అభిప్రాయం: మహిళలతో బాలీవుడ్ బంధం ఎలాంటిది?

  • శుభ్రా గుప్తా
  • దిల్లీ
కరీనా కపూర్, మేరీ

ఫొటో సోర్స్, Hype PR

నో సెక్స్ ప్లీజ్. మేం బాలీవుడ్ వాళ్లం.

కానీ మా దగ్గరకి రండి.. మా పాటల్లో, డాన్సుల్లో అణిగిపోయిన పొత్తి కడుపులు, ఉబికివచ్చే అందాల్ని మీకు ఇబ్బంది కలగని రీతిలో అందిస్తాం. ఇక నిరుత్సాహపూరిత కథానాయికలను అప్రాధాన్యపాత్రల్లో ప్రవేశపెడతాం.

బాలీవుడ్‌లో మహిళల చిత్రీకరణ గురించి ఎప్పుడు ఎలాంటి సంభాషణ జరిగినా కళ్ల ముందు కదలాడే దృశ్యాలివి.

నిజానికి ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు: కథానాయికను ఒక అలంకార వస్తువుగా చేయటం భారతదేశంలోని అన్ని పెద్ద సినీ పరిశ్రమల్లోనూ ప్రధానాంశమైపోయింది. సినిమాలో హీరో ఉన్నట్లయితే అతడు ముందు వరుసలో ఉంటాడు. హీరోయిన్ ముఖ్య విధి అతడిని పూజించటం, ఆరాధించటం.. హీరోలు బయటకు వచ్చినపుడు అడ్డు తప్పుకోవటం.

ఇది ఎల్లవేళలా ఇలాగే ఉండేది కాదు.

హాలీవుడ్‌లో నిరుటి ధీర వనితల తరహాలోనే ఒకప్పుడు బాలీవుడ్‌లోనూ ధైర్యంగా నిలబడిన హీరోయిన్లు ఉన్నారు. అవి సినిమా తొలి రోజులు. కులం, వర్గం వంటి నిషిద్ధ అంశాలను విశ్లేషించటానికి సినీ నిర్మాతలు సినిమాలను పనిముట్టుగా వాడుకుంటున్న కాలమది.

కానీ సామాజిక అవగాహన గల 1950ల తర్వాత పరిస్థితులు మారాయి. 1960ల్లో, ఆ తర్వాతా సినిమా ప్రధాన కొలమానం వినోదం... పురుష పాత్రలే కీలకంగా మారి, స్త్రీ పాత్రలు ద్వితీయ శ్రేణి పౌరులకు దిగజారాయి.

ఫొటో సోర్స్, Universal PR

ఫొటో క్యాప్షన్,

రాస్కల్ సినిమాలో కథా నాయిక కంగనా రనౌత్

తల్లులు తమ కొడుకులకు గాజర్ హల్వా తినిపిస్తారు. చెల్లెళ్లు తమ అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టి తాము ‘రక్షణ’ పొందినట్లు భావిస్తారు. భార్యలు లేదా కాబోయే భార్యలు తమ భర్తలు నూరేళ్లు బతకాలని ఉపవాసం చేస్తారు.

’నూతన బాలీవుడ్’ ముఖ్య రూపకర్తల్లో ఒకరైన కరణ్ జోహార్ తన తొలి సినిమా ‘కుచ్ కుచ్ హోతా హై’ని 1990ల మధ్యలో విడుదల చేశారు. అందులో కథానాయకుడు షారుఖ్ ఖాన్ చివరికి తన నిజ ప్రేమను తెలుసుకుంటాడు.

కథానాయిక కాజల్ పాత్రను పొట్టి జుట్టుతో బాస్కెట్‌బాల్ ఆడే టామ్‌బాయ్ (మగాళ్లలా ఉండటం ఇష్టపడే ఆడపిల్ల) లాగా చిత్రించారు. ఆమె మరులుగొలిపే షిఫాన్ చీరలో కనిపించినప్పుడు మాత్రమే.. అతడిని కోర్టులో గెలవనిచ్చినపుడు మాత్రమే.. అతడి దృష్టిలో పడే అర్హత పొందుతుంది.

ఆ సినిమా భారీగా హిట్ అయింది. ఆధునిక బాలీవుడ్ రొమాన్స్‌కి అదొక నమూనాగా మారింది.

ఫొటో సోర్స్, JIGNESH PANCHAL

ఫొటో క్యాప్షన్,

డార్క్ కామెడీ సినిమా ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’ సెన్సార్ బోర్డుతో సుదీర్ఘ పోరాటం తర్వాత విడుదలయింది

ఆ సినిమా.. చీరలు కట్టి, బిడియపడుతుండే వారే తమ పురుషులను దక్కించుకుంటారన్న భావనను మిగిల్చింది. టామ్‌బాయ్ పాత్రను అలా తెరమరుగు చేయటం సరి కాదని జోహార్ ఇప్పుడు అంగీకరిస్తారు.

