మారిన తల్లులు.. విడిచి రాలేమంటున్న పిల్లలు

  • 24 జనవరి 2018
రియాన్‌తో షెవాలీ బోరో
చిత్రం శీర్షిక తల్లిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టని రియాన్

ఇది అచ్చం బాలీవుడ్ సినిమా కథను తలపిస్తుంది.

మొదటి సీన్: ఇద్దరు పిల్లలు కొద్ది నిమిషాల వ్యవధిలో జన్మించారు. అయితే ఆసుపత్రిలో పొరబాటున ఒక తల్లి పిల్లలు మరో తల్లి ఒడికి చేరారు.

రెండో సీన్: వారిద్దరివీ భిన్నమైన నేపథ్యాలు. ఒకరి తల్లిదండ్రులు గిరిజనులైతే, మరొకరు ముస్లింలు.

ట్విస్ట్ ఏంటంటారా.. అధికారులతో దాదాపు మూడేళ్ల సుదీర్ఘ పోరాటం, డీఎన్‌ఏ పరీక్షల తర్వాత.. ఇప్పుడా పిల్లలు తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను విడిచిపోమంటున్నారు.

ఈ కథ ఈశాన్య భారతదేశంలోని అస్సోంకు సంబంధించినది.

చిత్రం శీర్షిక రియాన్ తమ పిల్లాడు కాదంటే నమ్మలేకపోయామంటున్న షెవాలీ బోరో

11 మార్చి, 2015న ఉదయం 6 గంటలకు షాబుద్దీన్ అహ్మద్ తన భార్య సల్మా పర్బీన్‌ను మంగల్దాయ్ సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. గంట తర్వాత ఆమెకో బాబు పుట్టాడు. ఆమెను మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు.

''వారం గడిచాక, నా భార్య 'ఈ పిల్లాడు మన పిల్లాడు కాదు' అంది. నేను 'ఏమంటున్నావ్ నువ్వు? అమాయకుడైన పిల్లాడి గురించి అలా మాట్లాడకూడదు' అన్నాను. కానీ నా భార్య.. లేబర్ రూంలో మరో బోడో గిరిజన యువతి ఉందని, పిల్లలు ఇద్దరూ మారిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. నేను ఆమెను నమ్మలేదు. కానీ ఆమె మాత్రం తన పట్టు వీడలేదు'' అని షాబుద్దీన్ తెలిపారు.

మొదటి నుంచి జొనైత్ తన పిల్లాడు కాదని తనకు అనుమానంగా ఉన్నట్లు సల్మా పర్బీన్ తెలిపారు.

''పిల్లాడి ముఖం చూసినప్పుడే నాకు అనుమానం కలిగింది. లేబర్ రూంలో ఉన్న మరో మహిళ మొహం నాకు గుర్తే. పిల్లవాడి మొహం అచ్చం ఆమెలాగే ఉంది. బాబు కళ్లు చూస్తే అది స్పష్టమవుతుంది. ఆ కళ్లు చిన్నగా ఉన్నాయి. మా ఇంట్లో ఎవరికీ అలా లేవు'' అని ఆమె అన్నారు.

షాబుద్దీన్ తన భార్య అనుమానాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు చెప్పినపుడు ఆమె సల్మాకు మతి భ్రమించిందని అన్నారు. దీంతో షాబుద్దీన్ తన భార్య డెలివరీ అయిన రోజు ఉదయం 7 గంటల సమయంలో ఆసుపత్రిలో పుట్టిన పిల్లల వివరాలు కావాలంటూ సమాచార హక్కు కింద దరఖాస్తు చేసుకున్నారు.

నెల తర్వాత ఆయనకు ఏడుగురు మహిళల వివరాలు అందాయి. రికార్డులు పరిశీలించాక ఆయన గిరిజన మహిళ వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇద్దరు పిల్లలూ ఒకే పరిస్థితుల్లో పుట్టారు. ఇద్దరూ మగపిల్లలు, ఇద్దరి బరువూ 3 కిలోలే. వారు కేవలం 5 నిమిషాల తేడాతో ఈ లోకంలోకి వచ్చారు.

షాబుద్దీన్ రెండుసార్లు ఆ గిరిజన దంపతుల గ్రామానికి వెళ్లినా, వాళ్ల ఇంటికి వెళ్లే ధైర్యం చేయలేకపోయారు.

