మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేశారు?

  • 30 జనవరి 2018
మహాత్మా గాంధీ Image copyright Hulton Archive/Getty Images

‘విధితో కలయిక’ ఆసన్నమైందని 1947 ఆగస్టు 15వ తేదీకి కొన్ని నెలల ముందు నుంచే కనిపిస్తోంది. కానీ ఆ రోజు ఆగమనం కోసం నిరీక్షణ చుట్టూ అలముకున్న సంతోషంలో ఏదో లోటు ఉంది.

శతాబ్దాల తర్వాత బ్రిటిష్ పాలన, బానిసత్వం భారతదేశానికి అంతం కానున్నాయి. అయినా, స్వాతంత్ర్య సంబరం ఊహించినంతగా ఆవరించిలేదు. దానికి కారణం విభజన విషాదం. విద్వేషాగ్ని కూడా దానిని బూడిదగా దహించివేయలేకపోయింది. ఈ విషాదాన్ని సజీవంగా ఉంచిన అగ్ని అది.

అధికార బదలాయింపు కొందరికి కాస్త ఊరటనిచ్చింది. కానీ అటువంటి వారిలో గాంధీ లేరు. ఎన్నో సత్యాన్వేషణలతో ప్రయోగాలు చేసి, 78 ఏళ్ల వయసులో ఉన్న గాంధీ ఆలోచన మునుపటికన్నా ఎక్కువగా బలపడింది. కానీ ఆయన శరీరం శక్తికోల్పోయింది. ఆయన సంకల్ప బలానికి సరితూగటంలో శరీరం విఫలమవుతోంది. తనకు ఎదురవుతున్న భీకర సవాళ్లను దృష్టిలో పెట్టుకున్న గాంధీ దీనిని అంగీకరించలేకపోయారు.

1947 ఆగస్టుకు కొన్ని నెలల ముందు నుంచీ 1948 జనవరి వరకూ ఆయన తరచుగా పర్యటనలు చేసింది అందుకే. ఎక్కడ అల్లర్లు జరిగితే అక్కడి ప్రజల బాధలు, విషాదాలను పంచుకోవటానికి గాంధీ వెళ్లేవారు. విద్వేషాగ్ని కీలలను ప్రార్థనలు, సందేశాల ద్వారా చల్లార్చేందుకు ప్రయత్నించేవారు. భవిష్యత్తులో సాన్నిహిత్యం కొనసాగించటానికి మార్గాలను సూచించేందుకు ప్రయత్నించారు.

మతమౌఢ్యం, ఉన్మాదం నుంచి మానవతా మార్గం చూపటానికి తన మనసు లోతుల్లోనుంచి కృషిచేశారు.

ఆయన రావాలని ఆకాంక్షించిన ప్రదేశాలన్నిటికీ, ఆయనను చూడాలనుకున్న క్షతగాత్రుల్లో ప్రతి ఒక్కరినీ గాంధీ చేరుకోలేకపోయారు. ఒక చోట ఉంటూ ఇతర ప్రాంతాలకు శాంతి సందేశాన్ని, దూతను పంపేవారు. పరిస్థితులు మరింత ఎక్కువగా సంక్లిష్టంగా మారుతున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1946లో కలకత్తాలో జరిగన మత మత ఘర్షణల్లో 2,000 మంది చనిపోయినట్లు అంచనా

అవిభాజ్య భారతదేశం విస్తృతి కూడా చాలా విస్తారమైనది. కరాచీ ప్రభావం బిహార్‌లో కనిపించింది. నౌఖోలీ ప్రభావం కలకత్తా మీద కనిపించింది. విధ్వంసం చాలా ప్రాంతాల్లో కనిపించింది. విద్వేషాగ్ని ప్రతి చోటా ప్రజ్వరిల్లుతూ ఉండింది. ప్రతి ఒక్కరికీ గాంధీ మీద ఫిర్యాదు ఉండింది. విద్వేషాగ్నిని విస్తరించే వారు, దాని నుంచి ప్రయోజనం పొందేవారు ప్రతి ఒక్కరికీ గాంధీ మీద ఫిర్యాదు ఉండింది. ఎందుకంటే వారి ఆకాంక్షలు ఇతరుల ఆకాంక్షలకన్నా భిన్నమైనవి.

హిందువులు లేదా ముస్లింలు లేదా సిక్కులు ఎవరి ఊచకోత జరిగినా.. గాంధీకి అది తన సొంత శరీర భాగాలను దహనం చేయటం లాంటిది. దీనిని ఆయన తన వైఫల్యంగా పరిగణించారు. అది ఆయన కలలకు వ్యతిరేకమైనది. ఆయను కుంగదీసింది. ’వామనుడి’ లాగా అవిభాజ్య భారతదేశాన్ని గాంధీ రెండు మూడు అంగల్లో కొలవాలనుకున్నారు కానీ కొలవలేకపోయారు. అది ఆయన విధి. విషాదభరిత విధి.

ఆగస్టు పదిహేనో తేదీ అర్థరాత్రి భారతదేశపు విధిని రూపొందించటంలో దిల్లీ తలమునకలైవుంది. అప్పటికి మూడు దశాబ్దాలుగా స్వతంత్ర సంగ్రామం విధానాన్ని, సంకల్పాన్ని, నాయకత్వాన్ని నిర్ణయించే మహాత్మా గాంధీ తన వారసులైన భావి దేశపు నిర్మాతలను ఆశీర్వదించటానికి అప్పుడక్కడ లేరు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1947 ఆగస్టు 26న ముస్లింల పండుగ ఈద్-ఉల్-ఫితర్ నాడు కలకత్తా మైదానంలో ప్రార్థనా సమావేశంలో గాంధీ ప్రసంగం వినటానికి లక్ష మంది హిందువులు, ముస్లింలు హాజరయ్యారు

ఆయన దిల్లీ సరిహద్దులకు మైళ్ల దూరంలో కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) లోని ‘హైదరీ మహల్’లో ఉన్నారు. మైనారిటీ హిందువులు దారుణ ఊచకోతకు గురైన నౌఖోలీలో పర్యటించటానికి ఆయన వెళ్లారు. ఆయన కలకత్తాలో రెండు మూడు రోజులు ఉండాల్సి వచ్చింది. ఇక్కడ మైనారిటీ ముస్లింలు ఫిర్యాదు చేస్తున్నారు. నౌఖోలీలో విద్వేష జ్వాలలను నివారించటానికి కలకత్తాలో అగ్నిని చల్లార్చాల్సిన అవసరం ఉందని గాంధీ భావించారు.

కలకత్తాలో ముస్లింలకు భద్రతలేకుండా వదిలేస్తే, నౌఖోలీలోని హిందువులను ఎలా రక్షించగలనని ఆయన భావించారు. ఇక్కడ మైనారిటీలను పరిరక్షించాల్సిన బాధ్యత తనదని గాంధీ భావించారు. అది నౌఖోలీలోని మైనారిటీల హక్కులను పరిరక్షించటానికి ఆయనకు నైతిక మద్దతును కూడగట్టింది. కలకత్తాలో ఘోరకలి అనదగ్గ ప్రాంతంలో ఉండాలని గాంధీ కోరుకున్నారు.

ఒక ముస్లిం వితంతువుకు చెందిన ‘హైదరీ మహల్’ అందుకు తగిన స్థలం. అది హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతం. సమీపంలో మియా బాగాన్ అనే బలహీన వర్గానికి చెందిన ముస్లింల ఆవాస ప్రాంతముంది. అది కాలువకు అవతల ఉంటుంది. మియా బాగాన్‌లో ఎంతగా విధ్వంసం సృష్టించారంటే.. తమ దైన్యం గురించి చెప్పటానికి ఏ ఒక్కరూ అక్కడ లేకుండాపోయారు.

ఈ ‘హైదరీ మహల్’లో బస చేయటానికి గాంధీ ఒక షరతుతో ఒప్పుకున్నారు. సుహ్రావర్దీ కూడా అక్కడ ఉండాలన్నది ఆయన షరతు. అప్పటికి ఏడాది కిందట తన ‘ప్రత్యక్ష చర్య’తో వందలాది మంది హిందువులను చంపి, వేలాది మందిని నిరాశ్రయులను చేసిన సుహ్రావర్దీ ఆయన. హిందువుల పట్ల ద్వేషానికి అపకీర్తి పొందిన సుహ్రావర్దీ తన నేరాన్ని అంగీకరించి, శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయటానికి అక్కడికి రావటానికి అంగీకరించారు.

Image copyright gandhismriti.gov.in

గాంధీ మరో షరతు పెట్టారు: కలకత్తాలోని ముస్లిం లీగ్ నేతల్లో అతివాదులు నౌఖోలీలోని తమ ‘జనాని’కి వైర్ సందేశం పంపి, అక్కడి హిందువులను రక్షించేలా చేయటం, అక్కడ శాంతి వాతావరణం నెలకొల్పేలా చేసేందుకు తమ కార్యకర్తలను పంపించటం.

గాంధీ షరతులకు అంగీకరించారు. కలకత్తా జనం తమ అభిప్రాయాలను వ్యక్తం చేయటం కొనసాగించారు. కానీ హిందూ మహాసభకు చెందిన యువతలో భ్రమలు అలాగే ఉండిపోయాయి. వారు గాంధీని కేవలం ముస్లింల సమర్థకుడిగా మాత్రమే భావించారు. హిందువులు కష్టాల్లో ఉన్నపుడు ఎందుకు రాలేదని, హిందువులు పారిపోతున్న ప్రాంతాలకు ఎందుకు వెళ్లలేదని వారు ఆయనను ప్రశ్నించేవారు. గాంధీని ‘హిందువుల శత్రువు’ అని వారు అభివర్ణించారు.

పుట్టుకలో, ఆచారంలో, జీవనశైలిలో, నమ్మికలో, విశ్వాసంలో పూర్తిగా హిందువు అయిన ఒక వ్యక్తి మీద చేసిన ఆరోపణ ఇది. దీనికి స్పందిస్తూ గాంధీ కూడా అదే చెప్పారు. గాంధీని హిందువుల శత్రువుగా ఆరోపించటం తీవ్రంగా బాధించేది.

ఆగస్టు పదిహేనును గాంధీ ఒక ’గొప్ప ఘటన’గా పరిగణించేవారు. ఆ దినాన్ని ‘ఉపవాసం, ప్రార్థనలు, పశ్చాత్తాపంతో ఆహ్వానించాలని ఆయన తన అనుచరులకు చెప్పారు. ఆయన స్వయంగా ఆ మహా దినానికి అదే రీతిలో స్వాగతం పలికారు.

Image copyright gandhismriti.gov.in

కలకత్తాలో గాంధీ విజయవంతమయ్యారు. శాంతియుత వాతావరణం అక్కడ విస్తరించటం మొదలైంది. మహాత్ముడి ఆదర్శాల ప్రభావం సైనిక శక్తి కన్నా బలమైనది. అందుకే.. చివరి వైశ్రాయ్, మొదటి గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ వైర్ సందేశంలో ఆయనకు ఇలా అభినందనలు తెలిపారు: ‘‘పంజాబ్‌లో మనకు యాభై ఐదు వేల మంది సైనికులున్నారు. కానీ అల్లర్లు అదుపుకాలేదు. బెంగాల్‌లో మన సైన్యానికి చెందిన ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. అక్కడ సంపూర్ణ శాంతి నెలకొంది.’’

నౌఖోలీకి వెళ్లటానికి ముందు కలకత్తాలో కొన్ని రోజులు ఉండాలని గాంధీ భావించారు. కానీ ఆయన నెల రోజుల పాటు అక్కడ ఉండాల్సి వచ్చింది. తుపాకీమందు గుట్ట మీద ఉండి ఒక్క అగ్గిరవ్వ తగిలితే విస్ఫోటనానికి సిద్ధంగా ఉన్న ఆ నగరం గాంధీని వెళ్లనివ్వలేదు. ఆ తుపాకీమందు మండే స్వభావాన్ని గాంధీ ధ్వంసం చేశారు. అగ్గిరవ్వ కూడా ఆరిపోయింది.

నాటికి కేవలం ఏడాది కిందట హిందువులను తీవ్రంగా వ్యతిరేకించిన సుహ్రావర్దీ ఇప్పుడు ఒక కొత్త ఆదర్శం. ఆయన ప్రతిజ్ఞను చూసి జనం ఆశ్చర్యపోయారు. అల్లర్లకు పాల్పడుతున్న హిందూ యువత కూడా పాశ్చాత్తాప పడింది.

Image copyright STR/AFP/Getty Images
చిత్రం శీర్షిక 1947 సెప్టెంబర్ 22న పాకిస్తాన్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ముస్లిం శరణార్థులను ఢిల్లీలోని పురానా ఖిలాలో గాంధీ సందర్శించారు

దిల్లీ గాంధీని పిలుస్తోంది. వేడుక వాతావరణం నిరర్థకమైంది. ఇప్పుడు దిల్లీకి గాంధీ అవసరముంది. దిల్లీ మరోసారి కలకత్తా జనంతో నిండిపోయింది. దిల్లీ మహాత్ముడి కోసం నైరాశ్యంతో నిరీక్షిస్తోంది.

గాంధీ సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం దిల్లీ చేరుకున్నారు. బేలూరు నుంచి రైలులో వచ్చారు. చిరపరిచితమైన ఈ సెప్టెంబర్ ఉదయం ఆనందదాయకమైన ఉదయం కాదని గాంధీ తెలుసుకున్నారు. అన్నిచోట్లా స్మశాన నిశబద్దం ఆవరించివుంది. అన్ని మర్యాదలకూ బీటలు పడ్డాయి.

రైల్వే స్టేషన్‌లో గాంధీని ఆహ్వానించటానికి సర్దార్ పటేల్ వచ్చారు. కానీ ఆయన ముఖంలో నవ్వు మాయమైంది. పోరాటంలో కష్ట కాలంలోనూ సంతోషంగా కనిపించే అదే సర్దార్‌ ముఖంలో ఇప్పుడు నిస్పృహ కనిపించింది. వస్తారని అనుకున్న ఇతర పెద్దమనుషులు రైల్వే స్టేషన్ వద్ద కనిపించలేదు. గాంధీ ఆందోళనకు ఇది చాలు.

సర్దార్ కారులో కూర్చుంటూ మౌనం వీడారు: ఐదు రోజులుగా అల్లర్లు జరుగుతున్నాయి. దిల్లీ ఇప్పుడు శవాల నగరంగా మారింది.

Image copyright Central Press/Getty Images

గాంధీని ఆయనకు ప్రియమైన వాల్మీకి టౌన్‌షిప్‌కు తీసుకెళ్లలేదు. బిర్లా భవన్‌లో ఆయనకు బస ఏర్పాటు చేశారు. కారు అక్కడికి చేరుకోగానే ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కూడా వచ్చారు. అది కాకతాళీయం కాదు. ఆయన ముఖ రూపం మారిపోయింది. ఒక్క నెల రోజుల సమయంలోనే ఆయన ముఖంలో ముడతలు అనూహ్యంగా పెరిగిపోయాయి.

ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ‘బాపు’ అంటూ గుక్కతిప్పుకోకుండా అంతా చెప్పారు. లూటీ, ఊచకోత, కర్ఫ్యూ.. అన్ని వివరాలూ తెలియజేశారు. ఆహారపదార్థాలు అందుబాటులో లేవు, సాధారణ పౌరుడి దీనస్థితి, పాకిస్తాన్‌ను తన పౌరులను రక్షించుకోవాలని తను ఆ దేశానికి ఎలా చెప్పగలరు?

హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అందరికీ సేవ చేస్తుండే డాక్టర్ జోషి అనే ప్రఖ్యాత సర్జన్ గురించి ప్రస్తావించారు. ఆయనను ఒక ముస్లిం ఇంటి నుంచి తుపాకీతో కాల్చారు. ఆయన బతకలేదు.

శాంతి కోసం సాధ్యమైన కృషి అంతా జరుగుతోంది. అందరూ అక్కడ కలిశారు. గాంధీ అనుచరులు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. గాంధీ ప్రతి రోజూ తన మనోభావాలను ప్రార్థనా సమావేశంలో చెప్పేవారు. అది రేడియోలో ప్రసారమయ్యేది. కానీ బహుశా ఈ ప్రయత్నాలు సరిపోలేదు.

Image copyright Kulwant Roy/Topical Press Agency/Hulton Archive/Ge

పాకిస్తాన్ నుంచి వస్తున్న హిందువులు, సిక్కుల సంఖ్య తగ్గలేదు. ఈ జనం రక్తానికి బదులుగా రక్తం కావాలంటున్నారు. గాంధీ మాటలు వారికి రుచించలేదు. ఈ మనిషి పాకిస్తాన్ మీద నైతిక ఒత్తిడి తెస్తున్నారన్నది కూడా వారు చూడలేకపోయారు. తన పౌరులకు భద్రత కల్పిస్తానన్న జిన్నా హామీని ఆయనకు గుర్తుచేశారు.

భారతదేశానికి కూడా దాని హామీని గాంధీ గుర్తుచేస్తున్నారు. ఆ హామీని నెరవేర్చటంలో నైతిక బలం పెరగటాన్ని గాంధీ చూసేవారు. ఆయన ప్రతి రోజూ ప్రణాళిక రచించేవారు. వాటిని అమలు చేసేవారు. జనవరి వణికించే చలి వచ్చింది. భారత్ కానీ, పాకిస్తాన్ కానీ తమ విశ్వాసాలను ఉల్లంఘించాయని గాంధీ భావించలేదు.

యాభై ఐదు కోట్ల రూపాయలను విశ్వాస అనుసంధానంగా ఆయన పరిగణించారు. విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడేందుకు ఎవరికైనా ఎదురు వెళ్లేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. చివరికి తనను తానే వ్యతిరేకించటానికి కూడా. గాంధీ అదే స్ఫూర్తి నుంచి నైతిక బలం పొందేవారు.

Image copyright Keystone/Getty Images

సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ వెళ్లాలనేది ఆయన ప్రణాళిక. జిన్నాను, ఆయన ప్రభుత్వాన్ని అంతకుమించి పరిగణించలేదు. శాంతి నెలకొల్పుకోవటమనే ఆలోచన హిందూ మహాసభకు నచ్చలేదు. గాంధీ నిరాహారదీక్షలో స్వీయ-సత్యసంధతను వీరు చూడలేదు.

ప్రపంచం గాంధీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నట్లు కినిపించినపుడు.. వీరు ‘గాంధీ ముర్దాబాద్’ అని నినాదాలు చేసేవారు. ఆధ్యాత్మిక స్వచ్ఛతతో పవిత్రంగా విలసిల్లినటువంటి ప్రపంచంలోని అత్యుత్తమ ఆలోచనను.. నాథూరాం గాడ్సేకు చెందిన సైద్ధాంతిక శాఖ ఎన్నడూ అర్థం చేసుకోజాలదు.

రాజీవ్ రంజన్ గిరి.. యూనివర్సిటీ ఆఫ్ దిల్లీలోని రాజధాని కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)