#గమ్యం: లా చదివితే లాయరే కానక్కర్లేదు

  • అనిల్ కుమార్
  • బీబీసీ ప్రతినిధి
వీడియో క్యాప్షన్,

లా అంటే... లాయర్‌గా ప్రాక్టీస్ చేయడం ఒక్కటే కాదు

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం. గణితం, సైన్స్ చదవనివారు, వాటిపై ఆసక్తి లేనివారు ఏం కోర్సులు చేస్తే రాబోయే కాలంలో మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయనే అంశాలపై చర్చిస్తున్నాం.

గత రెండువారాల్లో ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ డిజైనింగ్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ రంగాల్లో ఏయే కోర్సులు, విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయో, ఏ పరీక్షలు రాస్తే వాటిలో ప్రవేశం లభిస్తుందనే అంశాలపై చర్చించాం.

ఈ వారం న్యాయశాస్త్రం (లా), న్యాయవిద్య గురించి వివరిస్తున్నారు... Careers360.com ఛైర్మన్ మహేశ్వర్ పేరి. మీకు ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ చేయండి.

ఫొటో సోర్స్, Getty Images

న్యాయశాస్త్రం - విస్తృతి

అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింట్లో ఎన్నో కొత్త కంపెనీలు, సంస్థలు పుట్టుకొస్తుంటాయి. వాటి రోజువారీ నిర్వహణలో భాగంగా చట్టపరంగా ఎన్నో అంశాలపై ఆధారపడటం, జాగ్రత్తలు తీసుకోవడం, సమస్యలను ఎదుర్కోవడం వంటి అనేక కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇవన్నీ సాధారణ చదువులు చదివిన వ్యక్తి చేయలేరు. వీటికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, సంస్థకు సరైన సలహా ఇచ్చి మార్గదర్శనం చేయాలన్నా న్యాయశాస్త్రంపై అవగాహన ఉన్న వ్యక్తికి మాత్రమే సాధ్యం. అందువల్ల రాబోయే రంగంలో న్యాయశాస్త్ర నిపుణులకు అవకాశాలు పెరగబోతున్నాయి.

ఉద్యోగులు, మేనేజ్‌మెంట్ మధ్య ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం; కంపెనీలకు, బయటి వ్యక్తులు లేదా ఇతర కంపెనీలతో తలెత్తే ఇబ్బందులను పరిష్కరించడం వంటివి చేయాలంటే చట్టాలపై పట్టు ఉన్న వ్యక్తుల అవసరం ఎంతో ఉంది.

ఈ రోజుల్లో లా అంటే... ఏదో కోర్టులో సివిల్ లేదా క్రిమినల్ లాయర్‌గా ప్రాక్టీస్ చేయడం ఒక్కటే కాదు. కంపెనీలు, కార్పొరేట్ ప్రపంచం విస్తృతి కారణంగా ప్రస్తుతం లా ఆ పరిధి దాటేసింది. అందుకే ప్రత్యేక అర్హతలు కలిగిన వ్యక్తులు ప్రతి కంపెనీకి అవసరం.

లా ఎక్స్‌పర్ట్‌గా మారాలి అనుకునే విద్యార్థులు ప్రధానంగా మూడు పరీక్షలను దృష్టిలో ఉంచుకోవాలి. ఇవి జాతీయ స్థాయిలో లా స్కూళ్లలో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్షలు.

ఫొటో సోర్స్, CLAT

1. క్లాట్ (సీఎల్ఏటీ)

ఇంజనీరింగ్‌కు ఐఐటీ, మేనేజ్‌మెంట్‌కు ఐఐఎం ఎంత ప్రముఖ సంస్థలో న్యాయ విద్యకు నేషనల్ లా యూనివర్శిటీ (ఎన్ఎల్‌యూ)లు అంత గొప్ప విద్యాసంస్థలు. ఏ ఎన్ఎల్‌యూలో ప్రవేశం దొరికినా భవిష్యత్ అద్భుతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్‌లో కూడా నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా అని ఓ ఎన్ఎల్‌యూ ఉంది. దేశంలోని అన్ని ఎన్ఎల్‌యూల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష... కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్). ఇంటర్మీడియట్‌లో కనీసం 45శాతం మార్కులు వచ్చిన ఎవరైనా ఈ పరీక్ష రాయవచ్చు. పరీక్ష ఆన్‌లైన్‌లో మాత్రమే జరుగుతుంది.

ఎన్ఎల్‌యూల్లో సుమారు 2400 సీట్లు ఉంటాయి. వీటికోసం ప్రతి సంవత్సరం దాదాపు 40 వేల మంది పరీక్ష ద్వారా పోటీపడతారు.

జనవరి 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 31. ప్రవేశ పరీక్ష మే 13న జరుగుతుంది.

సుమారు 25కు పైగా ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఈ పరీక్ష స్కోరు ఆధారంగా తమ సంస్థల్లో ప్రవేశాలను కల్పిస్తాయి.

ఫొటో సోర్స్, NLUDelhi

2. అయ్‌లెట్ (ఏఐఎల్ఈటీ)

ఇది దిల్లీ నేషనల్ లా యూనివర్శిటీలో ప్రవేశం కోసమే ఉద్దేశించిన ప్రత్యేక ప్రవేశ పరీక్ష. కేవలం 83 సీట్లు మాత్రమే ఉన్న ఈ సంస్థలో ప్రవేశం కోసం సుమారు 17 వేల మంది పోటీపడతారు. ఎందుకంటే దిల్లీ ఎన్ఎల్‌యూలో డిగ్రీ చేయడానికి ప్రవేశం లభిస్తే... సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టు వంటి ప్రధాన కోర్టుల్లో పనిచేసే న్యాయ నిపుణుల ప్రసంగాలు వినే అవకాశం లభిస్తుంది. ఇతర ఎన్ఎల్‌యూలకు లేని గొప్ప అవకాశం ఇది. అందుకే తక్కువ సీట్లున్నప్పటికీ ఈ పరీక్షకు అంత పోటీ.

దరఖాస్తుల స్వీకరణ జనవరి 4నుంచి మొదలైంది. చివరితేదీ ఏప్రిల్ 7... మే 6న పరీక్ష జరుగుతుంది. ఇది ఆఫ్‌లైన్‌ పరీక్ష. ఈ పరీక్ష ద్వారా ప్రవేశం పొందడానికి ఇంటర్మీడియట్‌లో 50శాతం మార్కులు తప్పనిసరి.

ఫొటో సోర్స్, Getty Images

3. ఎల్‌శాట్

దేశవ్యాప్తంగా ఉన్న 85 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్ష లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ (ఎల్‌శాట్). ఇది కూడా ఆఫ్‌లైన్ పరీక్ష. మే 20న ఈ పరీక్ష జరగనుంది.

ఏపీ లాసెట్ & టీఎస్ లాసెట్

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లోని కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అవే ఏపీ లాసెట్, టీఎస్ లాసెట్.

ఏపీ లా సెట్‌ను ఈసారి శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ నిర్వహిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని దాదాపు 3000 లా సీట్ల కోసం నిర్వహించే ఈ పరీక్ష ద్వారా 33 విద్యాసంస్థల్లో ప్రవేశాలు జరుగుతాయి.

టీఎస్ లాసెట్ ద్వారా 22 కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతాయి. దాదాపు 4,500 సీట్లు ఈ పరీక్ష ద్వారా భర్తీ అవుతాయి.

అంటే న్యాయశాస్త్రాన్ని కెరీర్‌గా మలచుకోవాలనుకునే అభ్యర్థులు మే నెలలో 4 ప్రధాన పరీక్షలు రాయాల్సి ఉంటుంది. దాదాపు అన్ని పరీక్షలకూ విధానం, సిలబస్ ఒకే మాదిరిగా ఉంటాయి. అందువల్ల అన్నింటికీ కలిపి సిద్ధమైతే సరిపోతుంది.

ఆల్ ది బెస్ట్.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)