సోషల్ మీడియా ప్రభావంతో హీరోగా మారిన నిరసనకారుడు.. దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

  • 26 జనవరి 2018
శ్రీజిత్ Image copyright Vivek R Nair

దాదాపు 800 రోజుల నుంచి తన సోదరుని హత్యపై విచారణ జరిపించాలంటూ ఓ ప్రభుత్వ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టిన కేరళ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయారు. దీనిపై బీబీసీ ప్రతినిధి అఫ్రాష్ పదన్నా ప్రత్యేక కథనం.

22 మే, 2015 నుంచి త్రివేండ్రంలోని రాష్ట్ర సచివాలయం ఎదుట దీక్ష చేస్తున్న ఎస్.ఆర్.శ్రీజిత్‌ను నిన్నామొన్నటి వరకు ఎవరూ పట్టించుకునే వాళ్లు కాదు.

కేవలం ఓ చిన్న చాప వేసుకుని శ్రీజిత్ మండే ఎండలను, కుండపోత వర్షాలను, గడ్డకట్టించే చలిని తట్టుకుని నిరసన కొనసాగిస్తున్నారు.

తన సోదరుడు శ్రీజీవ్‌ని పోలీసులే హత్య చేశారని, దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలని శ్రీజిత్ డిమాండ్ చేస్తున్నారు.

పోలీసుల నిరంకుశత్వానికి, లాకప్ మరణాలకు పేరెన్నికగన్న భారతదేశంలో (2010-15 మధ్యకాలంలో భారత్‌లో 591 మంది పోలీస్ కస్టడీలో మరణించినట్లు భారత జాతీయ నేర గణాంకాల బ్యూరో నివేదిక తెలియజేస్తోంది) శ్రీజిత్ నిరసన వాటికి ప్రతిధ్వనిగా మారింది.

Image copyright Vivek R Nair
చిత్రం శీర్షిక తన సోదరుని మృతిపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని శ్రీజిత్ కోరుతున్నారు

26 ఏళ్ల శ్రీజీవ్‌ను మొబైల్ ఫోన్ చోరీ చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ చేయగా, అతను కస్టడీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.

అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రం శ్రీజీవ్ ఓ పోలీస్ అధికారి కూతుర్ని ప్రేమించినందుకే పోలీసులు చంపేశారని అంటున్నారు.

ఆమె పెళ్లి జరగడానికి ఒక రోజు ముందు శ్రీజీవ్‌ను అరెస్ట్ చేశారు. కస్టడీలో అతను 'ఆత్మహత్యాయత్నం' చేయడంతో ఆ మరుసటి రోజు అతణ్ని ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మరణించాడు.

''నా సోదరుడు మరణించడానికి ముందు అతణ్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని ఆసుపత్రిలో ఒక మంచానికి కట్టేసి ఉండడం నేను చూశాను. అతను నాకేదో చెప్పాలని ప్రయత్నించాడు. అతని ఒంటిపై చాలా గాయాలు కనిపించాయి. కానీ పోలీసులు అతనికి కాపలాగా ఉండడంతో నేను తన దగ్గరకు వెళ్లలేకపోయాను'' అని శ్రీజిత్ తెలిపాడు.

Image copyright Vivek R Nair
చిత్రం శీర్షిక సోషల్ మీడియా కారణంగా శ్రీజిత్ దీక్షకు క్రమక్రమంగా మద్దతు పెరుగుతోంది

కేవలం కొద్ది మంది ప్రజాప్రతినిధులు శ్రీజిత్‌ను పరామర్శించడం తప్పించి, శ్రీజిత్ నిరసనను చాలారోజులు ఎవరూ పట్టించుకోలేదు.

ఆ తర్వాత మెల్లగా సోషల్ మీడియాలో అతని నిరసనకు మద్దతు పెరగడం మొదలైంది.

గత కొన్ని నెలల నుంచి అతని చిత్రాలు ఫేస్ బుక్, ట్వీటర్‌లో విస్తృతంగా షేర్ అవుతూ చక్కర్లు కొడుతున్నాయి. అతని నిరసనకు కొంత మంది ప్రముఖులు కూడా మద్దతు తెలిపారు.

దక్షిణ భారతదేశంలో ప్రముఖ నటుడు ప్రధ్వీరాజ్ సుకుమారన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో శ్రీజిత్ గురించి పేర్కొన్నారు. కేరళ సినీ పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ నటుడు టోవినో థామస్ కూడా శ్రీజిత్‌ను పరామర్శించారు.

శ్రీజిత్ కోసం #JusticeForSreejith అనే పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ ప్రచారం కూడా జరుగుతోంది. అదే పేరుతో ప్రముఖ పాటల రచయిత గోపీసుందర్ రాసిన ఓ పాట జనవరి 17న అప్ లోడ్ చేయగా, నాటి నుంచి ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా దానిని వీక్షించారు.

తనకు లభించిన మద్దతు శ్రీజిత్‌కు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నా, అతని ఆరోగ్యం మాత్రం చాలా దెబ్బ తింది. ప్రస్తుతం అతని బరువు 49 కిలోలకు పడిపోయి, శ్రీజిత్ చాలా బలహీనంగా తయారయ్యారు.

అయితే ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం శ్రీజిత్ సోదరుని మృతిపై అంతర్గత విచారణకు ఆదేశించింది. కానీ శ్రీజిత్ మాత్రం సీబీఐ విచారణ కోసం పట్టుబడుతున్నారు.

ఇటీవల శ్రీజిత్ నిరాహార దీక్షకు దిగినపుడు, అనేక మంది అతనికి మద్దతుగా 'రిలే నిరాహార దీక్ష'లు ప్రారంభించారు.

''శ్రీజిత్‌కు న్యాయం జరిగేంత వరకు మేం ఈ ప్రచారాన్ని ఆపబోం'' అని అతనికి మద్దతు తెలుపుతున్న ఫేస్ బుక్ గ్రూప్ కన్వీనర్ అఖిల్ డేవిస్ తెలిపారు.

మే, 2016లో రాష్ట్ర పోలీసుల ఫిర్యాదు అధికార సంస్థ.. శ్రీజీవ్ మృతిపై విచారణ జరిపి, పోలీసు కస్టడీతో అతణ్ని దారుణంగా హింసించారని నిర్ధారించింది.

ఆ సమయంలో ఆ సంస్థకు నేతృత్వం వహించిన కె.నారాయణ కురుప్, టాక్సికాలజిస్టులు, ఫోరెన్సిక్ నిపుణులను సంప్రదించిన అనంతరం అది ఖచ్చితంగా లాకప్ మరణమే అని తమ విచారణలో తేలినట్లు బీబీసీకి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును సీబీఐకి బదిలీ చేయడానికి అంగీకరించినా, సీబీఐ మాత్రం ప్రస్తుతం తాము ఇతర కేసులతో బిజీగా ఉన్నామని కేసును చేపట్టడానికి నిరాకరించింది.

అయితే గతవారం కేరళ హైకోర్టు జోక్యం చేసుకుని, కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించింది. సీబీఐ ఇప్పటికే విచారణ చేపట్టినట్లు కొన్ని వార్తలు వెలువడుతున్నా, ఆ మేరకు తనకు అధికారికంగా నిర్ధారణ లభించేంతవరకు దీక్షను విరమించేది లేదని శ్రీజిత్ తెలిపాడు.

''రాజకీయ నాయకులు, పోలీసులు కలిసి తమ తప్పేం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐ విచారణ ప్రారంభమయ్యేంతవరకు నా దీక్ష విరమించను'' అని శ్రీజిత్ స్పష్టం చేశాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)