మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. చెక్ చేసుకోండి

  • 1 ఫిబ్రవరి 2018
మొబైల్ Image copyright Getty Images

మీ జేబులో ఉన్న ఫోన్ మీకు సంబంధించిన ఎన్నో వ్యక్తిగత విషయాలు, విలువైన సమాచారాన్ని బహిర్గతం చేయగలదు.

స్నేహితుల ఫొటోల దగ్గర నుంచి ఆఫీసుకి సంబంధించిన ముఖ్యమైన ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలతో సహా ఎన్నో రకాల సమాచారం చాలా మంది ఫోన్లలో ఉంటుంది.

అంటే, ఈ కాలంలో మొబైల్ ఫోన్ మీరు మీ జేబులో పెట్టుకున్న ఓ రాకెట్‌తో సమానమని చెప్పొచ్చు.

ఎందుకంటే ఇప్పుడు నెట్టింట్లో నిత్యం సైబర్ నేరగాళ్లు కాచుకుని కూర్చుంటున్నారు. మొబైళ్లపై హ్యాకింగ్‌లకు పాల్పడుతున్నారు.

అయితే.. ఫోన్ హ్యాకింగ్‌కు గురైతే మనకు వెంటనే తెలిసిపోతుందన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. మరి తెలియకపోతే?

అందుకే ఫోన్‌ హ్యాక్ అయితే కనిపించే 7 సంకేతాలు, వాటికి పరిష్కారాలు ఏమిటో చూద్దాం.

Image copyright Reuters

1. ఫోన్ వేగం

మీ ఫోన్ సాధారణ స్థాయి కంటే తక్కువ వేగంతో పనిచేస్తోందంటే ఏదైన హానికరమైన వైరస్ అందులో చేరిందని అర్థం.

ఇలాంటి హానికమైన వైరస్‌లు ఫోన్ పనితీరును తగ్గించి, వినియోగదారులను ఇబ్బంది పెడతాయి.

కానీ, ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. మీ ఫోన్‌లో ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) ఎప్పుడూ అప్‌డేట్ అవుతుంటే కూడా స్పీడ్, పనితీరు తగ్గొచ్చు.

ఈ మధ్యనే యాపిల్ ఐఫోన్ పాత వెర్షన్ స్పీడ్ తగ్గిన విషయాన్ని ఒప్పుకుంది.

2. బాగా వేడెక్కిపోవడం

మీరిది గమనించే ఉంటారు. అప్పుడప్పుడు ఫోన్ చాలా అధికంగా వేడెక్కిపోతూ ఉంటుంది.

అమెరికాకు చెందిన ఇంటెల్ నిపుణులు "మీ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా మాల్‌వేర్ వైరస్ రన్ అవుతూ ఉండటం దీనికి కారణం కావొచ్చు" అని అంటున్నారు.

కొన్ని యాప్‌లను సరిగ్గా క్లోజ్ చేయకపోవడం కూడా ఫోన్ వేడెక్కడానికి కారణం కావొచ్చు.

Image copyright Reuters

3. బ్యాటరీ లైఫ్

ఫోన్ ఎక్కువగా వేడెక్కడం బ్యాటరీ మన్నిక మీద కూడా ప్రభావం చూపిస్తుంది.

దాంతో బ్యాటరీ తొందరగా చెడిపోతుంది.

కానీ ఇక్కడ అసలు కారణం సిస్టం అప్‌డేట్ అవుతుండడం.

మొబైల్ జోన్ వెబ్‌సైట్ ప్రకారం అప్‌డేట్లు కొత్తవి లేదా ముఖ్యమైనవి అయితే ఇబ్బంది ఏమీ ఉండదు.

4. అజ్ఞాత మెసేజ్‌లు

ఒక్కోసారి మీ ఫోన్ హ్యాక్ అయినట్టుగా మీకన్నా ముందు మీ కాంటాక్ట్‌లలో ఉన్నవారికి తెలిసిపోతుంది.

ఒక్కోసారి మీకు తెలియని నంబర్ల నుంచి మెసేజ్ రావడం లేదా మీ ఫోన్ నుంచి మీ ప్రమేయం లేకుండానే మెసేజ్‌లు వెళ్ళడం మీరు గమనించే ఉంటారు.

మీ మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు ఎంఎంఎస్ లు లేదా వాట్సాప్‌ ద్వారా మీకు తెలియకుండానే ఈ మెసేజ్‌లు వెళిపోతుంటాయి.

సందేహం లేదు, ఇది కచ్చితంగా హ్యాకర్ల పనే!

అలాంటప్పుడు, వీలైతే ఆ మెసేజ్ తెరచి చూడకుండా వెంటనే డిలీట్ కొట్టడం ఉత్తమం.

ఇలాంటి ఈమెయిల్స్ ద్వారా కూడా రావొచ్చు. వాటిని కూడా వెంటనే డిలీట్ చేసేయాలి.

వేర్వేరు డివైజ్‌లతో ఫోన్ కనెక్ట్ చేయడం వల్ల కూడా వైరస్ చేరవచ్చు.

Image copyright (C) British Broadcasting Corporation

5. పాప్- అప్‌లతో జర జాగ్రత్త

ఒక్కోసారి కొన్ని రకాల వైరస్‌లు హఠాత్తుగా మన ఫోన్‌లో తెరపైకి వస్తుంటాయి.

కొన్నిసార్లు రిక్వెస్ట్‌ల రూపంలో వస్తుంటాయి.

కొన్నిసార్లు వేరే విండో లేదా ట్యాబ్ ఓపెన్ అయి తద్వారా వైరస్ వచ్చి చేరుతుంటుంది. కంప్యూటర్ భాషలో వీటిని పాప్-అప్స్ అంటారు.

"ఎలాగైతే కంప్యూటర్‌లో ఇంటర్నెట్ వల్ల కొత్త ట్యాబ్‌లు ఓపెన్ అవుతుంటాయో, అలాగే ఫోన్లోనూ ఈ ట్యాబ్‌లు ఓపెన్ అవుతూ ఉంటాయి. వీటి గురించి జాగ్రత్త వహిస్తూ, అలా వచ్చిన వెంటనే క్లోజ్ చేసేయడం బెటర్. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది" అని సైబర్ సెక్యూరిటీ నిపుణులు జోసెఫ్ స్టిన్‌బర్గ్ చెబుతున్నారు.

Image copyright PA

6. కొత్త యాప్‌లు

యాప్‌లను ఎక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు? అవి ఎలాంటి యాప్‌లు? అన్నది చాలా ముఖ్యం.

చాలాసార్లు మీ ఇంటర్నెట్ డాటా, మెమొరీ తొందరగా అయిపోతుంటాయి. ఎందుకంటే కొన్ని యాప్‌లు చాలా డాటాను వాడేసుకుంటూ ఉంటాయి. అలాగే ఎక్కువ మెమొరీని తీసుకుంటాయి.

"ఫోన్‌ను అప్‌డేట్ చేసుకుంటూ ఉండటం మంచిదే. కానీ ఈ యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సోర్స్ ఏమిటి? అన్నది గమనిస్తూ ఉండాలి. ఒరిజినల్ ప్రొవైడర్ దగ్గర నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడమే ఉత్తమం" అని నిపుణులు సూచిస్తున్నారు.

మీరు ఏ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవలనుకున్నా, మొదట దాని గురించి ఇంటర్నెట్‌లో వెతికి, రివ్యూలు చూడటం మేలు. లేదంటే ఈ యాప్‌ల ద్వారా హ్యాకర్లు మన ఫోన్‌ను హ్యాక్ చెయ్యడానికి ప్రయత్నించవచ్చు.

7. బ్యాక్‌గ్రౌండ్‌లో శబ్దాలు...

ఇంటర్నెట్‌లో ఏవైనా చూస్తున్నప్పుడు కొన్నిసార్లు వింత వింత శబ్దాలు వస్తుంటాయి. హఠాత్తుగా అవసరంలేని లేదా విభ్రాంతి కలిగించే అంశాలు కనిపిస్తుంటాయి.

దానర్థం దూరంగా ఎక్కడో కూర్చుని హ్యాకర్ మీ ఫోన్‌ను కంట్రోల్ చేస్తున్నాడని.

ఫలితంగా అర్థంపర్థం లేని విధంగా మీ ఫోన్‌లో శబ్దాలు, చిత్రాలు వస్తుంటాయి. మీకు అర్థం కానట్టు ఉంటుంది మీ ఫోన్ ప్రవర్తన.

అన్నిటికన్నా ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా వింత శబ్దం వినిపిస్తే, దానర్థం మీ సంభాషణలను ఎవరో రికార్డ్ చేస్తున్నారని.

బీప్ గానీ, ఒకే రకమైన శబ్దం మళ్ళీ మళ్ళీ వినిపించడంగానీ జరిగితే అది కచ్చితంగా రికార్డ్ చేస్తున్న శబ్దమే!

Image copyright Getty Images

మరి దీనికి పరిష్కారమేంటి?

  • ఏదైనా నమ్మకమైన సంస్థ నుంచి యాంటీ-వైరస్ కొనుక్కుని ఫోన్‌లో వేసుకోవచ్చు.
  • వాడకుండా ఉండే యాప్‌లను వెంటనే ఫోన్ నుంచి డిలీట్ చేయడం మేలు.
  • ఫ్రీ వై-ఫై వస్తోంది కదా! అని అన్నిచోట్లా ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవడం మంచిది కాదు.
  • ఫోన్‌కి కఠినమైన పాస్‌వర్డ్ పెట్టుకోండి. ఎవరికీ బ్రేక్ చేయసాధ్యం కాని గట్టి పాస్‌వర్డ్ పెట్టుకోండి.
  • పాప్-అప్స్ మీద పొరపాటున కూడా క్లిక్ చేయకండి.
  • డివైజ్‌ని అప్‌డేట్ చేసుకుంటూ ఉండండి, కానీ ఒకటికి పదిసార్లు సరిచూసుకోండి.
  • ఎంత ఇంటర్నెట్ డాటా ఖర్చు అవుతోందో అప్పుడప్పుడూ గమనిస్తూ ఉండండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు