తమిళనాడు 'పరువు' హత్య: తండ్రికే మరణశిక్ష పడేట్లు చేసిన యువతి

  • సౌతిక్ బిశ్వాస్
  • బీబీసీ ప్రతినిధి
కౌసల్యా శంకర్

ఫొటో సోర్స్, NATHAN G

మార్చి 2016లో తమిళనాడులో పట్టపగలు నడిరోడ్డుపై ఓ దళితుణ్ని హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కౌసల్య అనే ఉన్నత కులానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నందుకు 22 ఏళ్ల శంకర్‌ను నరికి చంపారు.

గత డిసెంబర్‌లో 'పరువు' హత్యకు పాల్పడినందుకు కౌసల్య తండ్రితో పాటు మరో ఐదుగురికి కోర్టు మరణశిక్ష విధించింది. ఆ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన కౌసల్య తన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చారు.

ప్రస్తుతం కులవివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 20 ఏళ్ల కౌసల్యను మా ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్ కలిసి మాట్లాడారు. ఆయన అందిస్తున్న కథనం..

ఫొటో సోర్స్, Courtesy: Kausalya Shankar

ఫొటో క్యాప్షన్,

జులై, 2015న పెళ్లి తర్వాత శంకర్, కౌసల్య

ఆరోజు ఏం జరిగింది?

హత్య జరిగిన రోజు ఉదయం శంకర్, కౌసల్యతో కలిసి తన గ్రామానికి 14 కి.మీ. దూరంలో ఉన్న ఉడుమాలపేట మార్కెట్‌కు బస్సులో బయలుదేరారు.

ఆ మరుసటి రోజు శంకర్ కాలేజీలో జరిగే ఫంక్షన్ కోసం అతనికి దుస్తులు షాపింగ్ చేశారు.

ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్లడానికి రద్దీగా ఉన్న రోడ్డును దాటడం కోసం పక్కన నిలబడ్డారు. ఆ రోజు శంకర్ ఆమెకు ట్రీట్ ఇవ్వాలని భావించాడు.

''మరెప్పుడైనా'' అని కౌసల్య దాన్ని తోసిపుచ్చింది. ఆమె వద్ద కేవలం 60 రూపాయలు మాత్రమే ఉన్నాయి.

ఫొటో క్యాప్షన్,

కౌసల్య, శంకర్‌లపై దాడి చేసిన సీసీటీవీ ఫుటేజ్

వాళ్లు రోడ్డు దాటే ప్రయత్నంలో ఉండగానే రెండు మోటర్ బైక్‌లపై వచ్చిన ఐదుగురు వ్యక్తులు వాళ్ల వెనుక దిగారు. నలుగురు వ్యక్తులు వాళ్లను చుట్టుముట్టి పొడవాటి కత్తులతో వాళ్లపై దాడికి దిగారు.

సీసీటీవీ ఫుటేజ్‌లో దుండగులు చాలా క్యాజువల్‌గా వాళ్లపై దాడి చేయడం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. పొదలను నరికే తరహాలో వాళ్లు దంపతులిద్దరిపై కత్తులతో దాడికి తెగబడ్డారు.

తీవ్రంగా గాయపడిన శంకర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. గాయాలపాలైన కౌసల్య కుంటుతూ అక్కడికి దగ్గరలో ఆగి ఉన్న వాహనం దగ్గరకు వెళ్లగా, దుండగులు మరోమారు ఆమెపై దాడి చేశారు.

ఇది మొత్తం కేవలం 36 సెకన్లలో జరిగిపోయింది. వాళ్ల చుట్టూ జనం గుమిగూడే లోపే దుండగులు తాపీగా మోటర్ సైకిళ్లపై అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ తర్వాత కొద్దిసేపటికి ఆంబులెన్స్ వచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న దంపతులను ఆసుపత్రికి తీసుకెళ్లింది.

మెటల్ స్ట్రెచర్‌పై ఉన్న కౌసల్య చూపు మసగ్గా కనిపిస్తుండగా, ఐవీ ఫ్లూయిడ్‌ను పట్టుకుని పడుకున్నారు. శంకర్ మాత్రం కదలకుండా పడి ఉన్నాడు.

''నా భుజం మీద తల పెట్టుకో'' శంకర్ నోటి నుంచి అతి కష్టం మీద మాట పెగిలింది. కౌసల్య అతని పక్కకు జరిగింది.

కొద్ది నిమిషాల అనంతరం ఆంబులెన్స్ ఆసుపత్రిలో ప్రవేశించేటప్పటికే శంకర్ శ్వాస ఆగిపోయింది.

ఫొటో క్యాప్షన్,

ఆసుపత్రిలో గాయాలతో కౌసల్య

శవపరీక్షలో శంకర్ ఒంటిపై 34 కత్తిగాట్లు, గాయాలు కనిపించాయి.

ఆ తర్వాత 20 రోజుల పాటు మొహం నిండా బ్యాండేజీతో, ఒంటిపై ఉన్న 36 కుట్లు మానేందుకు, విరిగిన ఎముకలు కట్టుకునేందుకు కౌసల్య ఆసుపత్రిలో గడిపింది. ఆసుపత్రి బెడ్ పైనుంచే ఆమె ఆ దాడికి తన తల్లిదండ్రులే కారణమని పోలీసులకు తెలిపారు.

''నువ్వు వాణ్నెందుకు ప్రేమించావు?'' అని దాడి చేస్తూ వాళ్లలో ఒకడు పదే పదే ఆమెను ప్రశ్నించాడు.

అరుంధతి రాయ్ తన 'ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్'లో రాసినట్లు - 'ఎవరిని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి' అన్న 'ప్రేమ నియమాల'ను వారు ఉల్లంఘించారు.

శంకర్ ఒక దళితుడు. ఒక భూమిలేని రైతుకూలీ కొడుకు. తన నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి కుమారలింగం గ్రామంలోని ఓ గుడిసెలో నివసించేవాడు.

ఉన్నత కులంగా పేర్కొనే తేవర్ కుటుంబానికి చెందిన కౌసల్య తండ్రి వడ్డీవ్యాపారి, ట్యాక్సీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. వాళ్లు పళని పట్టణంలో ఓ రెండస్తుల భవనంలో నివసిస్తున్నారు.

తనకు ఎయిర్ హోస్టెస్ కావాలని ఉందని కౌసల్య తల్లిదండ్రులకు చెప్పినపుడు, స్కర్ట్‌లు వేసుకోవాల్సి వస్తుందని వాళ్లు అందుకు నిరాకరించారు. ఆమె పాఠశాల చదువు పూర్తి కాగానే ఆమెకు పెళ్లి చేసేయాలనుకున్నారు. అయితే ఆమె దానికి నిరాకరించడంతో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చారు.

అయతే ఆ కాలేజీ ఆమెకు నచ్చలేదు. అక్కడ చాలా కఠినమైన ఆంక్షలు ఉండేవి. ఆడపిల్లలు మగపిల్లలతో మాట్లాడ్డం చూసినా సెక్యూరిటీ సిబ్బంది వాళ్ల తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసేవారు.

ప్రేమ చాలా విచిత్రమైన ప్రదేశాలలో పుట్టవచ్చు. కాలేజీలో ఫ్రెషర్స్ డే రోజున ఓ బక్కపలచటి కుర్రాడు ఆమె వద్దకు వచ్చి తన పేరు శంకర్ అని పరిచయం చేసుకున్నాడు. ''మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా?'' అని ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నతో ఇబ్బందిగా ఫీలైన కౌసల్య అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఆ మరుసటి రోజు శంకర్ మళ్లీ ఆమె వద్దకు వచ్చి ''నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అనుకుంటున్నా. మీరు వేరే ఎవరినైనా ప్రేమించారా?'' అని ప్రశ్నించాడు. ఆమె మళ్లీ సమాధానం చెప్పకుండా దూరంగా వెళ్లిపోయింది.

మూడోరోజు శంకర్ మళ్లీ ఆమె వద్దకు వచ్చినపుడు ప్రేమించడానికి ఇంకో యువతిని చూసుకొమ్మని సలహా ఇచ్చింది.

కానీ క్రమక్రమంగా ఆమె మెత్తబడడం ప్రారంభించింది. శంకర్ కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం ఆపేశాడు. దాంతో వాళ్లిద్దరూ స్నేహితుల్లా మసలడం ప్రారంభించారు. నేను ప్రేమిస్తున్నాను అని నేనెప్పుడూ అతనితో చెప్పలేదు. కానీ క్రమక్రమంగా ఆమెకు అతనితో ప్రేమలో పడిపోయానని తెలిసింది.

అయితే వాళ్ల ప్రేమకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఆమె ఇంటి నుంచి అతనితో ఫోన్‌లో మాట్లాడే అవకాశం లేకపోవడంతో వాట్సాప్ మెసేజ్‌లు మాత్రం పంపుకునేవారు. అలా 18 నెలల పాటు వాళ్ల మధ్య వాట్సాప్ సంభాషణ నడిచింది.

ఫొటో సోర్స్, The News Minute

ఫొటో క్యాప్షన్,

కౌసల్య తండ్రికి మరణశిక్ష విధించగా, తల్లిని నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేశారు

సెకెండ్ ఇయర్ చదువుతుండగా ఆమె జపనీస్ క్లాసులు జాయిన్ అయింది. కాలేజీ బస్ లేకపోవడంతో ఆమె ప్రైవేట్ బస్సులో ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. శంకర్ ఆమె కోసం వేచి ఉండేవాడు. వాళ్లిద్దరూ అలా బస్సులో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభమైంది.

జులై 2015లో వాళ్లు ప్రయాణించే బస్సు కండక్టర్ వాళ్లిద్దరూ బస్సులో మాట్లాడుకోవడం గురించి ఆమె తల్లికి తెలియజేసాడు. అదే రోజు ఆమె తల్లిదండ్రులు ఆమె ఫోన్ లాక్కుని, శంకర్ కు ఫోన్ చేసి, తమ కూతురికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. శంకర్ ఆమెను గర్భవతిని చేసి, పారిపోతాడని హెచ్చరించారు. ఆ మరుసటి రోజే ఆమెను కాలేజి మాన్పించేశారు.

మరుసటి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి శంకర్‌కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. 'నిజంగా గర్భవతిని చేసి పారిపోవాలనుకుంటున్నావా?' అని ప్రశ్నించింది.

''నువ్వు నిజంగా అలా భావిస్తుంటే మనం ఇప్పుడే పారిపోయి పెళ్లి చేసుకుందాం'' అని శంకర్ అన్నాడు.

కౌసల్య వెంటనే ఓ బ్యాగ్‌ను సర్దుకుని, ఇంటి నుంచి బయటపడింది. ఆ మరుసటి రోజు 12 జులై, 2015న ఇద్దరు ఓ గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తమది కులాంతర వివాహమని చెప్పి, తమకు రక్షణ కావాలని కోరారు.

తమిళనాడులో దళితులు, ఆదివాసులు కులపరంగా కఠోర పరిణామాలు ఎదుర్కొన్న చరిత్ర ఉంది. ఆ ఒక్క ఏడాదే తమిళనాడులో వాళ్లకు వ్యతిరేకంగా సుమారు 1,700 నేరాలు నమోదయ్యాయి.

ఆ మరుసటి 8 నెలలు తన జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజులని కౌసల్య తెలిపింది. ఆమె కాలేజీ వదిలిపెట్టి, నెలకు 5 వేల జీతంతో ఓ సేల్స్ గర్ల్‌గా పనికి కుదిరింది.

ఆమె తల్లిదండ్రులు, బంధువులు వాళ్లిద్దరినీ విడదీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. శంకర్ ఆమెను కిడ్నాప్ చేశాడంటూ కేసు పెట్టారు.

పెళ్లైన వారానికే ఆమెను బలవంతంగా తీసుకెళ్లి, ఆమె ముఖాన బూడిద పూసి, పూజలు చేసి, శంకర్‌ను వదిలిపెట్టేందుకు అనేక ద్రావకాలు తాగించారు. చివరకు ఆమెను వదిలిపెడితే రూ.10 లక్షలు ఇస్తామంటూ శంకర్‌కు ఆశ చూపారు.

ఫొటో క్యాప్షన్,

దళితుల సాంప్రదాయ వాయిద్యం పరై వాయిస్తున్న కౌసల్య

అయినా ఏ ఫలితమూ లేకపోవడంతో చివరకు ఆమెను వదిలిపెట్టేశారు. ఆమె తిరిగి శంకర్ ఇంటికి వెళ్లపోయింది.

శంకర్ హత్య జరగడానికి వారం రోజుల ముందు ఆమె తల్లిదండ్రులు వాళ్ల ఇంటికి వచ్చి, తమ వెంట వచ్చేయాలని కోరారు. అయితే ఆమె మాత్రం వెనక్కి తగ్లలేదు.

వెళ్లే ముందు ఆమె తండ్రి, ''తర్వాత ఏమైనా జరిగితే బాధ్యత మాది కాదు'' అని హెచ్చరించాడు.

ఒక యువతిని తక్కువ కులం యువకుడు ప్రేమిస్తే జరిగే పరిణామం ఏమిటో అందరికీ తెలియజేయాలని, శంకర్‌ను, కౌసల్యనూ హత్య చేయడానికి కౌసల్య తండ్రి 50 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

డిసెంబర్‌లో న్యాయమూర్తి కౌసల్య తండ్రితో పాటు మొత్తం ఆరుగురికి మరణశిక్ష విధించారు. ఆమె తల్లితో పాటు మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేశారు. కౌసల్య దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్లడానికి సిద్ధమౌతోంది. ఈ నేరంలో తన తల్లి కూడా దోషే అని ఆమె బలంగా విశ్వసిస్తోంది.

శంకర్ హత్య తర్వాత ఆమె చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆ తర్వాత క్రమంగా ఆమె కులం గురించి పుస్తకాలు చదవడం ప్రారంభించింది.

తన జుత్తును పొట్టిగా కత్తిరించుకుంది. కరాటే నేర్చుకోవడం ప్రారంభించింది.

ఫొటో సోర్స్, NATHAN G

ఫొటో క్యాప్షన్,

వాళ్లిద్దరు తీసుకున్న సెల్ఫీ కౌసల్య ఫోన్‌లో వాల్‌పేపర్‌గా ఉంది

కులవ్యతిరేక సంఘాలను కలవడం, కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడ్డం ప్రారంభించింది. ఆ తర్వాత దళితుల సాంప్రదాయ వాయిద్యం పరైను నేర్చుకోవడం ప్రారంభించింది.

ఇవాళ ఆమె శంకర్ తమ కోసం ఓ ఇల్లు కట్టుకోవాలన్న కలను సాకారం చేసింది. ప్రభుత్వం నుంచి అందిన పరిహారంతో గ్రామంలోని పేద పిల్లలకు ఓ ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తోంది. కుటుంబాన్ని పోషించడం కోసం ఓ ప్రభుత్వ కార్యాలయంలో క్లర్కు ఉద్యోగం చేస్తోంది.

వారాంతంలో ఆమె తమిళనాడు అంతటా పర్యటిస్తూ కులం, పరువు హత్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, ప్రేమ ప్రాముఖ్యతను చాటి చెబుతుంది.

ఆమె చేస్తున్న ప్రచారం చాలా మందికి నచ్చడం లేదు. అప్పుడప్పుడు ఆమె ఫేస్‌బుక్ వాల్‌పై చంపేస్తామంటూ బెదిరింపులు వస్తుంటాయి. అందువల్ల ఆమెకు పోలీసు భద్రత కల్పించారు.

శంకర్ మరణించాక, పోలీసులు అతని ఫోన్‌ను ఆమెకు ఇచ్చారు. దానిలో వాళ్ల ప్రేమకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలున్నాయి.

''నాకు ఏం చెప్పాలో తెలీడం లేదు. కానీ ఐ మిస్ యూ'' అని 2015 వేసవిలో శంకర్ ఆమెకు మెసేజ్ పంపాడు.

''మీ టూ'' అని ఆమె దానికి రిప్లై పంపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)