#BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసినారు..’ - విముక్తి పొందిన మహిళల కన్నీటి గాథలు

  • 5 ఫిబ్రవరి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి నన్ను అమ్మేశారు. అప్పుడు నా కూతురి వయసు 6 నెలలు

''మమ్మల్ని 80 వేలకు అమ్మేసినారు..''

''నన్ను లక్షా యాభై వేలకు అమ్మేసినారు..''

''నన్ను 5 లక్షలకు అమ్మేసినారు..''

ఇక్కడ మాట్లాడుతోంది, తమను ఎంతకు అమ్మారో చెబుతోంది - వ్యభిచార కూపం నుంచి బయటపడ్డ మహిళలు. వస్తువులను, జీవాలను అమ్మినట్లు మహిళలను అమ్మేస్తున్నారు.

కొందర్ని కళ్లు కప్పి అమ్మేస్తే, మరికొందర్ని మాయ చేసి అమ్మేస్తున్నారు.

ఇది అనంతపురం జిల్లా కరువు కోణం..

రాయలసీమలోని అనంతపురం, కడప జిల్లాల నుంచి కొన్ని దశాబ్దాలుగా మహిళల అక్రమ రవాణా సాగుతోంది.

ఇక్కడి పేద మహిళలను దిల్లీ, ముంబయి, పూణె నగరాల్లోని వ్యభిచార గృహాలకు అక్రమంగా తరలిస్తున్నారు. కొందరు మహిళలు కరువు కారణంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో వ్యభిచార కూపంలోకి వెళుతుంటే.. మరికొందరు బ్రోకర్ల చేతిలో మోసపోయి ఆ ఊబిలో చిక్కుకుంటున్నారు.

అక్రమ రవాణాకు పాల్పడుతున్న బ్రోకర్లు.. తమ సామ్రాజ్యాన్ని భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విస్తరించుకుంటున్నారని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తుంటే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పోలీసులు చెబుతున్నారు.

బ్రోకర్ల చేతిలో మోసపోయి, వ్యభిచార కూపాల్లో మగ్గి, అక్కడి నుంచి బయటపడ్డ ముగ్గురు మహిళలతో బీబీసీ మాట్లాడింది. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురి వ్యధాభరిత గాథలు వారి మాటల్లోనే..

Image copyright Getty Images

‘‘నా పేరు రమాదేవి. సమర్త(పుష్పవతి) అయిన సంవత్సరానికే నాకు పెళ్లి చేశారు. అప్పుడు నా వయసు 12.

అత్తగారింట్లో ఆడపడుచుల వేధింపులు చిన్న వయసులోనే ప్రారంభమయ్యాయి. వాళ్లకి తోడుగా నా మొగుడు కూడా వేధించడం మొదలు పెట్టినాడు. గర్భవతి అయ్యాక పుట్టింట్లో పురుడుపోసుకున్నా. ఆడపిల్ల పుట్టింది. కొన్నాళ్లకు అత్తగారింటికి పోయినా. అప్పటిక్కూడా వేధింపులు ఆపలేదు.. ఆ బాధలు భరించలేక నా బిడ్డను తీసుకుని పుట్టింటికొచ్చేసినా.

ఇంటికి తాళం వేసి ఉంది. నా తల్లిదండ్రులు పొట్టకూటికోసం వలస పోయినారని పక్కింటోళ్లు అన్నారు. అది కరువు కాలం. వర్షాల్లేవు, పనుల్లేవు. అందుకే వలస పోయినారు. వాళ్లెక్కడుండేదీ నాకు తెలియదు. చిన్నపిల్లతో దిక్కు తోచని స్థితిలో పడ్డాను.

ఏం చేయాలో తెలీలేదు. మా పెదనాన్న నన్ను మా తల్లిదండ్రుల దగ్గరికి తీసుకుపోయినాడు. ఇక వాళ్ల వద్దనే ఉందామని నిర్ణయించుకున్నా’’.

చిత్రం శీర్షిక సినిమా ఇంటర్వెల్‌లో మా ఇద్దరికీ కూల్ డ్రింక్ ఇచ్చినారు. అది తాగిన తర్వాత మైకం కమ్మేసింది. మూడు రోజుల తర్వాత మెలకువ వచ్చింది

కూల్ డ్రింక్‌లో మత్తు మందు

‘‘అక్కడే.. పుష్ప అనే అమ్మాయితో స్నేహం కుదిరింది. ఆమె వికలాంగురాలు. ఆమెకు తల్లిదండ్రులెవ్వరూ లేరు. ఓ హోటల్లో పని చేసేది.

నాగమ్మ అనే మహిళ మా ఇద్దర్నీ పరిచయం చేసుకుంది. మంచిగా మాట్లాడేది. ఓ రోజు.. నన్ను, పుష్పను సినిమాకు పోదామని అడిగింది. సరేనని నా బిడ్డను అమ్మ దగ్గర వదిలి ముగ్గురం సినిమాకు పోయినాం.

సినిమా ఇంటర్వెల్‌లో మా ఇద్దరికీ కూల్ డ్రింక్ ఇచ్చినారు. అది తాగిన తర్వాత మైకం కమ్మింది. అట్లనే పడుకున్నాం.

కళ్లు తెరిచి చూస్తే.. మేం ఓ కొత్త చోట ఉన్నట్లు అర్థమైంది. అక్కడ అందరూ హిందీ మాట్లాడుతున్నారు. వాళ్లెవ్వరికీ తెలుగు రాదు. మాకు హిందీ రాదు. అప్పటికి మూడు రోజులైందంట మేం మత్తులో ఉండి.’’

విషయం నెమ్మదిగా అర్థమైంది. నన్ను, పుష్పను నాగమ్మ.. 80 వేలకు అమ్మేసింది. కాళ్లు పట్టుకుని బతిమలాడినా మమ్మల్ని వదల్లేదు.

అప్పుటికి నా కూతురు ఆరు నెలల పసికందు..!’’

చిత్రం శీర్షిక తప్పించుకుందామనుకున్నా.. కానీ మొదటిసారే దొరికిపోయా. అంతే.. నన్ను కట్టేసి, పచ్చికారం నూరి కళ్లల్లో పెట్టినారు

‘‘నా తాళిబొట్టు, కాలి మెట్టెలు లాక్కున్నారు.. ఒంటిపై ఉన్న కాస్త బంగారాన్నీ ఒలిచేసుకున్నారు. మమ్మల్ని రెడీ కావాలన్నారు. పుష్పపై వికలాంగురాలన్న కనికరం కూడా చూపలేదు.

అక్కడ చాలా మంది ఆడపిల్లలున్నారు. వారిని చూపించి అలా తయారవ్వాలని, అక్కడికొచ్చే మగవాళ్లతో పడుకోవాలని చెప్పినారు.

ఆర్నెళ్లు గడిచినాయి. ఇద్దరం కృంగిపోయినాం. నా కూతురు గుర్తొచ్చి రోజూ ఏడ్చేదాన్ని. ఆ నరకం నుంచి బయటపడ్డానికి ఓసారి ప్రయత్నించినా. కానీ మొదటిసారే దొరికిపోయినా. నా చేతులు కట్టేసి, పచ్చికారం నూరి కళ్లల్లో పెట్టినారు. కొన్ని రోజులు ఏమీ తినలేకపోయా. ఆ నరకంలో సంవత్సరం ఉన్నాం. సరిగ్గా అన్నం పెట్టే వాళ్లు కాదు.. కంటికి నిద్ర లేదు, కడుపుకు తిండి లేదు.

వాళ్లతో రోజూ కొట్లాడేదాన్ని. నన్ను చూసి మిగతావాళ్లు కూడా గొడవ చేస్తారేమో అని భయపడి, సంవత్సరం తర్వాత నన్ను వెళ్లిపొమ్మన్నారు. కానీ పుష్పను వదలం అన్నారు. పుష్పను కూడా వదలాలని వాళ్లతో మళ్లీ కొట్లాట. చివరికి పుష్పను వదిలేసినారు.

రూ.2 వేలు మా చేతిలో పెట్టి రైలెక్కించారు. సంవత్సర కాలానికి గానూ.. ఆ రెండు వేలే మా కూలి..!’’

Image copyright Getty Images

నేను చచ్చిపోయినానంట..!

‘‘ఆత్రంగా ఇంటికి వచ్చినా. నేను చచ్చిపోయానని అనుకున్నారంట మా వాళ్లు. అప్పటికి మా తల్లిదండ్రులు బాగా చితికిపోయినారు. తినడానికి జరిగేదే కష్టం. అలాంటిది.. నా బిడ్డకు పాలు కొనడానికి నానా తిప్పలు పడినారు..’’ రమాదేవి కళ్లల్లో నీళ్లు.

రమాదేవిని మహారాష్ట్రలోని భివండీలో అమ్మేసేనాటికి ఆమె బిడ్డకు 6 నెలలు. ఇప్పుడు ఆ బిడ్డ మాట్లాడుతోంది.

‘‘ఇంటికి చేరుకున్నాక పాపను ఎత్తుకున్నాను. ఇప్పుడు నా కూతురుకు మాట్లాడటం వచ్చు. మీ అమ్మ ఏదీ అనడిగితే, 'అమ్మ చచ్చిపోయింది’ అని చెప్పింది. అప్పుడు ఎంత బాధగా ఉంటుందో నువ్వే చెప్పు సార్..!’’

చిత్రం శీర్షిక నా కూతురి మాటలు విన్నపుడు ఇంక బతక్కూడదనుకున్నా. కానీ.. భివండీలో నాలాగ ఎంతో మంది ఆడపిల్లలున్నారు.

‘‘నా కూతురి మాటలు విన్నపుడు ఇంక బతక్కూడదనుకున్నా. కానీ.. భివండీలో నాలాగ ఎంతో మంది ఆడపిల్లలున్నారు. వాళ్లని ఎట్లాగో బయటపడేయాలనుకున్నా.

రెడ్స్ స్వచ్ఛంద సంస్థకు పరిస్థితి అంతా చెప్పి, వాళ్లను భివండీకి తీసుకుపోయినా. పోలీసులు, రెడ్స్ సంస్థ సహాయంతో భివండీలో నన్ను బంధించిన వేశ్యాగృహంతో పాటు మరికొన్ని వేశ్యాగృహాల నుంచి సుమారు 30 మందిని వెనక్కు తెచ్చినాం’’ అని వివరించింది రమాదేవి.

Image copyright Getty Images

నా భర్త ముందే ‘వస్తావా’ అని పిలుస్తున్నారు

‘‘ప్రస్తుతం నేను నా భర్త దగ్గరే ఉన్నాను. ఇప్పుడు నా కుటుంబం బాగుంది. కానీ.. చుట్టుపక్కల మగవాళ్ల వేధింపులు మొదలయ్యాయి.

చాలా మంది నన్ను హీనంగా చూస్తున్నారు. నా భర్త ముందే 'పక్కలోకి వస్తావా?' అని అడుగుతుంటే నాకెంత బాధగా ఉంటుంది? వీళ్లందర్నీ అరెస్టు చెయ్యల్ల..’’ రమాదేవి గొంతులో ఆగ్రహం.

రమాదేవి రోజూ ఎన్నో హీనమైన చూపులను ఎదుర్కొంటోంది.

ఒకప్పుడు ఆమెను వేధించే భర్తే ఇప్పుడు ఆమెతో కలిసి ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి కూలికి వెళుతున్నారు.

2010లో రమాదేవి.. ఆ చెర నుంచీ బయటపడింది. ప్రభుత్వం అందించే తక్షణ సాయం అందడానికి రెండేళ్లు పట్టింది. 2012లో 10 వేలు రూపాయల అందాయి.

కానీ ఆమె జీవితం నుంచి కరువు పోలేదు.. నాణ్యమైన ఉపాధీ దొరకలేదు!

''నా కొడుకు వయసున్న పిల్లాడితో పండుకోవాల్సి వచ్చింది...’’

ఇంటి పని చేసేందుకు సౌదీ అరేబియాకు పోయి, మాటల్లో చెప్పలేని నరకాన్ని అనుభవించిన మరో మహిళ కథ ఇది.

‘‘నా పేరు పార్వతి. ఇద్దరు పిల్లలు. నా భర్తకు కాళ్లూ చేతులూ పడిపోయాయి. సంపాదించేవాళ్లు లేరు. సౌదీలో ఇంటిపని చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయంటే ఆశపడినాను. ఏదో.. డబ్బు సంపాదిస్తే ఇల్లు బాగుంటుంది కదా అని ఆశ.

పని ఇప్పిస్తానని చెప్పి ఓ బ్రోకర్ నన్ను సౌదీలో అమ్మేసినాడు. మొదట్లో ఆ విషయం నాకు తెలీదు. వారం రోజులు బాగానే ఉంది. ఆపై నన్ను వేరే ఇంటికి పంపారు. ఆ ఇంట్లో నరకం ప్రారంభమైంది. ఆ ఇంట్లో మగవాళ్లు ఎక్కువ మంది. ఆ ఇంట్లో 90 ఏళ్ల ముసలివాడు కూడా నన్ను రేప్ చేయాలని ప్రయత్నించినాడు. ఆరోజు ఎలాగో తప్పించుకున్నాను.

ఆ మరుసటి రోజు యజమాని కొడుకు నన్ను బలవంతం చేసినాడు. సిగరెట్లతో కాల్చినాడు. ఆ ఇంటి మగవాళ్లతో పడుకోలేదని నన్ను కొట్టినారు. ఒకసారి నా కొడుకు వయసున్న పిల్లాడితో పండుకోవాల్సి వచ్చింది. సెల్ ఫోన్‌లో ఆ పిల్లోడి తండ్రి ఏవేవో వీడియోలు చూపిస్తుంటే, కొడుకు నన్ను రేప్ చేసినాడు.

వారం రోజులు నాకు అన్నం పెట్టలేదు. తాగడానికి బాత్‌రూం నీళ్లే గతి. వాళ్లతో పడుకోవడానికి ఒప్పుకోలేదని నన్ను వేరే ఇంటికి పంపినారు. అదింకా పెద్ద నరకం. ఆ ఇంట్లోని మగాళ్లందరితోనూ పడుకోవాలి. తండ్రీ కొడుకుల భేదం లేదు. తండ్రితో పడుకోవల్ల, కొడుకుతోనూ పడుకోవల్ల.

తండ్రి సెల్ ఫోన్‌లో వీడియో చూపిస్తుంటే.. అది చూస్తూ కొడుకు నాతో పడుకుంటాడు. నాకూ ఆ పిల్లోడి వయసు కొడుకు ఉన్నాడు. వాడితో పడుకోవడం కంటే.. ఏదైనా తాగి చచ్చిపోయేది మేలనిపించింది.

వాళ్లతో పండుకోకపోతే కొడతారు. ఓరోజు.. నెలసరి వచ్చిందని చెబితే నమ్మలేదు. నేనే బ్లేడుతో కోసుకున్నానని మాట్లాడారు. ఆ దెబ్బలను తట్టుకోలేకే ఆ తండ్రి ఎదురుగా వాడి కొడుకును పండేసుకున్నా. ఆ ఇంటికి వచ్చే బంధువుల దగ్గర కూడా పండుకోవాల్సిందే.

పగలంతా ఇంటి చాకిరీ చేయల్ల.. రాత్రిళ్లు మగవాళ్ల పక్కల్లోకి పోవల్ల. విషయమంతా బ్రోకర్‌కు చెబితే.. ‘ఆ పని చేయడానికే కదా నువ్వు సౌదీ వచ్చింది’ అంటాడు. నన్ను 5లక్షలకు అమ్మేసినాడంట.. సార్’’ అంటూ.. బీబీసీతో తన గోడు వెళ్లబోసుకుంది పార్వతి.

‘‘ఆ నరకం నుంచి ఎట్లాగైనా తప్పించుకోవాలనుకున్నా. నన్ను నేను కాపాడుకోవాలంటే ఎదురు తిరగాల్సిందేనని అర్థమైంది. తరచూ గొడవలు చేసేదాన్ని. చివరికి వదిలేశారు. అక్కడి పోలీసుల సాయంతో ఎట్లాగో ఇంటికి చేరినాను.

ఇక్కడికొచ్చినాక జరుగుబాటు కష్టమవుతాంది. నా మొగునికి కాళ్లూ చేతులూ పడిపోయినాయి. సంపాదించే దిక్కు లేదు. చేద్దామన్నా పనులు దొరకడం లేదు.

మొన్న 20 కేజీల రాగులు తెచ్చుకున్నాం. రోజూ.. రాగి సంగటే మాకు దిక్కు. అందుకే.. కేరళ పోతున్నాం. నా భర్తనీ తీసుకుపోతున్నా. అక్కడ రోజు కూలీ 500 రూపాయలంట.. దొరికితే కూలి చేస్తా. లేకపోతే బిచ్చమెత్తుకుంటాను. మాకు వేరే గతి లేదు..!’’

2016లో పార్వతి.. వ్యభిచార కూపం నుంచి బయటపడింది. ఆమెకు 2017 నవంబర్‌లో 20 వేల రూపాయల ప్రభుత్వ సాయం అందింది.

ప్రస్తుతం పార్వతి కేరళ పోవడానికి సిద్ధమవుతోంది.

’’నా మొగుడే నన్ను బట్టలిప్పి నడివీధిలో నిలబెట్టినాడు’’

తన ప్రమేయం లేకుండా వ్యభిచార కూపంలోకి అడుగుపెట్టిన మరో మహిళ కథ ఇది. ఈమె పేరు లక్ష్మి. మేనమామనే పెళ్లి చేసుకుంది. అయినా అత్తగారింట్లో నరకం తప్పలేదు. భర్తకు అనుమానం.. చెప్పుడు మాటలు విని ఆమెను వేధించేవాడు.

''నా ఒంటిపై మా ఆయన కిరోసిన్ పోసినాడు. నిప్పంటించే సమయంలో ఎలాగో విడిపించుకుని బయటపడ్డా. అయినా వదల్లేదు.. బట్టలిప్పి నడివీధిలో నన్ను నిలబెట్టాడు'' అంటూ తన గాథను బీబీసీతో పంచుకుంది లక్ష్మి.

రమణమ్మ అనే మహిళ నా పరిస్థితిని గమనించింది. హైదరాబాద్‌లో ఇంటి పనికి కుదిరిస్తానని చెప్పింది. భర్తను విడిచి పుట్టింటికి చేరినావు.. నీ తల్లిదండ్రులకు భారమైనావు.. అని నాతో మాట్లాడేది. హైదరాబాద్‌లో ఇంటి పని చేస్తే నెలకు పది వేలు వస్తాయని, కష్టాలు తీరుతాయని చెప్పింది. మొదట్లో నేను ఒప్పుకోలేదు. దాదాపు నెల రోజులపాటు నన్ను బలవంతం చేసింది.

వాళ్లకు భారమవుతున్నావని పదేపదే అనేసరికి నాకూ నిజమేననిపించింది. కూలికి పోతేనే పూట గడిచేది మాకు. అలాంటపుడు తల్లిదండ్రులకు భారం కాకూడదనుకున్నా. హైదరాబాద్‌లో పని చేయడానికి ఒప్పుకున్నా. కానీ ఈ విషయం మా ఇంట్లో చెప్పలేదు.

అంతవరకూ నాకు హైదరాబాద్ ఎట్ల ఉంటుందో తెలియదు. రమణమ్మతో హైదరాబాద్‌కు బయలుదేరినా. మా ఊరి నుంచి కదిరికి, కదిరి నుంచి ధర్మవరంకు చేరుకున్నాం. మధ్యలో వలీ, అజీమ్ అనే ఇద్దరిని కలిసింది రమణమ్మ. నాకు బురఖా వేశారు. ఎందుకని అడిగితే, ఎవరైనా చూస్తే మళ్లీ ఇంటికి తీసుకుపోతారంది. రైల్లో బయలుదేరాం.

వలీ మాతోపాటు వచ్చాడు. రైలు దిగాక వలీ పిన్నమ్మ రెజీనా రైల్వేస్టేషన్ నుంచి మమ్మల్ని ఇంటికి తీసుకుపోయింది. అక్కడ దాదాపు 40 మంది అమ్మాయిలు ఉన్నారు.

అందరూ జీన్స్ ప్యాంటు, మిడ్డీ వేసుకుని, జడలు కట్ చేయించుకుని, మేకప్ వేసుకుని కూర్చున్నారు. నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ తర్వాత తెలిసింది.. నేను చేరుకుంది హైదరాబాద్ కాదు.. దిల్లీ అని!

అది దిల్లీలోని జీవీ రోడ్. ఆ రోజు సాయంత్రమే నన్ను బ్యూటీపార్లర్‌కు తీసుకుపోయినారు. జడ కత్తిరించి కటింగ్, మేకప్ చేయించినారు. ఇవన్నీ ఎందుకని అడిగితే అందరు అమ్మాయిల్లాగ నన్నూ రెడీ చేస్తామన్నారు’’.

Image copyright Getty Images

‘‘నాకంతా అయోమయంగా అనిపించింది. నేను వచ్చిన పని వేరు.. ఇక్కడ నాకు కనిపిస్తోంది వేరు. నన్ను డబ్బులకు అమ్మేసినవాడే మళ్లీ నన్ను ఆశించినాడు. అక్కడ నన్ను అమ్మేసి, అదే రోజు రాత్రి నాపై అత్యాచారం చేసినాడు. మరుసటి రోజు రెజీనా నన్ను మగాళ్ల దగ్గరికి పొమ్మని చెప్పింది. నేను ఒప్పుకోలేదు.

నెల రోజులు మొండికేసినా. ఆ నెల రోజులూ నాకు అన్నం పెట్టకుండా మాడ్చారు. కుర్చీలో కూర్చోబెట్టి నా చేతులు వెనక్కి కట్టేసినారు. నా కండ్లల్లోకి, నోట్లోకి పచ్చికారం నూరి పెట్టినారు. ఆ మంటకు నెల రోజులు భోంచేయలేకపోయినాను.

ఆ బాధ భరించలేక, చివరికి బలవంతంగానే ఆ పని చేయాల్సి వచ్చింది. ప్రాణాలు నిలబడాలంటే ఆ పని చేయాల్సిందే! కస్టమర్ల దగ్గరికి పోతే, అక్కడ మరో నరకం! వాళ్లకు నచ్చినట్లు చేయల్ల. ఒళ్లంతా సిగరెట్లతో కాలుస్తారు. వాళ్లకు నచ్చినట్లు చేయకపోతే అక్కడి నుంచి రాలేం.

ఆ పని చేయడం ఇష్టం లేకపోతే, కోరిక పుట్టడానికి ఇంజక్షన్లు వేస్తారు. నాక్కూడా ఇంజక్షన్లు వేసినారు సార్!’’ అని కన్నీటిపర్యంతమైంది లక్ష్మి.

‘‘ఆ ఇంటి వాచ్‌మన్ నన్ను కాపాడినాడు. నా బాధలు చూసి రెజీనా ఇంట్లో లేనపుడు నన్ను తప్పించినాడు. వెయ్యి రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కించినాడు. అలా ఆ నరకం నుంచి తప్పించుకున్నాను.

పుట్టింటికొస్తే.. నన్ను ఎవ్వరూ ఆదరించలేదు. నా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భర్త అందరూ నన్ను దూరం పెట్టినారు. ఎవ్వరూ లేకుండా కొంతకాలం ఒంటరిగా బతికినా.

ఇక్కడికొచ్చినంక వలీపై కేసు పెట్టి, పోలీసులను తీసుకుపోయి పట్టిచ్చినా. కానీ అతన్ని వెంటనే వదిలేసినారు. ఏ పనీ దొరక్క ఇట్లా మోసపోయినాం సార్..

నాలాంటి వారు చాలా మంది అక్కడ నరకం అనుభవిస్తున్నారు. కరువు లేకుంటే మాకు ఈ గతి పట్టేదే కాదు. మా జీవితాలు బాగుంటాండె.’’

2009లో లక్ష్మి బయటపడింది. కానీ ప్రభుత్వ సాయం అందడానికి చాలా కాలం పట్టింది. 2017 సెప్టెంబర్ నెలలో 20 వేల రూపాయలు అందాయి. ప్రస్తుతం ఆమె కూలి పనులు చేస్తూ ఒంటరిగా జీవిస్తోంది.

Image copyright BHANUJA
చిత్రం శీర్షిక జనవరి నెలలో పవన్ కల్యాణ్ కదిరి పర్యటన సందర్భంగా బాధిత మహిళలతో మాట్లాడారు. పవన్ కల్యాణ్‌కు అక్కడి పరిస్థితి వివరిస్తున్న రెడ్స్ సంస్థ నిర్వాహకురాలు భానూజ

అక్రమ రవాణా బాధితులకు బాసటగా రెడ్స్ సంస్థ

మహిళల అక్రమ రవాణా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతోందని, అయితే రాయలసీమలో జరుగుతున్న మహిళల రవాణా వెనుక ప్రత్యేకమైన పరిస్థితులు, కారణాలు ఉన్నాయని రెడ్స్ సంస్థ వ్యవస్థాపకురాలు భానూజ బీబీసీతో అన్నారు.

