ఆర్థిక సర్వే 2017-18: పది ముఖ్యాంశాలు

 • 29 జనవరి 2018
అరుణ్ జైట్లీ, జీఎస్‌టీ Image copyright Reuters

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో 2017-18 ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7 నుంచి 7.5 శాతం వృద్ధి చెందొచ్చని సర్వే నివేదిక వెల్లడించింది.

ఎగుమతులు, ప్రైవేటు పెట్టుబడులు పెరుగనున్న దృష్ట్యా దేశ ఆర్థిక స్థితి మెరుగుపడనున్నట్టు నివేదిక తెలిపింది. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాక జైట్లీ ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టారు.

ఆర్థిక సర్వేలో పది ముఖ్యాంశాలు:

 1. గత సంవత్సర కాలంగా వరుసగా చేపట్టిన ముఖ్యమైన సంస్కరణల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతానికి చేరుకుంది. 2018-19 సంవత్సరంలో ఇది 7.0 నుంచి 7.5 శాతం వరకు పెరుగుతుంది.
 2. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) గణాంకాల ప్రకారం పరోక్ష పన్ను చెల్లింపుదారుల సంఖ్యలో 50 శాతం పెరుగుదల ఉన్నట్టు తేలింది. డిసెంబర్ 2017 నాటికి 98 లక్షల మంది వ్యాపారులు జీఎస్టీ కింద తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
 3. బేటీ బచావో, బేటీ పఢావో, సుకన్య సమృద్ధి యోజన, అనివార్య మాతృత్వ సెలవు వంటి పథకాలన్నీ సరైన దిశలో పని చేస్తున్నాయి.
 4. ప్రపంచ బ్యాంకు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' రిపోర్టులో భారత్ 30 స్థానాలు ఎగబాకి టాప్ 100 దేశాల జాబితాలో చేరింది.
 5. 2017-18లో ద్రవ్యోల్బణం రేటు ఆరేళ్ల కనిష్ఠానికి చేరింది. వినియోగదారు ధరల సూచీ సగటున 3.3 శాతం వద్ద నిలిచింది. ఇది గత ఆరేళ్లలో అతి తక్కువ.
 6. ఎనిమిది కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంబంధిత పరిశ్రమలలో - బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, పెట్రోలియం, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్తు - 2017 ఏప్రిల్-నవంబర్ మధ్య 3.9 శాతం వృద్ధి నమోదైంది.
 7. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న వలస కారణంగా వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యం బాగా పెరిగింది. వ్యవసాయదారులుగా, కూలీలుగా, వ్యాపారులుగా మహిళల భాగస్వామ్యంలో పెరుగుదల నమోదైంది.
 8. వ్యవసాయంలో యాంత్రీకరణ బాగా పెరిగింది. ట్రాక్టర్ల అమ్మకాల్లో పెరుగుదల దీనినే సూచిస్తోంది. ప్రపంచ బ్యాంకు అంచనా వ్రకారం 2050 నాటికి భారత జనాభాలో సగ భాగం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుంది.
 9. రైతుల స్వల్పకాలిక పంట రుణాలపై 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 20,339 కోట్ల వడ్డీ మాఫీ చేసింది.
 10. భారత విదేశీ వ్యాపారానికి సంబంధించి చెల్లింపుల సమతుల్యం పరిస్థితి నిలకడగా ఉంది. 2017-18 సంవత్సరం రెండో త్రైమాసికంలో కరంట్ అకౌంట్ లోటు (సీఏడీ) 7.2 బిలయన్ డాలర్లు (జీడీపీలో 1.2 శాతం) ఉంది. ఇది అంతకు ముందటి త్రైమాసికంకన్నా తక్కువ.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు