ప్రెస్ రివ్యూ: రాజకీయాల బాటలో తమిళ నటుడు విజయ్!

  • 4 ఫిబ్రవరి 2018
తమిళ సినీ నటుడు విజయ్ Image copyright Actor Vijay/Facebook

తమిళ రాజకీయాల్లోకి తమిళ హీరో విజయ్ వస్తున్నారని చెన్నై మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

నటుడు కమల్‌హాసన్, రజనీకాంత్‌ సొంత పార్టీలు పెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. అలాగే నటుడు విశాల్‌ కుడా ఆ మధ్య బై ఎలక్షన్స్‌లో పోటీ చేసే ప్రయత్నం చేశారు.

ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్‌లోకి విజయ్‌ కూడా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని చెన్నై మీడియా టాక్‌. అందుకు గ్రౌండ్‌ వర్క్‌ కూడా స్టార్ట్‌ చేశారట విజయ్‌ అండ్‌ టీమ్‌.

'విజయ్‌ మక్కళ్‌ ఇయక్కమ్‌' అని విజయ్‌ ఫ్యాన్స్‌ ఓ వెబ్‌సైట్‌ను గతేడాది సెప్టెంబర్‌లో స్టార్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ వెబ్‌సైట్‌లో ప్రతి జిల్లా ఫ్యాన్స్‌ క్లబ్‌ మెంబర్స్‌ను ఎంట్రీ చేసి, వారికి ఐడీ కార్డ్స్‌ ఇస్తున్నారట.

త్వరలోనే ఓ యాప్‌ను కూడా తయారు చేయనున్నారని సమాచారం.ఇవన్నీ విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ కోసమా? అని కొందరు అడిగితే.. 'అలాంటిదేం లేదు. కేవలం టెక్నాలజీని వాడుకొని ఫ్యాన్స్‌ను రెగ్యులేట్‌ చేయడం కోసమే.. పాలిటిక్స్‌ సెకండరీ' అని పేర్కొన్నారట విజయ్‌ సన్నిహిత వర్గాలు.

పాలిటిక్స్‌ పై అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్‌ ఇవ్వనప్పటికీ విజయ్‌ ప్రతి సినిమాలోనూ పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌ ఉందన్నట్టుగా మెసేజ్‌ ఇస్తూ వస్తున్నారంటూ సాక్షి కథనం.

Image copyright facebook

సోషల్ మీడియాలోకి వెంకటేశ్వరుడు

శ్రీవారు సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నారంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

భక్తులారా.. శుభోదయం, కౌసల్యా సుప్రజా రామ.., గుడ్‌మార్నింగ్, అంటూ ఇక నిత్యం మన మొబైల్‌ఫోన్లలో తిరుమలేశుడు వివిధ రూపాల్లో ఆశీస్సులు అందించనున్నారు.

సమాచార విప్లవంలో రోజురోజుకూ పెరిగిపోతున్న సామాజిక మాధ్యమాలను కూడా ఒడిసి పట్టుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు ప్రారంభించింది.

ధర్మప్రచారంతో పాటు ప్రజల జీవన విధానంలో నైతికత పెంపొందించేందుకు వీలుగా శ్రీవారి చిత్రాలతో కూడిన సూక్తులు, పూజా విధానం మొబైల్‌ వీడియో క్లిప్పింగులు రూపొందించాలని భావిస్తోంది.

శ్రీనివాసుడు..ఒక్కో సేవలో,ఒక్కో రూపంలో దర్శనమిస్తుంటారు. అలాంటి చిత్రాలు, వీడియో లైవ్‌ క్లిప్పింగుల ప్రోమోలు అనేకం టీటీడీ వద్ద ఉన్నాయి.

అలాంటి వాటిని సులభంగా ప్రసారం చేసేందుకు వీలుగా మొబైల్‌ఫోన్‌ వెర్షన్‌కు మార్చాలని నిర్ణయించారు. వీటిని వాట్సప్, టెలిగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా సామాన్య భక్తులకు అందుబాటులోకి తేవాలని టీటీడీ సంకల్పించింది.

ఆ దిశగా శ్రీవారి చిత్రాలు, నిమిషం నుండి ఐదు నిమిషాల నిడివిగల వీడియోలు రూపొందిస్తోందని సాక్షి పేర్కొంది.

Image copyright facebook/p.v.simdhu official pafe

ఆల్ ది బెస్ట్..

డిఫెండింగ్‌ చాంపియన్‌ పీవీ సింధు ఇండియా ఓపెన్‌ టైటిల్‌ నిలబెట్టుకొనేందుకు అడుగు దూరంలో నిలిచిందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఓ వార్తను ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..

శనివారం ఉత్కంఠ భరితంగా జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో టాప్‌సీడ్‌ సింధు 21-13, 21-15తో మూడోసీడ్‌ రచనోక్‌ ఇంటానన్‌ (థాయ్‌లాండ్‌)ను చిత్తుచేసింది.

ఆదివారం జరిగే ఫైనల్లో ఐదోసీడ్‌ బీవనె జాంగ్‌ (అమెరికాను)తో సింధు తలపడనుంది. మరో సెమీఫైనల్లో జాంగ్‌ 14-21, 21-12, 21-19తో ఆరోసీడ్‌ చెంగన్‌ నాన్‌ యీ (హాంకాంగ్‌)పై అతికష్టమ్మీద నెగ్గి టైటిల్‌పోరులో నిలిచింది.

Image copyright Getty Images

రియల్ నిబంధనలు

రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇకపై రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో(రెరా) తమ ప్రాజెక్టులను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈనాడు దినపత్రిక ఓ వార్తను ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..

ఈ వెబ్‌సైట్‌ నెలాఖరు నుంచి అందుబాటులోకి రానున్నది. ఇక అప్పుడు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చాక స్థిరాస్తి వ్యాపారులకు ఏప్రిల్ తర్వాత సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.

రిజిస్ట్రేషన్ ఎవరికి అవసరం?

  • 2017 మే 1 నాటికి అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి అనుమతి తీసుకొని శ్లాబ్‌లు వేసినా, నిర్మాణంలో 50 శాతం ఫ్లాట్లు విక్రయించినా రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు.
  • అపార్ట్‌మెంట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి 'ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌' కోసం నగరపాలక సంస్థ/పురపాలక సంఘాల్లో దరఖాస్తు చేసుకున్న వ్యాపార సంస్థలూ రిజిస్ట్రేషన్‌ పరిధిలోకి రావు.
  • లేఅవుట్లలో రహదారులు, కాలువల, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పది శాతం ఖాళీ స్థలాన్ని (ఓపెన్‌ స్పేస్‌) పురపాలక/నగరపాలక సంస్థకు 2017 మే 1 నాటికి అప్పగించినట్లయితే అలాంటి స్థిరాస్తి వ్యాపార సంస్థలకు రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు.
  • ఏజెంట్లు కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి..

ఫ్లాట్లు, ప్లాట్లు, వ్యక్తిగత గృహాలు విక్రయించే ఏజెంట్లు కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అలాంటి వ్యక్తులు మాత్రమే వ్యాపార లావాదేవీల నిర్వహణకు అర్హులు.

విక్రయాల్లో వివాదాలు తలెత్తినపుడు ఏజెంట్లను కూడా బాధ్యులను చేయాలన్నది చట్ట ఉద్దేశమని ఈనాడు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)