మహారాష్ట్ర: 'నేను గే, మరో గేను పెళ్లాడాను'

  • 20 జనవరి 2018
గే వివాహం Image copyright Hrishi Sathavane
చిత్రం శీర్షిక వివాహ వేడుకలో విన్, హృషికేశ్ సాఠ్‌వణే

నా పేరు హృషికేశ్ సాఠ్‌వణే. నాకు 44 ఏళ్లు. అమెరికాలోని ఒక టెక్నాలజీ సంస్థలో పనిచేస్తున్నాను. మాది మహారాష్ట్రలోని యవత్‌మాల్.

నేను అందరిలా లేనని, నా లైంగిక నేపథ్యం(సెక్సువల్ ఓరియంటేషన్) భిన్నంగా ఉందని ఎదిగే వయసులోనే అనిపించేది.

అప్పట్లో నాలాంటి వారు ఎవ్వరూ తారసపడకపోవడంతో, దీనిని అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించేది.

చదువుపై బాగా శ్రద్ధ పెట్టాను. అదృష్టవశాత్తూ చదువులో బాగా రాణించాను. ఒక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో చదువుతుండగా సైకాలజీ క్లాసులో స్వలింగ సంపర్కం(హోమోసెక్సువాలిటీ) గురించి క్లుప్తంగా చెప్పారు.

అయితే నేనే ఒక స్వలింగ సంపర్కుడనన్నది అప్పటికి అంత స్పష్టంగా తెలియదు.

తర్వాత, అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయంలో చేరాను. అక్కడ స్వలింగ సంపర్కులకు అండగా నిలిచే ఒక గ్రూప్‌ను కలిసినప్పుడు, నేను 'గే' అని స్పష్టంగా అర్థమైంది.

వెంటనే, భారత్‌లో ఉంటున్న మా అమ్మానాన్న వద్దకు వచ్చి, నా పరిస్థితి గురించి చెప్పుకొన్నాను.

మా తల్లిదండ్రులకు వివరిస్తే, నమ్మలేకపోయారు. అంగీకరించలేకపోయారు.

ఏదో తెలియని అపరాధ భావం వారిలో కనిపించింది. ఎంతో బాధపడ్డారు. నిస్పృహకు లోనయ్యారు. కుమిలి కుమిలి ఏడ్చారు. ఇది 1997లో జరిగింది.

Image copyright Hrishi Sathavane

అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆమె జీవితం నాశనం చేయలేనన్నాను

ఎవరైనా అమ్మాయిని పెళ్లాడితే అంతా సర్దుకుంటుందని, అప్పుడు తాను చాలా మంది అబ్బాయిల్లాగే వ్యవహరిస్తానని మా అమ్మానాన్న చెప్పారు.

నేను 'గే' అని తెలిసి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఆమె జీవితాన్నినాశనం చేయలేనని చెప్పేశాను.

నా తీరుపై మొదట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేసిన మా తల్లిదండ్రులు క్రమంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు.

మా తల్లిదండ్రులకు విషయాన్ని విడమరిచి చెప్పి, వారు అర్థం చేసుకొనేలా చేయడంలో నా సోదరి ముఖ్య పాత్ర పోషించింది.

అమ్మానాన్న తొలిసారిగా 2007లో అమెరికా పర్యటనకు వచ్చారు. శాన్‌ఫ్రాన్సిస్కో గే ప్రైడ్ పరేడ్‌కు వారు కూడా హాజరయ్యారు. అంతగా ప్రేమించే, అండగా నిలిచే కుటుంబం ఉండటం నాకు లభించిన వరం.

డేటింగ్ వెబ్‌సైట్‌లో పరిచయమైన విన్

విన్‌తో 2016 అక్టోబరులో పరిచయం ఏర్పడింది. గే డేటింగ్ వెబ్‌సైట్ దీనికి వేదికైంది. పరిచయమైన రెండు రోజులకు బయట కలుసుకున్నాం. కలిసి భోజనం చేశాం.

అతడు వియత్నాంలోని హో చి మిన్ నగరంలో పుట్టాడు. విన్‌కు ఎనిమిదేళ్ల వయసులో 1990లో అతడి కుటుంబం అమెరికాకు వచ్చేసింది.

తను ప్రస్తుతం ఇంగ్లిష్, గణితశాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పరిచయమైన తర్వాత విన్, నేను చాలాసార్లు కలుసుకున్నాం. 2016 డిసెంబరులో ఆస్ట్రేలియాలో రోడ్ ట్రిప్‌కు వెళ్లాం.

నేనే ప్రపోజ్ చేశాను

ఎక్కువగా వారాంతాల్లో కలుసుకొనే వాళ్లం. అలా మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2017 ఏప్రిల్‌లో విన్‌కు ప్రపోజ్ చేశాను.

నా పెళ్లి ఎలా జరగాలనే దానిపై నాకు స్పష్టమైన ఆలోచన ఉండేది.

వివాహ కార్యక్రమం మొదట మా స్వస్థలం యవత్‌మాల్‌లో జరగాలి. ఎందుకంటే, నా స్నేహితులు చాలా మంది అక్కడే ఉన్నారు.

ఈ ప్రతిపాదన విన్‌కు కూడా నచ్చింది. విశాల దృక్పథం, దేన్నైనా స్వీకరించే తత్వం అతడికి ఉన్నాయి. అతడిలో నాకు బాగా నచ్చింది అవే. విన్ నన్నెంతగానో ప్రేమిస్తాడు. అతడికి ధైర్యం కూడా ఉంది.

Image copyright Getty Images

తల్లిదండ్రులను ఒప్పించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది

పెళ్లికి మా తల్లిదండ్రులను ఒప్పించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మా నిర్ణయం గురించి చెప్పగానే వారి ప్రతిస్పందన ఇదీ- ''పెళ్లా- ఎందుకు? భారత్‌లో ఎందుకు? యవత్‌మాల్‌లో ఎందుకు?'' అని.

కానీ చివరకు ఒప్పుకొన్నారు. మొదట మా అమ్మ అంగీకరించారు. తొలుత అభ్యంతర పెట్టినా నాన్న కూడా ఎట్టకేలకు సరేనన్నారు. కానీ పెళ్లి రోజు కూడా మా నాన్నలో పూర్తి సమ్మతి లేదు.

నేను ఫేస్‌బుక్‌లో ఉన్నాను. నా లైంగిక నేపథ్యం గురించి బాహాటంగానే చెబుతుంటాను. నా కజిన్లు, హైస్కూల్ స్నేహితుల్లో చాలా మందికి నా విషయం తెలుసు, దీనిపై వారికి వ్యతిరేకత లేదు. అలాంటి వారినే మా పెళ్లికి పిలిచాం.

మా తల్లిదండ్రుల్లో మాత్రం ఆందోళన కొనసాగుతూ వచ్చింది. నేను ఫలానా వాళ్లను పెళ్లికి పిలవాలని సూచించినా, నా పెళ్లి ఎలా జరగాలో చెప్పినా, వారు మొదట అభ్యంతరపెట్టేవారు. తర్వాత అయిష్టంగానే అంగీకరించేవారు.

రొమాంటిక్ పాటే పెట్టాలని పట్టుబట్టాను

కొన్ని ఇతర అంశాల్లోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉదాహరణకు పెళ్లికి ముందు జరిగిన డాన్స్ క్లాస్‌.

డాన్స్ క్లాస్‌లో ఇద్దరం కలిసి ఏదైనా రొమాంటిక్ పాటకు డాన్స్ నేర్చుకోవాలనుకున్నాం. మిగతావాళ్లేమో ఇద్దరూ పురుషులే ఉండే, ఏ మాత్రం రొమాంటిక్‌గా లేని పాటలు సూచించారు.

రొమాంటిక్ పాటే పెట్టాలని నేను పట్టుబట్టాను. ఇక్కడ అమ్మాయి లేరుగా అని వారు ప్రశ్నించారు.

''నేను అడుగుతోంది నా కోసం, విన్ కోసం.. రొమాంటిక్ సాంగ్ పెట్టాల్సిందే'' అన్నాను. వారికి అయోమయంగా అనిపించింది. తర్వాత అర్థం చేసుకొన్నారు.

స్వలింగ సంపర్కుల ప్రయోజనాల పరిరక్షణకు పోరాడే న్యాయవాదులైన నా స్నేహితులు కొందరితో పెళ్లి గురించి ముందుగానే చర్చించాను.

మా పెళ్లి వేడుకకు చట్టపరమైన ఇబ్బందులేవీ ఉండవని వారు తెలిపారు. ఈ స్పష్టత పోలీసులు అడ్డుకుంటారేమోనన్న భయాన్ని లేకుండా చేసింది.

పెళ్లి ఒక హోటల్‌లోని ఓ హాల్‌లో జరిగింది. ముందు జాగ్రత్తగా హాల్ వద్ద సెక్యూరిటీ గార్డును పెట్టాలని హోటల్ నిర్వాహకులకు చెప్పాను. అదృష్టవశాత్తు పెళ్లిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగలేదు.

సంప్రదాయబద్ధంగా జరిగిన మా వివాహ కార్యక్రమం విన్‌కు సంతోషాన్ని కలిగించింది. పెళ్లికి వచ్చినవారిలో ఇంగ్లిష్ తెలిసిన వాళ్లతో తను మాట్లాడాడు.

Image copyright Hrishi Sathavane

'ఈ తలపాగా ఇంకెంతసేపు పెట్టుకోవాలి?'

డాన్స్ చేయడం విన్‌కు అంత సౌకర్యంగా అనిపించకపోయినా, మేమిద్దరం కలిసి చేసిన డాన్స్ బాగుందనిపించింది.

నిజానికి భారత సంప్రదాయాలు విన్‌కు అంత సౌకర్యంగా అనిపించవు. కానీ నా కోసం అన్నీ చేశాడు. ఎందుకంటే ఇలా పెళ్లి చేసుకోవడం నా కలని విన్‌కు తెలుసు.

పెళ్లిలో అతడు అడిగిన ఒకే ఒక్క ప్రశ్న- ''పట్టేసినట్టున్న ఈ తలపాగా ఇంకెంత సేపు పెట్టుకోవాలి?''

పిల్లలను దత్తత తీసుకుంటాం

విన్, నేను పెళ్లికి ముందు నుంచే రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు 'హనీమూన్' అనేది మాకు వర్తించదు.

యవత్‌మాల్‌లో పెళ్లి తర్వాత అమెరికా వచ్చేశాం. ఇక్కడి చట్టం ప్రకారం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. పిల్లల పెంపకంపై గత ఏడాది శిక్షణ తరగతులకు హాజరయ్యాం. మరిన్ని తరగతులకు హాజరుకానున్నాం.

భారత్‌లో స్వలింగ సంపర్కుల సంబంధాలపై ఇప్పటికీ అపోహలు, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నాయి.

సరైన జోడి దొరికితే, ఉమ్మడి లక్ష్య సాధనకు ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు నిబద్ధతగా ఉంటే బంధాలు కలకాలం నిలుస్తాయి. స్వలింగ సంపర్కుల విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా ఇదే వర్తిస్తుంది. స్వలింగ సంపర్క జంటలు అయితే సమాజంలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి ఈ జంటల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం