రామేశ్వర్‌నాథ్‌ కావ్: బంగ్లాదేశ్ యుద్ధంలో 'కావ్ బాయ్'దే కీలక పాత్ర!

  • 24 జనవరి 2018
నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ వెనుక సూట్‌లో ఉన్న వ్యక్తి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మొదటి డైరెక్టర్ రామేశ్వర్‌నాథ్ కావ్. Image copyright Getty Images
చిత్రం శీర్షిక నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ వెనుక సూట్‌లో ఉన్న వ్యక్తి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మొదటి డైరెక్టర్ రామేశ్వర్‌నాథ్ కావ్.

అది 1996. బంగ్లాదేశ్ యుద్ధంలో విజయం సాధించి 25 ఏళ్లైన సందర్భంగా భారత్‌లో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ నిర్వహిస్తున్న ఓ సదస్సులో చివరన ఓ వ్యక్తి కూర్చున్నారు. ఓ బంగ్లాదేశీ జర్నలిస్టు ఆయనను గుర్తు పట్టి, 'సర్, మీరు స్టేజ్ ముందు వరుసలో కూర్చోవాలి. మీరు లేకుంటే 1971 యుద్ధంలో గెలుపొందేవాళ్లమే కాదు' అన్నారు.

హుందాగా, నిలువెత్తు ఉన్న ఆ వ్యక్తి మాత్రం, 'లేదు, లేదు.. నాదేం లేదు. స్టేజ్ మీద ఉన్నవాళ్లే ఆ ప్రశంసలకు అర్హులు' అని సమాధానం ఇచ్చారు.

ఓ జర్నలిస్టు తనను గుర్తించడంతో ఆందోళన చెందిన ఆయన వెంటనే ఆ సదస్సు నుంచి వెళ్లిపోయారు.

ఇంతకీ ఆయనెవరో కాదు.. భారత విదేశీ నిఘా సంస్థ 'రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్' వ్యవస్థాపకుడు, దాని తొలి డైరెక్టర్ రామేశ్వర్‌నాథ్ కావ్.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక నాటి వియత్నాం పాలకుడు హోచిమిన్‌తో చౌ ఎన్ లై

పోలీస్ సర్వీస్ ఆఫీసర్

1970 దశకంలో ప్రపంచంలోని టాప్ 5 ఇంటెలిజెన్స్ చీఫ్‌లలో కావ్ ఒకరని ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ఫ్రాన్స్ (ఎస్‌డీఏసీఏ) అధినేత కౌంట్ అలెక్సాండ్రే ది మెరెనే ప్రశంసించారు. శారీరకంగా, మానసికంగా ఆయనో అద్భుతమైన వ్యక్తి అని కూడా పేర్కొన్నారు.

రామేశ్వరనాథ్ కావ్ 1918 మే 10న వారణాసిలో జన్మించారు. 1940లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. అప్పట్లో దీన్ని ఐపీ అని కూడా అనేవారు. కావ్‌ను మొదట ఉత్తరప్రదేశ్ కేడర్ సర్వీస్‌లోకి తీసుకున్నారు. 1948లో ఇంటెలిజెన్స్ బ్యూరో ఏర్పడిన తర్వాత దానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించారు. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సెక్యూరిటీ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు.

కావ్‌ తన సర్వీస్ మొదట్లోనే అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్‌లో పని చేసే అవకాశం దక్కించుకున్నారు. 1955లో చైనా ప్రభుత్వం 'కశ్మీర్ ప్రిన్సెస్' అన్న ఓ ఎయిర్ ఇండియా విమానాన్ని అద్దెకు తీసుకుంది. ఈ విమానం హాంకాంగ్ నుంచి జకార్తా వెళ్లేది. బాండుంగ్‌లో నిర్వహించే సదస్సుకు హాజరవడానికి చైనా అధినేత చౌ ఎన్ లై ఇదే విమానంలో వెళ్లాల్సి ఉంది.

అయితే, అపెండిసైటిస్ నొప్పితో లై తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కానీ, ఆ విమానం ఇండోనేసియా తీరంలో కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న చైనా అధికారులు, జర్నలిస్టులు చనిపోయారు.

ఈ విమాన దుర్ఘటన దర్యాప్తు బాధ్యతను భారత ప్రభుత్వం కావ్‌కు అప్పగించింది. తైవాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కుట్ర కారణంగానే విమానం కూలిపోయిందని కావ్ తన దర్యాప్తులో తేల్చారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భారత ప్రధానమంత్రితో చైనా ప్రధాని చౌ ఎన్ లై

'రా' తొలి డైరెక్టర్‌గా..

కావ్ సన్నిహితుడు ఆర్కే యాదవ్ బీబీసీతో మాట్లాడుతూ, 'కావ్ పనితీరుకు చైనా అధినేత చౌ ఎన్ లై ముగ్ధుడయ్యారు. ఆయనను తన కార్యాలయానికి పిలిపించుకుని బహుమతి ఇచ్చారు. కావ్ పదవీ విరమణ వరకు 'రా' కార్యాలయంలో ఆయన టేబుల్‌పై ఆ బహుమతి ఉండేది' అని చెప్పారు.

1968లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ నిఘా సమాచారం సేకరించేందుకు సీఐఏ, ఎంఐ6 ‌లాంటి సంస్థను భారత్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాని పర్యవసానమే కావ్ ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటైంది.

ఇండో-పాక్ యుద్ధంలో భారత్ విజయం వెనుక 'రా' పాత్ర ఎంతో ఉంది. 'ముక్తివాహిని' పేరుతో లక్ష మంది సైన్యానికి కావ్ నేతృత్వంలోని 'రా' శిక్షణ ఇచ్చింది.

కావ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంతో బలంగా ఉండేది. పాకిస్తాన్ ఎప్పుడు, ఏ సమయంలో భారత్ మీద దాడికి దిగుతుందో కూడా ఆయన సమాచారం సేకరించేవారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇండో-పాక్ యుద్ధంలో భారత సైనికులు

యాహ్యా ఖాన్ (పాక్ మూడో అధ్యక్షుడు) కార్యాలయంలోని కచ్చితమైన సమాచారం తేదీలతో సహా కావ్‌కు అందేదని కావ్ సన్నిహితుడు, 'రా' మాజీ డైరెక్టర్ ఆనంద్ కుమార్ వర్మ పేర్కొన్నారు.

''ఇదంతా వైర్‌లెస్ రూపంలో వచ్చేది. కోడ్ భాషలో వచ్చిన ఆ సమాచారాన్ని అర్థం చేసుకున్నాం. కానీ, భారత్‌పై పాక్ దాడి చేసే తేదీని మాత్రం రెండు రోజులు తేడాతో తప్పుగా అంచనా వేశాం. దాడి సమాచారం తెలిసిన వెంటనే వాయుసేనను అప్రమత్తం చేశాం. కానీ, రెండు రోజుల పాటు పాక్ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో వాయుసేన చీఫ్ కాస్త ఆందోళన చెందారు. విమానాలను ఎక్కువ సమయం గగనతలంలో ఉంచలేమని ఆయన కావ్‌కు తెలిపారు. అయితే ఇంకా ఒక్క రోజు వేచిచూడాలని కావ్ ఆయనను కోరారు'' అని వివరించారు.

''సరిగ్గా రెండు రోజుల తర్వాత అంటే డిసెంబర్ 3న భారత్‌పై పాక్ దాడికి దిగింది. అప్పటికే భారత వాయుసేన యుద్ధానికి సిద్ధంగా ఉంది. పాక్ దాడి విషయాన్ని మాకు అందజేసింది నిఘా సంస్థ వ్యక్తి. అతడు సరైన సమయంలో, సరైన స్థలంలో ఉంటూ కోడ్ భాషలో మాకు సమాచారాన్ని అందించారు'' అని నాటి పరిణామాలను వర్మ గుర్తు చేసుకున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సిక్కిం విలీన ప్రణాళిక

సిక్కిం విలీనంలో కీలకపాత్ర

సిక్కిం భారత్‌లో విలీనం కావడంలో కావ్ కీలకపాత్ర పోషించారు. కేవలం నలుగురు అధికారులతోనే ఈ బృహత్తర కార్యాన్ని ఆయన నిర్వహించారు. భారత్‌లో సిక్కిం విలీన ప్రక్రియ చాలా రహస్యంగా జరిగింది. ఈ విషయం కావ్ డిప్యూటీ శంకరన్ నాయర్‌కు కూడా తెలియదు.

''సిక్కిం విలీన ప్రణాళిక కూడా కావ్ ఆలోచనే. అప్పట్లో ఇందిరాగాంధీ ఉపఖండంలో తిరుగులేని నేతగా ఎదిగారు. బంగ్లాదేశ్ విజయంతో ఆమె ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఉపఖండంలోని సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని ఆమె భావించారు.''

''సిక్కిం రాజు చొగ్యల్ అమెరికా వనితను పెళ్లి చేసుకోవడంతో అసలు సమస్య మొదలైంది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ అప్పటికే సిక్కింలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది'' అని ఆర్కే యాదవ్ బీబీసీకి తెలిపారు.

‘'సిక్కింను భారత్‌లో విలీనం చేయగలిగితే అది రక్తపాత రహిత సైనికచర్య అవుతుంది. చైనా సరిహద్దులో ఉన్న భూభాగాన్ని దక్కించుకోవడం భారత్‌కు బలమవుతుంది" అని కావ్ ఇందిరాగాంధీకి సలహా ఇచ్చారు. అప్పటికే చైనా సేనలు సిక్కిం సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి. అయితే, ఇందిరాగాంధీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. సిక్కిం.. భారత్‌లో 22వ రాష్ట్రంగా చేరడానికి ముఖ్యకారణం కావ్ ముందుచూపే'’ అని ఆర్కే యాదవ్ వివరించారు.

చిత్రం శీర్షిక రాలో పనిచేసిన ఆర్.కె.యాదవ్ 'ద మిషన్ ఆర్ అండ్ ఏడబ్ల్యూ' అనే పుస్తకం రాశారు

ఆకట్టుకునే దుస్తుల్లో..

పదవీ విరమణ తర్వత కూడా ఆయన సూట్‌లోనే కనిపించేవారు. ఒక్కోసారి ఆయన ఖాదీ కుర్తాలో కూడా మెరిసేవారు అని ఆర్కే యాదవ్ చెప్పారు.

‘'ఆయనకు ఏ దుస్తులైనా బాగా నప్పేవి. మంచి శరీర ధారుఢ్యంతో ఓ ఆటగాడిలా ఆయన కనిపించేవారు. యువకుడిగా ఉన్నప్పటి నుంచే ఆయనకు గుర్రపు స్వారీ అలవాటు. తన సగం వేతనం గుర్రాన్ని మేపడానికే సరిపోతుందని ఆయన అప్పుడప్పుడు అంటుండేవారు. కావ్ వేసుకొనే దుస్తులు, ఆయన హుందాతనం చూసి ఆయన సహచరులు అసూయపడేవారు’' అని ఆర్కే యాదవ్ తెలిపారు.

‘'కావ్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న జాకెట్‌ను ధరించేవారు. కలకత్తాలోని గోపాల్ కంపెనీలోనే అవి లభించేవి. తర్వాత అది మూతపడింది. అయితే, కావ్‌కు అవరసరమైన పది, పన్నెండు జాకెట్‌లను మాత్రమే వారు తయారు చేసి ఇచ్చేవారు'’ అని కావ్ సన్నిహితుడు, రా మాజీ అడిషనల్ డైరెక్టర్ రానా బెనర్జీ బీబీసీతో చెప్పారు.

Image copyright PN DHAR
చిత్రం శీర్షిక రా తొలి డైరెక్టర్ ఆర్.ఎన్.కావ్, ఇందిరాగాంధీ ముఖ్య కార్యదర్శి పి.ఎన్.ధర్

జనతా ప్రభుత్వం విచారణ

1977 సాధారణ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయాక మొరార్జీ దేశాయ్ భారత ప్రధాని అయ్యారు. ఇందిర కాలంలో విధించిన ఎమర్జెన్సీకి కావ్ కూడా బాధ్యుడని మొరార్జీ భావించేవారు. అయితే, ప్రధానిగా మీరు విచారణ కమిటీ ఏర్పాటు చేసుకోవచ్చని కావ్ మొరార్జీకి చెప్పారు.

మొరార్జీ ఇందుకోసం చరణ్‌సింగ్ అల్లుడు ఎస్పీ సింగ్ నేతృత్వంలో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కావ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది.

‘'సహచరులు, కిందిస్థాయి ఉద్యోగులతో కూడా కావ్ చాలా మర్యాదగా మాట్లాడేవారు. ఆయన మాటలు ఎవరినీ కించపరిచేలా ఉండేవి కావు. అప్పుడు యువకులుగా ఉన్న మేం ఆయనను ఓ హీరోగా ఆరాధించేవాళ్లం'’ అని రాజీ మాజీ అడిషనల్ సెక్రటరీ జ్యోతి సిన్హా చెప్పారు.

విదేశీ ఇంటెలిజెన్స్ అధిపతులతో కావ్‌కు ఉన్న వ్యక్తిగత సంబంధాలు భారత్‌కు ఎంత ఉపయోగపడ్డాయో చాలా తక్కువ మందికే తెలుసు.

అమెరికా మాజీ అధ్యక్షుడు, సీఐఏ మాజీ అధిపతి జార్జ్ బుష్ సీనియర్ ఒకసారి కావ్‌కు అమెరికన్ కౌబాయ్‌ని పోలిన విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి కావ్ సహచరులు ఆయనను కావ్ బాయ్ అని పిలిచేవారు. ఇప్పటికీ ఆ కౌబాయ్ విగ్రహం 'రా' ప్రధాన కార్యాలయంలో ఉంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్

కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?

కేరళ వరదలు: 'మా వాళ్ళు ఏడుగురు చనిపోయారు.. నేను ఎక్కడికి పోవాలి...'

నడి సంద్రంలో తిండీ నీరూ లేక 14 మంది చనిపోయారు... ఒకే ఒక్కడు బతికాడు

అనంతపురం వైరల్ వీడియో: గ్రామ పెద్ద బాలికను కొట్టిన ఘటనలో ఏం జరిగింది

"డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు

శాండ్‌విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు