దక్షిణాఫ్రికాపై చివరి టెస్టులో భారత్ గెలుపు... ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ భువీ

  • 27 జనవరి 2018
విజయానందంలో భారత క్రికెట్ జట్టు Image copyright Getty Images

దక్షిణాఫ్రికా‌తో టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఊరట లభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిపోయి, ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన టీమ్ ఇండియా చివరి మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో అసాధారణ విజయం సాధించింది. భువనేశ్వర్ కుమార్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.

విదేశాల్లో భారత్ సాధించిన అత్యుత్తమ విజయాల్లో ఇది ఒకటని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే 'ట్విటర్'లో వ్యాఖ్యానించారు. ఇది భారత్‌కు పేస్ బౌలర్లు అందించిన గెలుపు అని చెప్పారు.

విజయ లక్ష్యం 241 పరుగులు కాగా, రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 177 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఈ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ షమి అత్యధికంగా ఐదు వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ రెండు చొప్పున వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఈ మ్యాచ్‌ జరిగింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భారత ఫాస్ట్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో మొత్తం 20 వికెట్లు తీశారు. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 64 పరుగులు చేశాడు.

శనివారం నాలుగో రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి భారత్ మెరుగైన స్థితిలోనే ఉంది. కానీ ఆట సాగే కొద్దీ మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు మొగ్గింది. ఒక దశలో ఈ మ్యాచ్ కూడా దక్షిణాఫ్రికా ఖాతాలో పడేలా కనిపించింది.

అయితే కీలక సమయంలో భారత్ వికెట్లు పడగొట్టడంతో రెండు జట్లకూ విజయావకాశాలు సమానమయ్యాయి. ఆ దశ నుంచి బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ, భారత్‌కు విజయాన్ని అందించారు.

దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్ డీన్ ఎల్గర్ అత్యధికంగా 86 పరుగులు(నాటౌట్) చేశాడు. హషీం ఆమ్లా 52 పరుగులు చేశాడు.

క్వింటెన్ డికాక్ సహా నలుగురు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు.

'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా దక్షిణాఫ్రికా ఆటగాడు ఫిలాండర్ ఎంపికయ్యాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మూడో టెస్టు మూడో రోజు మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో డీన్ ఎల్గర్ గాయపడటంతో పిచ్ ప్రమాదకరంగా ఉందన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి
Image copyright Getty Images
చిత్రం శీర్షిక మొదటి ఇన్నింగ్స్‌లో 54 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ తరపున ఈ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేశాడు
Image copyright Getty Images
చిత్రం శీర్షిక తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన బుమ్రా ఈ మ్యాచ్‌లో బాగా రాణించాడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు