శివసేనలో మహిళలకు చోటు లేదా?

  • 29 జనవరి 2018
చురకత్తులు చూపుతున్న శివసేన మహిళా కార్యకర్తలు Image copyright Getty Images

శివసేన అగ్రనాయకుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌జోషి మాటల్లో చెప్పాలంటే శివసేన ఎల్లప్పుడూ ఒక ‘పురుషుల’ పార్టీ.

ఆ పార్టీ 1960ల్లో ఆవిర్భావ దశలో ఉన్నప్పుడు.. దాని వ్యవస్థాపకుడైన బాల్ ఠాక్రే ఆదేశాలను అమలు చేస్తూ బలిష్ఠులైన వీధి పోరాట యోధులతో నిండిపోవటంతో బిడియస్తులని, సున్నితులని పరిగణించే మహిళలకు చోటు లేకపోయింది.

1980ల్లో స్థానిక పరిపాలనా సంస్థల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వు చేస్తూ నాటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ బిల్లు ఆమోదించినపుడు పరిస్థితులు మారిపోయాయి. తమ సంస్థలో ఈ లోటును భర్తీ చేయటానికి శివసేన మహిళా అఘాడీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత 1992-93లో ముంబయిలో అల్లర్లు జరిగాయి. శివసేన మహిళలు తమకంటూ ఒక పాత్రను పోషిస్తూ, ఒక నిర్వచనం ఇచ్చుకోగలిగారు. అది బిడియమైనదీ కాదు సున్నితమైనదీ కాదు.

Image copyright Getty Images

విశ్వాస పరిరక్షకులుగా వారు కొన్నిసార్లు పురుషులకన్నా తీవ్రంగా ప్రతిస్పందించేవారు. అల్లర్లు చేయటానికి ఇష్టపడని పురుషులను వారి భార్యలు ఒత్తిడిచేసి పంపించేవారు.

ఈ మహిళలు తమ భర్తలకు రాత్రివేళ గాజులు తొడిగి, వారి పైజమాల స్థానంలో లంగాలు తొడిగి.. ఆ పురుషులు ఉదయం బయటకు వెళ్లి సాధ్యమైనంత ఎక్కువ మంది ముస్లింలను ‘చంపే’లా ఒత్తిడి చేసేవారు.

అల్లర్లకు పాల్పడిన వారి కోసం గాలిస్తూ పోలీసులు వచ్చినపుడు ఈ మహిళలు భద్రతా కవచంలాగా నిల్చునేవారు. పోలీసులు వీరిని దాటి వీరి వెనుక దాగున్న పురుషులను పట్టుకోగలిగేవారు కాదు. ఠాక్రే ఈ మహిళలను ‘రణరాగిణులు’గా అభివర్ణించారు. అయినా కానీ రిజర్వుడు సీట్లలో టికెట్లు ఇవ్వటం, మేయర్‌ పోస్టు మహిళకు రిజర్వు అయినపుడు ఒకరో ఇద్దరో మహిళలను నియమించటం మినహా వీరికి పార్టీలో సరైన పాత్ర ఇవ్వలేకపోయారు.

Image copyright Shiv Sena/Facebook

చివరికి ఆయన కుమారుడు, రాజకీయ వారసుడు ఉద్ధవ్ ఠాక్రేకు కూడా మహిళా అఘాడీ విషయంలో ఏం చేయాలో పాలుపోకపోవటం ఆశ్చర్యం కలిగించదు. తన పార్టీలో మహిళలు ఉండటం ఆయనకు ఇబ్బందికరంగానే అనిపిస్తోంది.

1960ల్లో స్థానికుల ప్రయోజనాల కోసం పోరాడటం, వారికి ఉద్యోగాలు, ఇళ్లు సాధించటం, వారు వివక్షకు గురికాకుండా చూడటం కోసం ఏర్పాటైన శివసేన అప్పటి నుంచి పెను మార్పులకు లోనయింది. ఆ లక్ష్యాల్లో చాలా వరకూ సాధించారు.

