‘మీ బిడ్డకు పాలిస్తా.. నా బిడ్డను బతికించండి!’ అంటూ చైనాలో చనుబాలను అమ్ముతున్న తల్లి

  • 5 ఫిబ్రవరి 2018
చైనాలో మోకాళ్లపై కూర్చుని ఓ బిడ్డకు పాలిస్తున్న మహిళ. ఆమె పక్కన ఉన్న బోర్డులో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె బిడ్డ ఫోటో ఉంది. Image copyright Pear Video
చిత్రం శీర్షిక తమ కుటుంబం ఇబ్బందుల్లో ఉందని, డబ్బుకోసం.. నిమిషానికి వంద రూపాయలు తీసుకుని పిల్లలకు పాలిస్తానంటూ.. వివరించే బోర్డు

చైనాలో ఓ తల్లి తన చనుబాలను అమ్ముతోంది. ఐ.సి.యు.లో ఉన్న తన బిడ్డ వైద్యానికి డబ్బులు కావాలంటూ షెన్‌జాన్ నగర వీధుల్లో ఇలా సహాయం అర్థిస్తోంది.

తన కవల పిల్లల్లోని ఒక పాప ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతోంది. వైద్యం కోసం కనీసం 10 లక్షల రూపాయలు కావాలని ఆమె భర్త చెబుతున్నారు.

చైనా సోషల్ మీడియా 'సీనా వీబో'లో ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ వీడియోకు 24లక్షల వ్యూస్, 5,000 కామెంట్స్ వచ్చాయి.

''మా పాప ఐసీయూలో చికిత్స పొందుతోంది. అందుకు చాలా డబ్బు అవసరం. ఆపరేషన్ పూర్తయ్యాక మేం కనీసం 10 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు'' అని.. ఆ తండ్రి చెబుతున్నారు.

చైనాలోని వైద్య సేవలపై ఈమధ్య కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని వైద్య కేంద్రాలు చాలినంతగా లేవని, వైద్య కేంద్రాలకు పోటెత్తుతున్న ప్రజల తాకిడిని తట్టుకోలేక కొందరు లంచాలు ఇచ్చి మరీ వైద్యం చేయించుకుంటున్నారన్న విమర్శలున్నాయి.

Image copyright Pear Video
చిత్రం శీర్షిక ఈ తల్లి కథ నిజమేనంటూ.. షెన్‌జాన్ ఆన్‌లైన్ ప్రెస్ కార్యాలయం తెలిపింది

సోషల్ మీడియాలో.. ''సెల్ మిల్క్ సేవ్ గర్ల్'' అనే నినాదంతో యూజర్లు స్పందిస్తున్నారు. ఆ దారిగా వెళ్లే ప్రజలు ఆ తల్లిదండ్రులకు తప్పకుండా సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులు కనపడితే.. వారికి తప్పక సాయం చేస్తామని మరికొందరు ప్రతిస్పందిస్తున్నారు.

''నిరుపేదలు.. ఒకవైపు రోగగ్రస్తమైన పిల్లలకు జన్మనిస్తూ, మరోవైపు.. తమ ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోతున్నారు’’ అని ఓ వ్యక్తి చేసిన కామెంట్‌కు 3,000కు పైగా లైక్స్ వచ్చాయి.

సోషల్ మీడియాలో మరికొందరు ఇందుకు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఇలా డబ్బుల కోసం చనుబాలను అమ్ముకోవడం అసహ్యకరం అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.

మరో వ్యక్తి.. '' మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారని అందరికీ అర్థమైంది. మీ బిడ్డకు వైద్యం అందాలనే మేం కోరుకుంటున్నాం. కానీ రోడ్లపై చనుబాలను అమ్ముకోవడంతో నువ్వు కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందగలవా?'' అంటూ కామెంట్ చేశాడు.

అయితే.. ఈ కామెంట్లపై మరో వ్యక్తి స్పందించాడు. ''ఇది.. నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద తల్లిదండ్రుల ప్రేమ! ఇలా స్పందిస్తున్నవారు ఒకసారి ఆలోచించాలి.. అదే మీ బిడ్డకు ఇలా జరిగితే మీరు దేని గురించి ఆలోచిస్తారు.. మీ బిడ్డ గురించా? లేక మీ గౌరవం గురించా?''

ఇవి కూడా చదవంవడి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)