సెకండ్ హ్యాండ్ దుస్తుల దిగుమతిలో భారత్‌ది మూడో స్థానం

  • 5 ఫిబ్రవరి 2018
దుస్తులు Image copyright iStock

నిరంతరం మారే ఫ్యాషన్ రంగంలో ఎప్పటికప్పుడు ఎన్నెన్నో డిజైన్లు.. కొత్త మోడల్, కొత్త డిజైన్ మార్కెట్లోకి రావడమే ఆలస్యం.. మరుక్షణమే వాటిని కొనేందుకు అమెరికా, ఇంగ్లండ్, ఇటలీ, కెనడా లాంటి దేశాల ప్రజలు ఎగబడుతున్నారు.

మరి బీరువా నిండా పేరుకుపోయిన పాత వాటినేంచేస్తారు? వాటిని చూసి చూసి పడేయలేక.. ఆక్స్‌ఫామ్ లాంటి స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేస్తారు.

2017లో తమ చారిటీ స్టోర్‌కు ఇలాంటి బట్టలు రావడం రెండు శాతం పెరిగిందని ఆక్స్‌ఫామ్ సంస్థ చెబుతోంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: కొన్ని గంటల్లోనే పాతవైపోతున్న కొత్త బట్టలు

ఆ సంస్థలు వాటిలో 10-20% బట్టలను మాత్రమే తమ చారిటీ షాపుల ద్వారా అమ్ముతున్నారు. తక్కిన వాటిని భారత్, పాకిస్తాన్, ఉగాండా, హంగేరి లాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వీటిని ఆయా దేశాల్లోని సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్లో అమ్ముతారు.

ఈ సెకండ్‌ హ్యాండ్ దుస్తుల మార్కెట్‌కు ఈ మధ్య కాలంలో డిమాండ్ తగ్గుతోంది. ఎందుకు?

ఎగుమతుల్లో తగ్గుదల..

ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ దుస్తుల ఎగుమతుల విలువ 400 కోట్ల అమెరికా డాలర్లు. కానీ ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఈ దుస్తుల ఎగుమతి, దిగుమతులు, ఆ దుస్తుల విలువ గణనీయంగా తగ్గాయి.

అమెరికా, ఇంగ్లండ్ దేశాల నుంచి సెకండ్ హ్యాండ్ దుస్తుల దిగుమతులను వచ్చే ఏడాది నుంచి నిలిపేస్తున్నట్టు రువాండా, కెన్యా, ఉగాండా, టాంజానియా, దక్షిణ సూడాన్‌లు ఇప్పటికే ప్రకటించాయి.

''మా దేశంలో దుస్తుల పరిశ్రమలను స్థాపించి, అభివృద్ధి చేసుకోనున్నాం..'' అని రువాండా అధ్యక్షుడు గత జూన్‌లో అన్నారు.

సెకండ్‌ హ్యాండ్ ఎగుమతుల్లో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది.. ఈ దేశాలు తీసుకున్న నిర్ణయం తమ సెకండ్ హ్యాండ్ దుస్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అమెరికా భావిస్తోంది. రువాండా, ఉగాండా, టాంజానియా దేశాలతో ఈ వ్యాపార సంబంధాలపై వేసవిలో సమీక్షిస్తామని తెలిపింది.

చిత్రం శీర్షిక రాస్ బ్యార్రీ

రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, లేకపోతే ఒక్కసారిగా డిమాండ్ తగ్గిపోవడం కావచ్చు ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలూ.. అమ్ముడుపోని దుస్తులను కొనాలని ఇంగ్లండ్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.

ఎల్.ఎమ్.టి టెక్స్‌టైల్ సంస్థ గత ముప్ఫై సంవత్సరాలుగా ఇంగ్లండ్‌లో ఈ వ్యాపారం చేస్తోంది. ఈ వ్యాపారం చేస్తున్నవారు ప్రస్తుతం ఎక్కువ లేరని సంస్థ యజమాని రాస్ బ్యార్రీ చెబుతున్నారు.

బాగా వాడిన, తక్కువ వాడిన దుస్తులను వాటి నాణ్యతను బట్టి వివిధ రకాలుగా వేరు చేస్తారు. మళ్లీ వాటిని ఒక్కో బ్యాగు 45 కేజీలు వుండేట్లు ప్యాక్ చేస్తారు. ఒక్కో సంచిని 5-150 పౌండ్ల ధరకు విదేశీ కొనుగోలుదారులకు అమ్ముతారు.

బ్రాలు, ఫుట్‌బాల్ కిట్లు ఎక్కువగా అమ్ముడు పోతాయని రాస్ బ్యార్రీ చెబుతున్నారు.

కుప్పలుగా వచ్చి పడే దుస్తులను వేరు చేయడం ఓ పెద్ద పని. వీటిలో ఏది బాగుందో.. ఏవి బ్రాండెడ్ దుస్తులో వేరు చేయడానికి ఎలాంటి పరికరాలూ లేవు. అందుకు తగిన సిబ్బంది అవసరం.

గత ఐదేళ్లలో దాదాపు 60-70 కంపెనీలు తమ వ్యాపారాలను మూసేశాయి. కానీ తాము ఇంకా కొనసాగుతున్నామని, వీటికి డిమాండ్ తగ్గడంతో తన సిబ్బందిని 100 మంది నుంచి 20 మందికి కుదించాల్సి వచ్చిందని రాస్ బ్యార్రీ చెప్పారు. మరోవైపు ఇంగ్లండ్‌లో వేతనాలు కూడా ఎక్కువేనని తెలిపారు.

అయితే.. ఈ వ్యాపారంలో కాస్త నిలదొక్కుకోవడానికి మరో మార్గం ఉందంటున్నారు. ఈ దుస్తుల్లో నాణ్యమైన వాటిని ఎన్నుకుని, వాటిని దుస్తుల నుంచి ఒట్టి గుడ్డలుగా మార్చుకోవాలి.

తిరిగా ఆ గుడ్డలతో మళ్లీ నాణ్యమైన దుస్తులను తయారు చేయవచ్చు.

ఇలాగే.. తమ వద్దకు వచ్చిన వాటిలో నాణ్యమైన దుస్తులను ఎన్నుకుని, వాటితో సూట్‌లను తయారు చేసేందుకు ఆక్స్‌ఫామ్ కంపెనీ మార్క్స్ అండ్ స్పెన్సర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)