BBC SPECIAL: అంధుల క్రికెట్‌లో తెలుగోళ్ల సత్తా

  • 24 జనవరి 2018
అంధుల క్రికెట్ వరల్డ్ కప్‌ను గెలుచుకున్న భారత జట్టు Image copyright Twitter
చిత్రం శీర్షిక అంధుల క్రికెట్ వరల్డ్ కప్‌ను గెలుచుకున్న భారత జట్టు

వారి కళ్లు వెలుగును చూడలేకున్నా, వారి కళ్లలో మాత్రం గెలుపు తెచ్చిన వెలుగు మిలమిలా మెరుస్తోంది. అంధుల క్రికెట్ ప్రపంచ కప్‌ను మరోసారి భారత్‌ గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఐదుగురు తెలుగు క్రీడాకారులతో 'బీబీసీ తెలుగు' మాట్లాడింది.

వారి జీవితంలోకి చీకటెలా వచ్చింది..? అంధుల క్రికెట్ ఆ చీకటిని ఎలా పారదోలింది..? అంధుల క్రికెట్‌కు సాధారణ క్రికెట్‌కు ఉన్న తేడా ఏంటి..?.. ఇలాంటి ఎన్నో విషయాలను వారు పంచుకున్నారు.

అంధుల క్రికెట్‌లో కొన్నాళ్లుగా భారత్ సత్తా చాటుతోంది. తాజాగా షార్జాలో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ పాకిస్తాన్‌పై ఉత్కంఠభరిత పోరులో గెలిచింది.

ఈ జట్టుకు కెప్టెన్ గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన అజయ్ కుమార్ రెడ్డి.

ఆయనతో పాటు మరో నలుగురు తెలుగు క్రీడాకారులు మహేంద్ర, వెంకటేశ్వరరావు, దుర్గారావు, ప్రేమ్‌కుమార్‌లు ప్రస్తుతం ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్నారు.

జాతీయ జట్టులో మొత్తం 17 మంది ఆటగాళ్లు ఉండగా అందులో అయిదుగురు తెలుగువారే ఉండడానికి కారణం ప్రతిభతో పాటు జోనల్ స్థాయి నుంచి వారికి అందుతున్న ప్రోత్సాహమేనన్నది వారి మాట.

Image copyright Twitter/CABI
చిత్రం శీర్షిక భారత జట్టు కెప్టెన్ అజయ్ రెడ్డి అంధుల క్రికెట్‌లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందారు.

ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్!

నాలుగేళ్ల వయసులో తలుపు గడియ తగలడంతో అజయ్ ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతింది. ఆ గాయం వల్ల సోకిన ఇన్ఫెక్షన్ కారణంగా క్రమంగా కుడికన్ను చూపూ మందగించింది.

ఇప్పుడాయన తన కుడికంటితో, అది కూడా 2 నుంచి 3 మీటర్లలోపు దూరంలోని వస్తువులను మాత్రమే పాక్షికంగా చూడగలరు.

చిన్నతనంలో క్రికెట్‌పై ఉన్న విపరీతమైన ఆసక్తితో ఆయన అందరితోపాటే క్రికెట్ ఆడేవారు. బంతిని గుర్తించలేక ప్రతి రోజూ ఆటలో దెబ్బలు తగిలించుకునేవారు. అంధుల పాఠశాలలో చేరాక అక్కడ అంధులకు ప్రత్యేకంగా క్రికెట్ ఉందని తెలుసుకుని అందులో రాణించారు.

నాలుగుసార్లు ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొన్న అజయ్ అంధుల క్రికెట్‌లో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్ అని సహచరుడు మహేంద్ర తెలిపారు. బ్యాటింగులోనూ అజయ్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆడిన 56 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 12 సెంచరీలు చేశారు.

చిత్రం శీర్షిక వరల్డ్ కప్ విజయం తరువాత దిల్లీకి చేరుకున్న భారత జట్టులోని తెలుగు ఆటగాళ్లు అజయ్ కుమార్ రెడ్డి, ప్రేమ్ కుమార్, మహేంద్ర

ఒక్కొక్కరిది ఒక్కో కథ..

* ఇక మిగతావారిలో మహేంద్ర హైదరాబాద్‌వాసి. మూడేళ్ల వయసులో మందులు వికటించడంతో కంటిచూపు కోల్పోయారు. ఇప్పటివరకు రెండు వరల్డ్‌కప్‌లు ఆడిన ఆయన ప్రస్తుతం స్టేట్‌బ్యాంకులో పీవోగా పనిచేస్తున్నారు. క్రీడాకోటాలో కాకుండా ప్రతిభ ఆధారంగా ఆయన ఉద్యోగాన్ని సాధించారు.

* కర్నూలుకు చెందిన ప్రేమ్‌కుమార్ చిన్నతనంలో చికెన్‌పాక్స్ సోకినప్పుడు చూపు కోల్పోయారు. క్రికెట్‌లోనే కాదు, పాటలు పాడడంలోనూ మంచి ప్రతిభావంతుడు ఈయన. వివిధ టీవీ ఛానళ్లు నిర్వహించిన సంగీత కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.

* వెంకటేశ్వరరావుది శ్రీకాకుళం జిల్లా. చిన్నప్పుడు క్రికెట్ ఆడుతుండగా బంతి కంటికి తాకడంతో చూపు కోల్పోయిన ఆయన ఆ తరువాత కూడా క్రికెట్‌ను కొనసాగిస్తున్నారు.

* శ్రీకాకుళం జిల్లాకే చెందిన దుర్గారావు ఆల్‌రౌండర్‌గా జట్టులో రాణిస్తున్నారు. చిన్నతనంలో ప్రమాదవశాత్తు చూపు కోల్పోయిన ఆయన రెండు ప్రపంచకప్‌లలో ఆడారు.

Image copyright Twitter/CABI
చిత్రం శీర్షిక అంధుల క్రికెట్‌లో వాడే బంతిలో బాల్ బేరింగులుంటాయి. దాంతో, బంతి నుంచి వచ్చే శబ్దం ఆధారంగా దాని జాడ గుర్తిస్తారు.

ఎలా ఆడతారు?

* సాధారణ క్రికెట్‌కు, అంధుల క్రికెట్‌కు ఉన్న ప్రధాన తేడా బంతి. సింథటిక్ ఫైబర్‌తో తయారుచేసే ఈ బంతిలో బాల్‌బేరింగులు ఉంటాయి.

* దాంతో బంతి వస్తున్నప్పుడు శబ్దం చేస్తుంది. బ్యాట్స్‌మన్ కానీ, ఫీల్డర్ కానీ ఆ శబ్దం ఆధారంగా బంతి జాడ గ్రహించి ఆడతారు.

* బౌలింగ్ విషయానికొస్తే సాధారణ క్రికెట్ మాదిరిగా కాకుండా అండర్ ఆర్మ్ బౌలింగ్ చేస్తారు. అయితే, సాధారణ క్రికెట్ మాదిరిగానే ఇందులోనూ బాల్ వేగంగా వేసే బౌలర్లు ఉన్నారు.

అందరూ పూర్తిగా అంధులు కారు..

* జట్టులోకి నాలుగు క్యాటగిరీల్లో ఆటగాళ్లను తీసుకుంటారు.

* బీ1 క్యాటగిరీలో పూర్తిగా అంధులైన నలుగురు ఆటగాళ్లుంటారు.

* బీ2లో పాక్షికంగా అంధులైన ముగ్గురు ఆటగాళ్లుంటారు. వీరు 3 మీటర్ల దూరం వరకు చూడగలిగే సామర్థ్యంతో ఉంటారు.

* బీ3 క్యాటగిరీలో నలుగురు ఆటగాళ్లుంటారు. వీరు 5 నుంచి 6 మీటర్ల దూరం వరకు చూడగలరు.

* మిగతా ఆటగాళ్లు బీ4 క్యాటగిరీలో ఉంటారు. వీరికి ఇంకొంచెం మెరుగైన దృష్టి ఉంటుంది.

చిత్రం శీర్షిక ట్రోఫీతో భారత అంధుల క్రికెట్ జట్టు ఆటగాళ్లు

'క్రీడా కోటాలో మాకూ అవకాశమివ్వాలి'

అంధ క్రికెటర్లకు క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వాలు సహకరించాలని వీరు కోరుతున్నారు.

మిగతా క్రీడల్లో ఆటగాళ్లకు ఇస్తున్నట్లుగా తాము భారీ నజరానాలేమీ కోరుకోనప్పటికీ ఉద్యోగాలు కల్పిస్తే చాలని, బీసీసీఐ నుంచి కూడా సహకారం అవసరమని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు