ప్రెస్‌రివ్యూ: హైదరాబాద్‌లో 100 కోట్ల బెగ్గింగ్ మాఫియా

  • 27 జనవరి 2018
Image copyright Getty Images

హైదరాబాద్‌లో బెగ్గింగ్‌ మాఫియా విజృంభిస్తోంది. అవసరాల్లో ఉన్నవారిని, ఆపదల్లో ఉన్నవారిని పట్టుకొచ్చి యాచక 'కూలీ'లుగా మార్చుతోంది అని 'సాక్షి' ఓ కథనాన్ని ప్రచురించింది.

కొంత సొమ్ము అప్పుగా ఇచ్చి.. తీర్చేందుకు భిక్షాటన చేయిస్తోంది. రోజూ ఇంత 'వసూలు' చేయాలంటూ టార్గెట్లు పెడుతూ వచ్చిన దాంట్లో ఎంతోకొంత చేతిలో పెడుతోంది. టార్గెట్‌ మేరకు డబ్బులు తేకపోతే హింసిస్తోంది.

హైదరాబాద్‌లో సుమారు 14 వేల మంది యాచకులున్నారని.. అందులో 90 శాతం ఇలాంటి నకిలీ బెగ్గర్లేనని 'ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎన్జీవోస్‌ ఫర్‌ బెగ్గర్‌ఫ్రీ సొసైటీ'సర్వే లో వెల్లడైంది.

ఏ దిక్కూ లేకనో, కుటుంబాన్ని పోషించుకునేందుకో అడుక్కునేవారు నాలుగైదు వందల మందే ఉంటారని గుర్తించింది.

యాచకులుగా 'పని'చేస్తున్నవారిని బెగ్గింగ్‌ మాఫియా అసాంఘిక కార్యకలాపాలకూ వినియోగిస్తోందని... 'సుపారీ' దాడుల దగ్గరి నుంచి గంజాయి, డ్రగ్స్‌ విక్రయించడం దాకా చాలా పనులకు వినియోగిస్తోందని తేలింది.

ఈ ఫెడరేషన్‌కు చెందిన 300 మంది ప్రతినిధులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఒకేసారి సర్వే నిర్వహించారు.

యాచకులు ఎంతమంది, వారిలో ఎన్ని రకాల వారున్నారు, ఎందుకు భిక్షాటన చేస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు, ఏ మేరకు దందా సాగుతోందన్న అంశాలను పరిశీలించారు. మూడు రకాల యాచకులు ఉన్నట్లు సర్వేలో గుర్తించారు అని సాక్షి పేర్కొంది.

Image copyright AndhraPradeshCM/facebook

'దళితులు అగ్రస్థాయికి చేరాలి'

'దళితులు సమాజంలో అట్టడుగు వర్గాలుగా మిగలకూడదు. అగ్రకులాల స్థాయికి వారు ఎదగాలి. దానికి అవసరమైన చేయూత ఇచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది' అని ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.

శుక్రవారం సాయంత్రం విజయవాడలో తన నివాసం సమీపంలోని గ్రీవెన్స్‌ హాల్‌లో టీడీపీ తలపెట్టిన 'దళిత తేజం' కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

దీనికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

దళితులను సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకు తేవడానికి అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

'అంబేడ్కర్‌ ఆశయాల స్పూర్తితో చంద్రన్న ముందడుగు కార్యక్రమం చేపట్టాం. దళితులకు భూ వసతి కల్పించడానికి ఎకరా భూమి రూ.15 లక్షలు పెట్టి కొనుగోలు చేయడానికి నిధులు ఇస్తున్నాం.

దళితులు కేవలం డ్రైవర్లుగా మిగిలిపోకుండా యజమానులుగా మారడానికి వారికి ఇన్నోవా కార్లు, పొక్లెయినర్ల వంటివి ఇప్పిస్తున్నాం' అని చంద్రబాబు పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright Padma Awards/FACEBOOK

అందని పద్మం..కనిపించని శకటం!

ఈసారి గణతంత్ర వేడుకలు తెలంగాణకు నిరాశనే మిగిల్చాయి. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి ఆశాభంగం కలగగా.. ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల ప్రదర్శనలో రాష్ట్ర శకటానికి అవకాశం లభించలేదు అని 'సాక్షి' పేర్కొంది.

వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల కోసం ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 24 మందితో కూడిన జాబితాను పంపింది. అయితే కేంద్రం ఈసారి పద్మ అవార్డుల నామినేషన్ల విధానంలో పలు మార్పులు చేసింది.

అర్హులైన వారు సొంతంగా కూడా నామినేషన్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్రం నుంచి మరో 15 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.

మొత్తంగా రాష్ట్రం నుంచి 39 ప్రతిపాదనలు వెళ్లినా.. ఒక్కరికి కూడా అవార్డు లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. రాష్ట్రం నుంచి 2015లో ముగ్గురికి, 2016లో ఆరుగురికి, 2017లో ఆరుగురికి పద్మ పురస్కారాలు దక్కాయి.

ఇక ఈసారి 85 మందికి పద్మ అవార్డులు ఇచ్చినా.. రాష్ట్రం నుంచి ఒక్కరికీ చోటు లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినవారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు.

ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీ నరసింహారావును దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డుకు సిఫారసు చేసింది.

తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్, ఆర్థికవేత్త చెన్నమనేని హనుమంతరావు, నవలా రచయిత, కవి శివ కె.కుమార్‌ల పేర్లను పద్మ విభూషణ్‌కు నామినేట్‌ చేసింది అని సాక్షి తెలిపింది.

Image copyright UTHAMKUMARREDDY/FACEBOOK

గవర్నర్ వద్దకు ఎందుకెళ్లారు?

గాంధీభవన్‌లో గణతంత్ర వేడుకల అనంతరం తెలంగాణలోని కాంగ్రెస్‌ నేతల ఇష్టాగోష్టి సమావేశంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది అని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం గవర్నర్‌ వద్దకు షబ్బీర్‌ అలీ, రేవంత్‌ రెడ్డిలు వెళ్లిన విషయం ప్రస్తావనకు వచ్చింది.

గవర్నర్‌ వద్దకు కాంగ్రెస్‌ ఎన్ని సార్లు వెళ్లి ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా పోవడమే కాకుండా పార్టీని అవమానించే తీరులో ఆయన వ్యవహరించారనీ, అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆయన వద్దకు వెళ్లడం ఏమిటని ఒక సీనియర్‌ నేత తీవ్ర అభ్యంతరం తెలియజేసినట్లు సమాచారం.

నేరెళ్ల, ఇసుక మాఫియా, ప్రాజెక్టులు, మల్లన్న సాగర్‌ రైతులు, ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు మొదలుకొని అనేక అంశాలపై కాంగ్రెస్‌ వివిధ సందర్భాల్లో గవర్నర్‌ను కలిసినా.. ఎన్నడూ సానుకూలంగా స్పందించలేదని సదరు నేత అన్నట్లు తెలిసింది.

ఇటీవల కాంగ్రెస్‌ నేతలు వెళ్లినపుడు గవర్నర్‌ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ, కాంగ్రెస్‌ నేతలను విమర్శించడం తారాస్థాయికి చేరిన సంఘటన అని అభిప్రాయపడ్డట్లు తెలిసింది అని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

హైదరాబాద్‌లో నిరుద్యోగులు Image copyright Getty Images

45 ఏళ్ల వరకు నిరుద్యోగభృతి ఇవ్వాలి

నిరుద్యోగభృతిని 45 సంత్సరాలు వచ్చే వరకు ఇవ్వాలని యువత కోరుతోంది. భృతి ఇస్తూనే నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తోంది అని 'ఈనాడు' తెలిపింది.

భృతినివ్వడానికే పరిమితమైతే యువతలో ఒక రకమైన బద్ధకాన్ని పెంచినట్లే అవుతుంది. భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఈ విధానాన్ని అమలు చేయాలి.

ప్రస్తుత యువతకు చేయూతనందిస్తూనే.. భవిష్యత్తుకు ముందస్తుగా సన్నద్ధం చేసేలా పాఠశాల స్థాయి నుంచే సరికొత్త పాఠ్యాంశాలు, ప్రయోగాలను అందుబాటులోకి తీసుకురావాలి.

ప్రయోగాలను అందుబాటులోకి తీసుకురావాలి. ఇప్పుడున్న విధానాల్లో లోపాలను పూర్తిస్థాయిలో అరికట్టాలి. వికలాంగులకు తొలి ప్రాధాన్యమిస్తే బాగుంటుంది అంటూ అనేక సలహాలు, సూచనలు ప్రభుత్వానికి అందాయి.

నిరుద్యోగ భృతి ముసాయిదా విధానంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సలహాల స్వీకరణ పూర్తయింది. యువ సాధికార నిరుద్యోగ భృతి పేరుతో ఈ సర్వేని ప్రభుత్వం చేపట్టింది అని ఈనాడు పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు