అభిప్రాయం: బడ్జెట్‌లో విద్యారంగానికి నిధులు తగ్గిస్తే నైపుణ్యాలు ఎలా పెరుగుతాయి?

  • 3 ఫిబ్రవరి 2018
జార్ఖండ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నేలపై చిన్నారుల విద్యాభ్యాసం Image copyright DIBYANGSHU SARKAR/AFP/Getty Images
చిత్రం శీర్షిక బ్యాంకులను పునరుద్ధరించటానికి అవసరమైన నిధుల కోసం.. విద్య, ఆరోగ్యం వంటి రంగాలను పణంగా పెట్టాల్సి వస్తోంది

కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ అస్పష్ట హామీలతో నిండివుంది. 2019 మధ్యలో రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కనిపిస్తోంది.

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన ఐదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు నుంచే సాధారణ ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయని రాజకీయ పరిశీలకులు సందేహిస్తూ వచ్చారు. ఆ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగుతాయని వారు ఇప్పుడు నమ్ముతున్నారు.

అధికార భారతీయ జనతా పార్టీ ఈ ఏడాదిలో మరో పది రాష్ట్రాల ఎన్నికలకు కూడా సన్నద్ధమవుతోంది.

భారత కార్మిక శక్తి అధిక భాగం ఇంకా ఆధారపడివున్న వ్యవసాయ రంగం కోసం జైట్లీ ఏదైనా చేస్తారని అందరూ భావించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు 0.91% మాత్రమే ఉంటుందని అంచనా.

Image copyright SAM PANTHAKY/AFP/Getty Images
చిత్రం శీర్షిక కనీస మద్దతు ధర పథకం వల్ల ప్రయోజనం పొందని రైతులు చాలా మంది ఉన్నారు

ప్రభుత్వం వరి, గోధుమలను కనీస మద్దతు ధరకు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తుంది. కానీ ఈ పథకం వల్ల ప్రయోజనం పొందని రైతులు చాలా మంది ఉన్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయటంలో ఉన్న పరిమితులు దానికి కారణం.

ఇప్పుడు ఇతర పంటలను కూడా కనీస ధరకు కొంటామని, లేదంటే కనీస ధరకు తమ ఉత్పత్తులను విక్రయించలేకపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు.

ప్రత్యేకించి.. ఈ పరిహారం ఇస్తామనే హామీ చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. దీనికయ్యే వ్యయాన్ని ఎలా సమకూరుస్తామనేది జైట్లీ వివరించలేదు.

అలాగే.. భారీ మొత్తాల్లో కొనేవారితో సహా వినియోగదారులకు రైతులే నేరుగా తమ ఉత్పత్తులను అమ్మగలిగేందుకు వీలు కల్పిస్తూ 22,000 గ్రామీణ మార్కెట్లను అభివృద్ధి చేసి, స్థాయిని పెంచాలని కూడా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది.

బడ్జెట్ ప్రవేశపెట్టడమనేది ప్రభుత్వ విధానాల దిశానిర్దేశాలను ప్రకటించే సందర్భంగా అనాదిగా కొనసాగుతోంది. భారత వ్యవసాయ రంగానికి ఈ దిశానిర్దేశ ప్రణాళిక అత్యవసరం.

Image copyright AFP/ Getty Images
చిత్రం శీర్షిక భారత కార్మిక శక్తిలో అధిక భాగం ఇంకా వ్యవసాయ రంగం మీదే ఆధారపడివుంది

ఈ రంగంలో ‘‘ప్రచ్ఛన్న నిరుద్యోగిత’’ చాలా అధికంగా ఉంది. అంటే వ్యవసాయం ద్వారా బతుకు తెరువు సంపాదించుకోవాలని ప్రయత్నించే వారు చాలా ఎక్కువ మంది ఉన్నారని అర్థం. వారు పనిచేయటం ఆపేస్తే ఉత్పత్తి దెబ్బతినదు కాబట్టి వారి ఉపాధి ఉత్పాదకంగా లేదని అర్థం.

వ్యవసాయ రంగం ఆర్థికంగా ఆచరణ సాధ్యతను సంతరించుకోవాలంటే.. దాదాపు 8.4 కోట్ల మంది - భారత గ్రామీణ కార్మిక శక్తిలో సుమారు నాలుగో వంతు - వ్యవసాయం నుంచి తప్పుకోవాలని ప్రభుత్వ మేధో సంస్థ ఒకటి ఇటీవల విడుదల చేసిన పత్రం పేర్కొంది.