వరకట్న వేధింపులు, ఇళ్లలో పనిచేసే వారి మీదా ఫ్యాక్టరీల్లో పనిచేసే వారి మీదా లైంగిక దోపిడీలు వంటి అంశాలపై పరస్పర సహాయం కోసం పేదల వాడల నుంచి ముందుకొచ్చిన బృందాలుగా మొదలైన మహిళా అఘాడీలు.. అల్లర్ల సమయంలో విభిన్నంగా మారాయి. "ఎయిర్-కండిషన్డ్" మహిళలు అని వీరు అభివర్ణించే వారిని ఉమ్మడి సమస్యలు, భయాలు ఏకం చేశాయి.

Image copyright Getty Images

ఈ మహిళలు పెద్ద పెద్ద భవంతుల్లో నివసిస్తూ పైథానీ చీరలు కడుతూ వజ్రాల మంగళసూత్రాలు ధరించే ధనిక వర్గ మహిళలు. వీరు తమ ఇళ్లలో పనిచేసే మహిళలను వారి అథమ పరిస్థితుల కారణంగా తక్కువగా చూసివుండొచ్చు. అయితే అల్లర్ల సమయంలో వీరి ఉమ్మడి భయాలు ఈ విభేదాలను చెరిపేశాయి. మధ్య తరగతి, ఎగువ తరగతి మహిళలు చాలా మంది మహిళా అఘాడీల్లో చేరటంతో వాటి స్థాయి పెరిగింది.

తమకు సమస్యాత్మకంగా ఉన్న ప్రభుత్వ అధికారులు లేదా స్కూళ్లు, కాలేజీల ప్రిన్సిపళ్ల ముఖాలకు నల్లరంగు పులమటం, నైతికత ప్రాతిపదికగా తమకు అభ్యంతరకరమైన సినిమాలను ప్రదర్శించే సినిమా థియేటర్లను మూసివేయించటం, ఉన్నత స్థానాల్లో ఉంటూ లైంగిక దాడులకు పాల్పడిన వారి పరువు తీయటం వంటి ఆందోళనలను స్వచ్ఛందంగా చేపట్టడం ద్వారా వీరు శివసేనకు తోడ్పడ్డారు.

Image copyright Shiv Sena/Facebook

కానీ ఇది కూడా ఒక విధమైన వీధి పోరాటమే. కాకపోతే ఇది మహిళల పోరాటం. ఇలాంటి ఘర్షణలు నచ్చని చాలా మంది మహిళలు కనుమరుగయ్యారు.

బాల్ ఠాక్రే అల్లరి మూకలకు నాయకత్వం వహించినప్పటికీ.. సోషలిస్టులు, న్యాయవాదులు, వైద్యులు, ప్రొఫెసర్లు, వ్యాపారవేత్తలు, దళితులు, వెనకబడిన వర్గాలు, అగ్ర కులాలు తదితర అన్ని వర్గాలకు చెందినవారూ ఆయనకు సలహాదారులుగా ఉన్నారు.

అలాంటి వారిలో ఇప్పుడు చాలా మంది మహిళలు ఉండివుండేవారు.

కానీ ఉద్ధవ్ సమస్య ఏమిటంటే.. తన ఆంతరంగిక మద్దతుదారులను మినహా ఆయన మరెవరినీ విశ్వసించలేరు, అలాంటి వారితో పనిచేయలేరు. ఆయన తన పార్టీలో మహిళా ప్రతిభావంతుల సంగతి తర్వాత, ఇతరత్రా ఎలాంటి ప్రతిభావంతులనూ గుర్తించకుండా ఇది అవరోధంగా నిలుస్తోంది.

Image copyright ShivSena/Facebook

నీలం గోరే వంటి వారి విలువైన అనుభవాన్ని కూడా ఆయన ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆమెకు శాసన మండలిలో సీటు ఇచ్చినప్పటికీ.. ఎల్లప్పుడూ తమ మంత్రివర్గంలో మహిళలకు నామమాత్రపు ప్రాతినిధ్యం కల్పించే కాంగ్రెస్, బీజేపీల లాగా.. అంతకుమించి పదోన్నతి కల్పించలేదు. ఎందుకంటే పురుషుల కంచుకోటల్లో ఈ మహిళలు పాగా వేసే అవకాశం ఉంటుంది కాబట్టి.

బాలాసాహెబ్ మీనావతిని నియమించినట్లుగానే మహిళా అఘాడీకి తన భార్య రష్మీ ఠాక్రేను ఇన్‌ఛార్జ్‌గా నియమించటం ద్వారా ఉద్ధవ్ తన తండ్రి అడుగుజాడలనే అనుసరించారు.

ఠాక్రే ‘రణరాగిణీలు’గా 1990ల్లో ముందుకొచ్చిన మహిళా అఘాడీ అప్పటి నుంచీ.. మహిళా బృందాలు ఆహారం తయారు చేసి దుకాణాల్లో విక్రయించే సఖి కుటుంబాల నిర్వహణలో, బహుశా హస్తకళలు ఇతర కళాత్మక వస్తువుల తయారీలో స్థానిక నైపుణ్యాలను ప్రదర్శించటంలో మినహా మహిళలకు మార్గదర్శకం ఇవ్వటంలో ఎలాంటి ప్రగతీ సాధించలేదు.

Image copyright Shiv Sena/Facebook

మహిళలు ఇళ్లనే అంటిపెట్టుకుని ఉండాలనే భావన ఎల్లప్పుడూ అంతర్లీనంగా ఉంది. మహిళలు ఎవరికీ తీసిపోరని, వారు తమ పోరాటతత్వం స్థాయిలోనే మేధస్సుతోనూ పార్టీని సుసంపన్నం చేయగలరనే వాస్తవాన్ని అంగీకరించటానికి ఠాక్రేలు సహా శివసేన నాయకత్వం ఈ తరానికి మారాల్సిన అవసరముంది.

ఉద్ధవ్ కుమారుడైన ఆదిత్య ఠాక్రేను ఇటీవలే శివసేన నేతగా ప్రకటించారు. పార్టీలో ఈ మార్పును ఆయన ప్రవేశపెట్టగలరా? ఇప్పటివరకూ అలాంటి సంకేతాలేవీ లేవు. ‘స్టైల్ ఐకన్’ అని, ‘చక్కని వస్త్రధారణ’ చేస్తారని కితాబులందుకున్న ఆదిత్య.. ఫ్యాషన్‌లోనూ ఫుడ్‌లోనూ ట్రెండ్ సెటర్లలాగే తనకు కనిపించే అందమైన వారితో ఎక్కువగా తలమునకలైనట్లు కనిపిస్తున్నారు. కానీ వారిని సేన వైపు ఆకర్షించటంలో సఫలం కాలేదు.

ధనికులు, అందమైన వాళ్లు నివసించే మలబార్ హిల్, నేపియాన్ సీ రోడ్, జుహు, బాంద్రా వంటి ప్రాంతాల్లో శివసేన భారీగా సీట్లు కోల్పోయిన 2017 బృహన్‌ముంబై కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టమైంది.

Image copyright Getty Images

విజ్ఞానవంతులు, విజయవంతమైన మహిళలను పార్టీలోకి ఆకర్షించటానికి, వారికి తగిన స్థానం ఇవ్వటానికి ఆయన ప్రయత్నించినట్లయితే.. 1990ల్లో మహిళా అఘాడీల తరహాలో వారు తమ పురుషులను పార్టీలోకి తీసుకురావచ్చేమో. అది.. ఆ పార్టీ ప్రతిష్ఠ గూండాల ముఠాగా కాకుండా ఉన్నత స్థాయి వ్యక్తుల సమాహారంగా మారాలన్న, మహారాష్ట్రను దాటి విస్తరించాలన్న ఆదిత్య ఠాక్రే ప్రకటిత లక్ష్యం నెరవేరటానికి దోహదపడవచ్చు.

అప్పుడు శివసేన తన గత చరిత్రను దులిపేసుకుని.. ఎన్నికల్లోనూ సామాజికంగానూ తనను కిందికి లాగివేస్తున్న బీజేపీ తదితర మిత్రపక్షాల ఊతం లేకుండా తన సొంత కాళ్లపై నిలబడవచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)