తిట్టారంటే జైలుకే: తెలంగాణ ప్రభుత్వ చర్యతో మేలెంత? ఎవరేమంటున్నారు?

  • 31 జనవరి 2018
కేసీఆర్ Image copyright fb/KalvakuntlaChandrashekarRao

పరుష పదజాలంతో దూషించడాన్ని కోర్టు అనుమతి లేకుండానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టే నేరంగా పరిగణిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అందుకోసం ఐపీసీలో 506, 507 సెక్షన్ల కింద పేర్కొన్న నేరాలను కోర్టు అనుమతి లేకుండానే(కాగ్నిజబుల్) విచారించదగిన నేరాలుగా ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సంతకం చేశారు.

అయితే, దీనిపై అధికారిక నిర్ణయం ఇటీవలే వెలువడ్డా.. ఈ తరహా నిబంధనలు తెస్తామంటూ చాలా కాలం నుంచే కేసీఆర్ చెబుతున్నారు. ప్రభుత్వంపై అసత్య, అనవసర ఆరోపణలు చేసేవారిపై కేసులు పెడతామంటూ పలుమార్లు హెచ్చరించారు.

Image copyright TELANGANA CMO/FACEBOOK

సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో తెరాస గెలుపొందిన అనంతరం ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ కూడా సీఎం కేసీఆర్ ఆ విషయాన్ని చెప్పారు.

"సోషల్ మీడియాలో ఓ చిల్లర గ్యాంగును పెట్టారు. మేము గొర్రెల పంపిణీ పథకం చేపడితే.. 'దొరా మాకు గొర్రె, బర్రేనా?' అని పోస్టులు పెడుతున్నారు. ఇది సంస్కారమా? ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఇష్టమొచ్చినట్టుగా రాస్తున్నారు. ఆ వివరాలన్నీ సేకరిస్తున్నాం. అందరినీ బుక్ చేస్తాం. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. విచ్చలవిడి తనానికి కూడా ఓ లెక్క ఉంటది. విమర్శకూ ఓ హద్దుంటది. సద్విమర్శలను తప్పకుండా స్వీకరిస్తాం. కానీ అక్కసుతో కూడుకున్న పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణల గురించి గతేడాది కేసీఆర్ మాట్లాడుతూ.. ’’మేం అవినీతి మీద యుద్ధం చేస్తున్నాం. మీలాగా స్వార్థానికి పోవడంలేదు. మీ ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలితే ఇప్పటిదాకా సహించాం. కానీ, ప్రభుత్వ శాఖలపై అనవసరమైన ఆరోపణలు చేస్తే ఇకనుంచి వెంటనే కేసులు నమోదు చేసి, ఆరోపణలు చేసిన వారిపై వాటిని రుజువుచేసే బాధ్యత పెట్టాలని మంత్రులందరికీ మనవి చేస్తున్నా" అని అన్నారు.

Image copyright FB/ramchanderrao.naraparaju

అయితే.. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం విపక్షాల నోరు మూయించే ప్రయత్నంగా ఉందని, దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ రామ్‌చందర్ రావు బీబీసీతో అన్నారు.

"తెలంగాణ ప్రభుత్వం 506, 507 సెక్షన్లను సవరించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రాజకీయంగా విపక్ష నాయకులు ఏవైనా అంశాల మీద మాట్లాడితే, అది దూషించినట్టు.. బెదిరించినట్టు చెప్పి వారిపై తప్పుడు కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రి తమపై ఆరోపణలు చేస్తే.. మాట్లాడితే కేసులు పెడతామని అంటున్నారు. విపక్షాల నోరు మూయటానికి చేస్తున్న ప్రయత్నంగా అనిపిస్తోంది" అని రామ్‌చందర్ రావు వ్యాఖ్యానించారు.

"ఇది సరైన పద్ధతి కాదు. భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉంది. సాధారణంగా ప్రభుత్వం ఈ పని పూర్తి చేయకపోతే ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారంటూ విపక్ష నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంటారు. అలాంటి వ్యాఖ్యలనూ వక్రీకరించి ప్రభుత్వం బెదిరింపుల కింద తీసుకుని కేసు పెట్టి, జైలులో వేసే పరిస్థితి వస్తుంది.

అప్పట్లో అన్నీ ఆలోచించే ఆ చట్టాన్ని రూపొందించారు. దానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలోని 19వ అధికరణం కల్పిస్తున్న భావ వ్యక్తీకరణ హక్కుకు విరుద్ధంగా ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోంది. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని భావిస్తున్నాం" అని ఆయన అన్నారు.

Image copyright FB/gandravenkataramanareddyofficial

కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి స్పందిస్తూ..

"ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకం. గతంలో కేసీఆర్ మమ్మల్ని ఎన్నో మాటలన్నారు. దద్దమ్మలు, సన్నాసులు అని తిట్టారు. అందుకు కేసు పెడితే 20 ఏళ్లు జైలులో ఉండాల్సి వస్తుంది. ఇది నియంతృత్వ చర్య. ఇలాంటి ఆలోచనను విరమించుకోవాలి. లేదంటే అన్ని రకాలుగా పోరాడుతాం. ఇంధిరా గాంధీ ఒక్కసారి ఎమర్జెన్సీ విధిస్తే దాని ప్రభావం కాంగ్రెస్‌పై ఇప్పటికీ ఉంది. అలాగే కేసీఆర్ ప్రభుత్వం కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది" అని వ్యాఖ్యానించారు.

Image copyright FB/karne.prabakar

తెరాస నాయకులు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రజల మధ్య విధ్వేషాలు పెరగడకుండా చూసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.

"దీన్ని భావ వ్యక్తీకరణకు భంగం కలిగించే ప్రయత్నంగా ఏమాత్రం పరిగణించొద్దు. ప్రజల మధ్య దూరం పెరగడకుండా, స్నేహభావాన్ని పెంచాలన్న మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి చిన్న విషయానికీ దూషణలు చేస్తే విద్వేషాలు పుట్టి, ప్రజల మధ్య దూరం పెరిగిపోతుంది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరికీ మంచిది కాదు. ప్రతిపక్షాలు తమకు తామే ఆపాదించుకుంటున్నాయి. మేం తిడతాం, ప్రభుత్వం మాపై కేసులు పెడుతుంది అన్న ఆలోచనతో వాళ్లు అలా మాట్లాడుతుంటారు" అని తెరాస నేత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో రాలేదు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)