పార్లమెంటులోనే తేల్చుకుంటామన్న టీడీపీ; 'వార్' వాయిదా?

  • 4 ఫిబ్రవరి 2018
చంద్రబాబు నాయుడు Image copyright Getty Images

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. బీజేపీతో పొత్తు విషయంలో తీవ్ర నిర్ణయం తీసుకోవచ్చంటూ కొద్ది రోజులుగా సాగిన ఊహాగానాలకు తెర పడింది.

బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన 'అన్యాయం'పై పార్లమెంటులో నిరసన తెలుపుతామని నిర్ణయించినట్టుగా టీడీపీ ఎంపీలు మీడియాకు తెలిపారు.

కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వం ఆశించిన ప్రాధాన్యం దక్కకపోవడంతో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మధ్య మైత్రి తెగతెంపులయ్యే అవకాశముందన్న ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది.

అందుకు మరింత ఊతమిస్తూ ఆదివారం తెలుగుదేశం ఎంపీలతో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకోవచ్చనే ఊహాగానాలు కూడా సాగాయి.

Image copyright GettyImages/PRAKASH SINGH

పోరాటం పార్లమెంటులోనే!

అయితే, అంతా ఊహించినట్టుగా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొత్తుపై సంచలన నిర్ణయమేదీ తీసుకోలేదు.

బడ్జెట్లో ఏపీ ప్రస్తావన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో టీడీపీ ఎంపీలు తమ గళాన్ని మరింతగా వినిపించాలని సూచించారు.

అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశం కొనసాగింది.

సమావేశం నుండి బయటికి వచ్చిన తర్వాత పలువురు టీడీపీ పార్లమెంటు సభ్యులు మీడియాతో మాట్లాడారు. తమ పోరాటం దశల వారీగా జరుగుతుందని, ఇప్పుడిది ఆరంభం మాత్రమేనని వారన్నారు.

రైల్వేజోన్, పోలవరం తదితర అంశాలపై పార్లమెంటులో పోరాడుతామని చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం తప్పదని ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు.

''విభజన చట్టంలో ఉన్న అంశాల్లో, రెవెన్యూ లోటు భర్తీ, రైల్వే జోన్ అంశంపై బడ్జెట్‌లో ఏపీకి న్యాయం జరగలేదు. దీనిపై ప్రజల్లో ఉన్న ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తెస్తాం. ఇప్పటికైనా ఏపీకి న్యాయం చేయాలని కోరుతాం'' అని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం అన్నారు.

Image copyright GettyImages/DIBYANGSHU SARKAR

అమిత్‌షా ఫోన్ కాల్ ప్రభావం?

అంతకు ముందు, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసినట్టుగా, సమావేశంలో తీవ్ర నిర్ణయాలేవీ తీసుకోవద్దని ఆయనకు సూచించినట్టుగా మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

అయితే కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, అమిత్‌షా ఫోన్ కాల్ చేశారన్నది వాస్తవం కాదన్నారు.

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి బీబీసీతో మాట్లాడుతూ, అమిత్‌షా ఫోన్ చేసి మాట్లాడడం, మాట్లాడకపోవడానికి పెద్ద ప్రాముఖ్యతేమీ లేదన్నారు.

బడ్జెట్ కేటాయింపుల వ్యవహారం ప్రభుత్వ వ్యవహారం, రాజ్యాంగపరమైన వ్యవహారం తప్ప రాజకీయమైంది కాదని అన్నారు.

"అసలు టీడీపీతో పొత్తు ఉంటుందా, ఉండదా అన్న అంశానికి బీజేపీ అంత ప్రాధాన్యం ఇస్తుందని నేననుకోను. పార్లమెంటులో కావల్సినంత మెజారిటీ ఉన్నప్పుడు దానికి ఆందోళన ఏముంటుంది? నా దృష్టిలో టీడీపీ తెగతెంపులు చేసుకుంటుందనే భయం బీజేపీకి లేదు. అలాంటి ఆలోచన తెలుగుదేశానికి కూడా ఏమీ లేదు" అని ఆయన అన్నారు.

Image copyright Facebook/జై అంబటి సతైనపల్లి

ఇవన్నీ బాబు డ్రామాలు: అంబటి రాంబాబు

కేంద్రంతో పోరాటం చేస్తామని చంద్రబాబు ప్రకటించడాన్ని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ ఆయన, "మిత్రపక్షంగా ఉంటూనే పోరాటం చేస్తామని అనడంలో అర్థం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజంగానే పోరాడాలనే ఉద్దేశం ఉంటే రాజీనామాలు చేయడానికి ముందుకు రావాల్సింది" అని అన్నారు.

"ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, బడ్జెట్‌ను రూపొందించేటప్పుడే పోరాడకుండా, ఇప్పుడు పోరాడతామని చెప్పడం ఓ డ్రామా" అని అంబటి బీబీసీకి చెప్పారు.

Image copyright YouTube grab

ట్రేడింగే తప్ప రాష్ట్రంలో రూలింగేదీ?: సోము వీర్రాజు

మరోవైపు, బీజేపీ ఎంఎల్‌సీ సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

కర్నూలులో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన తెలుగుదేశంపై నిప్పులు చెరిగారు.

పరోక్షంగా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, "ఓ మహానాయకుడు పార్టీని స్థాపిస్తే మీరు దాన్ని భూస్థాపితం చేశారు" అని వ్యాఖ్యానించారు.

తాము నిప్పుకణికలం అని చెబుతూ తెలుగు దేశం పార్టీ నేతలు అవినీతిపరులంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

ఓ వైపు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుండగా, మరోవైపు రాష్ట్రంలో బీజేపీ కీలక నేత వీర్రాజు ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Image copyright Facebook/Telakapalli Ravi Views

ఇదంతా ఓ ప్రహసనమే: తెలకపల్లి రవి

తెలుగుదేశానికి బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలనే ఉద్దేశం ఉందని తాను భావించడం లేదని తెలకపల్లి రవి బీబీసీతో అన్నారు.

"ప్రజలలో తమ పాలన పట్ల అసంతృప్తి ఉందని, అది రోజురోజుకూ పెరుగుతోందని తెలుగుదేశానికి బాగా తెలుసు. అందుకే కేంద్రంపై ధ్వజమెత్తడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని అది చూస్తోంది" అని రవి అన్నారు.

తెలుగు దేశం, వైఎస్‌ఆర్‌సీపీలు రెండూ బీజేపీని సంతృప్తి పర్చడానికే ప్రయత్నిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఇవేవీ కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేని స్థితిలో ఉన్నాయని, ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ కూడా తెలుగు దేశాన్ని విమర్శిస్తోందే తప్ప కేంద్రాన్ని ఏమీ అనడం లేదని ఆయన అన్నారు.

ఇలాంటి వ్యవహారాల ఫలితంగా రాష్ట్ర ప్రజలకే అన్యాయం జరుగుతోందని, ఇది దురదృష్టకరమైన పరిస్థితి అని రవి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)