#HerChoice: భర్త వదిలేశాక, నాతో నేను ప్రేమలో పడ్డాను సరికొత్తగా!

  • 28 జనవరి 2018
మహిళ

ఒక అర్థరాత్రి నా భర్త అకస్మాత్తుగా ఇంటి నుంచి వెళ్ళిపోయినపుడు, నా ముందున్న ప్రపంచం మొత్తం శూన్యమైపోయినట్లనిపించింది.

ఒక గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది.

15 ఏళ్లుగా పోగేసుకున్న జ్ఞాపకాలు, గోడపై వేలాడే ఫోటోలు, నా పదేళ్ల కూతురుతో ఒంటరిగా మిగిలాను.

ఏమైందో తెలుసుకునేందుకు నా భర్తకు కాల్ చేసినపుడు "మన మధ్య ఇక ఏ సంబంధమూ లేదు" అని ఫోన్ కట్ చేశాడు. ఎలాంటి వివరణా ఇవ్వలేదు. తప్పు చేశాననే భావన అతనిలో ఏమాత్రం లేదు.

అతను అప్పటికే మరొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని అతని స్నేహితుల ద్వారా తెలిసింది.

"ఈ విషయం విని హతాశురాలినయ్యాను" అనడం చాలా చిన్న పదం అవుతుందేమో. ఇక నా జీవితం చాలించాలని అనిపించింది. ఏవో మందులు మింగి ప్రాణం తీసుకోవాలనుకున్నాను. చనిపోవాల్సిందే, కానీ ఎలాగో బతికాను.

పెళ్లి, భర్త వీటి ఆవల కూడా ఒక జీవితం ఉంటుందని ఊహించలేకపోయాను.

నేను ప్రేమించిన భర్త మరొక మహిళకి దగ్గరవ్వడాన్ని తట్టుకోలేకపోయాను. నిజాన్ని జీర్ణం చేసుకోవడం చాలా కష్టమైంది. నా జీవిత భాగస్వామిని మరొకరితో పంచుకునేందుకు నేను సిద్ధంగా లేను.

#HerChoice - 12 మంది భారతీయ మహిళల వాస్తవగాథలు. ఈ కథనాలు 'ఆధునిక భారతీయ మహిళ' ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆకాంక్షలు, ప్రాధాన్యాల గురించి వివరిస్తూ మన భావనను విస్తృతం చేస్తాయి.

బాధ, అసూయ నన్ను ఆవరించాయి. నా భర్త కూడా పాత్రధారుడే అనే సంగతి మరిచిపోయి, నా భర్త జీవితంలోకి ప్రవేశించిన అమ్మాయిని నిందించాను.

తరవాత ఆలోచించినప్పుడు అర్థమైంది... ఇదేమీ నా జీవితంలో హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు అని. అంతకు ముందు చోటుచేసుకున్న సంఘటనలు, సంభాషణలు కళ్ల ముందు కదలాడాయి.

నన్ను తక్కువగా చూడటం మొదలైంది. నేను అందంగా లేనని, ఎక్కువ జీతం సంపాదించలేనని దెప్పిపొడవడం ప్రారంభమైంది.

ఒకప్పుడు "నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం" అన్న వ్యక్తి మాటలు ఇప్పుడు "నువ్వు నా జీవితంలో ఉండటం ఒక దురదృష్టం"గా మారాయి.

"నువ్వు చాలా బాగుంటావు" అన్న నోరు ఇప్పుడు "నీకు నా పక్కన నిలబడే అర్హత లేదు" అంటోంది.

ఆధునికత సంతరించుకున్న తన కొత్త సహచరి పక్కన నేను ఒక పల్లెటూరు అమ్మాయిలా కనిపించి ఉంటాను.

అకస్మాత్తుగా నా వస్త్రధారణ, వేష భాషలు కూడా విమర్శలకు లోనవడం మొదలైంది.

నీకు ఇంగ్లిష్ మాట్లాడటం రాదు, నిన్నెవరు ఉద్యోగంలో పెట్టుకుంటారు అనే సూటిపోటి మాటలు, దెప్పి పొడుపులు వినిపించేవి.

నేను తన దృష్టిలో మాత్రమే తక్కువ అనుకున్నాను. కానీ రాన్రాను నన్ను నేనే తక్కువగా ఊహించుకోవడం ప్రారంభించాను. "నేను తనకి కావాల్సిన అమ్మాయిని కాలేకపోయాను" అనే న్యూనత ఆవరించింది.

ఇంటి పని, బయట పని అంతా ఒక్కసారిగా నా నెత్తిన పడింది. అనారోగ్యం కూడా ఒక్కొక్కసారి పలకరిస్తూనే ఉండేది.

కలిసి బయటకు వెళ్లడం, పార్టీలకు వెళ్లడం వంటివన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి.

నేను సర్వస్వం అనుకున్న వ్యక్తి నెమ్మదిగా నా నుంచి దూరంగా వెళ్లిపోవడం, జీవితంలోంచి తొలగిపోవడం ప్రారంభించాడు. మా మధ్యన ఉన్న ప్రేమ అంతా అంతరించిపోయింది.

ఎందుకో ఇదంతా నాకు లీలగా అర్థమవుతున్నా, ఎలా అయినా ప్రేమని బతికించుకోవాలని తాపత్రయ పడుతూ ఉండేదానిని. కానీ అవన్నీ విఫలయత్నాలుగానే మిగిలిపోతాయని అనుకోలేదు. ఉన్నట్లుండి ఒక రాత్రి తాను నా జీవితంలోంచి వెళ్ళిపోయాడు.

తను నన్ను వదిలి వేరే ఇంటికి వెళ్లిపోయిన తరువాత కూడా నేనూ నా కూతురు మా అత్తగారింట్లోనే ఉండేవాళ్లం. వాళ్లకి నేనంటే ఇష్టమో, ఇంకేదో కాదు... అక్కడే ఉంటే తను తిరిగి వస్తాడేమో అని ఓ చిన్న ఆశ.

ప్రతి తలుపు చప్పుడుకీ తనే వచ్చాడేమో అని నేను చూసే ఎదురు చూపులు నన్ను నిరాశకి గురిచేసేవి. వచ్చిన పనిమనిషో, కొరియర్ అబ్బాయో నన్ను వెక్కిరించినట్లుగా అనిపించేది.

నా జీవితాన్ని అంతా తన చుట్టూ అల్లుకున్న నాకు ఒక్కసారిగా అంధకారం ఆవరించినట్లయింది. కొత్త జీవితాన్ని ప్రారంభించే వయసులో కూడా లేను.

జీవితాన్ని ఎలా అయినా కాపాడుకోవాలని శతవిధాలా ప్రయత్నించాను. ఒంటరిగా పోరాడాను. నా మానసిక స్థితిని అర్థం చేసుకునే వయసులో నా కూతురు లేదు.

ఆరోగ్యం క్షీణించింది. తన ఓదార్పు కోసం, తన తోడు కోసం తపించాను. తను చేసిన గాయాలకు తన నుంచే మందును ఆశించాను.

తానే ముందుగా వెళ్లి కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశాడు. అయినా నమ్మకం పోగొట్టుకోలేదు. పోరాడుతూనే ఉన్నాను.

నేను ఒక జీవంలేని పెళ్లికోసం పోరాడుతున్నానని తెలుసుకోవడానికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది.

నేను ఎదురు చూశాను నా జీవితంలో లేని మనిషి కోసం.

ఈ ఒంటరి పోరాటంలో అలసిపోయాను. కోర్టు రూముల చుట్టూ తిరగడానికి, లాయర్ల ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి, లాయర్ ఖర్చులు భరించలేక అలసిపోయాను.

ఇక విడాకులకు ఒప్పుకోక తప్పలేదు. దీంతో నాకు సంప్రదాయ సమాజంలో ఆమోదం దొరకని 'డైవోర్సీ' అనే ఒక కొత్త బిరుదు వచ్చిచేరింది.

అప్పటికి నా వయస్సు 39 సంవత్సరాలు.

విడాకులు అవ్వగానే నా ముందున్న తొలి సమస్య ఇల్లు వెతుక్కోవటం. ఆ తర్వాత, సమాజం నుంచి వచ్చే ప్రశ్నలను ఎదుర్కోవాలి. మీ భర్త ఎక్కడ? ఏమి చేస్తారు? ఒక్కరే ఎందుకు ఉంటారు?

వీరందరికీ సమాధానం చెప్పే స్థితిలో నేను లేను. పెళ్లి, సంసారం అనే జ్ఞాపకాల నుంచి బయటకి రావడానికి సంసిద్ధంగా లేదు నా మనస్సు.

కానీ నా స్నేహితులు దేవతల్లా నన్ను ఆదుకున్నారు. నన్ను ఆ స్థితిలోంచి బయటకి తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించారు.

"నేనొక ఒంటరి తల్లిని" అని చెప్పుకోవడం తప్పు కాదు అనే ధైర్యాన్ని నాలో నింపారు. ఇదంతా చెప్పినంత సులభం ఏమీ కాదు.

అతను విడాకులు ఇవ్వగానే తన సహోద్యోగిని వివాహం చేసుకున్నాడు. వాళ్లిద్దరినీ చూసినపుడు నా మనసులో గాయాలు మళ్లీ రగులుతూ ఉండేవి.

ఈ బాధల్లోనే మరో బాధ... నా తల్లిదండ్రులను కూడా కోల్పోయాను.

ఇక నా దగ్గర మిగిలినవి రెండే రెండు. ఒకటి నా ఉద్యోగం, రెండోది నా కూతురు.

అప్పటినుంచి నా ఉద్యోగం మీదే ఎక్కువ దృష్టి సారించి కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగాను. నేనేంటి, నాకేం కావాలి అని ఆలోచించా. నాకు ఇష్టం అయిన పనులు చదవడం, రాయడం. వాటినే ప్రవృత్తిగా మార్చుకుని బ్లాగింగ్ మొదలు పెట్టాను.

ఒకప్పుడు భర్త, అత్తమామలుకి వండి పెట్టేదాన్ని. ఇప్పుడు అదే పని స్నేహితుల కోసం చేయడం మొదలుపెట్టాను.

నేను ఒంటరిగా ఉన్నాననే విషయం పక్కన పెట్టి, స్నేహితులను పార్టీలకు ఆహ్వానించడం, చిన్న చిన్న ట్రిప్‌లకు వెళ్లడం, కొత్తగా ఫొటోలను తీసుకోవడం ప్రారంభించా, కొత్త జ్ఞాపకాలను పోగుచేసుకునేందుకు.

నా భర్త నా జీవితంలో వదిలేసిన ఖాళీని పూరించుకోవడానికి, సోషల్ మీడియాలో స్నేహితులను పెంచుకున్నాను. ఈ ప్రక్రియ ఎందుకో నా చుట్టూ ఒక పెద్ద ప్రపంచం ఉంది అనే భావనని కలగచేసేది.

ఫేస్‌బుక్‌లో వచ్చే కామెంట్లు, లైక్‌లు నా ఒంటరితనాన్ని పూరిస్తున్నట్లుగా ఉండేవి.

ఒకప్పుడు నా జీవితం అంటే నా కుటుంబం మాత్రమే అనుకున్నాను. కానీ నెమ్మది నెమ్మదిగా నా ప్రపంచం విశాలం కావడం ప్రారంభమైంది.

నా ఖాళీ సమయాన్ని నేను బలహీన వర్గాల పిల్లల కోసం పని చేసే ఒక స్వచ్చంద సంస్థ కోసం కేటాయించడం ప్రారంభించాను. అది నాకెంతో స్ఫూర్తిని, సానుకూల శక్తిని ఇచ్చేది.

నా శక్తి ఏమిటో అర్థమైంది. పీహెచ్‌డీ పూర్తి చేశాను.

నేను కోల్పోయిన జీవితం తిరిగి లభించినట్లయింది. ఒంటరిగా ఉన్నందుకు పెళ్లిళ్లకు, విందులకు వెళ్లకూడదనే నియమాలకు పక్కనపెట్టి అన్ని చోట్లకీ వెళ్లడం ప్రారంభించాను.

మంచి మంచి చీరలు కట్టుకుని అందంగా తయారయ్యేదాన్ని. ఈ చర్య ద్వారా విడాకులు తీసుకున్న ఒంటరి మహిళ విచారంగా ఉండాలనే సమాజపు ఆలోచనకి నిశ్శబ్దంగా నవ్వుతూ సమాధానం చెప్పాను.

సమాజం నన్ను ఒక ముద్ర వేసి చూస్తుంటే, నేను దానిని ధిక్కరిస్తూ వెలిగాను.

నాకంటూ ఒక పొదరిల్లుని నిర్మించుకున్నాను. ఆఫీస్ పని మీద విదేశాలకు కూడా వెళ్లాను.

నాలుగు సంవత్సరాల తర్వాత కొత్త గమ్యం కోసం కొత్త తీరాలు వెతుక్కుంటూ ఊరు వదిలి వెళ్లే ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నాను.

ఒక స్వతంత్ర మహిళగా తిరిగి జన్మించాను.

ఈ రోజు నేను తోడు కోసం ఎదురు చూడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒంటరిగా, ధైర్యంగా, 'చీకట్లో' కూడా నడవగలను!

(దక్షిణాదికి చెందిన ఒక మహిళ తన గాథను బీబీసీ ప్రతినిధి పద్మ మీనాక్షితో పంచుకోగా, సీనియర్ ప్రతినిధి దివ్య ఆర్య దీనిని అక్షరబద్ధం చేశారు. ఆ మహిళ విజ్ఞప్తి మేరకు ఆమె పేరును రహస్యంగా ఉంచుతున్నాం.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

డోనల్డ్ ట్రంప్: ‘నేను పాకిస్తాన్‌కు స్నేహితుణ్ణి.. ఇమ్రాన్ ఖాన్ గొప్ప నాయకుడు.. మోదీ ప్రకటన దూకుడుగా ఉంది’

హాంగోవర్ కూడా ఒక జబ్బు: జర్మనీ కోర్టు తీర్పు

నకాషీ: 500 ఏళ్ల నుంచి ప్రత్యేకత నిలుపుకుంటున్న తెలంగాణ చిత్రకళ

రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’

భారతదేశంలో నమోదైన మాతృ భాషలు 19,569 - హిందీ కింద వర్గీకరించిన మాతృభాషలు ఎన్ని

ఒకే దేశం.. ఒకే కార్డు: ‘పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, బ్యాంక్ అకౌంట్.. అన్నిటికీ ఒకటే’

పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్: ప్ర‌భుత్వం ఏం సాధించింది.. ప్ర‌తిప‌క్షం ఏమంటోంది

సౌర విద్యుత్ చరిత్ర: 3000 ఏళ్ల క్రితమే చైనాలో సౌరశక్తి వినియోగం