ప్రెస్‌ రివ్యూ: ‘బీజేపీతో బంధంపై లాజికల్‌గా చూద్దాం’

  • 3 ఫిబ్రవరి 2018
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు Image copyright NARA CHANDRABABU NAIDU/FACEBOOK

భాజపాతో సంబంధాలు ఎలా ఉండాలి? కేంద్ర ప్రభుత్వంలో కొనసాగాలా? వద్దా? అన్న అంశాలపై ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్టు ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

ఉండవల్లిలోని ప్రజాదర్బారు పార్టీ రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న దానిపైనే ప్రధానంగా చర్చించారు. రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల నాయకుల అభిప్రాయాలు కోరగా.. కొందరు తీవ్ర ఆవేశంతో స్పందించారు.

కేంద్రంలోని తెదేపా మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకోవాలని సూచించారు.

'ఇది సున్నితమైన అంశం. కేంద్రం నుంచి మనకు ఎలాంటి సహకారం అందకపోవడంతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. అన్నీ పరిశీలిద్దాం. ఏం చేస్తే లాజికల్‌గా ఉంటుందో చూద్దాం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా, తీసుకోకపోయినా సమస్యే.

మన వ్యతిరేకత తెలియజేయకున్నా ఇబ్బందే. అతిగా వెళ్లినా సమస్యే. పోలవరం వంటి పనులు కేంద్రంతో రోజూ ఉంటాయి. వాళ్లు చెయ్యకూడదనుకుంటే ఇబ్బందులొస్తాయి. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి.

ప్రజల మనోభావాలు, రాష్ట్ర ప్రయోజనాలు, జరిగిన అన్యాయం, ఇకపై ఎలా ముందుకు వెళ్లాలి? ఏం చేస్తే న్యాయం జరుగుతుందన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి' అని ముఖ్యమంత్రి స్పందించినట్టు ఈనాడు దినపత్రిక పేర్కొంది.

Image copyright Getty Images

కొల్లేరు కటకట

కొల్లేరుకు నీరు కరువై వేసవి కన్నా ముందే ఎడారి వాతావరణం కనిపిస్తోందని సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం మేరకు..

కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల నుంచి లక్షా పది వేల క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతోంది.

అయితే.. కొల్లేరుకు వచ్చి చేరే నీటి వనరులను పట్టిసీమకు మళ్లించడంతో కొల్లేరుకు నీటి కొరత ఏర్పడింది. కొల్లేరుపై ఆధారపడి మూడులక్షలకు పైగా జాలర్లు జీవిస్తున్నారు. వీరిలో చాలామంది వేట కరువై.. ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.

ప్రతి ఏటా కొల్లేరుకు సైబీరియా, ఆస్ట్రేలియా, నైజీరియా దేశాల నుంచి వలస పక్షులు విడిది వస్తాయి. స్వదేశీ, విదేశీ కలిపి 189 రకాల పక్షులు వస్తాయని సాక్షి దినపత్రిక ప్రచురించింది.

కానీ కొల్లేరులో నీరు లేకపోవడంతో..ఈ పక్షులకు వేట కరువయ్యింది. జనవరి, ఫిబ్రవరి నెలలు ఈ పక్షుల సంతానత్పత్తికి అనువైన కాలాలు. కానీ.. వేట కరువవ్వడం ఆ పక్షుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతోంది.

రెగ్యులేటర్ నిర్మించకపోవడం వల్ల ప్రతి ఏటా.. సముద్రపు నీరు కొల్లేరులోకి ఎగదన్నుతోంది. దీంత భూములు చౌడుబారడమే కాకుండా, కొల్లేరు సరస్సులో సహజసిద్దంగా పెరిగే నల్లజాతి చేపలు అంతరిస్తున్నాయని, పక్షులు అనారోగ్యం పాలవుతున్నాయని సాక్షి కథనం.

Image copyright Telangana CMO/Facebook

మేడారం జాతరకు 200 కోట్లు: కేసీఆర్

మేడారం జాతరకు శాశ్వత ఏర్పాట్ల కోసం 200 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్.. కుటుంబ సమేతంగా సందర్శించారు.

ప్రపంచం అబ్బురపడేలా రానున్న మేడారం జాతరను నిర్వహిస్తామన్నారు. 200 ఎకరాల భూసేకరణ చేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలిపారు. భూసేకరణపై 15 రోజుల్లో చర్చిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రమొస్తే జాతరకొస్తానని గతంలో మొక్కుకున్నానని, అనారోగ్యంతో గత జాతరకు రాలేకపోయానని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని మొక్కుకున్నట్టు తెలిపారు.

మేడారం జాతరను జాతీయ పండుగగా చేయాలని ప్రధానమంత్రిని కోరుతానని కేసీఆర్ పేర్కొన్నట్లు నవతెలంగాణ కథనం తెలిపింది.

Image copyright MCI

తెలంగాణలో 1,463 వైద్యుల పోస్టుల భర్తీ..

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 1463 మంది వైద్యుల నియామకాలను నేరుగా చేపట్టనున్నారని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

ఈ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం తొలుత ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ పోస్టుల భర్తీని డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీ(డీఎస్సీ) ద్వారా చేపట్టనున్నట్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కింద 1224 డాక్టర్లు, ఆయూష్‌ విభాగంలో 183 మంది వైద్యులను నేరుగా భర్తీ చేయనున్నట్టు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు జీవో జారీ చేశారు.

గత డిసెంబరు 11న వైద్య ఆరోగ్యశాఖలో 2517 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వాటిని టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయాలని సర్కారు ఉత్తర్వులిచ్చింది.

ఈ పోస్టులకు 70శాతం మార్కులు, 30 శాతం వెయిటేజీని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసేవారికి రెండున్నర మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో వారికి 2, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నవారికి 1 మార్కు వెయిటేజీని నిర్ణయించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవిదేశీ పక్షుల విడిదిల్లు - కొల్లేరు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)