రిపబ్లిక్ డే పరేడ్: ఆసియాన్‌ ఎందుకంత ప్రత్యేకం?

  • 25 జనవరి 2018
ఆసియాన్ సభ్య దేశాల జాతీయ పతాకాలతో మంగళవారం రిపబ్లిక్ డే పరేడ్ పూర్తిస్థాయి రిహార్సల్స్‌లో పాల్గొన్న భారత సైనిక బృందం Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆసియాన్ సభ్య దేశాల జాతీయ పతాకాలతో మంగళవారం రిపబ్లిక్ డే పరేడ్ పూర్తిస్థాయి రిహార్సల్స్‌లో పాల్గొన్న భారత సైనిక బృందం

శుక్రవారం జరిగే 69వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. 10 దేశాల అధినేతలు/ప్రభుత్వాధినేతలు ఇందులో ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.

రిపబ్లిక్ డే పరేడ్‌కు భారత్ ఇతర దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం మొదటి నుంచి ఆనవాయితీగానే వస్తున్నా, ఒకేసారి పది మంది దేశాధినేతలు/ప్రభుత్వాధినేతలను పిలవడం మాత్రం ఇదే తొలిసారి.

ఆగ్నేయాసియా దేశాల కూటమి(అసోసియేషన్ ఆఫ్ సౌత్-ఈస్ట్ ఏసియన్ నేషన్స్)-భారత్ మైత్రీబంధం రజతోత్సవాలను పురస్కరించుకొని ఆసియాన్‌లోని మొత్తం పది సభ్యదేశాల అధినేతలను, ప్రభుత్వాధినేతలను ఈ గణతంత్ర దినోత్సవానికి భారత్ ఆహ్వానించింది.

ఆసియాన్-భారత్ భాగస్వామ్యం పాతికేళ్లు (1992-2017) పూర్తిచేసుకున్న సందర్భంగా, రిపబ్లిక్ డేకు ఒక రోజు ముందు గురువారం దిల్లీలో ఆసియాన్-భారత్ ప్రత్యేక సదస్సు ఏర్పాటైంది. ఇందులోనూ ఈ పది మంది నాయకులు పాల్గొన్నారు.

Image copyright PRAKASH SINGH/AFP/Getty Images
చిత్రం శీర్షిక బుధవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ, మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్ సాన్ సూకీ

'ఆసియాన్' అతిథులు వీరే..

  • మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్ సాన్ సూకీ
  • ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే
  • సింగపూర్ ప్రధాని లీ హిసియన్ లూంగ్
  • ఇండొనేషియా అధ్యక్షుడు జోకో విడోడో
  • వియత్నాం ప్రధాని ఎన్‌గుయెన్ గ్సువాన్ ఫ్యుక్
  • మలేషియా ప్రధాని డాటో శ్రీ మొహమ్మద్ నజీబ్ బిన్ తున్ అబ్దుల్ రజాక్
  • థాయ్‌లాండ్ ప్రధాని జనరల్ ప్రయుత్ చాన్-ఓ-చా
  • బ్రూనై సుల్తాన్ హజీ హసన్‌లాల్ బోల్‌కియా
  • కంబోడియా ప్రధాని హున్ సెన్
  • లావోస్ ప్రధాని థాంగ్లౌన్ సిసౌలిథ్
Image copyright PRAKASH SINGH/AFP/Getty Images
చిత్రం శీర్షిక బుధవారం దిల్లీలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే‌తో ప్రధాని మోదీ

ఆసియాన్-భారత్ సంబంధాల్లో ఇదో ముఖ్య పరిణామం.

ఆసియాన్, ఆసియాన్-భారత్ సంబంధాల్లోని వివిధ ప్రాథమిక అంశాలు ఇవీ..

ఆసియాన్ ఎప్పుడు, ఎందుకు ఏర్పాటైంది?

ఆసియాన్ 1967 ఆగస్టు 8న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఏర్పాటైంది.

ఆసియాన్ ఏర్పాటైనప్పుడు సభ్యదేశాలు ఐదే ఉండేవి. అవి: ఇండొనేషియా, మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్.

1984 నుంచి 1999 మధ్య మరో ఐదు దేశాలు- బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా ఈ కూటమిలో చేరాయి.

సమష్టి ప్రయత్నాలతో ఆగ్నేయాసియా ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని, సామాజిక, సాంస్కృతిక పురోగతిని వేగవంతం చేయడం, ప్రాంతీయ శాంతి, సుస్థిరతలను సాధించడం కూటమి ప్రధాన లక్ష్యాలు.

కూటమి ప్రధాన కార్యాలయం ఇండొనేషియా రాజధాని జకార్తాలో ఉంది. ఆసియాన్ ప్రస్తుత సెక్రటరీ జనరల్ - లిమ్ జాక్ హోయ్ (బ్రూనై).

Image copyright www.weforum.org/ASEAN
చిత్రం శీర్షిక ఆసియాన్ సభ్యదేశాలు బ్రూనై, కంబోడియా, ఇండొనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం

చైనా, భారత్ తర్వాత అత్యధిక జనాభా ఆసియాన్‌లోనే

2014 నాటి గణాంకాల ప్రకారం ఆసియాన్ సభ్యదేశాల జనాభా 62.2 కోట్ల పైనే.

