రామ్ గోపాల్ వర్మ 'జీఎస్టీ'పై ఎందుకు అభ్యంతరం?

  • అనఘా పాఠక్
  • బీబీసీ మరాఠీ

'ఇప్పుడైనా, భవిష్యత్తులో మరెప్పుడైనా సరే, సెక్స్ ఒక్కటే ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైంది.'

ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ కొటేషన్‌తో రామ్ గోపాల్ వర్మ సినిమా 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' ప్రారంభమవుతుంది. సినిమా మొదటి దృశ్యంలో ఒక మహిళ నగ్నంగా కనిపిస్తుంది.

'రంగీలా', 'శివ', 'సత్య' వంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సినిమా తీశారు.

మియాతో తీసిన ఈ సినిమా యూట్యూబ్‌లో రిలీజైంది. ఇప్పుడిది చాలా వేగంగా హిట్లు ఆర్జిస్తోంది.

ఈ సినిమాకు సంక్షిప్తంగా జీఎస్టీ అని పేరు పెట్టారు. జీఎస్టీ గత సంవత్సర కాలంగా బాగా చర్చనీయాంశంగా ఉన్న మాట. కాబట్టి అలాంటి మాటను రామ్ గోపాల్ వర్మ ఉపయోగించుకోకుంటేనే ఆశ్చర్యపోవాలి కానీ ఉపయోంచినందుకు మాత్రం కాదు.

వర్మ సినిమాపై ఎందుకు మండిపడుతున్నారు?

బాలీవుడ్ సినిమాలతో వర్మకు దేశవ్యాప్తంగా బాగానే పేరున్నప్పటికీ ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో జరిగినంత చర్చ, తెలుగు ప్రజల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలు మరెక్కడా కానరాలేదు.

జనవరి 27న ఈ సినిమా యూట్యూబ్‌లో రిలీజైంది. తెలుగు న్యూస్ చానెల్‌లు దీనిపై చాలానే లైవ్ చర్చలు, వార్తలు ప్రసారం చేశాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మహిళా సంఘాలకు, రామ్ గోపాల్ వర్మకు మధ్య వివాదాలు తలెత్తాయి.

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA) నేతృత్వంలో మహిళా సంఘాలు విశాఖపట్నంలో వర్మ దిష్టిబొమ్మను తగులబెట్టారు.

విజయవాడలో బీజేపీ కూడా ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేసింది.

ఈ సినిమాకన్నా ముందు కూడా దేశంలో న్యూడ్ కంటెంట్ విషయంలో చాలా సార్లు వివాదాలు తలెత్తాయి. మరో వాస్తవం ఏంటంటే, ఇంటర్నెట్‌లో మహిళను నగ్నంగా చూపిస్తున్న సినిమాల్లో ఇది మొదటిదీ కాదు, చివరిదీ కాదు.

ఈ సినిమాపై ఎందుకింత రగడ?

వర్మ తన సినిమాను ఫిలసాఫికల్ (తాత్విక) సినిమాగా అభివర్ణిస్తున్నారు.

మీడియాతో మాట్లాడుతూ ఆయన, "భగవంతుడు సెక్స్‌ను ఎలా సృష్టించాడో, భగవంతుడు సెక్స్‌కు ఏ అర్థం ఇచ్చాడో, అదే ఈ సినిమాలో ఉంది" అని అన్నారు.

ఈ సినిమా ట్రైలర్ చూసినా అందులో ఎన్నో తాత్విక భావనలు కనిపిస్తాయి.

"ఒక అందమైన శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా సినిమాలు రూపొందాయి. కానీ ఒక అందమైన మనస్సుపై ఎన్నడూ సినిమా రూపొందలేదు. మేం ఈ సినిమాను అందమైన మనస్సుపైనే తీశాం" అని వర్మ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

ఫొటో క్యాప్షన్,

మియా మాల్కోవా

వర్మ వ్యాఖ్యలపై ఎందుకంత ఆక్రోశం?

ముఖ్యంగా వర్మ చేసిన ఒక ప్రకటన విషయంలో చాలా మంది మండిపడుతున్నారు.

"మహిళల లైంగిక వాంఛలను అనేక ఏళ్లుగా అణచివేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమా దాని వ్యక్తీకరణే" అని వర్మ అన్నారు.

ఈ సినిమాలో కొన్ని చోట్ల మియా కూడా ఈ వాదననే వివరిస్తున్నట్టు కనిపిస్తుంది. మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నది కూడా సరిగ్గా దీన్నే.

హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దేవి ఈ విషయంపై మాట్లాడుతూ, "మహిళల లైంగిక వాంఛల అంశాన్ని వర్మ తన సినిమా ప్రచారానికి వాడుకుంటున్నారు. ఆయన మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు. దీనిపైనే మా అభ్యంతరం. వర్మ కెమెరా మహిళను ఒక భోగ్య వస్తువుగా చూపిస్తోంది. ఆయన కెమెరా మహిళ శరీరాన్ని కామంతో చూస్తోంది. ఆమె నోటితో మాట్లాడుతున్న విషయాలేమో సాధికారతకు సంబంధించినవి. కానీ ఆయన చూపిస్తున్నది మాత్రం ఆమె యోనినే" అని అన్నారు.

వర్మ వైఖరి

మహిళా కార్యకర్తల పట్ల అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించారన్న ఆరోపణలు వర్మ ఎదుర్కొంటున్నారు.

ఓ 55 ఏళ్ల కార్యకర్తను ఉద్దేశించి టీవీలో ఆయన, 'నువ్వు బాగా అందంగా ఉన్నావు. వచ్చే సినిమా నీతోనే తీస్తా' అని వ్యాఖ్యలు చేశారు.

దేవిని ఉద్దేశించి కూడా వర్మ ఓ ట్వీట్ చేశారు. అందులో ఆయన ఆమెను 'నువ్వు బట్టలు ధరించే సెక్స్ చేస్తావా' అని ప్రశ్నించారు.

"వర్మ చెబుతున్నది మహిళా సాధికారత కాదు, పోర్న్‌ను ప్రోత్సహించడమే ఆయన మాటల సారాంశం. మహిళల లైంగికతను కనిపెట్టానంటూ, దానిపై ప్రచారం చేస్తున్నారు. ఆయన పోర్న్ ఫిల్మ్ రూపొందించారని కాదు మేం ఆయనను వ్యతిరేకిస్తున్నది. తన సినిమా మహిళా సాధికారతకు సంబంధించిందంటూ అబద్ధం ఆడుతుండడమే మా ఆగ్రహానికి కారణం. ఈ సినిమా మహిళలను ఉద్ధరించేదేమీ కాదు. దేశంలోని మహిళలకు ఈ విషయం బాగానే తెలుసు. వర్మ చెప్పగానే ఇది మహిళా సాధికరత అని నమ్మేంత అమాయకులేం కారు వాళ్లు" అని దేవి అన్నారు.

దీనిపై వర్మ ప్రతిస్పందన ఏమిటో తెలుసుకోవడం కోసం బీబీసీ పలు మార్లు ప్రయత్నించినప్పటికీ, ఇప్పటికీ ఆయన నుంచి ఈ విషయంలో ఎలాంటి జవాబూ రాలేదు.

సినీ విమర్శకులకు కూడా ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదు. విమర్శకులెవ్వరూ ఈ సినిమా పట్ల సానుకూలంగా మాట్లాడలేదు.

అన్నా ఎంఎం వెట్టికాడ్ బీబీసీతో మాట్లాడుతూ, "దీనిని తాత్విక గ్రంథం అని చెబుతుంటే నాకు నవ్వొస్తోంది. దీనిపై సీరియస్‌గా మాట్లాడడానికి ఇందులో అసలేమీ లేదు. మీతో ఈ మాటలు మాట్లాడడానికి నేను ఓ ఐదు సెకన్ల సమయం తీసుకున్నా. కానీ ఈ సినిమాపై ఇంత సమయం మాట్లాడడం కూడా వృథానే" అని అన్నారు.

మీడియాపై మహిళా సంఘాల ఆగ్రహం

AIDWA ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి బీబీసీతో మాట్లాడుతూ, "ఈ సినిమాకు మీడియా అనవసరంగా చాలా ఎక్కువ ప్రచారం ఇస్తోంది. వర్మను స్టూడియోలకు ఆహ్వానించి చర్చ నిర్వహించడానికి చానెల్‌లు పోటీ పడుతున్నాయి. మహిళల హక్కులు, వారిపై సాగుతున్న అణచివేతల మధ్య విభజన రేఖను మీడియా అర్థం చేసుకోలేకపోతోంది. మహిళలపై దోపిడీ, అణచివేతలు మరింత పెరిగేలా మీడియా ప్రోత్సాహం ఇవ్వగూడదని నా అభిప్రాయం" అని అన్నారు.

ఈ సినిమా విషయంలో తెలుగు మీడియాలో జరిగింత చర్చ దేశంలో మరెక్కడా జరగలేదు. సినిమాపై చర్చ పేరుతో దాని ట్రైలర్‌ను గంటల సేపు టీవీల్లో చూపించారు. అందులో అంగాంగ ప్రదర్శన విచ్చలవిడిగా ఉంది.

టీవీ చర్చల్లో వర్మ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బీబీసీ తెలుగు సంపాదకుడు జీఎస్ రామ్మోహన్ దీనిపై మాట్లాడుతూ, "తెలుగు మీడియాకు సెన్సేషనల్ అంశాలు చాలా ఇష్టం. ఎలాగైనా సరే జనాలను ఆకర్షించడమే వాళ్లకు కావాల్సింది. మరోవైపు వర్మకు కూడా తక్కువ ఖర్చుతో ప్రచారం కావాలి. అందుకే ఆయన కూడా మీడియా దగ్గరకు వస్తారు. వివాదాలు సృష్టిస్తారు. తెలుగు మీడియా, వర్మ పరస్పర పూరకాలు" అని అన్నారు.

19 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానప్పటికీ, దీని ట్రైలర్‌కు, మూవీకి హిట్లు మాత్రం భారీగా వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)