మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?

  • బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
  • బీబీసీ ప్రతినిధి
షణ్ముఖం చెట్టి

ఫొటో సోర్స్, Wikipedia

ఫొటో క్యాప్షన్,

స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి షణ్ముఖం చెట్టి

1947-48 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్‌కే షన్ముఖం చెట్టి 1947 నవంబర్ 26వ తేదీన దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

ఇది 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి 1948 మార్చి 31 వరకు అంటే.. ఏడున్నర నెలలకు మాత్రమే అమలయ్యింది.

ఆ బడ్జెట్ ప్రసంగంలో ఆయన ప్రధానంగా.. ఆహార, పారిశ్రామిక ఉత్పత్తి, దిగుమతుల్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించటంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. అలాగే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా రక్షణ రంగాన్ని బలోపేతం చేయటం గురించి మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని ఆయన పిలుపునిచ్చారు. తొలి బడ్జెట్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఫొటో సోర్స్, Fox Photos/Getty Images

'విదేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేం'

'ఎక్కువ ఆహారం పండించండి' అన్న ప్రచారం పెద్దగా విజయం సాధించలేదు. దాని ప్రభావం ఆహార పంపిణీ వ్యవస్థపై పడింది. స్వాతంత్ర్యానికి ముందు నాలుగేళ్లు.. అంటే 1944 నుంచి 47 వరకు రూ.127 కోట్ల విలువ చేసే 43.80 లక్షల టన్నుల ఆహార పదార్థాలను భారతదేశం దిగుమతి చేసుకుంది.

స్వాతంత్ర్యం పొందిన సంవత్సరంలో కూడా రూ.42 కోట్ల విలువైన 10.62 లక్షల ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంది. ఆస్ట్రేలియా నుంచి గోధుమలను దిగుమతి చేసుకునేందుకు ఒక కమిటీ ఆ దేశానికి వెళ్లింది. బహుశా సానుకూల ఫలితం రావొచ్చు. తద్వారా వచ్చే ఏడాదికి సరిపడా గోధుమలు మనం కొనుగోలు చేయవచ్చు.

ఇలా విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవటం ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై పెను ప్రభావం చూపుతోంది.

ఈ నేపథ్యంలో ఆహార ధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధి సాధించటమే మన ముందున్న ప్రధాన అజెండా. దీనిపై సర్ పురుషోత్తందాస్ ఠాకూర్‌దాస్ ఆధ్వర్యంలోని కమిటీ తన మధ్యంతర నివేదిక ఇచ్చింది. దీన్ని ప్రభుత్వం పరిశీలించాలి.

దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గటం, మత సంఘర్షణల కారణంగా పారిశ్రామిక రంగంలో అశాంతి కారణంగా నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి.

ఇప్పటి వరకూ బ్రిటీష్ కామన్‌వెల్త్ దేశాల నుంచి గణనీయంగా సరకు రవాణా జరిగేది. కానీ, ఇప్పుడు దానికి భారీగా అడ్డుకట్ట పడింది. దీంతో, విదేశాల నుంచి దిగుమతులు బాగా తగ్గుతున్నాయి. కాబట్టి, మనం మళ్లీ మన సొంత వసరులపై నిలబడాలి.

ఆహారం విషయానికి వస్తే.. దిగుమతులపై దేశం ఎక్కువకాలం ఆధారపడలేదు. మన రోజువారీ అవసరాలు విదేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండకూడదు. పైగా, పెద్ద మొత్తంలో విదేశీ దిగుమతులు మన విదేశీ మారక నిల్వలపై ప్రభావం చూపుతాయి. మన నిల్వల్ని పారిశ్రామికాభివృద్ధి, దేశాభివృద్ధి కోసం వినియోగించాలి కానీ దిగుమతుల కోసం కాదు. దేశంలోనే వీలైనంత ఎక్కువగా ఆహారాన్ని ఉత్పత్తి చేయటంపై మనం మన శక్తులన్నీ ధారపోయాలి. చేయి చేయి కలిపితే అదేమంత పెద్ద కష్టం కాదు.

ఫొటో సోర్స్, Raj Gopal/Getty Images

ఆదాయ.. వ్యయాలు

విభజన కారణంగా ఆదాయ అంచనాల్లో చాలా వ్యత్యాసాలు ఉండవచ్చు. ఈ విషయాన్ని సభ గుర్తించాలి. వచ్చే ఏడాది బడ్జెట్‌తో పాటు సవరించిన అంచనాలను సభ ముందుంచుతాను.

ఆదాయ అంచనా.. రూ.171.15 కోట్లు

వ్యయం అంచనా.. రూ.197.39 కోట్లు

లోటు.. రూ.26.24 కోట్లు

అయితే, లోటు ఇంకా ఎక్కువ ఉండవచ్చు. ఎందుకంటే శరణార్థుల పునరావాసం కోసం ఖర్చు చేయటంతో పాటు కొత్తగా ఏర్పడ్డ పశ్చిమ బెంగాల్, తూర్పు పంజాబ్‌ ప్రావిన్సులకు కూడా కొంత ఆర్థిక సహాయం చేయాలి. అయితే, ఆధారపడదగ్గ సమాచారం లేనందున వాటికి నిర్దుష్టంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదు.

నేను ప్రతిపాదించిన ఆదాయ అంచనా.. రూ.171.15 కోట్లలో కస్టమ్స్ నుంచి రూ.50.5 కోట్లు, ఆదాయపు పన్ను ద్వారా రూ.29.5 కోట్లు, సాధారణ వసూళ్లు రూ.88.5 కోట్లు.

పోస్టు, టెలిగ్రాఫ్‌ల శాఖ నుంచి ఆదాయం రూ.15.9 కోట్లు, ఖర్చు, వడ్డీ రూ.13.9 కోట్లు. నికర మిగులు అంచనా రూ.2 కోట్లు.

ఈ ఏడాది రైల్వేల నుంచి ఎలాంటి నిధులనూ ఆశించట్లేదు.

ఖర్చు రూ.197.39 కోట్లలో.. రూ.92.74 కోట్లు రక్షణ సేవలకు. మిగతాది పౌర ఖర్చులకు. విభజన కారణంగా రక్షణ రంగానికి సాధారణం కంటే ఎక్కువ ఖర్చవుతోంది. 1949 ఏప్రిల్ 1 నాటికి ఆర్మీలో 2.60 లక్షల మంది సైనికులు ఉండాలి. కానీ, వారి సంఖ్య 2.30 లక్షలకు తగ్గుతోంది. పైగా, నౌక, వాయుసేనల్లో కూడా భారతదేశానికి సరిపడా సామర్థ్యం లేదు. దేశ విభజన కారణంగా ఈ రెండు రంగాల్లో మన సామర్థ్యం మరింత తగ్గింది. దీన్ని పెంచటంపై ప్రణాళికల్ని పరిశీలిస్తున్నాం.

భారతదేశం నుంచి బ్రిటీష్ సేనలు వైదొలుగుతున్నాయి. 1947 ఆగస్టు 17వ తేదీన తొలి బృందం తిరిగి వెళ్లింది. 1947 లోనే పూర్తి కావాల్సిన ఈ ప్రక్రియ నౌకాయానంలో ఇబ్బందుల కారణంగా 1948 ఏప్రిల్ వరకు కొనసాగొచ్చు.

ఫొటో సోర్స్, Three Lions/Getty Images

స్టెర్లింగ్ పద్దు (విదేశీ మారక నిల్వలు)

భారత ప్రభుత్వం, బ్రిటీష్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం వివరాలను కొద్ది రోజుల కిందటే నేను సభ ముందు పెట్టాను. స్టెర్లింగ్ పద్దు కింద 1946 ఏప్రిల్ 5 నాటికి అత్యధికంగా రూ.1733 కోట్లు ఉన్నాయి. అవి 1947 మార్చి నాటికి 1612 కోట్లకు తగ్గిపోయాయి. జూలైలో మన కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టాక అవి రూ.1547 కోట్లుగా ఉన్నాయి. ఆరు నెలల్లోనే మనం రూ.65 కోట్లు తీసుకున్నాం. ఇదంతా కూడా భారీగా ఆహార ధాన్యాలు, సరకు దిగుమతుల కారణంగా జరిగింది. స్టెర్లింగ్ పద్దు నుంచే కనుక డబ్బులు తీసుకోకుంటే.. తగిన దిగుమతులు చేసుకోకుంటే మన దేశం యుద్ధ సమయంలో ఆకలితో అలమటించాల్సి వచ్చేది. తద్వారా చాలా పెద్ద మొత్తంలో నిధులు భారత్ నుంచి విదేశాలకు ముఖ్యంగా బ్రిటన్‌కు మళ్లాయి.

ఎంపైర్ డాలర్ పూల్

1939 సెప్టెంబర్ నుంచి 1946 మార్చి 31వ తేదీ వరకు ఈ పద్దు కింద మనం రూ.405 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు సంపాదించి, రూ.240 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు ఖర్చు చేశాం. రూ.165 కోట్లు మిగిలాయి. ఇదే సమయంలో కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోర్చుగల్ దేశాల కరెన్సీల్లో రూ.51 కోట్లు ఖర్చు చేయగా, ఇంకా రూ.114 కోట్లు మిగిలాయి.

యుద్ధం తర్వాత ప్రణాళిక, అభివృద్ధి పద్దు కింద రూ.100 కోట్లు పెట్టగా, అందులో రూ.45 కోట్లు ప్రావిన్సులకు గ్రాంటులు.

ప్రావిన్సులు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులూ ఇవ్వట్లేదు. అయితే, అవి తమ స్వంత వనరుల్ని పెంపొందించుకోవాలన్నదే కేంద్ర ప్రభుత్వ సహాయం ప్రధాన ఉద్దేశ్యం. దీన్ని ప్రావిన్సులు గుర్తిస్తాయని ఆశిస్తున్నాను.

ఫొటో సోర్స్, Keystone/Getty Images

దేశ ఆర్థిక పరిస్థితి

వరుసగా ఇది ఎనిమిదవ లోటు బడ్జెట్. ఈ సమయంలో మన దేశ ఆదాయ స్థితి పటిష్టంగా ఉందా? అని ఎవరైనా అడిగితే.. ఉందని చెప్పటానికి నేను ఏ మాత్రం సంశయించట్లేదు.

చరిత్రలోనే గొప్ప యుద్ధం ప్రభావాన్ని ఏ దేశమూ తప్పించుకోలేకపోయింది. ఈ యుద్ధ కాలంలో ఆర్థిక లోటంతా రక్షణ రంగంలో ఖర్చు కారణంగానే జరిగింది. ఈ సందర్భంగా అదనపు పన్నులు వేసి వీలైనంత లోటు పూడ్చాం. శాంతిని పునరుద్ధరించేందుకు చర్యలు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. అయితే దేశ విభజన కారణంగానూ, పంజాబ్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగానూ అవి కొంత మేరకు దెబ్బతిన్నాయి.

మనం కొంత సాధారణ స్థితికి వచ్చిన తర్వాత తప్పకుండా రక్షణ ఖర్చు తగ్గుతుంది. వచ్చే ఏడాది నాటికే మనం సాధారణ స్థితికి చేరుకుంటామని చెప్పటం అతిశయోక్తి కావొచ్చు. అయితే మనం తప్పకుండా 1949-50 నాటికి దీన్ని సాధిస్తాం.

దేశ ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఎలాంటి నిరాశావాదం అవసరం లేదు. విభజన కారణంగా నిజంగానే కొంత మనం బలహీనపడ్డాం. అఖండ భారతదేశంలో అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి కంటే చాలా మెరుగ్గా ఉండేవాళ్లం.

మన దేశ పరిమాణాన్ని బట్టి చూస్తే మన రుణ స్థితి కూడా మెరుగ్గానే ఉంది. అఖండ భారతదేశ అప్పు, వడ్డీ చెల్లింపులు మొత్తం రూ.2531 కోట్లు. విదేశీ నిల్వలు రూ.1600 కోట్లు. వీటిలో పాకిస్తాన్ వాటాను విడగొట్టాల్సి ఉంది.

భవిష్యత్ సంకల్పం

భారతదేశం ఇప్పుడే బానిసత్వం నుంచి బయటపడింది. ఆసియాలో లీడర్ కావాలన్న తన లక్ష్యాన్ని కనుక భారత్ చేరుకుంటే.. స్వతంత్ర్య దేశాల్లో ముందువరుసలో ఉంటుంది. ఇందుకోసం మనమంతా రాబోయే సంవత్సరాల్లో క్రమశిక్షణతో కూడిన చర్యలు చేపట్టాలి. శాంతి భద్రతల్ని కాపాడేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు, అంతర్గత సంఘర్షణలు నివారించేందుకు అంతా సహకరించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)