స్త్రీ ద్వేషంతో కూడిన అమర్యాదకర సంభాషణలు మనం అసలు గుర్తించలేనంత మామూలుగా మారిపోయాయి: కథానాయికలను తరచుగా ‘పనిలోకి దింపాల్సిన’ అవసరమున్న ‘మెరిసే బాడీలు’న్న కార్లతో పోలుస్తుంటారు.

మహిళా నటులకు కేవలం తెల్లబట్టలు ధరింపజేసి, వారిని జలపాతాల కింద నిల్చోబెట్టటం ఇప్పుడు వాడుకలో లేకపోవచ్చు. అయినా ఇప్పటికీ వారిది అదే పరిస్థితి. వారికి చాలా వరకూ వేషం వేస్తున్నారు కానీ దుస్తులు తొడగట్లేదు. శరీర భాగాల మీదుగా కదలాడే కెమెరాలు, అసభ్య ద్వంద్వార్థాల గీతాలు ఇప్పటికీ ప్రధాన స్రవంతి బాలీవుడ్‌లో అంతర్భాగంగానే ఉన్నాయి.

ఫొటో సోర్స్, JIGNESH PANCHAL

ఫొటో క్యాప్షన్,

రత్నా పాఠక్ షా తన యాభైల వయసులో తనకన్నా తక్కువ వయసున్న పురుషుడిని కొంటెగా ఊహించుకునే వితంతువు పాత్ర పోషించారు

భారత సమాజం లోలోతుల్లో పితృస్వామికమైనదని, అందులో లింగ వివక్ష, స్త్రీ ద్వేషం బలంగా ఉన్నాయనే వాస్తవాన్ని సినీ నిర్మాతలు ప్రతిఫలిస్తున్నారని వాదించవచ్చు. వాదిస్తున్నారు కూడా.

మిరామాక్స్ బాస్ హార్వే వైన్‌స్టీన్ ముసుగు తొలగిన ప్రభావం హాలీవుడ్‌లో సినిమాల పాత్రలకు తారాగణం ఎంపిక మీద ఉండే తరహాలోనే.. ఆ విధానాల గురించిన అవగాహన బాలీవుడ్‌లోనూ మొగ్గ దశలో ఉన్నా స్పష్టంగా కనిపిస్తోంది.

బాలీవుడ్‌ను నడిపించే పురుషులు.. సినిమాలో పాత్ర కావాలంటే తమ లైంగిక వాంఛలు తీర్చాలనటం, ఇతర వంచనల ప్రమాదాల గురించి కొద్ది మంది ధీర నటీమణులు బయటపెట్టటం మొదలు పెట్టారు.

హద్దులను విస్తరించటానికి, కథా వస్తువును, పాత్రను, నడకను మార్చివేయటానికి సాహసించగల సినీ దర్శకులు ఎల్లప్పుడూ ఓ పక్కగా ఉండేవారు.

వర్తమాన, ఉదారవాద భారతదేశం గురించి మాట్లాడే వారు, వారి సినిమాలు నెమ్మదిగానే అయినా తప్పకుండా కేంద్ర స్థానంలోకి వస్తున్నాయి.

సంతోషకరమైన విషయం ఏమిటంటే బాలీవుడ్‌లో బలమైన స్త్రీ పాత్రలకు 2017 అద్భుతమైన సంవత్సరం.

ఫొటో సోర్స్, StudiozIDrream

ఫొటో క్యాప్షన్,

సిగ్గరి అయిన ఒక విద్యార్థి గురించిన ‘ఎ డెత్ ఇన్ ద గంజ్’ పరిణతి పొందిన సినిమా

లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా, అనార్కలి ఆఫ్ అరా, ఎ డెత్ ఇన్ ద గంజ్, తుమ్హారీ సులూ వంటి సినిమాలు మంచి నటనలతో నిండివున్నాయి. అందులోని స్త్రీ పాత్రలు మూస పాత్రలు పోషించలేదు.

వారు తమ భావోద్వేగ, లైంగిక అవసరాలను వ్యక్తీకరించారు. వారు విలపించటం, కను రెప్పలు తటపటాయించటానికి బదులుగా తమ పరిస్థితులను మార్చే పనులు చేశారు.

అవును, ఈ మహిళలు భారీ బడ్జెట్ గల బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఇంకా నటించలేదు.

2017లో అతి పెద్ద బాలీవుడ్ హిట్ సినిమా, బహుశా బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద సినిమాగా మారే అవకాశం గల ‘టైగర్ జిందా హై’లో పురుష సూపర్‌స్టార్ సరసనే సీరియస్‌గా ఫైట్లు చేసే స్త్రీ పాత్ర కూడా ఉండటంలో మనం కాస్త ఊరట పొందవచ్చు.

ఇంకా మంచి విషయం ఏమిటంటే.. కథానాయిక కత్రినా కైఫ్ తెర మీద ప్రధానంగా కనిపిస్తున్నపుడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆమె నుంచి దృష్టిని తనవైపు మళ్లించుకోకపోవటం.

శుభ్రా గుప్తా ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికలో సినీ విమర్శకురాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)