కేజ్రివాల్ ప్రభుత్వానికి షాక్.. 20 మంది ఎమ్మెల్యేల శాసనసభ్యత్వం రద్దు చేసిన రాష్ట్రపతి

 • 21 జనవరి 2018
కేజ్రివాల్ Image copyright Getty Images

దిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు పదవికి అనర్హులని తేలింది.

వీరంతా లాభదాయక పదవులు నిర్వర్తిస్తున్నారని, కాబట్టి వీరి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం చేసిన సిఫార్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు.

రాష్ట్రపతి ఆమోదముద్ర లభించటంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది.

దాని ప్రకారం.. ఎమ్మెల్యేలు ఎవ్వరూ ప్రభుత్వంలో అదనపు అధికారాలు లభించే ఎలాంటి లాభదాయక పదవులను చేపట్టకూడదు.

గతంలో ఈ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. ఈ పదవి లాభదాయకమైనది.

2015 మార్చి 13వ తేదీ నుంచి 2016 సెప్టెంబర్ 8వ తేదీ వరకు వీళ్లు పదవుల్లో కొనసాగారు. దీంతో వీరిని ఎమ్మెల్యే పదవికి అనర్హుల్ని చేయాలని గత శుక్రవారం ఎన్నికల సంఘం రాష్ట్రపతిని కోరింది.

ఇప్పుడు వీళ్ల శాసనసభ్యత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేయటంతో.. దిల్లీలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

కాగా, ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారమే హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు.

సోమవారం ఈ కేసుపై విచారణ జరిగే అవకాశం ఉంది.

Image copyright PIB

అసెంబ్లీలో ఎవరి బలం ఎంత?

70 సీట్లున్న దిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 66 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 20 మందిపై వేటు పడినప్పటికీ ఆ పార్టీ అధికారంలో కొనసాగేందుకు ఇబ్బందులు ఉండవు. సాధారణ మెజార్టీకి మించి ఆ పార్టీకి బలం ఉంటుంది.

అయితే, నైతికత ఆధారంగా ముఖ్యమంత్రి పదవికి కేజ్రివాల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డిమాండ్ చేశాయి.

ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో పోరాడతామని చెప్పారు.

ఈ మొత్తం వ్యవహారంలో తమ ఎమ్మెల్యేలు వారి వాదన వినిపించేందుకు అవకాశమే లభించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది.

ఎన్నికల సంఘం రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదని సిసోడియా ఆరోపించారు. సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసేముందు.. ఎమ్మెల్యేల వాదన కూడా వినాల్సి ఉందని ఆయన అన్నారు.

చిత్రం శీర్షిక ఆదివారం కేంద్ర న్యాయ శాఖ విడుదల చేసిన ఆర్డినెన్స్ ప్రకారం 20 మంది ఎమ్మెల్యేలు అనర్హులయ్యారు

కేంద్ర న్యాయ శాఖ ఆదివారం జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం శాసనసభ్యత్వాన్ని కోల్పోయిన ఎమ్మెల్యేలు వీళ్లే..

 1. ఆదర్శ్ శాస్త్రి
 2. అల్క లంబ
 3. అనిల్ కుమార్ బాజ్‌పాయ్
 4. అవతార్ సింగ్
 5. జర్నైల్ సింగ్
 6. కైలాశ్ గెహ్లాట్
 7. మదన్ లాల్
 8. మనోజ్ కుమార్
 9. నరేశ్ యాదవ్
 10. నితిన్ త్యాగి
 11. ప్రవీణ్ కుమార్
 12. రాజేశ్ గుప్తా
 13. రాజేశ్ రిషి
 14. సంజీవ్ ఝా
 15. సరితా సింగ్
 16. శరద్ కుమార్ చౌహాన్
 17. శివ్ చరణ్ గోయల్
 18. సోమ్ దత్
 19. సుఖ్వీర్ సింగ్ దలాల్
 20. విజయేందర్ గార్గ్ విజయ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)