''దాంతో నేను వాళ్లకు ఓ లేఖ రాశాను. నా భార్య పిల్లలు మారినట్లు భావిస్తోందని, అందువల్ల వాళ్లకూ అలాంటి అనుమానం ఏమైనా కలిగిందా అని ప్రశ్నించాను. ఉత్తరం చివరన నా నెంబర్ ఇచ్చి, అనుమానం వస్తే నాకు ఫోన్ చేయమని కోరాను.''

షాబుద్దీన్ ఇంటికి 30 కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో గిరిజన దంపతులు అనిల్, షెవాలీ బొరో నివసిస్తున్నారు. తమ పిల్లాడికి వారు రియాన్ చంద్ర అని పేరు పెట్టుకున్నారు.

షాబుద్దీన్ ఉత్తరం వచ్చేంత వరకు వాళ్లకు పిల్లాడి గురించి అనుమానం రాలేదు. కానీ రెండు కుటుంబాలు కలిసినప్పుడు మాత్రం పరిస్థితి మారింది.

''మొదటిసారి ఆయనను చూసినపుడు పిల్లాడు తండ్రి పోలిక అని అనిపించింది. నాకు చాలా దు:ఖం వచ్చి ఏడ్చేశాను. మేం బోడోలం. అస్సామీలు, ముస్లింలలాంటి వాళ్లం కాదు. మా కళ్లు, బుగ్గలు, చేతులన్నీ మంగోలియా లక్షణాలతో ఉంటాయి'' అన్నారు షెవాలీ.

రియాన్‌ను చూడగానే సల్మా పర్బీన్‌కు కూడా ఆ పిల్లవాడు తన బిడ్డే అని అర్థమైంది.

చిత్రం శీర్షిక జొనైత్ తన రక్తం కాదని మొదటి నుంచి తనకు అనుమానం ఉందంటున్న పర్బీన్

షాబుద్దీన్ పట్టుబట్టడంతో ఆసుపత్రి అధికారులు ఈ ఆరోపణలపై విచారణకు ఒక కమిషన్ నియమించారు. ఆ రోజు లేబర్ రూంలో ఉన్న నర్సులను విచారించిన అనంతరం ఎలాంటి తప్పూ జరగలేదని ఆ కమిషన్ తేల్చింది.

సంతృప్తి చెందని షాబుద్దీన్ ఆగస్ట్, 2015లో భార్య, పిల్లాడి రక్త నమూనాలను డీఎన్‌ఏ పరీక్షలకు పంపారు. రిపోర్టులు వచ్చినపుడు ఆయనకు సమాధానం లభించింది.

సల్మా, జొనైత్‌లు తల్లీబిడ్డలు కాదు.

అయితే ఆసుపత్రి అధికారులు మాత్రం ఆ రిపోర్టు చట్టప్రకారం చెల్లదని తిరస్కరించారు. దీంతో అదే ఏడాది డిసెంబర్‌లో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన సబ్ ఇన్‌స్పెక్టర్ హేమంత బారువా, నిజమేంటో తెలుసుకోవడానికి 2016 జనవరిలో ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రుల రక్త నమూనాలతో కోల్‌కతాలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వెళ్లారు. కానీ ఆ ఫారంలో చిన్న తప్పు ఉండడంతో వాళ్లు పరీక్షలకు నిరాకరించారు.

బారువా మళ్లీ ఏప్రిల్‌లో రక్త నమూనాలను తీసుకుని గువాహటి వెళ్లారు. నవంబర్‌లో ఫలితాలు రాగా, షాబుద్దీన్ అనుమానం నిజమని తేలింది.

దీంతో షాబుద్దీన్ కోర్టుకు వెళ్లారు. కానీ జనవరి 4న రెండు కుటుంబాలు పిల్లలను మార్చుకోవడానికి కోర్టుకు వెళ్లినపుడు పిల్లలిద్దరూ తమను పెంచిన తల్లిదండ్రులకు దూరంగా వెళ్లడానికి ఇష్టపడలేదు.

''మాకు ఇష్టమైతే పిల్లలను మార్చుకోవచ్చని మేజిస్ట్రేట్ చెప్పారు. కానీ మేం అలా చేయలేమని ఆయనకు చెప్పాం. గత మూడేళ్లుగా ఈ పిల్లలను పెంచాం. ఇప్పుడు చూస్తూ చూస్తూ వాళ్లను ఇంకొకళ్లకు ఇవ్వడానికి మనసు ఒప్పలేదు'' అని సల్మా పర్బీన్ తెలిపారు.

''జొనైత్ నన్ను వదిలి వెళ్లనంటూ నా మెడను గట్టిగా వాటేసుకుని ఏడ్వడం మొదలుపెట్టాడు.''

రియాన్ కూడా అదే విధంగా షెవాలీని వదిలి వెళ్లనంటూ ఏడ్వడం ప్రారంభించాడు.

చిత్రం శీర్షిక పిల్లలను ఇప్పుడు మార్చుకోవడం మంచి ఆలోచన కాదంటున్న బోరో దంపతులు

పిల్లలను మార్చుకుంటే వాళ్ల మనసులు గాయపడే ప్రమాదం ఉందని అనిల్ బోరో గుర్తించారు.

మూడేళ్లుగా కలిసి జీవించడంతో వాళ్లకు తమను పెంచిన తల్లిదండ్రులతో ప్రేమానుబంధాలు పెరిగాయి.

కొన్నిరోజుల తర్వాత షాబుద్దీన్, బొరో దంపతుల ఇంటికి వెళ్లినపుడు రియాన్‌ను మొదట వాళ్లు అతని కంట పడనివ్వలేదు.

కొంత సేపటి తర్వాత పిల్లవాడు తిరిగి వచ్చినా, అతని పెంపుడు తల్లిదండ్రులు, బంధువులు మాత్రం అతణ్ని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు.

''పిల్లాడి మొహం ఎంత అమాయకంగా ఉందో చూడండి. ఇలాంటి పిల్లాణ్ని ఎలా వదిలి ఉండగలం'' అని వాళ్లు బాధపడ్డారు.

రియాన్ కూడా ఒక్క క్షణమైనా షెవాలీ పక్క నుంచి లేచి వెళ్లలేదు.

అలాగే జొనైత్ కూడా అప్పటికే షాబుద్దీన్, సల్మాలకు అలవాటైపోయాడు.

చిత్రం శీర్షిక రియాన్‌ను తీసుకెళ్లిపోతారేమో అని బోరో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

''మేం పిల్లలను మార్చుకోవడానికి కోర్టుకు వెళ్లే రోజు నా ఎనిమిదేళ్ల కూతురు, 'అమ్మా, తమ్ముణ్ని పంపేయొద్దు. అలా చేశావంటే నేను చచ్చిపోతాను' అంది'' అని సల్మా తెలిపారు.

రెండు కుటుంబాలకు మతపరమైన సమస్యలు రావా?

''పిల్లలెప్పుడూ పిల్లలే. వాళ్లు హిందువులు కాదు, ముస్లింలు కాదు, దేవుని వరాలు. వాళ్లంతా దేవుని దగ్గర నుంచే వస్తారు. ఈ భూమ్మీదకు వచ్చాకే హిందువులు, ముస్లింలుగా మారతారు'' అన్నారు షాబుద్దీన్.

పిల్లలను మార్చుకుంటే ఇప్పుడు భాష, సంస్కృతి, జీవన విధానాలు, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం చాలా కష్టమని ఆయన అన్నారు.

ఇక తల్లుల విషయానికి వస్తే, ఆ పిల్లవాడు తమకు పుట్టలేదని తెలిసినా, పిల్లలను పెంచే సందర్భంలో వాళ్లతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అదే సమయంలో కన్నపేగు బంధం బాధ కూడా తీర్చలేనిది.

ప్రస్తుతం పిల్లలిద్దరూ తమ పెంపుడు తల్లిదండ్రుల వద్దే పెరుగుతున్నారు. పెద్దయ్యాక వాళ్లు ఎవరి వద్ద ఉండాలనే నిర్ణయాన్ని ఆ తల్లిదండ్రులు పిల్లలకే వదిలేశారు.

ప్రస్తుతం రెండు కుటుంబాల సభ్యులూ అప్పుడప్పుడూ ఒకరినొకరు కలుసుకుంటూ, తమ సొంత పిల్లలను చూసుకుంటూ, స్నేహితులుగా మారే క్రమంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)