సెక్స్: పీరియడ్స్ సమయంలో చేసుకోవచ్చా, చేసుకోకూడదా?

  • ఎల్లే గ్రిఫిత్స్
  • బీబీసీ కోసం
పీరియడ్ సమయంలో సెక్స్

ఫొటో సోర్స్, Laurène Boglio

నేను మంచం మీద నడుం వాల్చగానే ఆనందాన్ని.. అంతకుమించిన అనుభూతిని పొందినట్లు అనిపించింది.

జీవితంలో ఎప్పుడూ నా బాయ్‌ఫ్రెండ్స్‌తో ఇలాంటి సెక్స్‌ అనుభూతి పొందలేదు. అతనికి ఎంతో దగ్గరయ్యాను. ఎప్పడూ అతడ్ని వీడలేని బంధం మా మధ్య ఏర్పడింది. ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటే మాటలు రావు.

ఆరు నెలల నుంచి మేం కలిసే ఉంటున్నాం. వారాంతాల్లో పూర్తిగా అతడితోనే గడుపుతాను. హనీమూన్‌కి వెళ్లిన జంట.. కలయిక సమయంలో ఎలా ఉంటుందో ఊహించండి అచ్చంగా అలానే ఉంటుంది అప్పుడు నా పరిస్థితి.

పీరియడ్ సమయంలో సెక్స్‌తో అంత అసౌకర్యంగా ఏమీ లేను. టీనేజ్ చివరి దశలో.. 20లలో అడుగుపెడుతున్న తొలినాళ్లలో నెలలో ఓ వారం పాటు సెక్స్‌కి దూరంగా ఉండేదాన్ని.

నా మొదటి బాయ్ ఫ్రెండ్ నాతో కలయిక కోసం చాలా ఆతృత పడ్డాడు. కానీ, నాకు అదంతా సులభంగా ఏమీ అనిపించలేదు.

2018లోకి అడుగుపెట్టా. కాలంతో పాటు నా వయసు పెరిగింది. పీరియడ్స్ సమయంలో సెక్స్‌ వాదనకు నేను అనుకూలంగా ఉన్నా.

నా వయసు పెరుగుతుంటే ఎలాంటి సెక్స్ కావాలో మరింత నిర్మొహమాటంగా అడుగుతున్నా. ఆ సమయంలో కలయిక నాకు మరింత ఆనందాన్నిస్తుందని గ్రహించా.

ఫొటో సోర్స్, Laurène Boglio

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

ఈ విషయంలో నేను ఒంటరిని కానని నాకు తెలుసు. పీరియడ్ సమయంలో సెక్స్ పై పరిశోధకులు 500 మంది అభిప్రాయాలు తీసుకుంటే అందులో 55 శాతం మంది నెలసరి సమయంలో సెక్స్‌తో సౌకర్యవంతంగానే ఉన్నామని చెప్పారు. ఆ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదని అన్నారు. మరో 45 శాతం మంది ఆ సమయంలో సెక్స్ సరికాదని అనలేదు.

సెక్స్‌కు సబంధించి అనేక అధ్యయనాలు జరిగాయి. వీటి నుంచి పరిశోధకులు చెప్పేదేంటంటే, 45 శాతం మంది మహిళలు పీరియడ్ సమయంలో సెక్స్‌ కోసం మరింతగా తపిస్తారట.

దీన్ని పూర్తిస్థాయిలో పరిశోధకులు నిర్ధరించకపోయినప్పటికీ నాకు మాత్రం ఓ విషయం అర్థమవుతోంది. పీరియడ్ సమయంలో సెక్స్‌కు సబంధించి నాకు ఉన్న అనుభవాలే చాలా మందికి ఉన్నాయని, ఈ విషయంలో నేను ఒంటరిని కానని. పీరియడ్ సమయంలో సెక్స్‌కు, సాధారణ రోజుల్లో సెక్స్‌కు తేడా ఉందని 28 ఏళ్ల క్యాథరీన్ పేర్కొంది.

''ఆ సమయంలో సెక్స్‌ కోసం అంతగా ఆరాట పడను. భిన్న భంగిమల్లో సెక్స్ ఆ సమయంలో ప్రమాదకరమని అనుకుంటా. కానీ, నెలసరి సమయంలో సహచరుడి సాన్నిహిత్యాన్ని కచ్చితంగా ఆస్వాదిస్తా'' అని క్యాథరిన్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

నెలసరిలో ఒక్కో మహిళ ఒక్కో విధమైన కోరికతో ఉంటుంది. ఆ సమయంలో కొంతమంది విశ్రాంతి కోరుకుంటారు.

''సెక్స్‌లో పాల్గొనేప్పుడు ఆక్సిటోసిన్ అనే హర్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీన్నే బాండింగ్ హార్మోన్ అని కూడా అంటారు. ప్రసవ సమయంలో కూడా హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. పురిటి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో హార్మోన్లు సహాయపడుతాయి'' అని కాలిఫొర్నియా యూనివర్సి గైనకాలజిస్ట్ రాచెల్ న్యూమెన్ పేర్కొన్నారు.

''మీరు మరింతగా ఉద్వేగం పొందితే హార్మోన్ల ఉత్పత్తి పెరిగి మీ శరీరం మరింత ఆహ్లాదాన్ని పొందుతుంది. నొప్పులు, తిమ్మిర్ల బాధను అవి కొద్దిసేపు తొలగిస్తాయి'' అని రాచెల్ చెప్పారు.

''ఎండోమార్మిన్ హార్మోన్లు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ హార్మోన్లు భావప్రాప్తి కలిగినప్పుడే ఉత్పత్తి అవుతాయి. అయితే, ప్రతిఒక్కరికి ఇలానే ఉంటుందని చెప్పలేం'' అని సైన్స్ పరిశోధకులు అనా డ్రుయెట్ వివరించారు.

ఫొటో సోర్స్, Laurène Boglio

ఆ సమయంలో సెక్స్ అసాధారణం కాదు

నెలసరిలో పరిశుభ్రంగా ఉండాలని చాలా మంది మహిళలు భావిస్తుంటారు. అందుకే ఆ సమయంలో సెక్స్‌ను ఇష్టపడరు. నెలసరి అప్పుడు మహిళల ప్రైవేటు శరీర భాగాల నుంచి స్రావాలు రావడం సాధారణమే.

పీరియడ్ సమయంలో కలవడం వల్ల రక్తస్రావం కూడా తగ్గుతుందని రాచెల్ అంటున్నారు.

''నెలసరి సమయంలో భావప్రాప్తి కలిగినప్పుడు గర్భాశయ సంకోచాలు మరింత ధృడమవుతాయి. ఆ సమయంలో కలిసినప్పుడు పీరియడ్స్ వల్లే వచ్చే ఇబ్బందులు కూడా తక్కువగా అనిపిస్తాయి'' అని రాచెల్ వివరించారు.

నెలసరిలో సెక్స్‌లో పాల్గొనేవారికి నాదో చిన్న సలహా. దుప్పటి పైన టవల్ వేయండి. అప్పుడు మీ పడక గది రక్తపు మరకలతో క్రైం సీన్‌ను తలపించకుండా ఉంటుంది.

ఆ సమయంలో అందరూ ఒకేలాంటి అనుభూతి పొందలేరు. కానీ, నా స్వగతం నుంచి చెప్పాలంటే నెలసరిలో సెక్స్ అసాధారణం ఏమీ కాదు. అయితే, ముందు ఇలాంటి విషయాలను మీ భాగస్వామితో చర్చించండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)