కర్ణి సేన అంటే ఏమిటి? అదేం పని చేస్తుంది? పద్మావత్‌ను ఎందుకు వ్యతిరేకిస్తోంది?

  • 25 జనవరి 2018
రాజ్‌పుత్, పద్మావత్ Image copyright Getty Images

గూగుల్‌లో వెదికితే, జనవరి 2017 వరకు ఇంటర్నెట్ యూజర్లు కర్ణి సేన గురించి ఎక్కువగా వెదకలేదని తెలుస్తుంది. అయితే దాని తర్వాత పద్మావత్‌లో నటించిన దీపికా పదుకొణె ముక్కు కోసేస్తామంటూ బెదిరించడంతో కర్ణి సేన ఒక్కసారిగా పతాక శీర్షికల్లోకి ఎక్కింది.

దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇంతకూ ఈ కర్ణి సేన ఏం చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. వాళ్లేం పని చేస్తారు? వాళ్ల లక్ష్యాలేంటి? వాళ్లెందుకు పద్మావత్‌ను వ్యతిరేకిస్తున్నారు?

జైపూర్‌లో కర్ణి సేన పిలుపు మేరకు ఒక మల్టీప్లెక్స్ ఎదుట గుమికూడిన విద్యార్థులతో మాట్లాడి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది.

Image copyright TWITTER/DEEPIKA PADUKONE

కర్ణి సేన రాజకీయ సంస్థా?

కాదు. కానీ దాని వెనుక రాజకీయ పార్టీలు ఉన్నట్లు కనిపిస్తుంది.

పద్మావత్ విడుదలకు ముందు సోషల్ మీడియాలో కర్ణి సేన మెసేజ్‌లు చూసి, జైపూర్‌లోని మల్టీప్లెక్స్ ముందు రాజ్‌పుత్ యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున గుమికూడారు.

కర్ణి సేన నేతల భావోద్వేగపూరిత, ఉద్రేకపూరిత ప్రసంగాలతో అక్కడికి వచ్చిన వాళ్ల కళ్ల ముందు రాజ్‌పుత్ కోటలు, వాళ్ల చరిత్ర కదలాడాయి.

జైపూర్‌లో న్యాయవిద్యను అభ్యసిస్తున్న దలపత్ సింగ్ దేవ్‌రా, ''కర్ణి సేన కేవలం రాజ్‌పుత్‌ల ఆత్మగౌరవాన్ని కాపాడ్డం ఒక్కటే కాదు, సమాజ హితం గురించి కూడా ఆలోచిస్తుంది. ఇవాళ రాజ్‌పుత్ యువకులు చదువుకుని, ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. కర్ణి సేన హిందూ సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేస్తోంది'' అని తెలిపారు.

అక్కడికి వచ్చిన వారిలో కొంతమంది రాజ్‌పుత్ యువకులు అభివృద్ధి ఆధారంగా రిజర్వేషన్‌లు ఉండాలని మాట్లాడుకుంటున్నారు.

జైసల్మేర్ నుంచి వచ్చిన త్రిలోక్, ''ఇవాళ రాజ్‌పుత్‌లు చదువుకొని ముందుకు వెళుతున్నారు. కానీ రిజర్వేషన్ల వల్ల వాళ్లకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. వీళ్లంతా రిజర్వేషన్‌లను తొలగించాలనడం లేదు, కేవలం దానిలో మార్పులు చేయాలని కోరుతున్నారంతే'' అన్నారు.

Image copyright Narayan Bareth

ఒక్క మెసేజ్‌తో వందలాది మంది యువకులు ఎలా వస్తున్నారు?

కర్ణి సేన రాజస్థాన్‌లో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఉన్న జిల్లాలలో చాలా వేగంగా విస్తరించింది. ఇప్పుడు అది ఒక్క విజ్ఞప్తి చేస్తే చాలు, వేలాది మంది యువకులు వచ్చి వాలిపోతున్నారు.

కర్ణి సేన పదాధికారి షేర్ సింగ్, ''జైపూర్‌లో కర్ణిసేన చాలా బలంగా ఉంది. నగరంలోని జోత్వాడా, ఖాతిపుర, వైశాలి, మురళీపుర రాజ్‌పుత్‌లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. అక్కడ కర్ణి సేన పిలుపు త్వరగా వ్యాపించి, యువకులు వెంటనే పరిగెత్తుకుని వస్తారు. ఇటీవల కర్ణి సేన ప్రాబల్యం పెరిగింది. రాష్ట్రం బయట కూడా తన అవసరం ఉందని అది గుర్తించింది'' అన్నారు.

చిత్రం శీర్షిక మల్టీప్లెక్స్‌ల ఎదుట రాజ్‌పుత్ యువత నిరసన

తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో రాజ్‌పుత్, ''ఇటీవల కొంతమంది రాజ్‌పుత్‌లు రాష్ట్రం బయట కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ అక్కడ పేరు సంపాదించుకున్నారు. అలాంటి వాళ్లకు రాజస్థాన్ గురించి గొప్పగా వినడం చాలా ఇష్టం. అందుకే ఎవరైనా పద్మావత్‌ను వ్యతిరేకిస్తూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి మాట్లాడితే, వాళ్లకు మంచి మద్దతు లభిస్తోంది'' అన్నారు.

దేశంలోని అనేక నగరాలలో రాజ్‌పుత్ సంస్థలు, క్షత్రియ యువజన సంస్థలు అనేక దశాబ్దాలుగా పని చేస్తున్నాయి. కానీ కర్ణి సేన ఒక భిన్నమైన పంథాను ఎంచుకుని, యువకులను ఆకట్టుకోగలిగింది.

అసలైన కర్ణిసేన ఏది?

ఇటీవల కర్ణిసేన ప్రాబల్యం, దాని ప్రాబల్యం పెరగడంతో అది మూడు ముక్కలైంది. అయితే ఎవరికి వారు తమదే అసలైన కర్ణి సేన అని చెప్పుకుంటున్నారు. ఆ వివాదం ఎంత పెద్దది అయిందంటే అది ఇప్పుడు కోర్టు వరకు వెళ్లింది.

వాటిలో ఒకటైన శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేనకు లోకేంద్రసింగ్ కాల్వి సంరక్షకుడిగా ఉన్నారు.

రెండోది శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన సేవా సమితి. దానికి అజిత్ సింగ్ మామ్‌డోలి, మూడోదైన శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేనకు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి నేతృత్వం వహిస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక లోకేంద్ర సింగ్ కాల్వి

కర్ణి సేన ఉద్దేశాలు ఏంటి?

శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన సేవా సమితికి చెందిన మామ్‌డోలి కర్ణిసేన అవసరాన్ని వివరిస్తూ''మా వర్గానికి చెందిన వారికి ఎవరికైనా అన్యాయం జరిగి, రాజకీయ పార్టీలు వాటిపై నోరు విప్పకపోతే, అప్పుడు కర్ణిసేన గళం విప్పడం తప్పనిసరి అవుతుంది'' అన్నారు.

''కొన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి అంశాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి కులపరమైన సంస్థలు పెరగడానికి కారణం ఇదే '' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)