ప్రెస్‌రివ్యూ: అలా చేస్తే.. కాంగ్రెస్‌‌తో నడుస్తా - పవన్ కల్యాణ్

 • 25 జనవరి 2018
పవన్ Image copyright janasenaparty/facebook

కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు తమతో కలిసి రావాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. వీహెచ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ప్రకటిస్తే కాంగ్రెస్‌తోపాటు నడుస్తామన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులంటే తనకు గౌరవమేనని, కానీ పనిచేసే విధానం జాగ్రత్తగా, పద్ధతిగా లేదన్న భావనే తప్ప మరోటి కాదన్నారు.

అన్ని పార్టీలు కలిసి తెలంగాణ సాధించుకున్నట్టు అభివృద్ధి కూడా అదే తరహాలో చేసుకోవాలన్నారు.

కులాలను అర్థం చేసుకోవాలి

భారతదేశ రాజకీయాలను మార్పు రావాలంటే కులాలను అర్థం చేసుకోవాలని పవన్‌ అన్నారు. వాస్తవానికి తన జీవితంలో కులం, మతం, ప్రాంతం లేదని, మానవత్వాన్ని, శాంతిని గౌరవిస్తానన్నారు.

అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినపుడు కులాలను కచ్చితంగా అర్థం చేసుకోవాలన్నారు. అలా అర్థం చేసుకోకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, దేశ రాజకీయాలను ముందుకు తీసుకువెళ్లలేమన్నారు.

బాధ్యతాయుత రాజకీయాలు కావాలంటే ఉడుకు రక్తం ఉన్న యువతరం, మేమున్నామని చెప్పే ఆడపడుచులు కావాలన్నారు. తుదిశ్వాస వరకు సామాజిక మార్పు కోసం అండగా ఉంటానన్నారు.

బుధవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అనంతరం కొత్తగూడెం నుంచి రోడ్‌ షో ప్రారంభించి ఖమ్మం నగరానికి చేరుకున్నారు.

ఖమ్మంలో పూర్వఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

Image copyright Getty Images

కాపు కోటాపై కేంద్రంలో కదలిక

కాపు రిజర్వేషన్లపై ఢిల్లీ స్థాయిలో తొలి కదలిక వచ్చింది. కాపులకు విద్యా, ఉద్యోగాల్లో 5 శాతం కోటా ఇవ్వాలని శాసనసభ ఆమోదించి పంపిన 'ఆంధ్రప్రదేశ్‌ కాపు బిల్లు-2017'పై కేంద్రం చర్యలు ప్రారంభించింది.

ఈ బిల్లుపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర న్యాయ, సామాజిక న్యాయ సాధికార, మానవ వనరులు, మైనారిటీ, గిరిజన వ్యవహారాలు, ఉద్యోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను కేంద్ర హోంశాఖ కోరింది.

కేబినెట్‌ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపాదనలను పరిష్కరించేందుకు వీలుగా ఆయా శాఖల అభిప్రాయాలను అడిగింది.

దీనిపై 15 రోజుల్లోపు స్పందించాలని స్పష్టం చేసింది. గడువులోపు అభిప్రాయాలను చెప్పలేకపోతే అందుకు గల కారణాలను వివరించాలని హోంశాఖ ఆయా మంత్రిత్వశాఖలకు ఇచ్చిన మెమోలో పేర్కొంది.

గరిష్ఠంగా నెలలోపు తమ అభిప్రాయాలు చెప్పలేకపోతే... వారితో నిమిత్తం లేకుండానే బిల్లు సిద్ధమవుతుందని తెలిపింది.

''బిల్లుపై సవివరంగా స్పందించండి. ఇందులో వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదు. మీ అభిప్రాయాలు వచ్చిన తర్వాత న్యాయశాఖను సంప్రదిస్తాం'' అని మెమోలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే అన్ని వర్గాలకు కలిపి 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. అ

యినా అదనపు రిజర్వేషన్లు కల్పించాలంటే తమిళనాడు తరహాలో... ఈ బిల్లును రాజ్యాంగంలోని షెడ్యూల్‌-9 పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుందని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

Image copyright Nandamuri Balakrishna

సీఎం సీట్లో బాలయ్య

హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే, సీఎం బావమరిది నందమూరి బాలకృష్ణ బుధవారం సీఎం క్యాంపు ఆఫీసులో తన అనంతపురం జిల్లాలో ప్రతి ఏటా నిర్వహించే లేపాక్షి ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు.

క్యాంపు ఆఫీసులో సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించే హాల్‌లో, సీఎం కుర్చీలోనే కూర్చుని అధికారులకు సూచనలు, ఆదేశాలివ్వడం వివాదమైంది.

సీఎం చంద్రబాబు ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు. సహజంగా చంద్రబాబు శని, ఆదివారాలు సచివాలయానికి సెలవయినందున, ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్షలన్నీ విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచే నిర్వహిస్తుంటారు. మిగిలిన రోజుల్లో సీఎంఓలో పనిచేసే అధికారులు, కింద ఫ్లోర్‌లో ఉన్న శాఖాధిపతులను తప్ప, అక్కడికి ఎవరినీ అనుమతించరు.

అయితే, గత కొద్దికాలం నుంచి విజయవాడకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఆఫీసు ప్రారంభంలో ఉన్న మీడియా హాల్‌లో విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Image copyright tdp.ncbn.official/facebook

క్యాంపు ఆఫీసు పైకి వెళ్లాలంటే ముందస్తు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. కింద ఉన్న సెక్యూరిటీకి పైనుంచి ఆదేశాలు వస్తేనే ఎవరినైనా అనుమతిస్తుంటారు.

అలాంటిది ఒక సాధారణ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణను పైకి అనుమతించడంతోపాటు, ఏకంగా సీఎం సీట్లో కూర్చుని సమీక్ష నిర్వహిస్తున్నా ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం విమర్శలపాలయింది.

ఈ సమావేశానికి మంత్రి దేవినేని ఉమ, సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరభ్‌కుమార్, ముఖేష్‌కుమార్ మీనా, ఇతర అధికారులు హాజరయి, బాలయ్య ఆదేశాలను శ్రద్ధగా నోట్ చేసుకుంటున్న ఫొటోలు ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని ఆంధ్రభూమి ఒక కథనాన్ని ప్రచురించింది.

అయితే, అది సీఎం కుర్చీ కాదని, సమావేశం నిర్వహించిన హాలు కూడా సీఎం చాంబర్ కాదని సీఎంఓ అధికారిక వర్గాలు చెప్పినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.

Image copyright ysjagan/facebook

నాలుగేళ్లలో 22 సార్లు బాబు విదేశీ టూర్లు- వైఎస్ జగన్

'విదేశాలు పట్టుకు తిరిగితే ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగాల పేరు చెప్పి నాలుగేళ్లలో 22 సార్లు విదేశాలకు వెళ్లొచ్చి సాధించిందేమిటి? ఓ వైపు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతూ.. మరోవైపు రూ.200 కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు విమానాలలో పర్యటనల కోసం ఖర్చు చేస్తావా?' అని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 70వ రోజు బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు.

చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏ హామీని అమలు చేయలేదని జగన్ మండిపడ్డారని సాక్షి పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

Image copyright ArunJaitley/facebook

ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. లక్ష కోట్లు - కేంద్రం

రాబోయే రెండు నెలల్లో 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు మునుపెన్నడూ లేనివిధంగా రూ.88,000 కోట్లకుపైగా నిధులను అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

మార్చి 31లోగా రూ.88,139 కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్నట్లు ఆయన బుధవారం ఇక్కడ ప్రకటించారు.

మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) సమస్యతో సతమతమవుతున్న బ్యాంకింగ్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేలా, ఖాతాదారులకు మరింత రుణ సదుపాయాన్ని కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

ప్రస్తుతం ఎన్‌పీఏల విలువ రూ.8 లక్షల కోట్లకుపైగా ఉండగా, త్వరలోనే ఇది రూ.9.50 లక్షల కోట్లకు చేరవచ్చన్న అంచనాలున్నాయి.

ఇక మొత్తం రూ.88,139 కోట్ల నిధుల్లో రూ.80,000 కోట్లు రీక్యాపిటలైజేషన్ బాండ్ల ద్వారా, మిగతా రూ.8,139 కోట్లు బడ్జెట్ కేటాయింపుల్లో నుంచి బ్యాంకులకు అందుతాయి.

దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) బ్యాంకులకు చేసిన ఆర్థిక సాయం రూ.లక్ష కోట్లను దాటనుందని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

ఏయే బ్యాంకులకు ఎన్ని నిధులు?

బ్యాంకు నిధులు (రూ. కోట్లలో)

 • ఐడీబీఐ 10,610
 • బ్యాంక్ ఆఫ్ ఇండియా 9,232
 • ఎస్‌బీఐ 8,800
 • యూకో 6,507
 • పంజాబ్ నేషనల్ 5,473
 • బ్యాంక్ ఆఫ్ బరోడా 5,375
 • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా5,158
 • కెనరా 4,865
 • ఇండియన్ ఓవర్‌సీస్ 4,694
 • యూనియన్ బ్యాంక్ 4,524
 • ఓబీసీ 3,571
 • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 3,173
 • దేనా 3,045
 • సిండికేట్ 2,839
 • యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా2,634
 • కార్పొరేషన్ బ్యాంక్ 2,187
 • ఆంధ్రా బ్యాంక్ 1,890
 • అలహాబాద్ బ్యాంక్ 1,500
 • పంజాబ్-సింధ్ 785

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)