#BollywoodSexism: సినిమాల్లో స్త్రీ, పురుషులకు సమ ప్రాధాన్యం ఉండాలి - సోనమ్ కపూర్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

#BollywoodSexism: సినిమాల్లో స్త్రీ, పురుషులకు సమ ప్రాధాన్యం ఉండాలి- సోనమ్ కపూర్

  • 3 ఫిబ్రవరి 2018

మగవారికి, ఆడవారికి మధ్య పారితోషికాల్లో సమానత్వానికి హిందీ చిత్ర పరిశ్రమ చాలా దూరంలో ఉందని ప్రముఖ నటి సోనమ్ కపూర్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. బాలీవుడ్‌లో లింగ వివక్ష, లైంగిక వేధింపులు ఉన్నాయా, ఉంటే వాటిపై చిత్రపరిశ్రమలోని కొందరు మహిళలు ఎలా పోరాడుతున్నారు అనే అంశంపై బీబీసీ అందిస్తున్న సిరీస్‌లో ఈ ఇంటర్వ్యూ ఒక భాగం.

లింగ వివక్ష, లైంగిక వేధింపుల సమస్యకు మూడు కోణాలు ఉన్నాయని సోనమ్ చెప్పారు. ''వీటిలో మొదటిది- చాలా మంది మహిళలు తమకు ఏం జరుగుతోందో గుర్తించరు. తమకు వేధింపులు ఎదురవడం మామూలేనని అనుకొంటుంటారు. మొదటి నుంచీ చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు వారిని ఇలా అనుకొనేలా చేస్తాయి. రెండోది- వేధింపులు ఎదురైతే, వాటి గురించి బయటకు చెప్పొద్దని, మౌనంగా ఉండాలని చెబుతుంటారు. అసలేమీ జరగనట్లు వ్యవహరించాలని చెబుతుంటారు. మూడోది- 'మహిళకు ఏమైనా జరిగితే మహిళదే తప్పు' అనే భావన ఉండటం, బాధితులనే నిందించడం'' అని ఆమె వివరించారు.

లైంగిక వేధింపుల గురించి మాట్లాడితే కెరీర్‌ దెబ్బతింటుందనే భయం నటీనటులకు ఉందా అని బీబీసీ ప్రశ్నించగా- కెరీర్ దెబ్బతింటుందని మాత్రమే కాదని, సమాజంలో పలుచన అవుతామనే భయం కూడా ఉంటుందని సోనమ్ సమాధానమిచ్చారు.

ఓ యువతితో అమెరికా నటుడు అజీజ్ అన్సారీ అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలతో మీడియాలో వెలువడిన ఒక కథనాన్ని, దీనిపై చర్చను బీబీసీ సోనమ్ వద్ద ప్రస్తావించింది. ఈ కథనాన్ని విమర్శించేవారు కొందరు, ఇది వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడమేననే వాదించడంపై మీరేమంటారని ప్రశ్నించగా, ఇది ఏ మాత్రం అర్థంలేని వాదనని ఆమె కొట్టిపారేశారు.

మహిళా సాధికారతపై ప్రస్తుతం జరుగుతున్నచర్చ పట్ల ఆశావహంగా ఉన్నానని సోనమ్ ఇటీవల చెప్పారు. ఈ అంశాన్ని ప్రస్తావించగా- తాను సినిమాల్లోకి వచ్చినప్పుడు తనకు 20-21 సంవత్సరాలు ఉంటాయని, అప్పుడు ''నేను స్త్రీవాదిని'' అని చెబితే, తానేదో పొరపాటు చేసినట్లు అందరూ చూశారని, తాను లౌక్యంగా వ్యవహరించలేనని అనుకున్నారని పేర్కొన్నారు. ఈ పదేళ్లలో మార్పు వచ్చిందని, ఇప్పుడు పరిస్థితి అలా లేదంటూ ఆమె ఒకింత సంతోషాన్ని వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)