గ్వాటెమాల అడవుల్లో నిదుర లేచిన మయా నాగరికత!

  • 3 ఫిబ్రవరి 2018
గాటెమాల అడవి ఒకవైపు, మరోవైపు లిడార్ టెక్నాలజీతో చెట్లు లేకుండా కనిపిస్తున్న అదే ప్రాంతం Image copyright Wild Blue Media/Channel 4

గ్వాటెమాల అడవుల్లో విస్తరించిన మయా నాగరికత శిథిలాలను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. చరిత్రలో ఇదో పెద్ద ఆవిష్కరణ!

మొత్తం 60,000 శిథిలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్వాటెమాల అడవి దుప్పటి కింద నిద్రిస్తోన్న నాగరికతా శిథిలాలను గుర్తించడానికి పరిశోధకులు లేజర్ టెక్నాలజీని ఉపయోగించారు.

ఈ అన్వేషణలో ఆనాటి ఇళ్లు, భవంతులు, విశాలమైన రహదారులు, రక్షణగా నిర్మించుకున్న కోట గోడలు బయటపడ్డాయి.

ఇదే ప్రాంతానికి సమీపంలోనే గతంలో కూడా కొన్ని పరిశోధనలు జరిగాయి. అయితే తాజా పరిశోధన అంతవరకూ ఉన్న అంచనాలను పూర్తిగా మార్చేసింది.

ఆ ప్రాంతంలో జీవించిన మయా ప్రజల జనాభా కూడా గతంలో ఊహించినదానికంటే ఇంకా ఎక్కువే ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

2,100 చదరపు కిలోమీటర్లలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మయా నాగరికత గురించిన ఆలోచనా విధానాన్ని ఈ సరికొత్త టెక్నాలజీ మార్చివేసిందని అధికారులు చెబుతున్నారు.

''గత 150 సంవత్సరాల్లో ఈ ఆవిష్కరణ అద్భుతమైన ఫలితాలనిచ్చింది'' అని బ్రౌన్ యూనివర్సిటీ పురావస్తు శాఖ ప్రొఫెసర్ స్టీఫెన్ హోస్టన్ అన్నారు.

దశాబ్దాల పరిశోధనల్లో ఇది కీలక ఘట్టమని ప్రొ. హోస్టన్ బీబీసీతో అన్నారు.

''అతిశయోక్తి అనుకోకపోతే.. ఈ నిర్మాణాలను కనుగొన్నపుడు నిజంగానే నా కళ్లు చెమర్చాయి.''

ఈ ఆవిష్కరణతో మధ్య అమెరికా కూడా గ్రీస్, చైనా లాంటి ఘనమైన నాగరికతను కలిగి వుండేదని అర్థమైంది. మయా నాగరికత విలసిల్లిన ప్రాంతానికి సంబంధించి, అంతవరకూ ఉన్న అంచనాలన్నీ తారుమారయ్యాయి.

గతంలో భావించిన ఆ ప్రాంత జనాభా, ఆ ప్రాంతం వైశాల్యం అన్నీ రెండు మూడు రెట్లు ఎక్కువగానే ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్త థామస్ గేరిసన్ బీబీసీతో అన్నారు.

Image copyright Wild Blue Media/Channel 4

అసలీ ‘లిడార్’ అంటే ఏమిటి?

లిడార్ టెక్నాలజీ అధునాతనమైనది. ఈ టెక్నాలజీలో శాస్త్రవేత్తలు కాంతితో పరిశోధనలు చేస్తారు.

దీన్ని ఓ 'మ్యాజిక్' గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు. పురావస్తు అధ్యయనాల్లో మనిషి కంటికి కనిపించని శిథిలాలను ఈ లిడార్ టెక్నాలజీ కనిపెడుతుంది.

  • ఈ సరికొత్త ఈ సాంకేతిక పరిజ్ఞానంలో లేజర్ లైట్‌ను ఉపయోగించి, భూమి అంతర్భాగంలోని శిథిలాలను గుర్తిస్తారు.
  • హెలికాప్టర్ లేదా ఛాపర్ నుంచి పరిశోధనల కోసం ఎంచుకున్న ప్రాంతంపై ప్రతి నాలుగు సెకన్లకూ కొన్ని లక్షల లేజర్ కిరణాలను భూమి పైకి పంపుతారు.
  • ఈ కిరణాలు భూమిలోని శిథిలాలను, నిర్మాణాలను తాకి వెనక్కి వస్తాయి. ఆ కిరణాలు వేగంగా తిరిగొచ్చే వేగాన్ని బట్టి తరంగ దైర్ఘ్యాన్ని కొలుస్తారు.
  • ఈ ప్రయోగం ద్వారా కచ్చితమైన కొలతలతో 3డి చిత్రాలు ఉత్పన్నమవుతాయి.

పరిశోధనలో భాగంగా.. ఆ ప్రాంతంలోవున్న దట్టమైన చెట్లను డిజిటల్‌ సహాయంతో తొలగించి 3డి మ్యాప్‌ను తయారు చేశారు.

''టెలిస్కోప్ ఖగోళ శాస్త్రంలో విప్లవాత్మక మార్పులకు ఎలా కారణమైందో అలానే ప్రస్తుతం ఈ లిడార్ సాంకేతిక పరిజ్ఞానం కూడా పురావస్తు శాస్త్రంలో భారీ మార్పులను తేనుంది'' అని టులాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో ఎస్ట్రాడా-బెల్లీ నేషనల్ జియోగ్రఫిక్‌తో అన్నారు.

''మాకు అందిన సమాచారాన్ని విశ్లేషించడానికి, అసలు మేం చూస్తున్నదాన్ని అర్థం చేసుకోవడానికి మరో 100 సంవత్సరాల సమయం పడుతుంది'' అని ఆయన అన్నారు.

Image copyright Wild Blue Media/Channel 4

ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా తవ్వకాలు చేస్తున్న పురావస్తు అధికారులు కూడా లిడార్ ఆవిష్కరణలో వెలుగు చూసిన కిలోమీటర్ల పొడవున్న రక్షణ గోడను గుర్తించలేక పోయారు.

లిడార్ పరిజ్ఞానం వల్ల ఇలాంటి లాభాలే కాదు, కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు.

''మూడు వేల సంవత్సరాల కిందటి మయా నాగరికత చిత్రాలను సంక్లిష్టంగా అందజేస్తుంది. ఆ సమాచారాన్ని అర్థం చేసుకోవడంలో ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది'' అని తాజా పరిశోధనలో పాల్గొన్న గేరిసన్ అన్నారు.

Image copyright Wild Blue Media/Channel 4

అసలక్కడ ఏముందంటే..

మయా నాగరికత 1,500 ఏళ్ల క్రితం నాటిది. మధ్యయుగం నాటి ఇంగ్లండ్ దేశం విస్తీర్ణం కన్నా రెట్టింపు విస్తీర్ణంలో ఈ నాగరికత విలసిల్లింది.

''మయా నాగరికత జనాభా సుమారు యాభై లక్షలు ఉంటుందని ఇంతవరకూ ఊహిస్తూ వచ్చారు. కానీ వారి జనాభా సుమారు కోటి యాభై లక్షలు ఉంటుందనడంలో ఆశ్చర్యమేమీ లేదని తాజా అధ్యయనం వెల్లడించింది'' అని ఎస్ట్రాడా-బెల్లి అన్నారు.

Image copyright Wild Blue Media/Channel 4

''మయా ప్రజల్లో చాలా మంది అందరూ నివాసయోగ్యం కావని భావించే లోతట్టు ప్రాంతాలు, చిత్తడి నేలల్లోనే జీవించారు''

పరిశోధనలో బయటపడ్డ 60 వేల నిర్మాణాలను రాతి పునాదులపైనే నిర్మించారు. ఆ పునాదులపై ఓ మోస్తరు స్తంబాల సహాయంతో పూరిళ్లను నిర్మించుకున్నట్టు తెలుస్తోంది.

''మయా నాగరికతలో.. ప్రాణరక్షణ కోసం చాలా కష్టపడ్డారు. అందుకోసం పెద్ద పెద్ద కోట గోడలు నిర్మించుకున్నారు. గత పరిశోధనల్లో ఈ విషయం మేం ఊహించలేదు'' అని గేరిసన్ అన్నారు.

ఏడంతస్తుల ఎత్తున్న ఓ పిరమిడ్ కూడా పరిశోధనలో వెలుగు చూసింది. కానీ ఈ పిరమిడ్ మొత్తం అడవి చెట్లతో కప్పబడింది.

మయా నాగరికత లోని అన్ని నగరాలను కలుపుతూ వేసిన రహదారులు కూడా ఉన్నాయి. రహదారులు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఆ కాలంలో వర్తకం కూడా ఎక్కువగా జరిగేదని అర్థం చేసుకోవచ్చు.

మయా నాగరికత వివరాలు, విశేషాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 11న ఇంగ్లండ్‌లో.. 'ఛానెల్ 4' లో ప్రసారమయ్యే కార్యక్రమంలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్ - ఉత్తర కొరియా: 'వెలిగిపోయే విజయం మాది' అంటున్న కిమ్ జోంగ్ ఉన్

లద్దాఖ్‌లో ప్రధాని మోదీ.. భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య హఠాత్ పర్యటన

తెలుగు రాష్ట్రాలకు 'ఆత్మనిర్భర్ భారత్' కింద వచ్చింది ఎంత? వలస కార్మికులకు ఇచ్చింది ఎంత?

పాకిస్తాన్‌లో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి అడ్డంకులు... ఫత్వా జారీ చేసిన మదర్సా

భారత్-చైనా 5జీ స్పెక్ట్రమ్‌పై కన్నేసిన చైనా కంపెనీలను అడ్డుకోవడం ఎలా?

బాలీవుడ్ డాన్స్ మాస్టర్ 'ఏక్ దో తీన్..' ఫేమ్ సరోజ్ ఖాన్ మృతి...

కరోనా వ్యాక్సీన్ ఎప్పుడు? భారత్ బయోటెక్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లాతో బీబీసీ ఇంటర్వ్యూ

కాన్పూర్‌లో ఎన్‌కౌంటర్, డీఎస్పీ సహా 8 మంది పోలీసుల మృతి

ఫేస్‌బుక్ కథ ముగిసినట్లేనా