అస్సాం: ‘అడవుల్ని ఆక్రమిస్తున్న టీ తోటలు’.. మనుషుల్ని చంపుతున్న ఏనుగులు

  • 5 జూన్ 2018
అస్సాం టీ తోటల్లో ఏనుగులు
చిత్రం శీర్షిక అస్సాం టీ తోటల్లో తిరుగుతున్న ఏనుగులు

ప్రపంచ ప్రఖ్యాత అస్సాం టీ సాగుదారులు అడవులను ఆక్రమిస్తున్నారని, దీనివల్ల ఏనుగులకు మనుషులకు మధ్య ఘర్షణ పెరుగుతోందని రాష్ట్రంలోని స్థానికులు, అధికారులు చెప్తున్నారు.

ఈ ఆక్రమణల్లో అధిక భాగం చిన్న తరహా తోటలదేనని అధికారులు ఆరోపిస్తుంటే.. పెద్ద టీ ఎస్టేటులకు సంబంధించి తాజా భూ సర్వే కూడా ఏదీ లేదని స్థానిక నాయకులు బీబీసీతో పేర్కొన్నారు.

ఈ ఆరోపణను టీ కంపెనీల సంఘం ఒకటి తిరస్కరించింది. అడవులు కొనసాగటం తమకు ప్రయోజనకరమని ఆ సంఘం పేర్కొంది.

అయితే.. అస్సాంలో అడవుల తరుగుదలకు టీ తోటలు కారణమవుతున్నాయని భారత ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వే చెప్తోంది.

‘‘రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం తగ్గటానికి ప్రధాన కారణం అటవీ భూమి ఆక్రమణ, జీవావరణ ఒత్తిడి, టీ తోటల్లో పంటల మార్పిడి పడిపోవటం, సాగు మారుతుండటం’’ అని అడవుల పరిస్థితిపై పర్యావరణ మంత్రిత్వశాఖ 2015 నివేదిక పేర్కొంది.

చిత్రం శీర్షిక భూటాన్ సరిహద్దులోని అస్సాంలో టీ తోటలు భారీగా విస్తరించాయి

ఏనుగుల దాడుల్లో మరణాలు

అస్సాంలో 2006 నుంచి 2016 మధ్య వరకూ దాదాపు 800 మంది అడవి ఏనుగుల దాడుల్లో చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

ప్రభుత్వం గత ఏడాది బహిర్గతం చేసిన తాజా లెక్కల ప్రకారం.. ఏనుగు లేదా పులికి తారసపడిన తర్వాత ప్రతిరోజూ ఒకవ్యక్తి చొప్పున మరణాలు సంభవిస్తున్నాయి.

2014 - 2015 మధ్య ఏనుగు దాడుల సంబంధిత మరణాలు పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా ఉంటే.. ఆ తర్వాతి స్థానంలో నిలిచిన అస్సాంలో అదే కాలంలో 54 మరణాలు సంభవించాయి.

‘‘ఒక ఏనుగు దాడిలో గాయపడ్డ నా కుమార్తెను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చివరిసారి వీడ్కోలు కూడా చెప్పలేకపోయాను’’ అంటూ దక్షిణ అస్సాంలోని సెస్సా టీ గార్డెన్ నివాసి మరియం కెర్కెటా కన్నీటి పర్యంతమయ్యారు.

ఆమె కుమార్తె 26 ఏళ్ల బొబితా కర్కెటా గత అక్టోబర్‌లో ఒక రోజు సాయంత్రం తన స్నేహితురాలితో కలిసి స్కూటర్‌పై వస్తుండగా టీ తోటలో ఏనుగు తారసపడింది. బొబితా స్కూటర్ మీద నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

చిత్రం శీర్షిక మరియం కర్కెటా కుమార్తె బొబితకు చిన్నప్పటి నుంచీ ఏనుగులంటే చాలా భయం

‘‘ఆమె స్నేహితురాలు అక్కడి నుంచి స్కూటర్ మీద తప్పించుకుని వెళ్లిపోగలిగింది. కానీ నా కూతురు తప్పించుకోలేకపోయింది. ఎందుకంటే రోడ్డుకు రెండు వైపులా టీ తోటల కంచెలు అడ్డుగా ఉన్నాయి’’ అని మరియం వివరించారు.

‘‘మేం ఈ ప్రాంతంలో తరతరాలుగా నివసిస్తున్నాం. కానీ ఇప్పుడు ఏనుగులతో ఘర్షణలు పెరుగుతుండటం వల్ల ఇక్కడ జీవితం చాలా ప్రమాదకరంగా మారింది. దీని గురించి ఏదో ఒకటి చేయాల్సిన అవసరముంది’’ అని ఆమె అంటారు.

ప్రమాదంలో ఏనుగులు

ఈ ఘర్షణ ఫలితంగా ఏనుగులు కూడా చనిపోతున్నాయి.

భారత పర్యావరణ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 2013, 2014ల మధ్య 72 ఏనుగులు చనిపోయాయి. 2012లో 100కు పైగా ఏనుగులు మృత్యువాత పడ్డాయి.

ఇక ప్రకృతి సంరక్షణ సంస్థలు చెప్తున్న లెక్కల ప్రకారం.. దంతాల కోసం వేటాడటం, రైళ్లు ఢీకొనటం, విష ప్రయోగం, విద్యుదాఘాతం తదితర కారణాల వల్ల 2001 - 2014 మధ్య 225 ఏనుగులు చనిపోయాయి.

ఆసియా ఏనుగుల్లో దాదాపు 60 శాతం ఏనుగులు భారతదేశంలో ఉన్నాయి.

ఏనుగుల జనాభా అత్యధికంగా కర్ణాటకలో ఉంటే.. ఆ తర్వాత అస్సాంలో ఉన్నాయి. ఇక్కడ 5,700 పైగా ఏనుగులు ఉన్నట్లు అంచనా.

చిత్రం శీర్షిక ఏనుగులు తమ సాధారణ మార్గాన్ని అడ్డుకుంటున్న ఈ టీ తోట గోడను ధ్వంసం చేశాయి

అస్సాంలో ఏనుగులు మరింత దూకుడుగా మారటానికి కారణం.. వాటి ఆవాస ప్రాంతాలు కుంచించుకుపోవటంతో పాటు, వాటి సంప్రదాయ సహజ కారిడార్లు ఆక్రమణలకు గురవటమేనని ప్రకృతి పరిరక్షకవాదులు అంటున్నారు.

‘‘ఇంతకుముందు ఈ ప్రాంతాలు అడవులు. ఇవి రిజర్వుడు అడవులకు, గ్రామాలకు మధ్య తటస్థ ప్రాంతాలుగా ఉండేవి. ఏనుగులకు ఆశ్రయంగా ఉండేవి’’ అని ఉర్లగుడి జిల్లాలో ప్రభుత్వ రిజర్వుడు ఫారెస్ట్ వార్డెన్ మనాష్ శర్మ పేర్కొన్నారు.

‘‘అప్పట్లో ఏనుగులకు ఆహారం, నీరు సమృద్ధిగా ఉండేది. కానీ జనాభా పెరుగుదల వల్ల ఈ ప్రాంతాల్లో టీ తోటల సాగు మొదలయింది. అది మా నియంత్రణలో లేదు’’ అని ఆయన వివరించారు.

‘‘ఈ ఆక్రమణలు ఇప్పుడు మా (అస్సాం అటవీశాఖ) నియంత్రణలో ఉండే రిజర్వుడు అడవుల సరిహద్దు ప్రాంతాల వరకూ విస్తరించాయి. ఏనుగులు టీ ఆకులు తినవు కాబట్టి అవిప్పుడు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో మనుషులతో ఈ ఘర్షణలన్నీ వస్తున్నాయి’’ అని చెప్పారు.

చిత్రం శీర్షిక అటవీ భూములను టీ తోటలు ఆక్రమించటం సమస్య అని ఉర్లగుడి ఫారెస్ట్ వార్డెన్ అంగీకరిస్తున్నారు

చిన్న తరహా తేయాకు పెంపకందారులు మాత్రమే ఈ అడవులను ఆక్రమిస్తున్నారని శర్మ గట్టిగా చెప్తున్నారు.

అటవీ ప్రాంతాల్లో అక్రమంగా టీ తోటలు నాటుతున్న కొందరు చిన్న తరహా పెంపకందారుల నుంచి భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని.. పేర్లు బయటపెట్టవద్దని కోరిన అస్సాం రెవెన్యూశాఖ అధికారులు పేర్కొన్నారు.

చిన్న రైతులపై కన్ను

ప్రభుత్వ సంస్థ అయిన టీ బోర్డ్ ఆఫ్ ఇండియా.. అస్సాంలోని 23 జిల్లాల్లో 56,000 మందికి పైగా చిన్న తరహా తేయాకు పెంపకందార్లను నమోదు చేసింది.

అయితే ప్రభుత్వం దగ్గర రిజిస్టరు చేసుకోని చిన్న తరహా తోటల పెంపకం దార్లు కూడా అంతే సంఖ్యలో ఉన్నారని స్థానికులు చెప్తున్నారు.

చాలా మంది చిన్న తరహా టీ పెంపకందార్లు కూడా తమ ఉత్పత్తులను పెద్ద టీ కంపెనీలకు విక్రయిస్తారు.

ఇక పెద్ద టీ కంపెనీల విషయంలోనూ ప్రశ్నలున్నాయని టీ తోటల జిల్లాల జనం అంటున్నారు.

‘‘వారి భూములను ఎన్నడూ ఎందుకు సర్వే చేయలేదు? 70 ఏళ్ల కిందట భూములు పొందిన వారి తోటలను కూడా సర్వే చేయటం లేదు ఎందుకు?’’ అని బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్ యువ నాయకుడు దీపేన్ బోరో ప్రశ్నిస్తున్నారు.

‘‘మా పరిశీలన ప్రకారం 30 నుంచి 40 శాతం ఆక్రమణలు పెద్ద కంపెనీ టీ తోటలవే. ఈ టీ తోటలను ఖచ్చితంగా సర్వే చేయాలని సర్కిల్ అధికారి, సంబంధిత అధికారుల మీద మేం ఒత్తిడి తెస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. ఈ సమాచారం పొందటం కోసం తాను సమాచార హక్కు కింద దరఖాస్తు చేస్తానని పేర్కొన్నారు.

చిత్రం శీర్షిక అస్సాంలో తేయాకు తోటల కోసం అటవీ భూమిని చదును చేస్తున్నారు

ఈ ఆరోపణలు నిరాధారమని అస్సాంలోని పెద్ద టీ సంస్థలు చాలా వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ టీ అసోసియేషన్ అంటోంది.

‘‘అడవులను ఆక్రమించటానికి, చెట్లు నరకటానికి, టీ తోటలు నాటటానికి మేం అడవుల్లోకి వెళ్లలేదు’’ అని అసోసియేషన్ కార్యదర్శి సందీప్ ఘోష్ పేర్కొన్నారు.

‘‘అడవులను నిర్మూలించటం కొనసాగిస్తే అది టీ తోటలనే దెబ్బతీస్తుంది. కాబట్టి తగినంత అటవీ ప్రాంతం ఉండటం మా ప్రయోజనాలకు ముఖ్యం’’ అని చెప్పారు.

భూములను సర్వే చేయాల్సిన బాధ్యత తమది కాదని ఘోష్ వ్యాఖ్యానించారు.

‘‘భూముల మీద మాకు అధికార పరిధి లేదు. సర్వే చేసేలాగానో, చేయవద్దనో మేం ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేం. రెవెన్యూ వసూలు చేయటం, భూమిని సర్వే చేయటం పూర్తిగా ప్రభుత్వ బాధ్యత’’ అని పేర్కొన్నారు.

చిత్రం శీర్షిక తేయాకు సేకరించే మహిళా కార్మికులకు చీకటి పడిన తర్వాత సంచరించే ఏనుగుల ప్రమాదం గురించి తెలుసు

టీ తోటలు విస్తరించివున్న భూములన్నిటినీ ప్రభుత్వం ఎప్పుడైనా లెక్క చూస్తుందా అన్నది వేచి చూడాలి.

కానీ, ఈ లోగా.. అస్సాంలో ఏనుగులు - మనుషులకు మధ్య ఘర్షణ అంతకంతకూ తీవ్రంగా మారుతోంది.

పెరుగుతున్న మానవ జనాభా.. తరుగుతున్న అడవుల విస్తీర్ణం వల్ల.. అసలు మనుషులు, ఏనుగులు ఇక కలిసి జీవించగలరా అన్న ప్రశ్న రాష్ట్రంలో దాదాపు ప్రతి ఒక్కరి నుంచీ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)