ప్రెస్ రివ్యూ : జమిలికి మేం సిద్ధమంటున్న కేసీఆర్

  • 31 జనవరి 2018
Image copyright Telangana cmo/facebook

జమిలికి సై..!

లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు కలిపి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదిస్తున్న ముందస్తు జమిలి ఎన్నికల వల్ల తమకు లాభమే జరుగుతుందని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం మేరకు..

ముందస్తుగా జరిగినా, గడువు ప్రకారం జరిగినా జమిలి ఎన్నికలే రావాలని టీఆర్ఎస్ కోరుకుంటోంది. ప్రధాని ప్రతిపాదించినట్లు ముందస్తు జమిలి ఎన్నికలు వస్తే వాటిని వ్యతిరేకించరాదని ఆ పార్టీ ఓ అవగాహనకు వచ్చింది.

రాష్ట్రపతి, ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో జమిలి ఎన్నికలపై ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది.

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు అనివార్యమైతే, దాంతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించడానికి టీఆర్‌ఎస్‌ వ్యతిరేకం కాదని తెలుస్తోంది. వ్యయ ప్రయాసలు తగ్గటం, ప్రజలకూ అనుకూలంగా ఉంటుందనే కోణంలో ముందస్తు జమిలికి 'గులాబీ' దళం పెద్దలు సిద్ధపడుతున్నారు.

జమిలి ఎన్నికలు జరిగితే సోనియా, రాహుల్‌ల శక్తి సామర్థ్యాలు తెలంగాణలో మాత్రమే కేంద్రీకరించడం కుదరదు కాబట్టి అది తమకు అనుకూలంగా మారుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినప్పటికీ, 119 స్థానాలకుగాను 102 స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని కేసీఆర్‌ చెప్పినట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

తాజాగా వేర్వేరు సంస్థలతో విడివిడిగా చేయించిన మూడు సర్వేల్లో ఈ విషయం తేలిందని కేసీఆర్ తెలిపారు.

''2014 సాధారణ ఎన్నికల సమయంలో సర్వేలు చేసిన వాళ్లకే ఇప్పుడు సర్వేల నిర్వహణ బాధ్యతలు అప్పగించాం. అప్పటి మాదిరిగానే ఇప్పటి సర్వేల ఫలితాలు కూడా నిజం కానున్నాయి'' అని సీఎం కేసీఆర్‌ పార్టీ ముఖ్యులతో చెప్పినట్లు ఈ కథనంలో ప్రచురించింది.

Image copyright Getty Images

ఇంజనీరింగ్ సిలబస్‌ మారుతోంది

సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న కరిక్యులమ్‌లో మార్పులు చేసి కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సాక్షి దిన పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కరిక్యులమ్‌ను రూపొందించింది. రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం సిలబస్‌ను రూపొందించే కార్యక్రమాన్ని ఉన్నత విద్యామండలి చేపట్టింది.

దీనికోసం తిరుపతి ఐఐటీ డీన్ ప్రొఫెసర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించింది. ఇందులో వివిధ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలల సీనియర్ ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తలు సభ్యులుగా ఉన్నారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

విద్యార్థులు తరగతి గదుల్లో పాఠాలు వినడానికే పరిమితం కావడం వల్ల నైపుణ్యాలు పెరగడం లేదని ఏఐసీటీఈ భావిస్తోంది. అందుకే కొత్త కరిక్యులమ్‌లో ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేయబోతోంది. విద్యార్థులు 3 నెలల పాటు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది.

ఈ మార్పుల నిర్ణయంతో విద్యార్థులపై చాలా వరకూ భారం తగ్గుతుంది. గతంలో డిగ్రీ అర్హత కోసం 220 క్రెడిట్లు సాధించాల్సి వచ్చేది. దీన్ని 160 క్రెడిట్లకు తగ్గించనున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కాంట్రాక్టర్ ఉండగా మళ్లీ టెండర్లు ఎందుకు?

"పోలవరం"లో ముందడుగు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక అడుగు పడిందంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

స్పిల్‌వే పనుల నిర్మాణంలో జాప్యం చేస్తున్న గుత్తేదారు సంస్థ టాన్స్‌ట్రాయ్‌ నుంచి 60సి నిబంధన కింద కొంత పనిని తప్పించి నవయుగ సంస్థకు అప్పగించడానికి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆమోదముద్ర వేశారు.

మంగళవారం సాయంత్రం ఇక్కడి శ్రమశక్తిభవన్‌లోని ఆయన కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకమీదట నవయుగ సంస్థ ఉపగుత్తేదారు సంస్థగా కాకుండా ప్రధాన గుత్తేదారు సంస్థల్లో ఇదీ ఒకటిగానే స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ నిర్మాణ పనులు చేపడుతుంది.

మొత్తం 30 లక్షల క్యూబిక్‌మీటర్ల కాంక్రీట్‌ పనుల్లో ఇప్పటివరకు 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే పూర్తయింది. మిగతా 25 లక్షల క్యూబిక్‌ మీటర్ల స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ తదితర పనులను నవయుగ పూర్తిచేయాలి.

2019 డిసెంబరు నాటికి దీన్ని పూర్తిచేయడం లక్ష్యంకాగా వచ్చే సంవత్సరం మార్చికల్లా పూర్తిచేసి ప్రపంచ రికార్డు సృష్టించాలనుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

పనుల పూర్తికి 80 లక్షల టన్నుల రాయిని పిండి చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం సుమారు 20వేల మంది మానవ వనరులను మోహరించాల్సి ఉంటుందని చెప్పారు. ఆసక్తి ఉన్న యువత ముందుకురావాలని పత్రికా ప్రకటన ఇస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే 3వేల దరఖాస్తులు వచ్చాయని, అనుకున్నంత సంఖ్యలో మానవ వనరులను మోహరించడంలో ఇబ్బందేమీ ఉండదని పేర్కొన్నట్లు ఈనాడు కథనం పేర్కొంది.

Image copyright Getty Images

‘పండక ముందే’ ధరలు పెరిగాయ్!

అన్నదాత నెత్తిన విత్తన పిడుగు పడనుందంటూ ఈనాడు తెలంగాణ ఎడిషన్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం మేరకు..

రైతులకు అవసరమయ్యే సోయాచిక్కుడు, జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాల విక్రయ ధరలను ప్రైవేటు కంపెనీలు భారీగా పెంచుతున్నాయి.

విత్తనాలను కొనేందుకు 'తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ' (టీఎస్‌ సీడ్స్‌) ఇటీవల టెండర్లు పిలిచింది. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర కంపెనీలు అధిక ధరలను కోట్‌ చేస్తూ టెండర్లు దాఖలు చేశాయి.

వీటి ధరలను తగ్గించాలని కంపెనీలతో సంస్థ సంప్రదింపులు జరుపుతోంది.

వచ్చే వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో రైతులకు రాయితీపై వ్యవసాయశాఖ విక్రయించే విత్తనాలను ప్రైవేటు కంపెనీల నుంచి కొనాలని టీఎస్‌సీడ్స్‌ టెండర్లు పిలిచింది.

అత్యంత కనిష్ఠ (ఎల్‌1) ధరను కోట్‌ చేసిన కంపెనీని ఎంపిక చేసి విత్తనాల సరఫరా బాధ్యతను అప్పగించాలనేది నిబంధన. వీటి ఆధారంగా కంపెనీలతో చర్చిస్తున్నారు.

టెండర్లలో ఎల్‌1 ధరను కోట్‌ చేశాక మళ్లీ ధరలు పెరుగుతున్నాయని ఇప్పుడే చెప్పలేమని కంపెనీలు పేర్కొంటున్నాయి. జీలుగ విత్తనాలను క్వింటాలుకు రూ.6900 చెల్లించాలని ఎల్‌1 ధరను కోట్‌ చేశాయి.

గతేడాది వీటిని రూ.3900కే ఇవే కంపెనీలు టీఎస్‌సీడ్స్‌కు అమ్మడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)