దావోస్‌లో మోదీ: ప్రపంచం ముందున్న సవాళ్లు ఇవే!

  • 23 జనవరి 2018
నరేంద్ర మోదీ Image copyright Reuters

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం 48వ వార్షిక సమావేశాల్లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.

దాదాపు 2 దశాబ్దాల తరువాత భారతదేశ ప్రధానమంత్రి, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొన్నారు.

అంతకుముందు, చివరిసారిగా 1997లో అప్పటి ప్రధానమంత్రి హెచ్‌డి దేవగౌడ్ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

వరల్డ్ ఎకనమిక్ ఫోరంను ప్రపంచ వేదికగా మలచడం ఒక మంచి ముందడుగు అని మోదీ అన్నారు.

గత 20 ఏళ్ళలో భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి-జీడీపీ 6 రెట్లు పెరిగిందని చెప్పారు.

Image copyright Getty Images

వాతావరణ మార్పులతో మానవాళికి ముప్పు

పేదరికం, వేర్పాటువాదం, నిరుద్యోగ సమస్యను దూరం చేయాల్సి ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం, ప్రపంచం ముందు మూడు ప్రధాన సవాళ్లు ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.

వాతావరణంలో మార్పులు మానవజాతి అభివృద్ధికి పెద్ద ముప్పుగా మారాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.

పరిస్థితులు దిగజారుతున్నాయి. ఎన్నో ద్వీపాలు మునిగిపోయాయి. కొన్ని మునిగిపోయే దశలో ఉన్నాయని గుర్తు చేశారు.

ప్రకృతిని కాపాడుకోవడం అనేది భారతీయ సంస్కృతిలో భాగమని చెప్పారు.

గడిచిన మూడేళ్లలో భారతదేశంలో విద్యుత్ ఉత్పాదన 60 గిగావాట్లకు చేరిందని ఆయన వివరించారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక డబ్యూఈఎఫ్ కాంగ్రెస్ సెంటర్

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

ప్రపంచం ముందున్న రెండో పెద్ద సమస్య ఉగ్రవాదమని మోదీ అన్నారు.

తీవ్రవాదం ఎంత ప్రమాదకరమో, మంచి, చెడు తీవ్రవాదాలంటూ కృత్రిమంగా సృష్టిస్తున్న వ్యత్యాసాలు అంతకంటే ఎక్కువ ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

అన్ని దేశాలు తమ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించడం మూడో సమస్య అని మోదీ అన్నారు.

గ్లోబలైజేషన్ వెలుగు తగ్గుతోందని, దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాల వేగం తగ్గిందని తెలిపారు.

దేశాల మధ్య వాణిజ్య కార్యక్రమాల తరుగుదల స్పష్టంగా కనిపిస్తోందని, మూడేళ్లలో 1400లకు పైగా చట్టాలు రద్దు చేశారని మోదీ గుర్తు చేశారు.

భారత దేశంలో జీఎస్టీ రూపంలో వ్యవస్థను సంఘటితం చేసే ప్రక్రియ ప్రారంభించామని, పారదర్శకతను పెంచడానికి టెక్నాలజీని విరివిగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.

ప్రపంచంలో బలమైన వ్యవస్థల మధ్య సహాయ సహకారాలు పెంపొందాలని, సవాళ్ళను ఉమ్మడిగా ఎదుర్కోవడం కోసం అంతా ఏకమవ్వాలని ఆయన పిలుపు ఇచ్చారు.

మరోవైపు, మోదీ నేతృత్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ చైర్మన్ క్లాజ్ స్వాప్ అన్నారు.

'వసుదైక కుటుంబం' అనే భారతీయ తత్వచింతన, అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి, సామరస్యానికి ఎంతో తోడ్పడుతోందని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.