#HerChoice: పెళ్లి కాకుండానే తల్లిగా ఉండాలనుకున్నాను!

  • 4 ఫిబ్రవరి 2018
#HerChoice, మహిళ, సహజీవనం, గర్భవతి

ప్రేమలో పడ్డప్పుడు అతనిది నా దేశం, మతం, కులం కాదనే విషయాన్ని లెక్కే చేయలేదు. తనతో నెలపాటు సాగిన సహజీవనం తెగిపోయాకే అతని బిడ్డను కడుపులో మోస్తున్నాననే విషయం తెలిసింది.

పెళ్లి కాకుండా 21 ఏళ్లకే ఓ బిడ్డకు తల్లి కాబోతున్నాను. అందుకే నా స్నేహితుల దృష్టిలో నేనో పిచ్చిదాన్ని అయిపోయాను. నాకు అలానే అనిపించింది. ఇంకేదో కీడు జరగబోతుందని భయమేసింది. కానీ, జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. అంతకంటే కీడు ఇంకేముంటుంది?

ముస్తఫాను తొలిసారి కలిసినప్పుడు నాకు 19 ఏళ్లు. ఈశాన్య భారతదేశంలోని ఓ చిన్న పట్టణం నుంచి కాల్‌ సెంటర్‌లో ఉద్యోగం చేయడానికి నగరానికి వచ్చాను. ఆఫ్రికా మూలాలున్న ముస్తఫా ఆజానుబాహుడు. నల్లగా ఉన్న అందగాడు. నేను తన ఆకర్షణలో పడిపోయా.

మొదట మేం మంచి స్నేహితులమయ్యాం. అది కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్లకు కలిసి జీవించడం మొదలు పెట్టాం. నేను క్రిస్టియన్, తను ముస్లిం. ప్రేమలో ఉన్నా కూడా పెళ్లి గురించి ఆలోచించే ధైర్యం చేయలేదు. ఇదంతా అసందిగ్ధంగా అనిపించినా కూడా కలల ప్రపంచంలో జీవిస్తూ మా భవిష్యత్తు గురించి ఆలోచనలు, ప్రణాళికలు వేసుకున్నాం.

అతనికి చాలా మంది స్నేహితులున్నారు. వాళ్లు తరచుగా మా ఇంటికి వస్తుండటంతో నేను వాళ్లతో చనువుగా మెలిగా. కొన్నికారణాలతో ముస్తఫా నన్ను అనుమానించడం మొదలు పెట్టాడు. తన స్నేహితుడితో నేను సంబంధం పెట్టుకున్నానని భావించాడు. అదే మా ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది.

ఆ గొడవలు కాస్తా ఇద్దరం తిట్టుకునే స్థాయికి చేరాయి. రోజంతా ఒకరిని ఒకరు అవమానించుకోవడం, తిట్టుకోవడం మామూలుగా మారింది. చివరకు ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత నేనే ఎంతో భయపడ్డా. గంటల తరబడి ఏడ్చేదాన్ని. చివరకు ఆ ప్రభావం నా పని మీద పడింది. ఉద్యోగం పోయింది.

#HerChoice - 12 మంది భారతీయ మహిళల వాస్తవగాథలు. ఈ కథనాలు 'ఆధునిక భారతీయ మహిళ' ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆకాంక్షలు, ప్రాధాన్యాల గురించి వివరిస్తూ మన ఆవగాహనను విస్తృతం చేస్తాయి.

మళ్లీ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. ముస్తఫాతో గడిపిన క్షణాలను గుర్తు చేస్తున్న ఈ చిన్న అపార్ట్‌మెంట్ నుంచి పారిపోవాలని అనిపించింది. కానీ, నెలసరి సమయం తప్పడంతో నా ప్రణాళికలన్నీ వృథా అయ్యాయి. సమీపంలో ఉన్న షాపు నుంచి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తెచ్చుకున్నా. నా భయం నిజమైంది. టెస్టులో పాజిటివ్ అని వచ్చింది.

