ప్రధాని మోదీ దావోస్ ఎందుకు వెళ్తున్నారు?

  • 22 జనవరి 2018
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ Image copyright Getty Images

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018లో తన తొలి విదేశీ పర్యటనపై దావోస్‌కు వెళ్తున్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 48వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం ప్రారంభం కానున్న ఫోరం సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. మంగళవారం ఫోరం అధికారిక సెషన్స్‌లో ఆయన ప్రసంగిస్తారు.

రెండు దశాబ్దాల తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే.

చివరిసారిగా, 1997లో అప్పటి ప్రధానమంత్రి ఎచ్‌డీ దేవెగౌడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు.

ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీతో ఈ విషయం ప్రస్తావించగా, ఆర్థికవ్యవస్థకు దావోస్ ఓ ముఖ్య వేదికగా మారిందని ప్రపంచానికంతా తెలుసు అని ఆయన జవాబిచ్చారు.

ప్రపంచంలోని ప్రముఖులంతా అక్కడ హాజరవుతారనీ, భావి ఆర్థిక అవకాశాలు కూడా అక్కడే ఆవిష్కృతమవుతాయనీ మోదీ అన్నారు.

Image copyright Getty Images

ఎందుకు వెళ్తున్నారు?

అయితే ఆర్థికవ్యవస్థ దిశ, దశలను పరిశీలించడానికే ఆయన వెళ్తున్నారా? ఇంతకు ముందు ప్రతి సారీ ఆర్థిక మంత్రులు లేదా మరెవరైనా అధికారులు మాత్రమే ఎందుకు హాజరయ్యేవారు?

ఆర్థికరంగ పాత్రికేయులు ఎంకే వేణు దీనికి జవాబిస్తూ, ఆర్థికవ్యవస్థలో చోటు చేసుకున్న మందగమనమే దీనికి కారణమని అన్నారు.

"వచ్చే మే నాటికి మోదీ ప్రభుత్వానికి నాలుగేళ్లు నిండుతాయి. కానీ ఇప్పటి వరకు ప్రధాని దావోస్‌కు వెళ్లలేదు. ఎందుకంటే నిరుటి వరకు ప్రపంచం భారత్‌ను ఎదుగుతున్న ఆర్థికవ్యవస్థగానే చూసేది. చమురు, సరకుల ధరలు తగ్గిపోవడంతో భారత ఆర్థికవ్యవస్థకు లాభం చేకూరింది. అయితే 2015-16లో భారత జీడీపీ వృద్ధి రేటు 7.9 శాతం ఉండగా, 2016-17లో అది 7.1 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 6.52 శాతం వరకు దిగిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్థిక రంగంలో భారత్ వెనుకబడిపోతుండగా, మిగతా ప్రపంచంలోని 75 శాతం దేశాల జీడీపీ రేటు పెరిగింది.

1971లో స్విట్జర్లాండ్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరాన్ని ఒక లాభరహిత సంస్థగా ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.

పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ సంస్థగా దీనికి గుర్తింపు ఉంది. ప్రపంచంలోని వ్యాపార, వాణిజ్య, రాజకీయ, విద్యాసంబంధిత, తదితర రంగాల్లో ప్రముఖులైన వారిని ఆహ్వానించి అంతర్జాతీయ, ప్రాంతీయ, పారిశ్రామిక రంగాల దిశను నిర్ణయించడం దీని ఉద్దేశం.

Image copyright Getty Images

ఆందోళన కలిగిస్తున్న ఆర్థికవ్యవస్థ

ఈ సమావేశానికి ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీల ముఖ్య అధికారులు హాజరవుతారని వేణు తెలిపారు. ఈ వేదికపై వ్యాపారం, నెట్‌వర్కింగ్ వ్యవహారాలు సాగుతాయని ఆయనన్నారు. ఇందులో భారత్ ఒక థీమ్‌గా పాలు పంచుకుంటుంది. ఇందులో చాలా పెద్ద ప్రముఖులు పాల్గొంటారు.

ఇలాంటి ఆర్థిక సమ్మేళనాలు చాలానే జరుగుతాయి. అయితే ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్తుండడం వల్ల ఇది ప్రత్యేకత సంతరించుకుంది. భారత్‌ను ఒక నూతన, యువ, ఉన్నత స్థాయిలోకి ఎదుగుతున్న దేశంగా చూపడం ప్రధాని మోదీ పర్యటన ఉద్దేశమని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

ఈసారి జరిగే వార్షిక సమ్మేళనంలో వ్యాపారం, రాజకీయాలు, కళలు, విద్య, పౌర సమాజానికి చెందిన దాదాపు 3 వేల మంది పాల్గొంటారని పీటీఐ తెలిపింది. వీరిలో భారత్ నుంచి 130 మంది పాల్గొంటున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారిలో అత్యధిక సంఖ్య భారతీయులదే.

Image copyright Getty Images

నల్లధనంపై చర్చ జరిగే అవకాశం

ఫోరం అధికారిక సెషన్ మంగళవారం మొదలవుతుంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోరం ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు క్లాజ్ ష్వాప్‌తో కలిసి ప్రసంగిస్తారు. ఈ పర్యటన చాలా ఫోకస్డ్‌గా ఉంటుందని చెబుతున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ప్రపంచంలోని 60 పెద్ద కంపెనీల సీఈవోలకు విందు ఏర్పాటు చేయనున్నారు.

నల్లధనాన్ని అంతం చేయడానికి ప్రధాని మోదీ చేపట్టిన చర్యల గురించి ఈ ఫోరంలో చర్చ జరగొచ్చని నిపుణులంటున్నారు. "ప్రధానమంత్రి మోదీ నోట్లరద్దు అంశంపై విదేశీ కంపెనీలను తన వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. దీని ద్వారా ఆర్థికవ్యవస్థ డిజిటైజేషన్ అవుతుందని ఆయన నచ్చజెపుతున్నారు" అని వేణు అన్నారు.

"విదేశీ కంపెనీలకు డిజిటైజేషన్, జీఎస్టీ వంటివి వినడానికి బాగా అనిపిస్తాయి. కానీ వీటి వల్ల దేశం లోపల ఆర్థికవ్యవస్థ పరిస్థితి ఎలా అయ్యిందో వాటికి అర్థం కాదు. నోట్లరద్దు వల్ల చిన్న పరిశ్రమలకు, రైతాంగానికి చాలా నష్టం జరిగింది. కానీ దీనికి విదేశీ కంపెనీలు పట్టించుకోవు. జీఎస్టీ ప్రస్తుతం అమలవుతున్న పద్ధతిలో చిన్న పరిశ్రమలు బాగా దెబ్బ తింటున్నాయి" అని వేణు అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఒక సెషన్‌లో రఘురామ్ రాజన్ పాల్గొననున్నారు.

రఘురామ్ రాజన్, షారుఖ్ ఖాన్‌లు కూడా...

ప్రధాని నరేంద్ర మోదీ ఈ పర్యటనలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఆలెన్ బెఖ్సిట్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

ప్రధాని ప్రతినిధి బృందంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ముకేష్ అంబానీ, గౌతం అదానీ, అజీమ్ ప్రేమ్‌జీ వంటి పెట్టుబడిదారులు సభ్యులుగా ఉన్నట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

పాకిస్తాన్ ప్రధానమంత్రి షాహిద్ ఖాకాన్ అబ్బాసీ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్నారు. అయితే భారత ప్రధాని పాక్ ప్రధానితో భేటీ అయ్యే కార్యక్రమమేదీ లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్నారు.

అట్లాగే రఘురామ్ రాజన్ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్నారు. భారత ఆర్థికవ్యవస్థ ఎదుర్కొన్న ఎగుడుదిగుళ్లన్నింటిలో ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పని చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)