కేంద్ర బడ్జెట్‌పై సోషల్ మీడియా రియాక్షన్: ఆరోగ్య బీమాకు ప్రశంసలు.. ఆదాయ పన్నుపై విమర్శలు

  • 1 ఫిబ్రవరి 2018
బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ Image copyright Getty Images
చిత్రం శీర్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు పార్లమెంటులోనికి వెళ్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు.. బీజేపీ, దాని మిత్రపక్షాల నేతలు ఈ బడ్జెట్‌పై ప్రశంసలు కురిపిస్తుండగా విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

సోషల్ మీడియాలోనూ అనుకూల, వ్యతిరేక పోస్టులతో పాటు వ్యంగ్యాస్త్రాలూ కనిపిస్తున్నాయి. మధ్యతరగతిని పట్టించుకోలేదంటూ నెటిజన్లు విమర్శనాత్మక పోస్టులు పెడుతున్నారు.

క్రిప్టో కరెన్సీలను ప్రభుత్వం ఆమోదించబోదన్న జైట్లీ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Image copyright DevendraFadnavis/Twitter
చిత్రం శీర్షిక చరిత్రాత్మక బడ్జెట్ అంటూ మహారాష్ఱ్ట సీఎం పొగడ్తలు కురిపించారు.

ప్రధాని మోదీ కార్యాలయం తాజా బడ్జెట్‌పై ట్విటర్‌లో స్పందిస్తూ ''రానున్న కాలంలో భారత్ మరింత ప్రగతి సాధిస్తుందన్న నమ్మకాన్ని ఈ బడ్జెట్ కలిగించింది'' అని పోస్ట్ చేసింది.

అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక స్థిరీకరణ పరీక్షలో జైట్లీ విఫలమయ్యారని.. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చిదంబరం హెచ్చరించారు.

''10 కోట్ల మందికి లబ్ధి చేకూర్చేలా చేపడుతున్న జాతీయ ఆరోగ్య పథకం ఒబామా కేర్ కంటే పెద్ద ప్రాజెక్టు'' అంటూ పాత్రికేయుడు నిశాంత్ చతుర్వేది ట్వీట్ చేశారు.

బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్- ''మోదీ ప్రభుత్వం మరోసారి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో అత్యంత భారీ హెల్త్‌కేర్ పథకాన్ని ప్రవేశపెడుతోంది. రూ.5 లక్షల వరకు కవరేజితో 50 కోట్ల మందికి మేలు కలుగుతుంది'' అంటూ ట్వీట్ చేశారు.

పేదలు, రైతులు, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్ అంటూ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ''పేద రైతులు, కార్మికులకు ఇది తీవ్ర నిరాశాజనకమైన బడ్జెట్. సాధారణ ప్రజలు, మహిళలు, వ్యాపారుల నోటి మీద కొట్టారు. ప్రజల కష్టాలను విస్మరిస్తూ రూపొందించిన ఘోరమైన బడ్జెట్ ఇది'' అంటూ ట్వీట్ చేశారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాల పెంపు ప్రతిపాదనలపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Image copyright Twitter
చిత్రం శీర్షిక మధ్యతరగతిని విస్మరించారంటూ ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు

‘బీబీసీ తెలుగు’ ఫాలోయర్ దాము.కె ''మరో అయిదేళ్లు వృథా అయ్యాయి. ఏపీకి మొండిచేయి ఇచ్చారు'' అంటూ ట్వీట్ చేశారు.

ఫేస్‌బుక్‌లో బీబీసీ తెలుగు ఫాలోయర్ ఎరుమల్ల శ్రీనివాస్ బడ్జెట్ బాగుందంటూ తన అభిప్రాయం తెలిపారు. గ్రామీణాభివృద్ధికి ఊతమిచ్చేలా ఉందని చెప్పారు. జాన్ ప్రణయ్ కుమార్ రెడ్డి అనే ఇంకో యూజర్ ''ఆంధ్రకు ఈ బడ్జెట్‌తో ఎలాంటి లాభం లేదు. ఏపీ సీఎం ఇంకా నిద్రపోతున్నారు'' అని స్పందించారు.

''బడ్జెట్లో రాజధాని అమరావతి ఊసే లేదు.. ముంబయి, బెంగళూరు మెట్రోలకు కోట్ల రూపాయలు ఇచ్చిన మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ ఇవ్వలేదు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ కళ్లు తెరిచి పోరాటం చేయాలి. ఆంధ్రులను మోసం చేయడం మానకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే మీకూ పడుతుంది'' అంటూ మహ్మద్ గౌస్ అనే యూజర్ తన అభిప్రాయం వెల్లడించారు.

కార్పొరేట్ పన్ను తగ్గించారు కానీ, ఉద్యోగుల ఆదాయ పన్ను శ్లాబులు మార్చలేదంటూ తోట రత్నాకర్ అనే ఫేస్ బుక్ యూజర్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కలేదని పలువురు నెటిజన్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)