చైనా, భారత్ తర్వాత అత్యధిక జనాభా ఉన్న ప్రాంతం ఇదే.

ఆసియాన్ జనాభాలో సగం మందికి పైగా 30 ఏళ్లలోపువారే.

సాంస్కృతిక వైవిధ్యం

ఆసియాన్ ప్రాంతంలో సాంస్కృతిక వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఇండొనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లనే తీసుకొంటే, ఒక్కో దేశంలో ఒక్కో మతాన్ని ఆచరించేవారి జనాభా ఎక్కువగా ఉంది.

ఇండొనేషియా జనాభాలో సుమారు 90 శాతం మంది ముస్లింలు. ప్రపంచంలోకెల్లా ముస్లింల జనాభా అత్యధికంగా ఉన్న దేశం ఇదే.

ఫిలిప్పీన్స్‌ జనాభాలో 80 శాతం మందికి పైగా ప్రజలు రోమన్ క్యాథలిక్‌లు.

థాయ్‌లాండ్‌లో 95 శాతం మందికి పైగా ప్రజలు బౌద్ధులు.

Image copyright www.asean.org
చిత్రం శీర్షిక గత ఏడాది ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఒక ఆసియాన్ సదస్సులో పాల్గొన్న కూటమి సభ్యదేశాల నాయకులు

ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

ఆసియాన్ సెక్రటేరియట్ లెక్కల ప్రకారం 2014లో ఆసియాన్ దేశాల ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2.6 లక్షల కోట్ల అమెరికా డాలర్లు. 2007-2014 మధ్య ఈ ఉమ్మడి జీడీపీ రెండింతలైంది.

ఆసియాన్ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నిటినీ కలిపి ఉమ్మడి ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తే, అది ఆసియా ఖండంలో మూడో అతిపెద్ద, ప్రపంచంలో ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది.

యూరోపియన్ యూనియన్, ఉత్తర అమెరికా, చైనా/హాంకాంగ్ తర్వాత ప్రపంచంలోకెల్లా అత్యధిక ఎగుమతులు చేసే ప్రాంతం ఆసియాన్‌. ప్రపంచ మొత్తం ఎగుమతుల్లో ఆసియాన్ వాటా దాదాపు ఏడు శాతంగా ఉంది.

ఆసియాన్ మొత్తంగా చూస్తే ముడి పామాయిల్, రబ్బరు ఉత్పత్తిలో ఈ ప్రాంతం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుంది.

ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాల్లో ఆసియాన్ దేశాల మధ్య ఎంతో అంతరం ఉంది. ఉదాహరణకు సంపన్న దేశమైన సింగపూర్‌లో తలసరి జీడీపీ 52 వేల డాలర్లు కాగా, మయన్మార్‌లో ఇది కేవలం 1,246 డాలర్లుగా ఉంది.

Image copyright ddinews.gov.in

'యాక్ట్ ఈస్ట్'

భారత విదేశాంగ విధానంలో ఆసియాన్‌తో బంధం కీలకాంశంగా ఉంది.

ఆసియాన్‌తో సంబంధాలను పెంపొందించుకొనే చర్యల్లో భాగంగా భారత్, జకార్తాలో ఆసియాన్ కోసం ప్రత్యేకంగా దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఆసియాన్‌ భారత రాయబారిగా ప్రస్తుతం సురేశ్.కె.రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆసియాన్‌తో భారత్ బంధం బలోపేతం కావడంలో 1990ల్లో తీసుకొచ్చిన 'లుక్ ఈస్ట్(తూర్పు వైపు చూపు)' విధానం ముఖ్య పాత్ర పోషించింది. ఈ విధానాన్ని విస్తృతపరుస్తూ, మరింత క్రియాశీలం చేస్తూ 'యాక్ట్ ఈస్ట్ (తూర్పు వైపు అడుగు)' విధానాన్ని 2014లో భారత్ ప్రకటించింది.

''2014 నవంబరులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 'యాక్ట్ ఈస్ట్' విధానంతో ఆసియాన్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కింది'' అని జకార్తాలోని భారత ఆసియాన్ దౌత్య కార్యాలయం వ్యాఖ్యానించింది.

2016 నాటికి భారత్ నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఆసియాన్ ఉంది.

2016లో ఆసియాన్ దేశాలు, భారత్ మధ్య (ఉభయ పక్షాల) వాణిజ్యం విలువ సుమారు రూ.3.82 లక్షల కోట్లు (6,005 కోట్ల డాలర్లు)గా ఉంది.

ఆసియాన్‌కు మరింత చేరువయ్యేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు తప్పక మంచి ఫలితాలను ఇస్తాయని భారత్ ఆశిస్తోంది.

(ఆధారం: ఆసియాన్, భారత ఆసియాన్‌ దౌత్య కార్యాలయం, భారత విదేశీ వ్యవహారాలశాఖ, వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెబ్‌సైట్లు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)