ఇది రెండోసారి. తొలిసారి నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ముస్తఫా బలవంతంగా నాకు అబార్షన్ చేయించాడు. ముస్తఫాకు ఫోన్ చేసి కేఫ్‌కి రమ్మని పిలిచా. అక్కడ ఎదురెదురుగా కూర్చున్నప్పుడు నా పరిస్థితి గురించి చెప్పా.

సరైన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదంటూ తను నా మీద అరవడం మొదలు పెట్టాడు. అబార్షన్ చేసుకోడానికి వందల కారణాలు చెప్పాడు. అసలు పుట్టబోయేది నా బిడ్డేనని ఎలా నమ్మాలి అంటూ నన్ను నిలదీశాడు. కానీ, నేను పెద్దగా చలించలేదు.

మొదటిసారి అబార్షన్ చేసుకున్నప్పుడు మాత్రం హత్య చేసినట్లు అనిపించింది. ఇంకోసారి నా బిడ్డను హత్య చేసే ధైర్యం నాకు లేదు. నేను భయపడకపోతేనే నా బిడ్డ బతుకుతుంది.

నాకింకా పెళ్లి కాలేదు. సరైన ఉద్యోగం కూడా లేదు. అన్నింటికి మించి నా బిడ్డకు తండ్రిగా ఉండటానికి కూడా అతను అంగీకరించడం లేదు.

ఇన్ని కష్టాలు చుట్టుముట్టినా నా మీద నాకు నమ్మకం ఉంది. ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం దేవుడు ఇస్తాడని అనిపించింది. ఇన్నాళ్లు జీవితాన్ని లెక్క చేయకుండా ఆశ్రద్ధగా గడిపాను. ఇప్పుడు ఒంటరిగా బిడ్డను పెంచే సామర్థ్యం నాకుందా అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు.

నా ముందు ఉన్న దారి అంత తేలికైనది కాదనే విషయం స్పష్టంగా తెలుసు. కానీ, ఇప్పుడు బాధ్యతగా జీవించే పరిస్థితులు ఎదురయ్యాయి. పుట్టబోయే బిడ్డ మీద నాకున్న ప్రేమ తనని ఈ లోకం చూసేలా చేస్తుంది.

నేను తల్లి కాబోతున్నాననే విషయం ఇంట్లో చెప్పడానికి భయపడ్డా. వాళ్లకు ముస్తఫాతో నాకున్న బంధం గురించి తెలుసు. కానీ, గర్భవతిని అని తెలియడంతో కోప్పడ్డారు. పెళ్లి కాకుండానే తల్లి కాబోతుండటం పట్ల వారేమీ అభ్యంతరం చెప్పలేదు. కానీ, ఓ నల్లటి బిడ్డకు, తమ కులం, మతం కాని వ్యక్తి బిడ్డకు జన్మనిస్తున్నందుకు మాత్రం కలవరపడ్డారు.

అన్ని విషయాలు నేనే చూసుకుంటానని వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేశా. దీంతో మరోసారి వాళ్లు నా దగ్గర ఈ ప్రస్తావన తీసుకురాలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో దేవతలా నా స్నేహితురాలు అండగా నిలిచింది. తన స్కూటీని నాకిచ్చి హెల్త్ చెకప్‌లకు ఆసుపత్రికి వెళ్లడానికి సహకరించింది.

రోజులు గడవడానికి సేల్స్‌గర్ల్‌గా పని చేయడం మొదలుపెట్టా. అదే సమయంలో ముస్తఫా మళ్లీ నాకు దగ్గరవడానికి ప్రయత్నించాడు. కానీ, నా నిర్ణయం ఎప్పుడో తీసుకున్నా. ప్రసవ సమయంలో నా స్నేహితురాలు అదే స్కూటీ మీద ఆసుపత్రికి తీసుకెళ్లింది. నాకు సిజేరియన్ చేశారు. నేను స్పృహలోకి వచ్చేటప్పటికి నా స్నేహితురాలి ఒడిలో నా బిడ్డ నిద్రపోతున్నాడు. నా పక్కనే డాక్టర్ నవ్వుతూ నిలబడ్డారు.

సాయంత్రం ముస్తఫా కూడా ఆసుపత్రికి వచ్చాడు. తన బిడ్డను ముద్దు పెట్టుకున్నాడు. ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి తాను తండ్రినయ్యానని చెప్పాడు. తాను సంతోషంగా ఉండటం చూసి నాకు ఆశ్చర్యమేసింది. కానీ, తండ్రినయ్యాననే విషయం ఇంట్లో చెప్పే ధైర్యం మాత్రం అతను చేయలేదు.

మళ్లీ మనం కలిసి ఉందామని అతను ప్రతిపాదించాడు. తన బిడ్డకు ముస్లిం పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ, నేను ఒప్పుకోలేదు. నా బిడ్డకు క్రిస్టియన్ పేరే పెట్టాలనుకున్నా. ఇకపై ముస్తఫాను నమ్మే పరిస్థితే లేదు.

కొన్నాళ్ల తర్వాత.. అమ్మ, చెల్లి నాతో ఉండటానికి వచ్చారు. ఇప్పుడు ఇక నేను ఒంటిరిదాన్ని కాదు. తర్వాత ఏడాదే ముస్తఫా తన దేశానికి వెళ్లిపోయాడు. మళ్లీ ఎప్పుడూ ఇక్కడికి రాలేదు.

ఇప్పుడు నాకు 29 ఏళ్లు. నా కొడుకు ఆరోయేట అడుగుపెడుతున్నాడు. కొన్నాళ్లు క్లిష్ట పరిస్థితుల్లో జీవించాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు చాలా ధైర్యంగా నా బిడ్డను పెంచుతున్నా.

సహజీవనం వల్లే నాకు బిడ్డ పుట్టాడని, పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యానని చెప్పడానికి సంకోచించడం లేదు. మా అబ్బాయిని నీ తండ్రి ఎవరు అని ఎవరైనా అడిగితే ముస్తఫా పేరు చెప్పడాన్ని ప్రోత్సహిస్తున్నా. నేను తీసుకున్న నిర్ణయం పట్ల ఇప్పుడేమీ బాధపడటం లేదు. ఈ జీవితంతో సంతృప్తిగానే ఉన్నా.

ఇప్పుడు వాడు మా అమ్మ దగ్గర పెరుగుతున్నాడు. మంచి భవిష్యత్తు కోసం నేను కష్టపడి పనిచేస్తున్నా. పార్టీలు, వివిధ కార్యక్రమాల్లో పాటలు పాడుతున్నా. నా బిడ్డ భవిష్యత్తు కోసం కాస్త డబ్బు కూడబెడుతున్నా. మా వాడు చాలా చురుకైనవాడు.

ముస్తఫాతో నా బంధం శాశ్వతంగా ముగిసింది. కానీ, అతని జ్ఞాపకం మాత్రం నాకెప్పుడు ప్రత్యేకమే.

తనతో ముగిసిన బంధం ఎలా జీవించాలో నేర్పింది. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇంకా ముందుకు వెళ్లాలనుకుంటున్నా. మళ్లీ నేను ప్రేమలో పడాలనుకుంటున్నా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. కానీ, అప్పుడే తొందరేమీ లేదు. రాసిపెట్టి ఉంటే కచ్చితంగా అది జరిగి తీరుతుంది.

(ఈశాన్య భారత్‌కు చెందిన ఓ మహిళ తన నిజ జీవితగాథను బీబీసీ ప్రతినిధి సింధువాసిని త్రిపాఠితో పంచుకోగా, సీనియర్ ప్రతినిధి దివ్య ఆర్య దీనిని అక్షరబద్ధం చేశారు. ఆ మహిళ విజ్ఞప్తి మేరకు ఆమె పేరును రహస్యంగా ఉంచుతున్నాం. ఆ వ్యక్తి పేరు మార్చాం.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)