ప్రెస్‌రివ్యూ: బాలయ్యకు చంద్రబాబు చెక్?

  • 28 జనవరి 2018
Image copyright Balakrishna/facebook

బావమరిది నందమూరి బాలకృష్ణకు చెక్‌ పెట్టేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారని 'సాక్షి' ఓ కథనాన్ని ప్రచురించింది.

బాలయ్యను రాజకీయాల నుంచి పూర్తిగా పక్కన పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ ప్రజాప్రతినిధిగా ఉంటే ఎప్పటికైనా తన కుటుంబానికి ఇబ్బందులు తప్పవని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ వెనుకపడిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అసలు బాగోలేదని, సర్వేల్లో ఈ నియోజకవర్గాలు పూర్తిగా వెనుకపడిపోయాయని చంద్రబాబు ఇటీవల తరచూ పార్టీ సమావేశాల్లో చెప్పుకొస్తున్నారు.

ఆ 40 నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈసారి అక్కడ బాలకృష్ణ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమనే లీకులు టీడీపీ నుంచి బయటకు వస్తున్నాయి.

బాలయ్యకు వ్యతిరేకంగా బయటకొస్తున్న లీకులు, ప్రచారం అంతా చంద్రబాబు వ్యూహంలో భాగమేననే వాదన వినిపిస్తోందని సాక్షి పేర్కొంది.

Image copyright Jagdish Agarwal

హైదరాబాద్: కూలీలు కావలెను!

కొన్నాళ్ల క్రితం వరకు పని కోసం కూలీలు వెతుక్కోగా.. ఇప్పుడు కూలీలను వెతుక్కుంటూ పని వస్తోంది! అయినా అవసరానికి తగ్గట్టుగా కూలీలు, కార్మికులు అందుబాటులో లేరు అని 'ఆంధ్రజ్యోతి' ఓ కథనాన్ని ప్రచురించింది.

మెట్రో రైలు పనులు.. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం.. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఆర్‌డీపీ).. గతంలో కంటే ఎక్కువగా కొనసాగుతున్న నిర్మాణరంగం ప్రాజెక్టులు.. వెరసి హైదరాబాద్ లో కార్మికులకు తీవ్ర కొరత ఏర్పడింది.

ఏకకాలంలో ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులు మొదలవడంతో కూలీలకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. ఎక్కువ డబ్బులు ఇస్తామన్నా.. పనికి వస్తారన్న గ్యారంటీ లేదు.

రూ.400-450 ఇస్తే కానీ మహిళా కూలీలు పనికి రావడం లేదు. పురుషుడికైతే (పార కాడు) గతంలో రూ.450 ఇచ్చే వారు. ఇప్పుడు వారి దినసరి కూలి రూ.550కి పెరిగింది.

కూలీల కొరతతో హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ప్రభావం పడుతోందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

Image copyright Pocharam/facebook

మొక్కలు బతక్కపోతే సర్పంచ్ డిస్మిస్!

తెలంగాణలో పంచాయతీరాజ్‌ చట్టం మరింత పదునుగా రూపొందుతోంది. హరితహారానికి రక్షణగా నిలవబోతోందని 'సాక్షి' తెలిపింది.

హరితహారం మొక్కలు 75 శాతం బతక్కపోతే సర్పంచ్‌ని డిస్మిస్‌ చేసేలా పంచాయతీరాజ్‌ చట్టం రాబోతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

శనివారం ఆయన జిల్లా వ్యవసాయాధికారుల (డీఏవో)తో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్‌ చట్టంలో అనేక ప్రతిపాదనలు రూపొందిస్తున్నారని పోచారం చెప్పారు.

వ్యవసాయాధికారుల సాగు లెక్కలు, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు.

'అవును... మేం ఇచ్చిన నివేదికల కంటే క్షేత్రస్థాయిలో ఎక్కువగానే సాగైనట్లుగా ఉంద'ని నిజామాబాద్‌ అధికారి ఒప్పుకోవడంతో మంత్రి ఇంకాస్త మండిపడ్డారు. తక్కువ సాగు చూపిస్తే ఆహార పంటల ఉత్పత్తులు కూడా అదేస్థాయిలో తక్కువగా నమోదవుతాయని పేర్కొ న్నారు సాక్షి పేర్కొంది.

Image copyright chandrababu/facebook

ఎందుకీ అక్కసు?

''రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నా ఏదో ఒక బురద చల్లి ఆనందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లతో పోరాడాలా? రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలా అనేది అర్థం కావడంలేదు'' అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశం వ్యక్తం చేశారు అని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

దావోస్‌ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన... శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపై భావోద్వేగంతో స్పందించారు.

రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కాకూడదని, అరాచకం పెరిగిపోవాలని .. ప్రజల మధ్య చిచ్చు రేపాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని మండిపడ్డారు.

లులూ సంస్థ విశాఖలో కార్యకలాపాలను స్థాపించేందుకు ముందుకు వస్తుంటే.. కొందరు ఎలా వస్తుందో చూస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

వివాహం Image copyright SAM PANTHAKY

మేనరికాలతో ముప్పేనా?

దగ్గరి బంధువులు, మేనరిక వివాహాలతో జన్యుపరమైన వ్యాధుల ముప్పు పొంచి ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌ అండ్‌ హాస్పిటల్‌ ఫర్‌ జెనెటిక్‌ డిసీజెస్‌ (ఐజేహెచ్‌జేడీ) అధ్యయనంలో మరోసారి తేటతెల్లమైందని 'ఈనాడు' పేర్కొంది.

తెలంగాణలోని కొన్ని గిరిజన తెగల్లో ఈ ముప్పు ఎక్కువగా కనిపిస్తోందని గుర్తించింది. ఇటీవల వరంగల్‌ ప్రాంతంలోని కొన్ని తెగల గిరిజన కుటుంబాలపై అధ్యయనం చేయగా జన్యుకారక వ్యాధుల ముప్పు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది.

ఒకే గ్రామంలో 70 కుటుంబాల్లో మహిళలు, పురుషులకు పరీక్షలు చేయగా.. 4-5శాతం మందిలో తలసీమియా, సికెల్‌సెల్‌ అనీమియా కారక జన్యువులున్నట్లు వైద్యులు తెలిపారు.

ఆయా తెగల్లోని మహిళలు, పురుషులను పెళ్లికి ముందు పరీక్షలతో పాటు కౌన్సిలింగ్‌ చేయనున్నట్లు ఐజేహెచ్‌జేడీ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరి తెలిపారు.

తాజాగా తలసీమియాకు వ్యాధి ఎక్కువశాతం మేనరికం, దగ్గరి బంధువులను పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారని ఈనాడు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)