక్ ధన్వా ఆ తర్వాత రాసినట్లు...

'అనేక మంది బాలికలు తమ ఆలోచనల్లో పారిపోతుంటారు

రాత్రిళ్లు మేల్కొని, తమ డైరీ పేజీలలో,

వాళ్ల సంఖ్య నిజంగా పారిపోయిన వాళ్లకంటే చాలా ఎక్కువ..'

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)