మహిళల అక్రమ రవాణాపై రెడ్స్ సంస్థ గత 20 ఏళ్లుగా పని చేస్తోందని ఆమె చెప్పారు. రాయలసీమలో అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా మహిళల అక్రమ రవాణా జరుగుతోందని వివరించారు.

‘‘ఈ ప్రాంతంలో వ్యవసాయం దాదాపుగా వర్షాధారమే..! గత 17 సంవత్సరాల్లో కేవలం మూడుసార్లు మాత్రమే పంటలు పండాయి. ఒక వైపు వరస కరువులు, మరోవైపు ఉపాధి కొరత.. ఈ కారణాలతో మహిళలు బ్రోకర్ల బారిన పడుతున్నారు’’ అని భానూజ తెలిపారు.

‘‘ఇంతవరకూ ముంబై, దిల్లీ, భివండీ ప్రాంతాల్లోని వ్యభిచార కూపాల్లో మగ్గుతున్న 318 మంది మహిళలను సీబీసీఐడీ, ఆయా నగరాల్లోని స్థానిక పోలీసుల సాయంతో వాళ్ల స్వగ్రామాలకు చేర్చగలిగాం’’ అని ఆమె అన్నారు.

‘‘వ్యభిచార కూపాలనుంచి తిరిగొచ్చిన వారికి తక్షణ సాయం కింద 20,000 రూపాయలు ఇవ్వాలి. ఒంటరి మహిళలకు పునరావాసం కల్పించాలి. కానీ.. ఈ తక్షణ ఆర్థిక సాయం అందడానికి 2-3 సంవత్సరాలు పడుతోంది. ఈ పరిస్థితి మారాలి.

మరోవైపు.. బ్రోకర్లను గుర్తించడం, వారిని అడ్డుకోవడంలో పోలీసులు కూడా విఫలమవుతున్నారు. అరెస్టయి, విడుదలయ్యాక కూడా ఆ బ్రోకర్లు తమ వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నారు.

కొందరు కింది స్థాయి పోలీసులు.. బ్రోకర్లపై కేసులు పెట్టిన బాధిత మహిళల వద్దకు వెళ్లి.. రాజీ కావాలంటూ మధ్యవర్తిత్వం చేస్తున్నారు. ఇది దారుణం..

ఈ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు 2015 సెప్టెంబర్ 3న నా ఇల్లు తగులబెట్టారు. అదృష్టవశాత్తూ ఆరోజు ఇంట్లో ఎవ్వరం లేము. ఆతర్వాత కొందరిపై కేసు పెట్టినా.’’ అని భానూజ బీబీసీతో అన్నారు.

Image copyright Getty Images

‘ఇప్పుడు ఆ పరిస్థితి లేదు’

అయితే.. మహిళల అక్రమ రవాణా ఇప్పుడు జరగడం లేదని అనంతపురం జిల్లా ఎస్పీ జి.వి.జి. అశోక్ కుమార్ బీబీసీతో అన్నారు. గతంలో అక్రమ రవాణా ఉన్నమాట నిజమేనన్నారు..

2011లో పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు.

కానీ.. గల్ఫ్ దేశాలకు మహిళలను అక్రమంగా తరలిస్తున్న కేసులు మాత్రం తమ వద్దకు రాలేదన్నారు.

అక్రమ రవాణాను నియంత్రించడానికి కదిరిలో ప్రత్యేకంగా ఓ ఇన్‌స్పెక్టర్‌ను కూడా నియమించామని అశోక్ కుమార్ అన్నారు. అనంతపురంలో వార్డు వార్డుకు ఓ మహిళా పోలీస్ వాలంటీర్‌ను నియమించి, ఓ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.

‘‘మహిళలపై హింసను అరికట్టడానికి జిల్లాలో మొత్తం 1,500మంది మహిళా వాలంటీర్లను నియమించాం. వారికి నెలకు రూ.1,000 వేతనం కూడా ఇస్తున్నాం. బాధితులు వీరికి కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా.. బాధితులు పోలీసులను ఆశ్రయించాలి. ఇప్పటికీ.. పోలీస్ జాబితాలో ఉన్న కొందరు బ్రోకర్లపై నిఘా ఉంచాం’’ అని.. ఎస్.పి.అశోక్ కుమార్ బీబీసీకి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)