హెచ్‌సీయూ: ఏబీవీపీ ఆందోళనకు కారణాలేంటి?

  • దిగవల్లి పవన్‌కాంత్
  • బీబీసీ ప్రతినిధి

రెండేళ్ల క్రితం దళిత స్కాలర్ రోహిత్ వేముల మృతి కారణంగా వార్తల్లో నిలిచిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) ఇప్పుడు మరో దఫా నిరసనలకు వేదికగా మారింది.

ఈ ప్రతిష్ఠాత్మక వర్సిటీలో సాధారణంగా వామపక్ష, దళిత-బహుజన విద్యార్థి సంఘాలు నిరసనలకు దిగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) వీధుల్లోకెక్కింది.

"ఒక ప్రొఫెసర్‌ను దుర్భాషలాడుతూ, ఆయన అర్హతల్ని సవాలు చేస్తూ ఫేస్‌బుక్‌లో బహిరంగ పోస్ట్ చేశారన్న" కారణంగా ఏబీవీపీకి చెందిన రీసెర్చ్ స్కాలర్ కాలూరామ్ (కరణ్) పల్సారియాను వర్సిటీ అధికారులు ఏడాది పాటు రస్టికేట్ చేశారు. దాంతో పాటు 30 వేల జరిమానా కూడా విధించారు.

కరణ్‌కు యూనివర్సిటీ విధించిన 'తీవ్రమైన శిక్ష'కు నిరసనగా ఏబీవీపీ ఆందోళనకు దిగింది.

ఫొటో క్యాప్షన్,

ప్రస్తుతం తన మానసిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని కరణ్ అన్నారు.

అసలేం జరిగింది?

హెచ్‌సీయూలో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా ఉన్న కె.లక్ష్మీనారాయణపై గత ఏడాది నవంబర్‌లో కరణ్ పల్సానియా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారాన్ని రేపింది.

రాజస్థాన్‌కు చెందిన కాలూరామ్ పల్సానియా భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. గతంలో ఆ సంస్థ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు. ఇప్పుడు ఏబీవీపీ సెంట్రల్ యూనివర్సిటీస్ జాతీయ కో-కన్వీనర్‌గా ఉన్నారు. మిత్రులు ఆయనను 'కరణ్' అని వ్యవహరిస్తుంటారు.

ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, గత నవంబర్ 26న ఎకనామిక్స్ సెమిస్టర్ పరీక్షలకు ప్రశ్నాపత్రాన్ని తయారు చేశారు. అందులో - "ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి ఉండే మౌలిక లక్ష్యాలేమిటి? ప్రైవేటీకరణ, కాషాయీకరణ వంటి ప్రక్రియల ద్వారా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై మోపబడుతున్న నూతన లక్ష్యాలు ఏమిటి? - అన్నది ఓ ప్రశ్న.

ఈ ప్రశ్న ఏబీవీపీ నాయకుడైన కరణ్ పల్సానియాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దాంతో నవంబర్ 27న ఫేస్‌బుక్‌లో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణను అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ ఓ వ్యాఖ్య పోస్ట్ చేశారు. తన వ్యాఖ్యతో పాటు ప్రశ్నాపత్రం స్క్రీన్ షాట్ కూడా పోస్ట్ చేశారు.

లక్ష్మీనారాయణకు ఆర్థికశాస్త్రంలో మూల సిద్ధాంతాలు కూడా తెలియవనీ, కేవలం బెదిరింపులకు పాల్పడుతూ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారంటూ ఆ పోస్ట్‌లో పల్సానియా తీవ్ర ఆరోపణలు చేశారు.

ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ 1989లో హెచ్‌సీయూలో లెక్చరర్‌గా చేరారు. గత 29 ఏళ్లుగా అందులోనే పని చేస్తూ ప్రస్తుతం ప్రొఫెసర్‌గా ఉన్నారు.

అంతకన్నా ముఖ్యంగా, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ దళితుడు కూడా కావడంతో పల్సానియా వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి.

"ఇది ఏ రకం నీతి?"

కరణ్ వ్యాఖ్యలపై వర్సిటీలోని వివిధ విద్యార్థి సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో వర్సిటీ అధికారులు ఆయనపై తీసుకున్న చర్యలను కూడా వారు పూర్తిగా సమర్థించలేదు.

"దళిత సముదాయం నుంచి వచ్చి, విద్యాబోధనలో అపార అనుభవమున్న ఒక ప్రొఫెసర్‌ను ఇలాంటి పదజాలంతో దూషిస్తూ పబ్లిక్ ప్లాట్‌ఫాంలో రాయడం ద్వారా ఎలాంటి నీతిని బోదిస్తున్నట్టు? బీజేపీ చెప్పే జాతీయవాదంలో ఉన్న లోపాలను ప్రశ్నించే వారందరిపైనా ఇట్లాగే దాడులు చేయాలని ఏబీవీపీ తమ కార్యకర్తలకు, నాయకులకు శిక్షణ ఇస్తోందా?" అని ఎస్ఎఫ్ఐ - హెచ్‌సీయూ కార్యదర్శి కేసబన్ చౌధురి ప్రశ్నించారు.

పల్సానియా ఫేస్‌బుక్ పోస్ట్‌కు వ్యతిరేకంగా అంబేడ్కర్ విద్యార్థి సంఘం (ఏఎస్ఏ), స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్‌ఐ) వంటివి యూనివర్శిటీ కేంపస్‌లో ఈ ఘటన జరిగినప్పుడే ఆందోళనలు నిర్వహించాయి.

ఈ నేపథ్యంలో పల్సానియాపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రొ. లక్ష్మీనారాయణ వర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

దీనిపై విచారణ జరిపిన ఏడుగురు సభ్యుల యూనివర్సిటీ ప్రోక్టోరల్ బోర్డ్ పల్సానియాపై చర్య తీసుకుంది.

అయితే వర్సిటీ తీసుకుంటున్న క్రమశిక్షణా చర్యలలో వివక్ష ఉందని ఏఎస్ఏ అధ్యక్షుడు మున్నా సన్నకి అన్నారు.

"కొన్ని రోజుల క్రితం ఎలాంటి ఆధారాలు లేకుండానే ముగ్గురు విద్యార్థులను రెండేళ్ల పాటు, మరో ఏడుగురు విద్యార్ధులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. వర్సిటీ అధికారులు మోరల్ పోలీసింగ్ చేస్తూ ఏబీవీపీ ఫిర్యాదులపై ఏకపక్షంగా ఈ చర్యలు తీసుకున్నారు. కరణ్ విషయంలో మాత్రం అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, అధికార వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కేవలం ఒక సంవత్సరం మాత్రమే రస్టికేట్ చేశారు" అని మున్నా అన్నారు.

వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొ. పొదిలె అప్పారావు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల ప్రభావంలో పని చేస్తారని ఆయన ఆరోపించారు.

"క్రమశిక్షణా చర్యలు విద్యార్థుల జీవితాలు, చదువులు నాశనమయ్యేలా ఉండకూడదు. తప్పు చేసినట్టు ప్రోక్టోరల్ బోర్డు భావిస్తే, తప్పుకు తగిన జరిమానా విధించడమో, కొద్ది కాలం పాటు సస్పెన్షన్ చేయడమో చేయాలి. అంతే తప్ప, సంవత్సరాల తరబడి వారిని విద్యకు, యూనివర్శిటీకి దూరం చేయడం వల్ల వారి జీవితాలు నాశనమవుతాయి" అని మున్నా సన్నకి పేర్కొన్నారు.

పల్సానియాదీ తప్పే.. ప్రొఫెసర్‌కూ ఎజెండా ఉంది: ఏబీవీపీ

మరోవైపు, ఏబీవీపీ ఓ ప్రకటన విడుదల చేస్తూ పల్సానియా ఫేస్‌బుక్ పోస్ట్‌ను తాము పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది.

పల్సానియా ఆ పోస్ట్‌ని తొలగించి క్షమాపణ చెప్పారని ఆ ప్రకటన తెలిపింది.

ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ కమ్యూనిస్టు భావజాలంతో ఉంటూ, ఇతర భావజాలాలకు చెందిన విద్యార్థుల మెదళ్లను పాడు చేసేలా, తన సొంత రాజకీయ ఎజెండాను విద్యార్థులపై రుద్దేలా ప్రశ్నలను తయారు చేశారని ఏబీవీపీ తన ప్రకటనలో తెలిపింది.

దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అది ప్రకటనలో తెలిపింది. వెంటనే పల్సానియాపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఏబీవీపీ ఆ ప్రకటనలో డిమాండ్ చేసింది.

ఆర్ఎస్ఎస్ భావజాలమే పల్సానియాది!

పల్సానియాది వెనుకబడిన కులమే కాబట్టి ఆయనకు ఒక దళిత ప్రొఫెసర్‌ని ఉద్దేశపూర్వకంగా విమర్శించాల్సిన అవసరమేమీ లేదని ఏబీవీపీ అంటోంది.

కానీ యూనివర్శిటీ విద్యార్థి నాయకులు కేసబన్ చౌధురి, మున్నా సన్నకి మాత్రం ఆర్ఎస్ఎస్ శిక్షణ తీసుకున్న వ్యక్తి కావడం వల్లనే పల్సానియా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు.

పల్సానియాది వెనుకబడిన కులం అని చెప్పడం ద్వారా అతడిని వెనుకేసుకొచ్చే ప్రయత్నం ఏబీవీపీ చేస్తోందని వారన్నారు.

ఆవేశంలోనే అలా తిట్టాను...!

ఈ విషయంపై కాలూరామ్ పల్సానియాతో బీబీసీ మాట్లాడింది.

ఈ మొత్తం సంఘటనతో తన మానసిక పరిస్ధితి ఏ మాత్రం సరిగా లేదని, ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని ఆయన అన్నారు.

ఆవేశంలోనే ఫేస్‌బుక్‌లో ప్రొ. లక్ష్మీనారాయణను దూషిస్తూ పోస్ట్ పెట్టానని, అది తప్పేనని చెప్పారు.

తానా పోస్ట్‌ను 20 నిమిషాలలోనే డిలీట్ చేసి, తరువాత బహిరంగ క్షమాపణ ఫేస్‌బుక్‌లోనే చెప్పానని పేర్కొన్నారు.

అయినా కూడా, తనపై ఇంత కఠినమైన చర్యలు తీసుకోవడం సమంజసం కాదన్నారు.

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ పట్టా పొందిన పల్సానియా ఇప్పుడు 'రాజస్థాన్, గుజరాత్‌లలో మధ్య యుగాలలో మహిళా భక్తి సాధువుల చరిత్ర' అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు.

ఈ తీవ్రమైన చర్య వల్ల తన భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని పల్సానియా ఆవేదన వ్యక్తం చేశారు.

"సబ్జెక్టు తెలుసుకోకుండానే ఈ అసభ్య దూషణలేంటి?"

ఈ అంశంపై ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో బీబీసీ మాట్లాడింది. ఆయన ఆ ప్రశ్నాపత్రంలో పొందుపర్చిన ప్రశ్న నేపథ్యం ఏమిటో తెలిపారు.

ఆ ప్రశ్న తాను బోధించే సబ్జెక్టులో భాగమే తప్ప, మరేదో ఎజెండాతో తయారు చేసింది కాదని అన్నారు.

తాను స్వార్థ ప్రయోజనాల కోసం దళిత కార్డును ఉపయోగించే వ్యక్తిని కాదన్నారు.

"అలా చేసి ఉంటే కాలూరామ్ పల్సానియా ఇప్పటికే జైల్లో ఉండేవారు" అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

తాను యూనివర్శిటీ నిబంధనలకు అనుగుణంగానే నడచుకుంటున్నానని చెప్పారు.

"ఆర్థికశాస్త్ర విభాగంలో 'ఎకనమిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్' అనే ఆప్షనల్ సబ్జెక్ట్‌లో ఆర్థిక సిద్ధాంతాలు, స్వాతంత్ర్యానంతరం భారత విద్యా విధానాలనే రెండు భాగాలు ఉంటాయి. వాటిలో వివిధ రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఏయే విధాలైన విద్యా విధానాలను అవలంబించాయనే అంశాలు, అవి ఎలాంటి రాజకీయార్థిక వైఖరులను అనుసరించారో విద్యార్థులకు పాఠాలు చెప్పడం నా బాధ్యత" అని లక్ష్మీనారాయణ అన్నారు.

బీజేపీ అనుకూల శక్తులు సబ్జెక్ట్ మీద అవగాహన లేమితో, విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా, తాను తన ఉద్యోగ రీత్యా నిర్వర్తించిన కర్తవ్యాన్ని తప్పు పడుతున్నాయని పేర్కొన్నారు.

తనను అంత ఘోరంగా తిడుతూ, ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టేంత తప్పు తానేం చేశానని ఆయన ప్రశ్నించారు.

పల్సానియా బహిరంగ క్షమాపణ చెప్పిన విషయాన్ని బీబీసీ ప్రస్తావించగా, పల్సానియా గనుక ఆ పోస్ట్‌ను తీసేసిన వెంటనే లేక కనీసం ఒక వారం రోజులలో క్షమాపణ చెప్పి ఉంటే పరిస్థితి ఇంత వరకు రాకపోయేదని ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు.

మూడు రోజుల క్రితమే, అది కూడా ఇక ప్రోక్టోరల్ బోర్డ్ తనపై చర్యలు తీసుకోక తప్పదని స్పష్టమైన తర్వాతే అతడు క్షమాపణలు చెప్పాడని, అందులో నిజాయితీ లేదని లక్ష్మీనారాయణ అన్నారు.

పల్సానియా ఇలా ప్రవర్తించడం మొదటిసారేమీ కాదని, గతంలో మరో ఇద్దరు ప్రొఫెసర్లతో కూడా ఇలాగే క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తించాడని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

అతనిపై తీసుకున్న చర్య సరైనదే అని ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)