1948 జనవరి 30: మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచిందంటే..

  • 30 జనవరి 2018
గాంధీ Image copyright Fox Photos/Getty Images

1948, జనవరి 30, శుక్రవారం, రోజూలాగానే మొదలయ్యింది. గాంధీ తెల్లవారుఝాము మూడున్నరకే లేచారు.

ప్రార్థన చేసుకుని, ఓ రెండు గంటలు కాంగ్రెస్ కొత్త బాధ్యతలు, విధానాల మీద దృష్టి పెట్టి, మిగతావారు లేచేలోపు, ఆరు గంటలకి మళ్ళీ నిద్రకు ఉపక్రమించారు. మళ్ళీ ఎనిమిది గంటలకు లేచారు.

ఎప్పటిలాగే ఆయనకి నూనెతో మాలిష్ జరిగంది. స్నానం చేసాక మేక పాలు, ఉడికిన కూరగాయలు, ముల్లంగి, నారింజ రసం ఆరగించారు.

అదే సమయానికి, ఢిల్లీ నగరంలో మరో మూల, ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్‌లో నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే, విష్ణు కర్కరే ఇంకా నిద్రపోతూ ఉన్నారు.

ఇక్కడ, గాంధీ ఉపాహారం తరువాత, తనని కలవడానికి సపరివారంగా వచ్చిన పాత స్నేహితుడు రుస్తమ్ సోరాబజీతో కాసేపు సంభాషించారు. తరువాత ఢిల్లీలోని ముస్లిం లీడర్లను కలిసి 'మీ సమ్మతి లేకుండా వార్ధా వెళ్ళలేను' అని చెప్పారు.

Image copyright Photodivision

పటేల్‌ను ఎందుకు కలిశారంటే..

తరువాత, గాంధీగారి సన్నిహితులు అయిన సుధీర్ ఘోష్, ప్యారేలాల్ కలిసి లండన్ టైమ్స్‌లో వచ్చిన వార్త 'నెహ్రూ, పటేల్ మధ్యన అభిప్రాయబేధాలు'పై స్పందించమని కోరారు. ఆరోజు సాయంకాలం వారిద్దరి ముందూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని గాంధీ అన్నారు.

అక్కడ బిర్లా హౌస్‌కి బయలుదేరేముందు గాడ్సేకి వేరుసెనగలు తినాలనే కోరిక కలిగింది. అతని మిత్రుడు ఆప్టే వాటిని ఎలాగోలా సంపాదించి మిత్రునికి ఇచ్చాడు. అవి తిన్నాక తృప్తిగా బయలుదేరారు.

సాయంత్రం నాలుగు గంటలకి వల్లభాయ్ పటేల్ తన కూతురు మనీబేన్‌తో సహా గాంధీని కలిసి ప్రార్థనా సమయం.. 5 గంటలు దాటే వరకూ ముచ్చటించారు.

అదే సాయంత్రం నాలుగుంపావుకి గాడ్సే, అతని మిత్రులు టాంగా ఎక్కి కనాట్ ప్లేస్‌కి వెళ్ళారు. అక్కడినుండి ఇంకో టాంగా తీసుకుని బిర్లా హౌస్‌కి బయలుదేరారు. హౌస్‌కి ముందు రెండు వందల గజాల దూరంలోనే టాంగా ఆపించి దిగారు.

ఇక్కడ గాంధీ.. పటేల్‌తో మాట్లాడుతూనే, ఒకచేత్తో చరఖా చేత పట్టి, మరో చేత్తో ఆభా తెచ్చిపెట్టిన సాయంత్రం భోజనం చేయసాగారు. ప్రార్థనా సభకి ఆలస్యంగా వెళ్ళడం గాంధీకి ఇష్టం ఉండదు. ఈ విషయం గురించి ఆభా ఆందోళన చెందసాగింది. కానీ పటేల్‌కు ఈ విషయం గుర్తు చేసే ధైర్యం ఆమెకి లేదు. పైగా ఆయనకు ఉక్కుమనిషి అని పేరు కూడా ఉంది. అలాగని, ఆలస్యం అవుతోందని గాంధీకి చెప్పే ధైర్యమూ లేదు. చివరికి హాల్‌లో ఉన్న జేబు గడియారం తీసి టైము చూపించే ప్రయత్నం చేసారు. అది గమనించిన మనుబెన్ గాంధీకి చెప్పగా ఆయన ప్రార్థనా సభకి 5.10 ని. బయలుదేరారు.

Image copyright GANDHISMRITI.GOV.IN
చిత్రం శీర్షిక ఆభా, మనులతో మహాత్మా గాంధీ

అలా వెళుతుండగానే..

తన సహాయకులైన ఆభా, మను లతో కలిసి నడుస్తూ, వారితో సరదాగా ముచ్చటిస్తూ ప్రార్థనా సభకు చేరుకున్నారు. అక్కడకు చేరాక ప్రజలకు అభివాదం చేసారు.

ఎడమవైపు నుండి నాథూరామ్ గాడ్సే, గాంధీగారి వైపుకి వంగడం చూసి, ఆయన పాదాలకు నమస్కరించబోతున్నాడని మను భావించింది.

అసలే ఆలస్యమైపోయిందనుకుంటే ఇలా మధ్యలో వచ్చి ఇంకా జాగు చేస్తున్నాడని ఆభా కాస్త చిరకు పడ్డారు. గాడ్సే విసురుగా మనుని తోసుకుంటూ ముందుకి వచ్చాడు.

మను చేతిలో ఉన్న మాల, పుస్తకం రెండూ కిందపడిపోయాయి. అవి తీసుకోవడానికి ఆమె క్రిందకు వంగారు.

అదే సమయంలో గాడ్సే తుపాకీ తీసి ఒకదాని వెనుక ఒకటి.. మూడు గుళ్ళు.. గాంధీ చాతీమీద, పొట్టలోకి దిగేట్టు పేల్చాడు. ఆయన నోటి నుండి "రామ్....రా...మ్" అనే శబ్దాలు వెలువడ్డాయి.

మరుక్షణం ఆయన శరీరం నేలకొరిగిపోయింది. ఆభా వెంటనే ఒరిగిపోతున్న ఆయన తలను తన చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నం చేసారు.

అక్కడ, గాంధీగారితో ఉన్న ఇద్దరు అమ్మాయిలను చూసి తను కాస్త కంగారుపడ్డానని గాడ్సే, తన సోదరుడైనా గోపాల్ గాడ్సేతో తరువాత అన్నాడు.

Image copyright NAna Godse
చిత్రం శీర్షిక ఆప్టే (ఎడమ)తో నాథూరామ్ గాడ్సే (కుడి)

పోలీసులకోసం అరిచిన గాడ్సే

నాథూరామ్ గాడ్సే మాటల్లో.. "ఫైర్ చేసిన తరువాత నేను తుపాకీ గట్టిగా పట్టుకుని, చేతిని పైకెత్తి పోలీస్...పోలీస్ అని అరిచాను. ఇది ఒక ప్రణాళిక ప్రకారం, కావాలనే చేసిన పని అని ఒక్కరైనా గుర్తించాలన్నది నా ఉద్దేశం. ఇది ఆవేశంలో చేసిన పని కాదు అని అందరు గుర్తించాలన్నది నా తాపత్రయం. నేను అక్కడనుండి పారిపోయే ప్రయత్నం చేసినట్టుగానీ లేదా తుపాకీ కిందపడేసినట్టుగానీ ఎవరూ అనుకోకూడదు. కానీ, ఇది జరిగిన వెంటనే అక్కడంతా నిశ్శబ్దం ఆవరించింది. ఒక నిముషంపాటు ఎవరూ నా దగ్గరకు కూడా రాలేదు."

అక్కడే ఉన్న తోటమాలి వెంటనే గాడ్సేని పట్టుకుని తలపై బలంగా నెత్తురు వచ్చేట్టు మోదారు. కానీ, గోపాల్ గాడ్సే అతని పుస్తకమైన "గాంధీ హత్య మరియు నేను" లో దీనిని ఖండించారు. గాడ్సే పట్టిబడిన కొన్ని క్షణాల తరువాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతని తలపై గట్టిగా బాదడంతో రక్తం వచ్చింది అని రాసారు.

Image copyright NANA GODSE
చిత్రం శీర్షిక నాథూరామ్ గాడ్సే

నివాళి

గాంధీ నేలకొరిగిన కొంతసేపటికే అప్పటి వైస్రాయ్ మౌంట్‌బాటన్ అక్కడికి చేరుకున్నారు. గాంధీ విరిగిపోయిన కళ్ళద్దాలు తీసేసి ఉన్నాయి. కొవ్వుత్తుల వెలుతురులో, కళ్ళజోడు లేని ఆయన పార్థివ దేహాన్ని చూసి మౌంట్‌బాటన్ గుర్తుపట్టలేకపోయారు. ఎవరో ఆయన చేతికి కొన్ని గులబీ రేకులను అందించారు. వాటిని ఆయన గాంధీ పార్థివశరీరంపై ఉంచి చివరి అంజలి ఘటించారు. ఇది, తన దేశపు ఆధిపత్యాన్ని ఓడించి, స్వాతంత్ర్యాన్ని సంపాదించిన మహనీయుడికి ఆ దేశపు చిట్టచివరి వైస్రాయ్ అందించిన నివాళి.

Image copyright Getty Images

‘మానవత్వం హత్యకు గురైంది’

మను, గాంధీగారి తలని తన ఒడిలోకి తీసుకుని నుదుటి మీద ఆప్యాయంగా నిమురుతూ కూర్చుండిపోయింది. మానవ హక్కుల కోసం ఎన్నో ఆలోచనలు చేసిన తల అది.

గాంధీ హత్య అనంతరం "మంచిగా ఉండడం ఎంత ప్రమాదమో ఈ ఉదంతం సూచిస్తుంది" అని బెర్నార్డ్ షా అన్నారు.

దక్షిణాఫ్రికాకు చెందిన మార్షల్ జైన్ స్మట్స్ "మన మధ్యన రాజకుమారుడు ఇక లేడు" అని అన్నారు.

"గాంధీ హత్యతో.. సంపూర్ణ మానవత హత్యకు గురైంది" అని కింగ్ జార్జ్ VI తన సందేశం పంపించారు.

జిన్నా సందేశం

అందరికన్నా భావోద్వేగంతో కూడిన సందేశం పాకిస్తాన్ నుండి మియా ఇఫ్తిఖారుద్దీన్ పంపించారు..."గత కొద్ది నెలల్లో అమాయకులైన మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలపై చేయి ఎత్తిన మాలో ప్రతీ ఒక్కడూ గాంధీ మరణానికి కారకుడు".

జిన్నా తన సందేశంలో "అక్కడి హిందూ సముదాయంలో ఆయన ఒక మహోన్నత వ్యక్తి" అన్నారు.

గాంధీ ఆలోచనలు ఒక సముదాయానికి పరిమితమైనవి కావని, ఆయన వ్యక్తిత్వం ఒక సముదాయం కన్నా చాల పెద్దది అని జిన్నాకు అతని స్నేహితుడు నచ్చజెప్పబోగా "దటీజ్ వాట్ హి వజ్..ఎ గ్రేట్ హిందు" అని జిన్నా తన సందేశాన్ని సమర్ధించుకున్నారు.

గాంధీగారి దహనసంస్కారాలు జరుగుతున్నప్పుడు చూడలేక మను, పటేల్ భుజంపై తల పెట్టి రోదించారు. కాసేపయ్యక తల యెత్తి చూసేసరికి, హటాత్తుగా పటేల్ చాలా ముసలివారైపోయినట్టు కనిపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు