మహారాష్ట్ర: మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు

  • 27 జనవరి 2018
11వ శతాబ్దం నాటి శిలా శాసనం Image copyright SANKET SABNIS/BBC
చిత్రం శీర్షిక 11వ శతాబ్దం నాటి శిలా శాసనం

రాజాజ్ఞను ఎవరైనా ధిక్కరిస్తే ఆ కుటుంబంలోని స్త్రీలను గాడిదలతో రేప్ చేయించేవారు. మహారాష్ట్రలో గతంలో ఈ శిక్ష అమల్లో ఉన్నట్టు చారిత్రక ఆధారాలు లభించాయి.

మరాఠీ భాషలో ఉన్న తామ్రపత్రాలు, శాసనాలు, ఇతర పత్రాలన్నీ 11వ శతాబ్దంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉండేదో స్పష్టంగా చెబుతున్నాయి.

మహారాష్ట్రలో కొన్ని ఆలయాల ప్రాంగణాల్లో కనిపించే శిలా శాసనాలను గమనిస్తే నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు ఎలా ఉండేవో అర్థమవుతుంది.

10వ శతాబ్దంలో మహారాష్ట్రలో శిలాహర్ అనే రాజ్యం ఉండేది. ‘ఎవరు తప్పు చేసినా, వారి కుటుంబంలోని స్త్రీలను గాడిదలతో రేప్ చేయించడం జరుగుతుంది’ అని చెప్పే శిలా శాసనాలు శిలాహర్ ప్రాంతంలో దొరికాయి. ఆ శిలా శాసనాలను గధేగల్ అని పిలుస్తారు. సమాజంలో నాటి మహిళల పరిస్థితికి ఆ శాసనాలు అద్దం పడుతున్నాయి.

Image copyright RAHUL RANSUBHE/BBC

ముంబయికి చెందిన హర్షదా విర్కుద్ అనే యువతి ఈ శాసనాలపైన పీహెచ్‌డీ చేస్తున్నారు. తన రీసెర్చ్‌లో భాగంగానే ఈ గధేగల్ శాసనాలనూ ఆమె అధ్యయనం చేశారు.

ఈ శాసనాల్లో మూడు భాగాలుంటాయి. పై భాగంలో శాసనం పేరు, మధ్య భాగంలో ఆ శాసన వివరాలు, కింది భాగంలో దాని తాలూకు బొమ్మా చెక్కుంటాయి.

రాజాజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించినవారి కుటుంబంలో మహిళలను గాడిదలతో రేప్ చేయించే శిక్ష అప్పట్లో అమల్లో ఉండేదంటారు హర్షదా. శాసనంపైన ఉన్న సూర్యుడు, చంద్రుడి గుర్తులకు అర్థం.. ఆ సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఆ శాసనం అమల్లో ఉంటుందని.

మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో అలాంటి అరుదైన దాదాపు 150 శాసనాలు బయటపడ్డాయి.

వీటిపైన పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాక అప్పట్లో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థమైందంటారు హర్షదా. ఆ శాసనాల్లో ఉన్న శిక్షను అమలు చేస్తే పురుషులు కూడా తలదించుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్లు తప్పు చేయడానికి భయపడతారనే ఉద్దేశంతో ఆ శిక్షను ప్రవేశపెట్టుంటారని చెబుతారామె.

Image copyright RAHUL RANSUBHE/BBC

‘గతంలో మహిళలను ఎంత అగౌరవంగా చూసేవారో చెప్పడానికి ఈ శాసనాలే ఉదాహరణ’ అంటారు ముంబైకి చెందిన కురుష్ దలాల్ అనే పురావస్తు శాస్త్రవేత్త.

‘రాజులు తాము ఎంత కఠినంగా ఉంటామో చెప్పడానికి ఈ శాసనాలను చెక్కించేవారు. ప్రజలను భయపెట్టడానికే వీటిని ఏర్పాటు చేయించేవారు’ అంటారాయన.

‘ఇలాంటి శిలా శాసనాలపై ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. కొందరు వాటిని దేవుళ్లుగా కొలుస్తారు. కొందరు వాటిని చెడుగా భావిస్తారు. ఇంకొందరు వాటిని పగలగొట్టడమో, నీళ్లలో పారేయడమో చేస్తారు. కానీ శిలలు దొరికాయంటే దానర్థం ఆ ప్రాంతానికి ఏదో చారిత్రక ప్రాధాన్యం ఉందని’ అని కురుష్ వివరిస్తారు.

హర్షద కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఆ శిలల ఆధారంగా చరిత్రను అధ్యయనం చేయొచ్చనీ, కాబట్టి మూఢ నమ్మకాల జోలికి పోకుండా వాటి సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించడం మంచిదనీ అంటారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)