దక్షిణ సూడాన్: కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకులు దొరకని దుస్థితి

  • 30 జనవరి 2018
దక్షిణ సూడాన్‌ ప్రజలు Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆకలిని తట్టుకునేందుకు తన రెండేళ్ల కొడుకు ఒనాంగ్ నగొర్‌కు స్థానికంగా దొరికే సారాయిని తాగిస్తున్న నైబోల్ మడుట్. అంతర్యుద్ధం కారణంగా ఈమె ముగ్గురు పిల్లల్ని కోల్పోయింది

దక్షిణ సూడాన్‌లో తుపాకి మోతలు ఒకవైపు, ఆకలి కేకలు మరోవైపు వినిపిస్తున్నాయ్.

దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం లక్షలాది చిన్నారులకు శాపంగా మారుతోంది. కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకులు దొరకని దుస్థితి.

తక్షణమే వీరికి ఆహారం అందకపోతే నాలుగోవంతు చిన్నారులు మరణించే ప్రమాదం ఉందని యూనిసెఫ్ హెచ్చరిస్తోంది.

సహాయక చర్యలకు అంతర్యుద్ధం విఘాతం కలిగిస్తుండటంతో కరవు పరిస్థితులు తలెత్తుతున్నాయి.

చిత్రం శీర్షిక రెండేళ్ల వయసున్న క్రిస్టీన్ జాక్సన్, ఆకలి సంక్షోభానికి ప్రతీకగా కనిపిస్తోంది

ఆకలి సంక్షోభానికి ప్రతీక

రెండేళ్ల వయసున్న క్రిస్టీన్ జాక్సన్, ఆకలి సంక్షోభానికి ప్రతీకగా కనిపిస్తోంది.

తీవ్రమైన పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్న ఈ చిన్నారి సగం బరువు కోల్పోయింది. రోగ నిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తోంది. చిన్న అంటువ్యాధి సోకినా ఊపిరి ఆగిపోతుంది.

ప్రస్తుతం ఆ పాప ఓ శిబిరంలో రక్షణ పొందుతూ, పాల తాగి బతుకుతోంది. ఇక్కడి నుంచి బయటకెళ్తే కనీసం ఒక్క పూట భోజనం పెట్టే స్తోమత కూడా తనకు లేదని క్రిస్టీనా తండ్రి జాక్సన్ లెపానీ ఆవేదన చెందుతున్నారు.

చిత్రం శీర్షిక ఎంతో మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు

యుద్ధం పేదలుగా మారుస్తోంది

దక్షిణ సూడాన్‌లో ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్న వారిలో జాక్సన్ ఒకరు. మంచి ఉద్యోగంతో పాటు ఆయనకు కొంత పొలం కూడా ఉంది.

అయితే నాలుగేళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధం జాక్సన్‌ను నిరుపేదగా మార్చేసింది.

దేశ రాజధాని జుబాలో ప్రతి 10 మంది చిన్నారుల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. రాజధాని బయట ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

చిత్రం శీర్షిక విమానాల ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఆహారం అందిస్తున్నారు

ప్రాణాల మీదకు వస్తోన్న సహాయం

ప్రభుత్వం, తిరుగుబాటుదార్ల మధ్య జరుగుతున్న యుద్ధం అనేక మంది సహాయక చర్యలు చేపట్టే ఉద్యోగుల ప్రాణాలను తీస్తోంది.

తిరుగుబాటుదార్ల అధీనంలో ఉన్న గాన్యేల్ వంటి ప్రాంతాల్లో విమానాల ద్వారా సహాయం అందిస్తున్నారు.

ఇది ఎంతో ఖరీదైన వ్యవహారం. కాబట్టి అందరికీ సహాయం చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ క్రమక్రమంగా కరవు పరిస్థితులు నెలకొంటున్నాయి.

చిత్రం శీర్షిక సాగు తగ్గి ఆహారానికి తీవ్రమైన కొరత ఏర్పడినట్లు హెన్రియేటా ఫోర్ చెబుతున్నారు

నాగలి పట్టడం లేదు

అంతర్యుద్ధం వల్ల ఎంతో మంది రైతులు పొలాలను వదిలేస్తున్నారని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెన్రియేటా ఫోర్ చెబుతున్నారు. దీంతో సాగు తగ్గి ఆహారానికి తీవ్రమైన కొరత ఏర్పడిందని తెలిపారు.

వచ్చే జులైలో మొదలయ్యే పంట కాలంలోనూ పరిస్థితులు ఇలాగే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

"దక్షిణ సూడాన్ ఇప్పుడు ఎంతో క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఇటువంటి దయనీయ స్థితిలో మేం పిల్లల ప్రాణాలు కాపాడాల్సి ఉంది" అని హెన్రియేటా ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్రం శీర్షిక తిరుగుబాటుదార్లు పిల్లల జీవితాలను బలి చేస్తున్నారని అటెనీ వెక్ అటెనీ ఆరోపిస్తున్నారు

పంతం నెగ్గించుకోవడానికే

తిరుగుబాటుదార్లకు కూడా సమాన హక్కులు ఉండాలని మధ్యవర్తులు కోరుతున్నారని దక్షిణ సూడాన్ అధ్యక్షుని ప్రతినిధి అటెనీ వెక్ అటెనీ అన్నారు. వారి పంతం నెగ్గించుకోవడం కోసం తిరుగుబాటుదార్లు పిల్లల జీవితాలను బలి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

యుద్ధం ఆగే సూచనలు లేకపోవడంతో ఇక్కడి చిన్నారులు దాతల ఔదార్యం మీద ఆధారపడి జీవిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం