#గమ్యం: మాస్ కమ్యూనికేషన్స్‌కు మంచి విద్యాసంస్థలివే!

  • అనిల్ కుమార్
  • బీబీసీ ప్రతినిధి
మీడియా లోగోలు

ఫొటో సోర్స్, Getty Images

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం. గతవారం మనం ఫ్యాషన్ అండ్ డిజైనింగ్‌లో ఉన్న అవకాశాలు, కోర్సులు, విద్యాసంస్థల గురించి తెలుసుకున్నాం.

సైన్స్, మ్యాథ్స్ ఆధారిత ఉపాధి అవకాశాలు కాకుండా ఇంకా ఇతర మార్గాలు ఏమేం ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ వారం 'మాస్ కమ్యూనికేషన్స్' రంగం గురించి వివరిస్తున్నారు... Careers360.com ఛైర్మన్ మహేశ్వర్ పేరి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ చేయండి.

గత దశాబ్ద కాలంగా మీడియా విస్తృతి బాగా పెరిగిపోయింది. ప్రింట్, టీవీ, బ్రాడ్‌కాస్ట్ జర్నలిజం, డిజిటల్, రేడియో, మొబైల్ మీడియా, యానిమేషన్స్, ఫిల్మ్ మేకింగ్, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్... ఇలా అన్ని విభాగాలూ గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నాయి. ఈ రంగాలన్నింటికీ మూలం కమ్యూనికేషన్... సమాచార ప్రసారం.

వీడియో క్యాప్షన్,

#గమ్యం: జర్నలిజం కోర్సు చేయాలంటే ఏ విద్యా సంస్థ మంచిది?

ఇవే కాదు... ఏ రంగంలోనైనా సమాచార ప్రసారం అనేది చాలా ముఖ్యమైన విభాగం. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, పరిశీలన, పరిశోధనాత్మక దృష్టి ఉంటే మాస్ కమ్యూనికేషన్స్ రంగంలో రాణించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఈ నైపుణ్యాలు ఉంటే ఇంక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ప్రతి కంపెనీలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ అనే ఓ విభాగం, దానికి ఓ అధిపతి ఉండటం ఈరోజుల్లో సర్వసాధారణమైపోయింది. మీకు అనువైన రంగాన్ని ఎంచుకుని దానిపై పూర్తి స్థాయిలో పట్టుసాధించాలి.

మాస్ కమ్యూనికేషన్స్ రంగంలో అత్యుత్తమ శిక్షణనందిస్తున్న సంస్థలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి.

జర్నలిజం

ఫొటో సోర్స్, IIMC

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ (ఐఐఎంసీ)

ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. దీనిలో ప్రవేశానికి ఓ ప్రవేశ పరీక్ష రాయాలి. ఐఐఎంసీ 6 క్యాంపస్‌ల ద్వారా 6 భాషల్లో, 6 కోర్సులను అందిస్తోంది. మొత్తం 430 సీట్లుంటాయి. ఇక్కడ శిక్షణ పొందితే జాబ్ మార్కెట్లో మీకు ఢోకా ఉండదు. ఎందుకంటే ఐఐఎంసీ అందించే శిక్షణ అత్యుత్తమంగా ఉంటుందని చెప్పవచ్చు.

జర్నలిజం

ఫొటో సోర్స్, MICA

ముద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (ఎంఐసీఏ)

దేశంలోని ఉత్తమ మాస్ కమ్యూనికేషన్స్ సంస్థల్లో ఇదొకటి. ఈ సంస్థ అహ్మదాబాద్‌లో ఉంది. క్యాట్ / మ్యాట్ / జీమ్యాట్ రాసిన తర్వాత మైక్యాట్ అనే ఓ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనిద్వారానే ముద్ర సంస్థలో ప్రవేశానికి అవకాశం లభిస్తుంది.

జర్నలిజం

ఫొటో సోర్స్, ACJ

ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం (ఏసీజే)

ఈ రోజుల్లో దేశంలోని అన్ని మీడియా సంస్థలూ తమ సొంత జర్నలిజం శిక్షణాసంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కానీ జర్నలిజం అనేది నైతిక విలువలు, ప్రమాణాలు, అభ్యర్థి పరిశీలనాశక్తి, విశ్లేషణాశక్తి వంటి ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటికి అనుగుణంగా నడిచే మరొక ఉత్తమ సంస్థ ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం. ఇది చెన్నైలో ఉంది. ఈ సంస్థలో చేరాలంటే ఓ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు ఇతర దేశాల నుంచి సైతం అభ్యర్థులు హాజరవుతారు.

వీటితోపాటు పుణెలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీ, ముంబయిలోని జేవియర్స్ ఇన్‌స్టిట్యూట్... ఇవన్నీ మాస్ కమ్యూనికేషన్స్ రంగంలో తమదైన ప్రత్యేకతతో శిక్షణనిస్తున్నాయి.

జర్నలిజం

ఫొటో సోర్స్, SRFTI

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) & సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్ఆర్ఎఫ్‌టీఐ)

చిత్ర నిర్మాణం, నటనలకు సంబంధించిన అన్ని రంగాల్లో అత్యుత్తమ శిక్షణనందించే సంస్థ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ). ఇప్పటివరకూ మన దేశంలో చిత్రనిర్మాణ రంగంలో ఉన్న అత్యుత్తమ నటులు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల్లో చాలామంది ఇక్కడ శిక్షణ తీసుకున్నవారే.

ఎఫ్‌టీఐఐ, ఎస్ఆర్ఎఫ్‌టీఐ... ఈ రెండింట్లో కలిపి 2వేలకు పైగా సీట్లు ఉంటాయి. రెండింట్లో ప్రవేశానికి జేఈటీ అని ఓ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది. కానీ చిత్రనిర్మాణ రంగంలో భవిష్యత్తుని నిర్మించుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచి ఆప్షన్.

వీటితోపాటు ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏ విద్యాసంస్థలో చదివితే మంచి అవకాశాలు వస్తాయనే దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)