కానీ ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ ఈ సమస్యను పరిష్కరించటం మీద దృష్టి పెట్టలేదు.

ఇతర దేశాల్లో కార్మిక శక్తి వ్యవసాయం నుంచి పక్కకు తొలగినపుడు.. నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి ఉద్యోగాలు లభించాయి. కానీ భారత గ్రామీణ శ్రామిక శక్తిలో అత్యధిక భాగానికి నైపుణ్యం లేదు. ఉన్నా అది అరకొర నైపుణ్యమే.

Image copyright AFP/Getty Images
చిత్రం శీర్షిక పెట్టుబడులు మళ్లీ పుంజుకోనిదే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టించటం సాధ్యం కాదు

పైగా భారత జీడీపీ - పెట్టుబడి నిష్పత్తి గత 11 ఏళ్లుగా దిగజారుతోంది - 2007లో అత్యధికంగా 35.6 శాతానికి పెరిగిన ఈ నిష్పత్తి 2017 నాటికి 16.4 శాతానికి పడిపోయిందని తాజా ఆర్థిక సర్వే చెప్తోంది.

పెట్టుబడులు మళ్లీ పుంజుకోనిదే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టించటం సాధ్యం కాదు. 2018-19 మధ్య 51 లక్షల ఇళ్లు నిర్మించటం లక్ష్యంగా పథకం ప్రకటించటం ద్వారా ఈ లోటును కొంత భర్తీ చేయాలని ఆర్థికమంత్రి జైట్లీ ప్రయత్నించారు. అంతకుముందు రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం భారీ పథకం ప్రకటించింది. అది కూడా కొంత సాయపడుతుంది.

ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ వాటా అంతా కలిసి 12 శాతం మాత్రమే ఉంటుంది కనుక.. ప్రభుత్వం ఆ మేరకు మాత్రమే చేయగలదు.

ప్రైవేటు పెట్టుబడులు పెరగాలంటే కొన్ని సంస్కరణలు - కార్మికులు, పన్ను విధానం, భూ సేకరణలకు సంబంధించిన చట్టాలను సరళీకృతం చేయటం, సులభ వ్యాపారాన్ని మొత్తంగా మెరుగుపరచటం వంటి సంస్కరణలు అవసరం.

పెట్టుబడి పునరుత్తేజమవటం మీద ఆర్థిక సర్వే అనుమానంగానే ఉంది: ‘‘భారత్‌లో పెట్టుబడులు తగ్గిపోవటాన్ని తిప్పికొట్టటం కష్టంగానే కనిపిస్తోంది’’ అని ఆ సర్వే వ్యాఖ్యానించింది.

Image copyright AFP/Getty Images
చిత్రం శీర్షిక ప్రభుత్వ విధానాల దిశనిర్దేశాలను ప్రకటించే సందర్భం బడ్జెట్ ప్రవేశపెట్టటం

ఆర్థికమంత్రి జైట్లీ ‘‘372 నిర్దిష్ట వాణిజ్య సంస్కరణ చర్యల’’ను గుర్తించటం గురించి మాత్రమే ప్రస్తావించారు.

దేశంలో ప్రతి నెలా పది లక్షల మంది కార్మిక శక్తిలోకి ప్రవేశిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది మరింత ముఖ్యమైన అంశం.

వారికి ఉద్యోగాలు లేకపోవటం పెద్ద సమస్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాల్లో చేసిన పలు ప్రకటనలు ఈ సమస్యను వారు ఇంకా గుర్తించలేదని చెప్తున్నాయి. జైట్లీ సైతం తన బడ్జెట్ ప్రసంగంలో ఈ సమస్యను గుర్తించలేదు.

భారత శ్రామిక శక్తికి అవరోధంగా మారిన మరో ప్రధాన సమస్య.. విద్య - ఇంకా చెప్పాలంటే అది లోపించటం. విద్య మీద ప్రభుత్వం (కేంద్ర స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ) ఖర్చు చేస్తున్న నిధుల మొత్తం.. 2011-12లో జీడీపీలో 3.2 శాతంగా ఉంటే 2017-18 నాటికి 2.7 శాతానికి పడిపోయింది.

Image copyright AFP/Getty Images
చిత్రం శీర్షిక ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు

ఒక దాని తర్వాత ఒకటిగా కేంద్ర ప్రభుత్వాలు.. తాము విక్రయించాలని భావించని బ్యాంకులను ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించటాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇదేమీ ఆశ్యర్యం కలిగించదు. ‘‘పునఃపెట్టుబడులు పొందిన బ్యాంకులకు ఇప్పుడు అభివృద్ధికి ఆసరానిచ్చే సామర్థ్యం మరింత ఎక్కువగా ఉంటుంది’’ అని జైట్లీ పేర్కొన్నారు.

ప్రభుత్వ యాజమాన్యంలోని 21 బ్యాంకులకు మళ్లీ పెట్టుబడులు పెట్టటం కోసం 2009 నుంచి ఇప్పటివరకూ 1,50,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేశారు. నష్టాల్లో ఉన్న మరికొన్ని సంస్థలను కూడా ప్రభుత్వం నడుపుతోంది.

ఈ బ్యాంకులను పునరుద్ధరించటానికి, విఫలమవుతున్న ఈ సంస్థలను నడిపించటానికి అవసరమైన నిధుల కోసం.. విద్య, ఆరోగ్యం వంటి రంగాలను పణంగా పెట్టాల్సి వస్తోంది.

Image copyright AFP/Getty Images
చిత్రం శీర్షిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అంతగా నైపుణ్యం లేని యువ కార్మిక శక్తిని ఉత్పత్తి చేశాయి

భారత ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చదువుకున్న విద్యార్థుల అభ్యాస ఫలితాలు గత కొన్నేళ్లుగా బాగా పడిపోయాయి - గ్రామీణ భారతదేశంలో మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకూ చదువుతున్న వారిలో దాదాపు సగం మంది చిన్నారులు కనీస ప్రాథమిక అభ్యసన స్థాయిని కూడా అందుకోలేకపోతున్నారు.

జైట్లీ తన ప్రసంగంలో ఈ విషయాన్ని అంగీకరించారు. ఉపాధ్యాయుల నాణ్యతను మెరుగుపరటం గురించి మాట్లాడారు.

అయితే.. ఇంతకుముందు కూడా ఇవే మాటలు చెప్పారు. ప్రాధమిక విద్యకు ఎక్కువ నిధులు కేటాయించటంతో పాటు.. భారతీయ పాఠశాలల్లో చిన్నారులకు విద్యాబోధన విధానాన్ని మార్చాల్సిన అవసరముంది. దీని గురించి ప్రభుత్వం మరింతగా మాట్లాడితే బాగుండేది.

ప్రతి చోటా ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయటానికి ప్రయత్నించటానికి బదులు.. పేద తల్లిదండ్రులకు ప్రభుత్వం విద్యా కూపన్లు ఇవ్వవచ్చు. అప్పుడు తమ పిల్లలను ఏ స్కూలుకు పంపించాలనేది వారి తల్లిదండ్రులు నిర్ణయించుకోగలరు. దీనిద్వారా తల్లిదండ్రులకు ఒక విధమైన బేరమాడే శక్తి లభించేది.

కానీ భారత ప్రభుత్వం ఏదీ కూడా.. మార్కెట్-తరహా పరిష్కారాలను ఇష్టపడదు.

Image copyright AFP/Getty Images
చిత్రం శీర్షిక 10 కోట్ల పేద కుటుంబాల కోసం ప్రధానమైన ఆరోగ్య పథకం ప్రకటించారు

ఇక ఆరోగ్య రంగంలో.. 10 కోట్లకు పైగా పేద, దుర్బల కుటుంబాల కోసం (సుమారు 50 కోట్ల మంది లబ్ధిదారుల కోసం) ఒక భారీ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ద్వితీయ, తృతీయ చికిత్సల కోసం ఆస్పత్రుల్లో చేరితే కుటుంబానికి రూ. 5,00,000 వరకూ బీమా కవరేజీ ఉంటుంది.

ఇటువంటి ఆశావహ పథకాన్ని ఎలా అమలుచేస్తారు, నిధులు ఎలా చెల్లిస్తారు అనేది ప్రభుత్వం వివరించలేదు.

స్థూలంగా చెప్తే.. జైట్లీ కలలు చూపిస్తూ వాటిని తమ ప్రభుత్వం ఎలా సాధిస్తుందనేది వివరించకుండా వల విసిరారు. ఇంతకుముందు బడ్జెట్ల తరహాలోనే ఈ బడ్జెట్ కూడా.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న సంస్థాగత సమస్యల మీద దృష్టి పెట్టలేదు.

వివేక్ కౌల్ ‘ఇండియాస్ బిగ్ గవర్నమెంట్ - ద ఇంట్రూజివ్ స్టేట్ అండ్ హౌ ఇట్ ఈజ్ హర్టింగ్ అజ్’ రచయిత.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం