జమ్మూ కశ్మీర్‌లో సైన్యం-పోలీసులు ఎదురెదురు?

  • 29 జనవరి 2018
షోపియాన్ ఘటనపై జమ్మూ కశ్మీర్ పోలీసులు ఆర్మీ యూనిట్‌పై కేసు నమోదు చేశారు. Image copyright Getty Images
చిత్రం శీర్షిక షోపియాన్ ఘటనపై జమ్మూ కశ్మీర్ పోలీసులు ఆర్మీ యూనిట్‌పై కేసు నమోదు చేశారు.

భారత్ పాలిత కశ్మీర్‌లో శనివారం నాడు సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు సైనిక యూనిట్‌పై కేసు నమోదు చేశారు.

దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని గోవాంపొరాలో సైన్యం జరిపిన కాల్పుల్లో 20 ఏళ్ల జావేద్ అహ్మద్ భట్, 24 ఏళ్ల సుహైల్ జావేద్ మృతి చెందారు.

కాల్పుల జరిపిన సైనిక యూనిట్‌పై హత్య (సెక్షన్ 302), హత్యా యత్నం (సెక్షన్ 306) సహా పలు సెక్షన్ల కింద పోలీసులు షోపియాన్ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

ఈ ఎఫ్ఐఆర్‌లో ఆర్మీ మేజర్ ఆదిత్య పేరు కూడా నమోదు చేశారు. కాల్పులు జరిపినప్పుడు మేజర్ అద్వితీయ 10 గఢ్వాల్ యూనిట్‌కు నేతృత్వం వహిస్తున్నారు.

Image copyright Getty Images

స్పందించని ఆర్మీ

ఈ కేసులో సైన్యానికి వ్యతిరేకంగా కేసు నమోదు చేశామని పోలీసు చీఫ్ శేష్‌పాల్ వైద్ బీబీసీతో చెప్పారు. అయితే, ఈ ఘటన ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో తాము తెలుసుకుంటామని కూడా ఆయన అన్నారు.

దీనిపై సైన్యం స్పందనను తెలుసుకోవడానికి పలు మార్లు ప్రయత్నించినప్పటికీ ఆర్మీ ప్రతినిధి ఫోన్ కాల్స్ స్వీకరించలేదు.

తాము తప్పనిసరి పరిస్థితుల్లోనే, ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చిందని శనివారం ఘటన తర్వాత ఆర్మీ పేర్కొంది.

ఈ ఘటనపై మెజిస్ట్రేట్ ద్వారా న్యాయవిచారణ జరిపించాలని, 20 రోజుల లోగా నివేదిక అందించాలని ప్రభుత్వం శనివారం నాడే ఆదేశించింది.

షోపియాన్‌లో యువకుల మృతికి నిరసనగా వేర్పాటువాదులు ఆదివారం నాడు బంద్‌ నిర్వహించారు. బంద్ సందర్భంగా కశ్మీర్ లోయ అంతటా దుకాణాలు మూతపడ్డాయి. రోడ్లపై ట్రాఫిక్ కనిపించలేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇది శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తుంది: ముఫ్తీ

రక్షణమంత్రితో మాట్లాడిన సీఎం

షోపియాన్‌లో యువకుల మృతి ఘటన తర్వాత కశ్మీర్‌లో ఉద్రిక్తత నెలకొంది. కశ్మీర్ బంద్‌ను దృష్టిలో పెట్టుకొని ఆదివారం నాడు రైల్వే సేవలు కూడా నిలిపివేశారు.

శనివారం రాత్రి నుంచే కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవల్ని ఆపేశారు.

షోపియాన్‌లో సైన్యం కాల్పుల్లో యువకుల మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ సంతాపం ప్రకటించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఆమె ఫోన్‌లో మాట్లాడారు.

జమ్మూ కశ్మీర్‌లో మొదలైన శాంతి ప్రక్రియపై షోపియాన్ కాల్పుల వంటి ఘటనలు చెడు ప్రభావం పడవేస్తాయని ఆమె హోంమంత్రికి తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు