టీడీపీ-బీజేపీ మిత్రబేధం: రణమా.. శరణమా.. ఎన్నికల వ్యూహమా?

  • 3 ఫిబ్రవరి 2018
మోదీ, చంద్రబాబు Image copyright Getty Images/tdp.ncbn.official/facebook

కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు తాము ఆశించినంతగా జరగలేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తామంటూ సంకేతాలిస్తున్నారు.

వాస్తవానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీల విమర్శల కంటే అధికార పార్టీ విమర్శలే ఎక్కువ కటువుగా ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటామంటూ మాట్లాడుతున్నారు.

ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా మాట్లాడకపోయినా.. మీడియా కథనాలు, టీడీపీ నాయకుల వాగ్ధాటి చూస్తుంటే ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. కేంద్రం సహాయం చేయకుంటే ‘ఏం చేస్తాం.. నమస్కారం పెట్టి బయటకొస్తాం’ అని పోలవరానికి నిధుల కేటాయింపు వ్యవహారం సందర్భంగా చంద్రబాబు చెప్పారని వార్తలొచ్చాయి.. కానీ, తానలా అనలేదని మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

బీజేపీపై టీడీపీ నాయకులు తరచూ విమర్శలు చేస్తుండటం.. వారికి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారని తర్వాతి రోజు వార్తలు రావటం గత కొంతకాలంగా మామూలైపోయింది.

ఈ నేపథ్యంలో ఈసారి కేంద్రంపై ‘యుద్ధం’ ప్రారంభిస్తున్నట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తున్నట్లుగా టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా రణానికి దారితీస్తాయా? లేక ఎప్పట్లాగే చంద్రబాబు వీటిని ఖండిస్తారా? ఈ రెండింటితోపాటు ఇందులో ఇంకేదైనా వ్యూహం ఉందా?

Image copyright AP Govt
చిత్రం శీర్షిక 'విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ లోటును పూడ్చలేదు, నాలుగేళ్లు గడుస్తున్నా రాజధానికి తగినన్ని నిధులు ఇవ్వలేదు’

‘‘వీలైనంత తీసుకుని.. అంచెలంచెలుగా యుద్ధం’’

ఈ చర్చను లేవనెత్తిన వ్యక్తి టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్. శుక్రవారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అంచెలంచెలుగా కేంద్రంపై పోరాటం ప్రారంభమవుతుందని చెప్పారు. దీనిపై ఆయన్ను బీబీసీ సంప్రదించగా.. అవే విషయాలను పునరుద్ఘాటించారు.

‘‘ముఖ్యమంత్రి.. కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం ప్రకటించే దిశలో ముందుకు వెళుతున్నారు. అంచెలంచెలుగా ఈ యుద్ధ ప్రక్రియ ఉంటుంది’’ అని వెంకటేశ్ చెప్పారు.

‘‘రాష్ట్రావతరణ జరిగిన వెంటనే కేంద్రంతో యుద్ధం పెట్టుకోవాలని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. తెలివైన వాళ్లెవరైనా.. కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇచ్చినవన్నీ తీసుకుంటూ.. మిగిలిన వాటికోసం యుద్ధ ప్రకటన చేయాలి. అంతేకానీ, మొదట్లోనే యుద్ధం చేస్తే మనకు చిప్ప మిగిలేది’’ అన్నారు.

‘‘అధికారంలో ఉన్నవారు ఎంత వీలైతే అంత కేంద్రం నుంచి తీసుకుని ఎన్నికల ముందు యుద్ధం ప్రకటించాలి. మిత్రపక్షాలు ఏమీ చేయలేని పరిస్థితి. ఎంతున్నా ప్రేమతోనే లాగాలి. వీలైనంత వరకు తీసుకోవాలి.. తీసుకున్నాం. అంచలంచెలుగా పోరాటాన్ని మా ఛీఫ్ కమాండర్ చంద్రబాబు నిర్ణయిస్తారు. నేను ముందుగానే మీడియాతో చెప్పటం సబబుగా ఉండదు. ఆదివారం చంద్రబాబుతో భేటీ తర్వాతే ఈ వార్ ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

‘‘అంచెలంచెల వార్ అంటే అందరికీ తెలిసిందే.. కేంద్రంలో మేము, రాష్ట్రంలో వారు మంత్రివర్గంలో కొనసాగుతుండగా, ఎంపీలు రాజీనామా, చివరగా తెగతెంపులు ఉంటాయి’’ అని చెప్పారు. చంద్రబాబును ఎవ్వరూ తక్కువ అంచనా వేయరాదు అని కూడా ఆయన అన్నారు.

Image copyright tdp.ncbn.official/facebook

‘‘ఎన్నికల వరకూ పొత్తు కొనసాగుతుంది’’

అయితే, ఎన్నికల ముందే కలసి ప్రజల వద్దకు వెళ్లిన తెలుగుదేశం, బీజేపీల పొత్తు మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ కొనసాగుతుందని బీజేపీ సమన్వయకర్త పురిఘళ్ల రఘురామ్ బీబీసీతో అన్నారు. టీడీపీలో కొత్తగా చేరిన వాళ్లే తప్ప పాత వాళ్లెవరూ బీజేపీని విమర్శించట్లేదని ఆయన చెప్పారు.

‘‘తెలుగుదేశం పార్టీ నాయకుల మాటల్ని సీరియస్‌గా తీసుకోలేం. ఆదివారం భేటీ తర్వాత చంద్రబాబు నాయుడే స్వయంగా ఈ వ్యాఖ్యల్ని ఖండించవచ్చు. గతంలో కూడా ఆయన అలా ఖండించారు. చంద్రబాబు ఇంత వరకూ నేరుగా ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు’’ అని తెలిపారు.

‘‘పొత్తుల గురించి ఎన్నికల సమయంలో మాట్లాడాలనేది బీజేపీ విధానం. అప్పటి వరకూ దేశం, రాష్ట్రాల అభివృద్ధి కోసం మేం మాట్లాడతాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది మా అధిష్ఠానం నిర్ణయిస్తుంది’’ అని రఘురామ్ చెప్పారు.

బడ్జెట్‌లో కేటాయింపులపై స్పందిస్తూ.. ’’ఆంధ్రప్రదేశ్‌కు మేం న్యాయం చేస్తున్నాం. టీడీపీ నాయకుల డిమాండ్లలో పస లేదు. నాలుగేళ్లుగా గుర్తుకురానివి ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా? బడ్జెట్ అనేది దేశం కోసం.. రాష్ట్రం కోసం కాదు’’ అన్నారు.

Image copyright TDP.Official/Facebook
చిత్రం శీర్షిక ‘‘బీజేపీతో కలసి ఎన్నికలకు వెళితే గెలుస్తాం అన్న నమ్మకం ఉంటే ఎన్ని అవమానాలను అయినా చంద్రబాబు భరిస్తారు’’

‘‘రాష్ట్రం కోసం కాదు.. రాజకీయాల కోసమే’’

కాగా, ఈ వ్యవహారం మొత్తం రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్నదిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

‘‘ప్రజల్ని మభ్యపెట్టేందుకే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే ఆగ్రహావేశాలపై నీళ్లు చల్లటమే దీని ఉద్దేశ్యం’’ అని ఆయన అన్నారు.

రాజస్థాన్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటం వల్ల చంద్రబాబు ఈ మాత్రం అయినా మాట్లాడగలిగారని, లేదంటే ఇది కూడా ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘బీజేపీతో కలసి తెలుగుదేశం పార్టీ నడవాలా? వద్దా? అనేది రాజకీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నదే తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై ఆధారపడింది కాదు. బీజేపీతో కలసి ఎన్నికలకు వెళితే గెలుస్తాం అన్న నమ్మకం ఉంటే ఎన్ని అవమానాలను అయినా చంద్రబాబు భరిస్తారు. అలాంటి పరిస్థితి లేదంటే తప్పుకుంటారు. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేసి.. వాటికి తగ్గట్లు చంద్రబాబు వ్యవహరిస్తారు. తగిన సమయం కోసం ఆయన ఎదురుచూస్తారు. చంద్రబాబు మాటలే కనుక నిజం అయితే.. ఈపాటికే ఆయన కేంద్రంపై సుప్రీంకోర్టులో కేసు వేయాలి. కానీ, ఆయన అలా వేయలేదు కదా!’’ అని చెప్పారు.

Image copyright TDP.Official/Facebook
చిత్రం శీర్షిక ‘ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఒకవైపు, తన కొడుక్కి మంచి భవిష్యత్ ఇవ్వాలని మరోవైపు చంద్రబాబు చూస్తున్నారు’

‘నాలుగేళ్ల తర్వాత బీజేపీని నిందిస్తే ప్రజలు నమ్ముతారా?’

రాజకీయాల్లో మిత్రపక్షాలు ఒకరిని మరొకరు నిందించుకోవటం సహజంగా జరిగేదేనని.. కొన్ని దశాబ్దాలుగా బీజేపీ-శివసేనల మధ్య జరుగుతోంది ఇదేనని హన్స్ ఇండియా ఆంగ్ల దినపత్రిక జాతీయ వ్యవహారాల ఎడిటర్ డబ్ల్యు చంద్రకాంత్ బీబీసీతో అన్నారు.

స్థానికంగా తమకు వ్యతిరేకత వస్తోందని గుర్తించినప్పుడు.. ప్రజల నుంచి, రాష్ట్రంలోని ఇతర పార్టీల నుంచి సవాళ్లు ఎదురైనప్పుడు.. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవటానికి, తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవటానికి ఇలాంటి బెదిరింపు రాజకీయాలు జరుగుతుంటాయని ఆయన చెప్పారు.

‘‘గత ఎన్నికల్లో టీడీపీకి చాలా తక్కువ మెజార్టీ వచ్చింది. బీజేపీ కొంత ఉపయోగపడింది. ఇప్పుడు బీజేపీని నిందించి.. శత్రువుగా మార్చుకుని ఎన్నికలకు వెళ్లటం వల్ల ఉపయోగం ఏంటి? పైగా జగన్ కేసులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా చంద్రబాబు బయటకు వెళ్తారని అనుకోలేం. ఇప్పటికిప్పుడైతే కూటమి విడిపోదు’’ అని ఆయన తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మించి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఒకవైపు, తన కొడుక్కి మంచి భవిష్యత్ ఇవ్వాలని మరోవైపు చూస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు బీజేపీతో సంబంధాలను చెడగొట్టుకోవటం వల్ల ఆ రెండూ సాధ్యం కాకుండా పోవచ్చని వివరించారు.

పైగా, నాలుగేళ్ల తర్వాత ఇప్పటికిప్పుడు బయటకు వెళ్లి బీజేపీపై నిందలేస్తే.. ప్రజలు ఎంత వరకు చంద్రబాబును సమర్థిస్తారు అని ప్రశ్నించిన చంద్రకాంత్.. ఒకవేళ కొన్ని నెలల తర్వాత ఈ కూటమి విడిపోతే.. అది ఇరు పార్టీల వ్యూహంగా తాను భావిస్తానని అన్నారు.

Image copyright ysjagan/facebook
చిత్రం శీర్షిక ‘ప్రజలను సంతృప్తి పర్చటానికి, ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటానికి చంద్రబాబు సమాయత్తం అవుతుండవచ్చు’

‘ప్రజల్ని సంతృప్తి పర్చాలి.. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలి’

అయితే, టీడీపీ-బీజేపీల మైత్రి బీటలు వారిందని, రాబోయే కాలంలో అది మరింత తీవ్రరూపం దాలుస్తుందని ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.

‘‘బీజేపీపై పార్లమెంటు లోపల, బయట ఒత్తిడి తీసుకొచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంది. నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి’’ అని ఆయన చెప్పారు.

2014లో బీజేపీ స్థితికి, ప్రస్తుత స్థితికి చాలా తేడా ఉందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అవసరం టీడీపీకి లేదని వివరించారు. ఒకవేళ బీజేపీతో సంబంధాలు తెంచుకుంటే.. అది ఆవేశపూరితంగా తీసుకున్న నిర్ణయం కాదు అని ప్రజలకు తెలిసేలా చంద్రబాబు తదుపరి వ్యూహం ఉంటుందని వెల్లడించారు.

‘‘విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ లోటును పూడ్చలేదు, నాలుగేళ్లు గడుస్తున్నా రాజధానికి తగినన్ని నిధులు ఇవ్వలేదు, కేంద్రీయ సంస్థలకు అరకొర నిధులిచ్చి, పోలవరం నిధులపై స్పష్టత ఇవ్వట్లేదు. రైల్వేజోన్, అసెంబ్లీ సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవట్లేదు’’ అని చెప్పారు.

ప్రస్తుతం ముందస్తు ఎన్నికల అంశంపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలను సంతృప్తి పర్చటానికి, ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటానికి చంద్రబాబు సమాయత్తం అవుతుండవచ్చునని కృష్ణారావు తెలిపారు.

అయితే, బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం గురువారం కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి.. ఏపీకి కేటాయింపుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. ‘‘మిత్రపక్షంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సాధ్యాసాధ్యాలను చూసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. బడ్జెట్‌లో పేర్కొనకపోయినా నిధులు ఇవ్వొచ్చు. ప్రజాస్వామ్యంలో చర్చలు, సంప్రదింపులద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం చేసుకోవాలి.. చర్చల నుంచి తప్పుకుని కాదు’’ అని చెప్పిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)