ప్రెస్ రివ్యూ: కేసీఆర్‌ను ఇక 'కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు’ అని పిలుస్తా - గవర్నర్

  • 21 జనవరి 2018
గవర్నర్ నరసింహన్ Image copyright governor.tsap.nic.in
చిత్రం శీర్షిక గవర్నర్ నరసింహన్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇక నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని కాకుండా 'కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు' అని పిలుస్తానని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారని 'ఈనాడు' రాసింది.

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా శనివారం మేడిగడ్డ నుంచి ప్యాకేజీ-8లోని లక్ష్మీపూర్‌ వరకు పనులను గవర్నర్ పరిశీలించారు.

రెండేళ్ల కిందట భారీ తెర మీద స్వయంగా ముఖ్యమంత్రి తనకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారని నరసింహన్ చెప్పారు.

''ప్రాణహిత నుంచి నీళ్లు తీసుకునే విధానం, కాలువలు, ఎత్తిపోతలు, సొరంగాలు.. అంటూ సీఎం రెండు గంటల పాటు వివరించారు.

'ఇదంతా అయ్యే పనేనా.. ఈయన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావా.. కలల చంద్రశేఖర్‌రావా' అనుకున్నాను. అన్ని చోట్లా ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఇంత భారీ ప్రాజెక్టును వేగంగా నడిపిస్తున్న కేసీఆర్‌ను ఇక నుంచి 'కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు'గా పిలుస్తాను. మంత్రి హరీశ్‌రావును 'కాళేశ్వర్‌రావు' అందాం. అధికారి జోషి.. జోష్‌తో పనిచేస్తున్నారు'' అని గవర్నర్ చెప్పారని 'ఈనాడు' తెలిపింది.

Image copyright TWITTER/NARA LOKESH
చిత్రం శీర్షిక పోలవరం ప్రాజెక్టు ప్రాంతం

నామినేషన్‌పై నవయుగకు పోలవరం కాంట్రాక్టు పనులు

పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులను నవయుగ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి నామినేషన్ విధానంలో అప్పగించాలని శనివారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారని 'సాక్షి' పత్రిక రాసింది.

పనులను వారం రోజుల్లో నవయుగ సంస్థకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో మీడియాకు తెలిపారని పత్రిక చెప్పింది.

''2014 స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల(ఎస్‌ఎస్ఆర్) ప్రకారమే డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు. కానీ మీడియాలో ఏదేదో రాస్తున్నారు. రూ.33 వేల కోట్ల ఆర్‌అండ్ఆర్ ప్యాకేజీ బాధ్యత కూడా కేంద్రానిదే. అందుకు వారు ఒప్పుకొన్నారు'' అని చంద్రబాబు చెప్పారని 'సాక్షి' పేర్కొంది.

మళ్లీ 'ఆదరణ'

బీసీల కోసం ‘ఆదరణ’ పథకాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారని ఆంధ్రజ్యోతి తెలిపింది. ఈ పథకానికి ఆదరణ-2గా ప్రభుత్వం నామకరణం చేసింది.

‘‘ఈ పథకం కింద రాష్ట్రంలోని 124 రకాల చేతివృత్తుల వారికి నాణ్యమైన పనిముట్లు అందిస్తాం. పథకం అమలుకు రూ.350 కోట్లు ఖర్చవుతుంది. తొలి ఏడాదే రెండున్నర లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది’’ అని సీఎం చంద్రబాబు చెప్పారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

మేడారం జాతరకు ప్రపంచవ్యాప్త ప్రచారం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే మేడారం జాతరకు ప్రపంచవ్యాప్త ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని 'నమస్తే తెలంగాణ' తెలిపింది.

ఈ జాతరకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చేందుకు సమాచార, పౌరసంబంధాలశాఖ సమాయత్తమైంది. అమెరికా, చైనా, జపాన్ తదితర దేశాల్లోని ప్రఖ్యాత మీడియా సంస్థలను కవరేజ్‌కు ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది.

''రాష్ట్ర సమాచార కమిషనర్ అరవింద్ కుమార్.. ఈ జాతర ప్రత్యేకత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వివరిస్తూ దిల్లీ, ముంబయి కేంద్రాలుగా పనిచేసే అంతర్జాతీయ మీడియా సంస్థల దక్షిణాసియా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు.

ఇప్పటికే బీబీసీ, నేషనల్ జియోగ్రాఫిక్ పత్రిక, ద న్యూయార్క్ టైమ్స్, చైనా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మొదలైన దేశాల్లో వెలువడే ప్రముఖ పత్రికల ప్రతినిధులతో మాట్లాడారు'' అని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)